తాతా ధిత్తై తరిగిణతోం 54

తాతా ధిత్తై తరిగిణతోం 54

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

విషయం బోధపడింది శ్రీరామ్ కి. తాము హోటల్లో అడుగు పెట్టగానే, రిసెప్షన్ లో వున్న మేనేజరు అశ్విని వైపు 'అలా' నిశితంగా ఎందుకు చూశాడో అర్థమైంది కొన్ని క్షణాలు ఆలోచించి ఓ నిర్ణయానికి కొచ్చాడు.

"ఓ.కే.సార్. మీరు చెప్పినట్టే పోలీస్ స్టేషన్ కోస్తాం. తన కూతురు కనిపించటం లేదని పేపరు ప్రకటన ఇచ్చిన ఆ జగన్నాధం ఎవరో ఆయన్ని కూడా వెంటనే పిలిపించండి. ఆయనొచ్చి, ఈ అమ్మాయి తన కూతురే అని చెప్తే మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా ఒప్పుకుంటాను. ఒకవేళ ఈ అమ్మాయి తన కూతురు కాదని చెప్తే మీ మీద నేను పదిలక్షలు పరువునష్టం దావా వేస్తాను సరేనా?" ఛాలెంజ్ చేస్తున్న వాడిలా అడిగాడు.

"మీరు వేసే దావాలు మా దగ్గర చెల్లవు బాబూ! కంప్లయింట్ వచ్చినప్పుడు ఎవరినైనా సరే స్టేషన్ కి తీసుకెళ్ళి ఆరాతీసే అధికారం మాకుంది" మొండిగా చెప్పి శ్రీరామ్ చేతికి బేడీలు వేసేందుకు ముందుకొచ్చాడు ఇన్స్పెక్టరు. అంతవరకూ ఎంతో ధైర్యంగా నిలబడిన అశ్విని 'బేడీలు' చూడగానే బేలగా మారిపోయింది గభాల్న శ్రీరామ్ గుండెలపై వాలిపోయింది.

"సారీ శ్రీరామ్!? ఇదంతా నావల్లే జరిగింది పుట్టినరోజు కానుకగా నన్ను 'హనీమూన్' తీసుకెళ్ళమంటూ మూర్ఖంగా నేను బలవంతం చేయటం వల్లనే జరిగింది." అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ కన్నీళ్లు చూసిన ఇన్స్పెక్టరు కొంచెం భార్యాభర్తలేనేమో నన్న అనుమానం కూడా కలిగింది. శ్రీరామ్ చేతికి బేడీలు వేసే ప్రయత్నం విరమించుకున్నాడు.

"ఉ! సరే! ఈ ఊళ్లో మీకు తెలిసినవారెవరైనా వుంటే చెప్పండి. ఫోన్ చేసి వాళ్లని పిలిపిస్తాను. వాళ్ళొచ్చి మీరిద్దరూ భార్యాభర్తలని 'సర్టిఫై' చేస్తే ఒదిలేస్తాను." అన్నాడు. ఓ నిర్ణయానికొచ్చినవాడిలా.

వెంటనే అశ్విని అంది శ్రీరామ్ తో శ్రీరామ్ ఈ ఊళ్లో మీ నాన్నగారి ఫ్రెండెవరో వున్నారని చెప్పావుగా."

శ్రీరామ్ కూడా చటుక్కున గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ వున్నారు సార్...చిదంబరం గానీ క్రిమినల్ లాయరు! లబ్బీపేటలో వున్నారు" అంటూ గబగబా తన బ్యాగ్ లోని డైరీ తీసి అందులోవున్న చిదంబరం 'ఫోన్ నంబరు' వేరే కాగితం మీద రాసిచ్చాడు.

"ఆల్ రైట్! రిసెప్షన్ లోంచి ఫోన్ చేసి పిలుస్తాను." అంటూ ఇన్స్పెక్టరు బయటకు నడిచాడు. కానిస్టేబులు మాత్రం రూమ్ బయట 'కాపలా' గా నిలబడ్డాడు.

"ఛ...మనం బయల్దేరిన వేళ బాగోలేదు. అందుకే ఇలా జరిగింది. ఈ హనీమూన్ హాయిగా మా ఇంట్లో జరుపుకున్నా బావుండేది." కన్నీళ్లు తుడుచుకుని మంచం మీద కూర్చుంటూ అనుకుంది అశ్విని.

"నేనూ అలాగే అనుకున్నాను. కానీ మా నాన్న వట్టి అనుమానం మనిషి. మన మీద అడుగడుక్కీ నిఘా వేసే రకం. మా స్కూలు బంట్రోతు వీరయ్యను నాకు ఎస్కార్టుగా వేసి మధ్యలో మీ ఇంట్లో మజిలీ వేసినట్టు ఏ గూఢచారి ద్వారానో ఆయనకు తెలిసిందంటే నానా రభసా జరుగుతుంది." చెప్పాడు శ్రీరామ్.

"అదీ పాయింటే ఇప్పుడింతకీ ఆ చిదంబరంగారు ఇంట్లో వుంటారో ఉండరో?" దిగులుగా చూసిందామె.

"తప్పకుండా వుంటారు అశ్వినీ! మనం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నవాళ్ళం ఆ అగ్నిదేవుడే మనల్ని కాపాడుతాడు. నువ్వేం దిగులుపడకు."

"కానీ మీ ఊళ్లోవున్న తన పొలాలు చూసుకునేందుకు ఆయనగారు అప్పుడప్పుడు వస్తూంటారని చెప్పావ్ కదా? అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా ఈ విషమంతా మావయ్యగారికి చెప్పేస్తారేమో."

"అదంతా నేను చూసుకుంటానుగా నువ్వేం దిగులుపడకు. ముందీ గండం గడవనియ్." ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పాడు శ్రీరామ్.

మరో అయిదు నిమిషాలు బరువుగా గడిచాయి. అంతలోనే ఇన్స్పెక్టర్ తో సహా చిదంబరం హడావిడిగా ఆ రూమ్ లోకి వచ్చాడు.

"నమస్తే అంకుల్." అతని రాకకోసమే ఆత్రంగా ఎదురుచూస్తున్న శ్రీరామ్ ఉత్సాహంగా అతనికి ఎదురువెళ్లాడు. అశ్విని కూడా ఆయనకు మర్యాదపూర్వకంగా నమస్కరించింది.

"మీరటోయ్? ఎవర్నో గుర్తుపట్టాలి, అర్జంటుగా రండంటూ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే ఖంగారు పడుతూ వచ్చాను. ఇంతకీ మీరెప్పుడు వచ్చారు?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు చిదంబరం.

"ఇంతకు ముందే ఓ గంటయింది అంకుల్."

"అయితే వీళ్లు మీకు తెలుసున్నమాట." తేలిగ్గా నిట్టూర్చి అన్నాడు ఇన్స్పెక్టర్.