హలో... రాంగ్ నెంబర్.! - 17

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and   latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 17

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

సడన్ బ్రేకుతో కారాపాడు శ్రీకర్.

"డాడీ...మనలో మనమాట...మాకు తెలియకుండా మా కోసం నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావా?" బబ్లూ మెల్లిగా అడిగాడు.

శ్రీకర్ అయోమయంగా చూసాడు.

"చాలా సినిమాల్లో హీరో తండ్రులు తన పెళ్ళాం, పిల్లలకోసం స్మగ్లింగ్ చేస్తారు కదా..అందుకని అడిగాను"

కొడుకు సినిమా తెలివితేటలు చూసి సంతోషించాలో, ఎదురుగా వున్న లేడీ ఇన్స్పెక్టర్ తో మాట్లాడాలో అర్థం కాలేదు.

ఆ లేడీ ఇన్స్పెక్టర్ కారు డోర్ దగ్గరకి వచ్చి, తన దగ్గరున్న స్టిక్ తో డోర్ మీద శబ్దం చేసి "ఏయ్ మాన్..కమ్ అవుట్.." అని గద్దించింది.

కారులో నుంచి బయటకు వచ్చిన శ్రీకర్ మరో షాక్ తిన్నాడు. అతని అదృష్టం అతని పర్సులోనే వుండిపోయి సేఫ్ అయ్యాడు.

"ఏంటి...కారు మాగ్జిమమ్ స్పీడ్ దాటి డ్రైవ్ చేస్తున్నావు. ఓసారి బ్యాక్ టర్నింగిచ్చి చూసుకో" అంది ఆ లేడీ ఇన్స్పెక్టర్. 

వెనుక ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పరుగెడుతూ, మరొకతను సైకిల్ మీద, ఇంకొకతను బైక్ మీద, ఆ తర్వాత జీపులో...తన కారు వైపు దూసుకొస్తున్నారు.

"కారు ఆపమన్నా ఆపకుండా ఎందుకు డ్రైవ్ చేస్తున్నారు? కారు లోపల డెడ్ బాడీ వుందా? స్మగ్లింగా? విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నావా? అమ్మాయిలను ఎక్స్ పోర్ట్ చేస్తున్నావా?" ఇంకా శ్రీకర్ ని గుర్తించకుండానే అడిగింది ఆ ఇన్ స్పెక్టర్.

వెంటనే బబ్లూ రంగంలోకి దిగాడు.

"సారీ...ఇన్స్పెక్టర్ రాంటీ..ఇవ్వాళ నాకు పరీక్షలు. ఇన్ టైమ్ కు రాకపోతే గోడకుర్చీ వేసి పరీక్షలు రాయిస్తానని మా మేడమ్ చెప్పింది. కాకపోతే చిన్నపిల్లాడిని కదా...పైగా కుర్చీలో కూచోని ఎగ్జామ్ రాయగలను కానీ గోడకుర్చీతో రాయలేను కదా. అందుకని మా డాడీ కారును స్పీడుగా పోనివ్వాలని యాక్సిలేటర్ తొక్కాడు" చాలా ఒబీడియంట్ గా ఎక్కాలు అప్పజెప్పినట్టు చెప్పాడు.

ఆ లేడీ ఇన్స్పెక్టరుకు బబ్లూ మాటలు ముద్దొచ్చాయి. అయినా వెంటనే కర్తవ్యం గుర్చోచ్చి, "ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం నేరం. పైగా ఆ నేరం ట్రాఫిక్ నుంచి క్రైమ్ కు మారింది. ట్రాఫిక్ వాళ్ళు కంగారుపడి మా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసారు. ది సీజ్ త్రీమచ్..."

"యస్..ఇన్స్పెక్టర్ ఆంటీ...మా డాడీ చేసిన తప్పునకు ఆయన కొడుగ్గా నేను ఫైన్ కడతాను. ఇదిగోనండి మేడమ్! నా పాకెట్ మనీ ట్వంటీఫైవ్ రుపీస్ సెవంటీ ఫైవ్ పైసా..." అంటూ జేబులో నుంచి డబ్బు తీయబోయాడు (తీసినట్టు నటించాడు. బబ్లూ.

లేడీ ఇన్స్పెక్టర్ ఆ సెంటిమెంట్ కి కరిగిపోయింది.

"ఇంత చిన్న వయసులో నీకు ఆ దేవుడు 'పెద్దబుద్ధి' ఇచ్చాడు. గాడ్ బ్లేస్స్ యు మై చైల్డ్" అని శ్రీకర్ వైపు తిరిగి "ఈ ఒక్కసారీ మీ అబ్బాయి మొహం చూసి వదిలేస్తున్నాను. స్పీడ్ గా వెళ్లినందుకు ఫైన్ కట్టి వెళ్ళండి." అంది ఇన్స్పెక్టర్.

బబ్లూ తన మొహాన్ని రియర్ వ్యూ మిర్రర్ లో చూసుకుంటున్నాడు. అలా వంద రూపాయల ఫైన్ కట్టి బయటపడ్డాడు శ్రీకర్. కానీ అతనికి ఇంకా కన్ ఫ్యూజన్ గానే వుంది. బబ్లూని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ కూడా ఆలోచిస్తున్నాడు. ఆ లేడీ ఇన్స్పెక్టర్ని తనెక్కడో చూసాడు..ఎక్కడ?

*            *               *

కారు డ్రైవ్ చేస్తోన్నా అతనికి ఆ లేడీ ఇన్స్పెక్టరే కళ్ళ ఎదురుగా కనిపిస్తోంది. ఆ డైలాగ్ డెలివరీ, ఆడిక్షన్ ఎక్కడో విన్నాడు. ఆ ఫేస్ ని తను ఎక్కడో చూసాడు. ఆ పర్సనాలిటీని మాత్రం చూడలేదు. ఎక్కడ? తను పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు...ఆ ఇన్స్పెక్టర్ శిల్పాశెట్టి కజిన్ లా వుంది. ఈవిడలా ఇద్దరు మనుష్యులంత సైజు కాదు...మరెక్కడ చూసాడు.

అలా ఆలోచిస్తూ ఎదురుగా లారీ వస్తోంది" అంటూ హెచ్చరించింది.

వెంటనే కారును సైడ్ కు కట్ చేసాడు. లెఫ్ట్ కు కాకుండా, రైట్ కు రాంగ్ సైడ్ లో కట్ చేయడంతో, అతనికి వార్నింగిచ్చిన కెనటిక్ హోండా మీద వస్తోన్న అమ్మాయి వెహికల్ కు తాకింది. దాంతో ఆ అమ్మాయి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. సడన్ బ్రేక్ తో కారాపాడు శ్రీకర్.

"సారీ" అన్నాడు కెనటిక్ హోండా నుంచి కిందపడిన అమ్మాయికి చేయి అందిస్తూ.

ఓసారి శ్రీకర్ వైపు చూసి మెల్లిగా లేచి, గీరుకుపోయిన మోచేతి వంక చూసుకుంటూ కిందపడిన తన హోండాని మెల్లిగా పైకి లేపబోయింది. చేయి నొప్పెట్టి "అమ్మా" అంది.

"అయ్యెయ్యో...మీకెందుకు శ్రమ..." అంటూ శ్రీకర్ కెనటిక్ హోండాని పైకి లేపి స్టాండ్ వేసాడు.

"ఎక్స్ ట్రీమ్ లీ సారీ. దగ్గర్లో హాస్పిటల్ వుంది. ఫస్ట్ ఎయిడ్ చేయించుకుందురు గానీ రండి..."

మరోసారి శ్రీకర్ వంక చూసి అంది "ఫర్లేదు"

"మీరలా ఫర్లేదు అంటే నేను చాలా గిల్టీగా ఫీలవుతాను"

"అదేమిటి...నేనేమీ తిట్టలేదు కదా...ఫీలవ్వడం ఎందుకు?"

"ఎందుకంటే...మీరు నన్ను తిట్టనందుకు నన్ను కాపాడాలని వచ్చిన మిమ్మల్ని అదే మీ వెహికల్ ని తాకి మిమ్మల్ని కింద పడేసినందుకు..."

"ఫర్లేదు..." అంది మళ్ళీ ఆ అమ్మాయి.

"మూడు...మూడు 'ఫర్లేదు' లు ఉపయోగించారు. ఫర్లేదు అన్నది మీ ఊతపదమా..." చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీకర్.

మళ్లీ ఫర్లేదు అనబోయి వెంటనే ఆగిపోయి, శ్రీకర్ వంక చూసింది.