హలో... రాంగ్ నెంబర్.! - 12

Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

 

హలో... రాంగ్ నెంబర్.! - 12

 

ముచ్చర్ల రజనీ శకుంతల

ఎట్ యువర్ సర్వీస్ ఆఫీసు.

శ్రీకర్ కారును పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసి ఆఫీసు వైపు నడిచాడు.

శ్రీకర్ ని చూడగానే స్టాఫ్ లేచి ఒక్క రొక్కరూ విష్ చేయసాగారు. అప్పుడే ఓ అరవై అయిదేళ్ల వ్యక్తి సెక్షన్ ఇన్ ఛార్జ్ తో ఏదో మాట్లాడుతున్నాడు.

సెక్షన్ ఇన్ చార్జీ విసుక్కుంటున్నాడు. "ఇంత పొద్దున్నే వస్తే ఎలా సార్? హాయిగా సామాన్లు మీరే సర్దుకుని ఏ వ్యానో ట్రాలీనో మాట్లాడుకోవచ్చుగా" అంటున్నాడు.

"మీ ఎట్ యువర్ సర్వీస్ కు ఎంతో పేరువుంది. మీరే ఇలా విసుక్కుంటే ఎలా? అయినా మేము సామాను షిఫ్ట్ చేయవలసింది చెన్నయ్ కి. వ్యానో ట్రాలీనో ఎలా మాట్లాడతాం. నా వయసు అరవై అయిదు.  ఆర్ద్రయిటీస్. మా ఆవిడకు బీపీ. మా అబ్బాయి చెన్నయ్ వెళ్లిపోయాడు. మీరే కాస్త హెల్ప్ చేయాలి" అతను రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాడు.

సెక్షన్ ఇన్ చార్జీ మొహంలో విసుగు.

సరిగ్గా అప్పుడే ఆ టేబుల్ దగ్గరకి వచ్చాడు శ్రీకర్. అతనికి సిట్యుయేషన్ అర్ధమైంది.

"ఎక్స్ క్యూజ్ మీ సర్. అయామ్ శ్రీకర్. ఈ సంస్థ ఛైర్మన్ ని. మే ఐ హెల్ప్ యు...?"

వెంటనే సెక్షన్ ఇన్ చార్జీ ఎలర్టయి విష్ చేసాడు.

"అయామ్ విశ్వనాధశాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ని. చెన్నయ్ కి షిఫ్ట్ అవుతున్నాం. ప్యాకర్స్ కి సంబధించిన డిటైల్స్..."

శ్రీకర్ సెక్షన్ ఇన్ చార్జ్ వైపు చూసాడు.

"కంప్యూటర్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ డిటైల్స్ వున్నాయి. చెక్ చేసి చెబుదామని..."

"మీరుండేది ఏ ఏరియాలో?" అడిగాడు శ్రీకర్.

"గాంధీ నగర్ లో" చెప్పాడతను.

ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, ఫోన్ నెంబర్స్, అడ్రస్ లు రికలెక్ట్ చేసుకోసాగాడు.

"ఆర్. కె. ప్యాకర్స్ అండ్ మూవర్స్, అశోక్ నగర్, ఫోన్ నెంబర్ 27607266

రాకేశ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, గాంధీ నగర్, ఫోన్ నెంబర్ 27607266

ఓట్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాయత్ నగర్, 23224200.

మీ దగ్గర్లో వున్నవి ఇవి. వీటిలో మీరు వేటికైనా ఫోన్ చేసి ఆ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మేము మాట్లాడి పెట్టమన్నా సరే. ఫైవ్ పెర్సంట్ ఎక్స్ ట్రా చార్జ్ చేస్తాం. లేదా మీరే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు" అతను ఆ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుని " థాంక్యూ సర్. మీ ఫీజు..." అంటూ జేబులో చేయి పెట్టాడు.

"నో ఫీజ్. సీనియర్ సిటిజన్స్ కు ఫ్రీ సర్వీసెస్. వుయ్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్" వినయంగా చెప్పి తన ఛాంబర్ వైపు నడిచాడు.

"గాడ్ బ్లెస్ యూ..." అన్నాడతను వెళ్ళిపోతూ.

"మన బాసాసురిడికి ఎంత జ్ఞాపకశక్తి..నేనివాళ పేపర్లో చదివింది సాయంత్రానికి మరిచిపోతాను" అంది రిసెప్షనిస్ట్ శ్రీకర్ లోపలికి వెళ్లాక టైపిస్టుతో.

ఈలోగా సెక్షన్ ఇన్ చార్జీకి క్యాబిన్ నుంచి పిలుపొచ్చింది.

*           *            *

"సారీ సర్..." అన్నాడు సెక్షన్ ఇన్ చార్జ్, శ్రీకర్ పది నిమిషాల పాటు క్లాసు తీసుకోవడం పూర్తయ్యాక.

"తప్పులను రిపీట్ చేయడం నేను సహించలేను. కస్టమర్లు మనకు దేవుళ్లతో సమానం. ఒక కస్టమర్ తో మనం సవ్యంగా వుంటే అతను పదిమందికి చెబుతాడు. ఆ పదిమంది వంద మందికి చెబుతారు. రెప్యుటేషన్ ఒక్కసారి దెబ్బ తింటే క్యాన్సర్ లా సంస్థను డామేజ్ చేస్తుంది. వన్ మోర్ థింగ్.... మీ జ్ఞాపకశక్తిని ఎప్పుడూ ఇంట్లో వదిలి రాకండి. ఖాళీ సమయాల్లో ఫోన్ బెమ్బార్లు, అడ్రస్ లు ఓసారి చూసుకోండి. ప్రతీదానికి కంప్యూటర్ మీద ఆధారపడ్డం మంచిదికాదు. చిన చిన్న విషయాల్లో కూడా. అన్నింటి కన్నా ముఖ్యమైంది క్షమార్హం కానిది నిర్లక్ష్యం. క్లయింట్స్ పట్ల నిర్లక్ష్యం నేనసలు టాలరేట్ చేయను, యుకెన్ గో..." చెప్పాడు శ్రీకర్.

వృత్తి పట్ల డెడికేషన్ శ్రీకర్ విజయరహస్యం. బిజినెస్ మేనేజ్ మెంట్ చదవలేదు. కానీ బిజినెస్ చెయ్యడానికి...తను ఓ క్లయింట్ లా ఆలోచిస్తే చాలనుకున్నాడు. ఓ క్లయింట్ ఎలాంటి వ్యాపార సంస్థను, ఎందుకు ప్రిఫర్ చేస్తాడో తెలుసుకోగలిగితే చాలనుకుంటాడు.

*                  *               *