హలో... రాంగ్ నెంబర్.! - 13

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 13

 

ముచ్చర్ల రజనీ శకుంతల

 

లంచ్ టైమ్ లో ప్రియంవద ఫోన్ చేసింది.


"హలో ప్రియా డాళింగ్...హౌ ఆర్యూ" అన్నాడు ఆమె నుంచి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటూ.

"చాల్లెండి...మరీ అంతొద్దు...లంచ్ బాక్స్ పంపించాను వచ్చిందా?"

"ఇప్పుడే క్యారియర్ విప్పా. ఓ దాంట్లో అనురాగం నే అన్నం, మరోదాంట్లో మమకారం అనే మటన్ కర్రీ, ప్రేమ అనే ఫిష్ కర్రీ, ఇంకో దాంట్లో అభిమానం అనే ఆవకాయ...అబ్బో...టోటల్ గా నీ ఎఫెక్షన్ తో క్యారియర్ ఘుమఘుమలాడిపోతుందనుకో..."

"లాస్ట్ టిఫిన్ బాక్స్ లో ఏముందో చూడలేదా?"

"ఓసారి ఓపెన్ చేసి చూడండి" చెప్పి ఫోన్ పెట్టేసింది.

క్యారియర్ ఓపెన్ చేయబోతుండగా మొబైల్ రింగయింది. అది తన పర్సనల్ ఫోన్. అంటే కచ్చితంగా అమ్మాయే అయి వుంటుంది.

ఓకే బటన్ ప్రెస్ చేసి "శ్రీకర్..ఎట్ యువర్ సర్వీస్ ప్లీజ్."

"నేన్నీతో మాట్లాడను" హస్కీగా వినిపించింది అటు వైపు నుంచి.

ఓసారి డిస్ ప్లేలో చూసాడు. థర్టీసిక్స్ అని వుంది. మోబిటెల్ లో పేర్లు కాకుండా నెంబర్ నోట్ చేస్తాడు. ఒక్కో అమ్మాయికి ఒక్కో నెంబర్ లాట్ చేసాడు. ఓసారి మెమరీలోకి వెళ్లాడు. థర్టీవన్ రేఖ, థర్టీ టు మంజరి...థర్టీ త్రీ మాధవి, థర్టీ...సిక్స్...కె.కె. ఫర్ కోమలి.

"హలో కోమలీ ! హౌ ఆర్యూ" అడిగాడు ఉత్సాహంగా.

"నేన్నీతో మాట్లాడని చెప్పానుగా. రాత్రి నీకు ఫోన్ చేస్తే ఫట్ మని కొట్టినట్టు ఫోన్ పెట్టేయాలా?" అటువైపు నుంచి కోమలి కంఠం వినిపించింది.

"అందమైన అమ్మాయిలు బెడ్ మీద అలిగితే బావుంటారు గానీ ఫోన్ లో అలిగితే బావుండదు. వెల్ కమ్ కోమలి. నౌ అయామ్ ఫ్రీ..నువ్వొస్తే నీ కోసం క్యారియర్ రెడీగా వుంది. లంచ్ చేసి, అలా బయటకు వెళ్దాం... మీ ఇంట్లో ఓకేనే కదా?"

"డబుల్ ఓకే. ఓసారి 'యస్ కమిన్' అని నువ్వంటే లోపలికివచ్చేసాను" అంది ఆ వెంటనే డోర్ నాక్ చేసిన సౌండ్ వచ్చింది.

"యస్ కమిన్" అన్నాడు.

కోమలి లోపలికి వచ్చింది.

"ఈ సెల్ లు, మోబిటెల్లు వచ్చేక ఎవరు ఎక్కడ్నుంచి ఫోన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆమధ్య ఓసారి కావేరితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తోంటే మా బబ్లూ 'హాయ్ డాడీ నేనిక్కడ జూపార్క్ దగ్గర వున్నాను. నువ్వెక్కడున్నావని అడిగాడు.

బిల్డప్ కోసం సిటీ అవుట్ స్కట్స్లో అని చెప్పాను. వెంటనే మోబిటెల్ ఆఫ్ చేసి 'డాడీ నేనిక్కడ నీ వెనకే' అన్నాడు. ఇంకా నయం...ప్రియంవద లేదు...వాళ్ల ఫ్రెండ్స్ తో వచ్చాడు."

"మై గుడ్ నెస్...ఎలా మేనేజ్ చేసావు?" అడిగింది అతని ఒళ్లో సెటిలవుతూ.

"చాలా సీరియస్ గానే మేనేజ్ చేసాను"

"తిట్టి, బెదిరించా?"

"కాదు...నాలుగు ఐస్ క్రీములు...ఓ క్రికెట్ సెట్ కొనిచ్చి" చెప్పాడు శ్రీకర్.

నవ్వింది అందంగా కోమలి.

"కోమలీ...డెడ్ బాడీని బెడ్ మీదికి రప్పించే స్టన్నింగ్ స్ట్రక్చర్ నీది" అంటూ ఇంటంకమ్ నొక్కి ఓ గంట వరకూ ఎవర్నీ పంపించొద్దని చెప్పాడు.

క్యారియర్ ఓపెన్ చేసాడు. అన్నీ అతనికి ఇష్టమైన ఐటమ్స్.

"శ్రీ....యూ ఆర్ లక్కీ....చక్కగా వండిపెట్టే భార్య దొరికింది" అంది కోమలి.

ఒక్కక్షణం చివుక్కుమనిపించింది. భార్యను కేవలం వండిపెట్టే మనిషిగా భావిస్తోందా కోమలి?

"లాస్ట్ బాక్స్ ఓపెన్ చేయలేదేంటి?" అడిగింది కోమలి.

లాస్ట్ బాక్స్ లో ప్రియంవద చెప్పినట్టు స్పెషల్ ఐటమ్ వుందా? అది కోమలికి పెట్టడానికి మనసొప్పలేదు సెంటిమెంట్ గా.

"అది ఎక్స్ క్లూజివ్ లీ ఫర్ మీ" అన్నాడు వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి చేతులు కడుక్కుంటూ.

"ఓకే వెళ్దామా?" అంది తనూ వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి.

కోమలి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లగానే క్యారియర్ లో వున్న లాస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసాడు.

ఓ చిన్న స్లిప్. "ఈ లంచ్ మీ కోసమే. అమ్మాయిలతో కలిసి షేర్ చేసుకోకండి. ప్రియంవద"

ఒక్కసారిగా పొలమారినట్టు అనిపించింది.కోమలి చూడకుండా దాన్ని తన జేబులో పెట్టుకున్నాడు.

కారులో కోమలి ఫ్లాట్ వైపు వెళ్తున్నారు.

డ్రైవ్ చేస్తుంటే ప్రియంవద స్లిప్ లో రాసింది గుర్తొచ్చి నవ్వొచ్చింది శ్రీకర్ కు. పెళ్ళయిన కొత్తలో క్యారియర్ లో ఒక్కో బాక్స్ లో ఒక్కో స్లిప్ రాసి పెట్టేది. ఇది అనురాగం, ఇది ఆప్యాయత, ఇది ప్రేమ...అని.

ఒక్క క్షణం గిల్టీ ఫీలింగ్. అయితే ఆ గిల్టీ ఫీలింగ్ ని అతని వ్యసనం జయించింది.

*              *              *

"ఇంత అందంగా ఎందుకు పుట్టావు కోమలీ/" అడిగాడు కోమలి పెదవుల మీద చేతి వేళ్లతో సూతారంగా రాస్తూ.

"నీకోసమే" అంది అతని గుండెల మీద వాలిపోతూ కోమలి.

ఎందుకో బాగా డ్రమెటిగ్గా అనిపించింది సిట్యుయేషన్ శ్రీకర్ కు. ఎంబర్రాసింగ్ గా కూడా అనిపించింది. తన ప్రవర్తన తనకే ఇబ్బందిగా వుంది.

సాయంత్రం నాలుగు అవుతుండగా శ్రీకర్ మోబిటెల్ రింగయింది.

వెంటనే డిస్ ప్లేలో నెంబర్ చూసాడు.

డిస్ ప్లేలో నెంబర్ రాలేదు. "హలో..." అన్నాడు.

"నేను ప్రియంవదని"

"నువ్వా ప్రియంవదా...ఏంటీ ఈ టైంలో ఫోన్ చేసావు?"

"ఎక్కడున్నారు?" అడిగింది ప్రియంవద.

"ఎక్కడుంటాను...ఆ ...ఆఫీసులో...ఇంతకూ నువ్వు...నువ్వెక్కడున్నావు?"

"నేనా...నేనూ ఆఫీసులోనే వున్నాన్లెండి"

తల తిరిగిపోయిన ఫీలింగ్ కలిగింది శ్రీకర్ కు. అయిపోయింది అంతా అయిపోయింది.... ఇప్పుడిక ఏమవుతుందో...

"మాట్లాడరేమిటండీ.."

"మాట్లాడుతున్నాను ప్రియంవద...ఆఫీసుకు దగ్గర్లోనే వున్నాను. అయిదు నిమిషాల్లో అక్కడుంటాను."