హలో... రాంగ్ నెంబర్.! - 20

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 20

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

పంజాగుట్ట ఓల్డ్ వ్యూ సెంటర్ లో న్యూ సెంచరీ అపార్ట్ మెంట్స్ లో థర్డ్ ఫ్లోర్ లో వుంది 'నో టెన్సన్' డిటెక్టివ్ ఏజెన్సీ. ఆ డిటెక్టివ్ ఏజెన్సీకి చైర్మన్ నాయర్. కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి సెటిలైన అరవై రెండేళ్ళ నాయర్ ఎక్స్ - మిలిట్రీ మెన్. పదేళ్ళు తగ్గినట్టుగా కనిపించే నాయర్ నోట్లో ఎప్పుడూ సిగార్ గుప్పగుప్పుమంటూనే వుంటుంది.

చిన్నప్పట్నుంచీ డిటెక్టివ్ నవలలను విపరీతంగా చదివే నాయర్ మిలటరీలో పనిచేస్తూ కూడా డిటెక్టివ్ పనులను ఆసక్తిగా చేసేవాడు. భవిష్యత్తులో డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టాలన్న కోరిక అతనికి ఆరేళ్ళ కిందట తీరింది. కేరళలో తన ఆస్తులను అమ్మేసుకుని హైదరాబాద్ లో సెటిలయ్యాడు.

ఆ తర్వాత డిల్లీ, ముంబయ్ లలో వున్న డిటెక్టివ్ ఏజెన్సీలను పరిశీలించాడు. ఓ మహిళ కూడా డిటెక్టివ్ ఏజెన్సీ నడిపించి, ఎంతో పేరు తెచ్చుకున్న వార్త ఇచ్చిన స్ఫూర్తితో అతను డిటెక్టివ్ ఏజెన్సీని స్థాపించాడు.

అతను ఎక్కువగా టేకప్ చేసే కేసులు కుటుంబ పరమైనవే. పెళ్ళికి ముందు వధూవరుల మీద నిఘా వేయడం, అమ్మాయిలతో తిరిగే  భర్తల గురించి వాకబు చేసి ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా రిపోర్టులు తయారుచేయడం నుంచి బాయ్ ఫ్రెండ్స్, గల్ ఫ్రెండ్స్, ప్రవర్తనను కనిపెట్టుకొని అవతలి వారికి సమాచారం చేరవేయడం చేస్తూంటాడు. ప్రతీ విషయాన్నీ కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాడు.

అతని కింద పనిచేసే స్టాఫ్ సంఖ్య ఎనిమిది. అందులో ఒకరు ఆఫీసు అసిస్టెంట్ గా, మరొకరు రిసెప్షనిస్టు. మిగతా ఆరుగురు డిటెక్టివ్ లు. అందులో ఇద్దరు మహిళలు..నలుగురు పురుషులు.

ఆఫీసుల్లో జరిగే గోల్ మాల్స్ ను కూడా అతను పరిశోధించడానికి ఒప్పుకుంటాడు. వ్యాపారసంస్థల మధ్య జరిగే రహస్య లావాదేవీలను అతను చాలా కాన్ఫిడెన్షిల్ గా డీల్ చేస్తాడు. అతనికి ఏ బాదరబందీ లేదు. అసలు డిటెక్టివ్ వృత్తిలో వుండే వాళ్ళు బాదరబందీలు పెట్టుకోవద్దంటారు. తన దగ్గరికి వచ్చే క్లయింట్స్ టెన్షన్ ని పోగొట్టడమే 'నో టెన్షన్' డిటెక్టివ్ ఏజెన్సీ వుద్దేశం అంటాడు.

ఆరోజు సాయంత్రం వరకూ పనులన్నీ పూర్తి చేసుకొని, కాస్త రిలాక్సవ్వడం కోసం ప్లాస్క్ లో వున్న కాఫీని కప్పులోకి ఒంపుకొని సిప్ చేస్తోండగా వచ్చిందా ఫోన్ కాల్.

"నో టెన్షన్ డిటెక్టివ్ ఏజెన్సీ" అన్నాడు రిసీవర్ అందుకొని నాయర్.

"మీరు మిస్టర్ నాయరా?"

"యస్...స్పీకింగ్..మే ఐ నో హూ ఈజ్ ఆన్ ద లైన్"

"అయాం ప్రియంవద...హౌస్ వైఫ్ ని. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రేపు మార్నింగ్ మీరు 'ఫ్రీగా' వుంటారా?"

"యూ ఆర్ మోస్ట్ వెల్ కమ్. మా క్లయింట్స్ అర్థరాత్రి కూడా మా డిటెక్టివ్ ఏజెన్సీ తలుపు తట్టవచ్చు" నాయర్ అన్నాడు.

"మీ డిటెక్టివ్ ఏజెన్సీ అర్థరాత్రి కూడా తిరిచే వుంటుందా?" సందేహంగా అడిగింది ప్రియంవద.

"గుడ్ జోక్..అన్నట్టు ఏమిటీ మీ ప్రాబ్లెం?"

"రేపు మీ ఆఫీసుకు వచ్చాక డిటైల్డ్ గా మాట్లాడతాను. అన్నట్టు మీ ఫీజు?"

"మీ కేసునుబట్టి వుంటుంది. మీ కేసు డీల్ చేస్తే కన్సల్టేషన్ ఫీజు వుండదు. ఇన్ కేస్ మీ కేసు తాలూకు టర్మ్స్ అండ్ కండీషన్స్ కుదరని పక్షంలో కన్సల్టేషన్ ఫీజు వసూలు చేస్తాం. అఫ్ కోర్స్ అలాంటి సందర్భాలు మా ఏజెన్సీలో ఎదురువ్వవు. మనీ కన్నా, మీ ప్రాబ్లెమ్ కు ఎక్కువ ఇంపార్టేన్స్ ఇస్తాం."

"థాంక్యూ మిస్టర్..."

"నాయర్..."

"ఓ.కె. రేపు మార్నింగ్ మీ ఆఫీసుకు వస్తాను"

"బైదిబై రేపు మీరు వచ్చేటప్పుడు రిసెప్షన్ లో మీ పేరు చెప్పకండి. థర్టీసిక్స్ అని చెప్పండి చాలు..."

ఒక్కక్షణం ఫోన్ మాట్లాడుతోన్న ప్రియంవద మొహం ఎర్రబడింది.

అటువైపు మౌనాన్ని బట్టి విషయం అర్ధమైన నాయర్.

"యూ ఆర్ మిస్టేకన్ జెంటిల్ ఉమెన్. ఒక కేసు డీల్ చేస్తున్నప్పుడు మా స్టాఫ్ కు కూడా ప్రైమరీ స్టేజ్ లో మీరు తెలియకుండా జాగ్రత్తపడతాం. అలా మీకో నెంబర్ ఇస్తా. నా దగ్గరున్న పర్సనల్ లాప్ టాప్ లో మీ నెంబరు ఎదురుగా పేరు వుంటుంది."

"ఓహ్..అయాం సారీ..." గిల్టీగా ఫీలవుతూ అంది ప్రియంవద.

"గుడ్ నైట్ వితో నో టెన్షన్" చెప్పాడు నాయర్.

"థాంక్యూ..." రిసీవర్ పెట్టేసింది ప్రియంవద. ఆమెకిప్పుడు రిలీఫ్ గా వుంది. రెపోద్దున్నే డిటెక్టివ్ ఏజెన్సీకి వెళ్ళడానికి భర్తకు ఏ కారణం చెప్పాలా? అని ఆలోచిస్తూ వుండిపోయింది ప్రియంవద.

*             *            *