తాతా ధిత్తై తరిగిణతోం 46

తాతా ధిత్తై తరిగిణతోం 46

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials Taataadhithai tadiginatom, telugu serial comics and latest jokes online

 

"ఇవాళ ఈ ముచ్చట జరపటం లేదు. ఇవన్నీ తీసెయ్." టేబుల్ మీదనున్న మినప సున్నండుల పళ్లేన్ని ఆమెకు అందించాడు.

"ఎందుకునాన్నగారూ...ఏం జరిగిందీ?" పళ్లెం అందుకున్న గీతం దిగ్భ్రాంతిగా చూస్తూ అడిగింది.

విషయమంతా కూతురికి వివరంగా చెప్పాడు వీరభద్రం. మరుక్షణంలో ఆ వార్త ఇంట్లో అందరికీ చేరిపోయింది. అశ్వినికి పూలజడ అల్లుతున్న పార్వతమ్మ నిర్ఘాంతపోయింది. చేస్తున్న పని అలాగే వదిలేసి హాల్లోకి వచ్చింది.

"ఇదెక్కడి విడ్డూరమండీ? శుభమా అని పెళ్లిచేసి ఇప్పుడు శోభనం చెయ్యటానికి వీల్లెదంటారా? పైగా పెళ్ళికి ముహూర్తం పెట్టిన పంతులుగారే పంచాంగం చూసి ఈ ముచ్చటకు కూడా సమయాన్ని నిర్ణయించారు. మళ్ళీ, వచ్చేఏడు ఈనాటికి మీకు తాతగారయ్యే యోగం ఉందని కూడా నిర్ధారించారు" అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ మధ్యలోనే ఆమెను వారిస్తూ అన్నాడు వీరభద్రం.

"అదే....ఆ యోగమే ఫలిస్తే నాకు మారకం కూడా పట్టునని ఇప్పుడొచ్చిన ఆ సాధువుగారు చెప్పారు.

"ఒంటిమీద కషాయం గుడ్డ వేసుకుని నాలుగు రుద్రాక్ష దండలు వేలాడేసుకున్నంత మాత్రానా ఆయనగారు ఓ సాధువువైపోతాడా? ఆయనగారి వాక్కులు వేదవాక్కులైపోతాయా?" విసుక్కుంది పార్వతమ్మ.

"చాలించు ప్రేలాపన లేకున్న నీ నాలిక తెగ్గోయగలను. ఆయన కాషాయం ధరించిన సాధువు కాదు....కారడవుల్లో కూర్చుని తపస్సాచరించిన మహాయోగి. భూత భవిష్యత్ వర్తమానాల్ని కళ్ళుమూసుకుని దర్శించుగల శక్తి స్వరూపులు" భార్యను కసురుకుంటూ చెప్పాడు వీరభద్రం.

అంతలోనే శ్రీరామ్, ఆ వెనుక అశ్వినీ అక్కడకొచ్చారు. "శక్తి స్వరూపుడూకాదూ...ముక్తి ప్రదాతా కాదు. జాతకాల పట్ల మీకున్న పిచ్చినీ, మీలో వున్న మూఢనమ్మకాల్నీ కనిపెట్టి...ఎవడో ఇలా మాయవేషం వేసుకొచ్చుంటాడు. ఈ సమయంలో, నాలుగు అవాకులూ, చెవాకులూ చెప్తే మీరు భయపడిపోయి వాటి పరిహారం కోసం, పూజలూ, పునస్కారాలు చేయించమనీ తన చేతిలో వేలకు వేలు పోస్తారసుకుని వుంటాడు." శ్రీరామ్ చెప్పాడు.

"అదీ  నిజమే ఇవాళా రేపూ ఇలాంటి దొంగ సాధువులూ, స్వామూలూ ఎంతోమంది తయారవుతున్నారని మొన్నామధ్య 'టీవీనైన్' వాళ్ళు  న్యూస్ లో చూపించారు." అశ్విని కూడా శ్రీరామ్ కి వంత పలికింది.

ఆ మాటలు వీరభద్రానికి రుచించలేదు...కోడలు మీద విపరీతమైన కోపం వచ్చింది...కానీ 'కొత్తకోడలు కదా' అని నిగ్రహించుకున్నాడు.

"ఆయన అలాంటి దొంగ సాధువేం కాదు  గొప్ప మహిమాన్వితుడు ...ఆ కంఠస్వరం, ఆవర్చస్సు చూడగానే పాదాభివందనం చేయాలనిపించింది...అయినా ఒకవేళ, మీరంటున్న విషయములే యదార్థమైనచో ఆవిధమైన పూజలకూ, పునస్కారములకూ నన్నూ డబ్బు అడిగివుండెడివాడు కదా? ఎక్కడో కాశ్మీరం దగ్గరున్న పర్వత శ్రేణుల్లో తపస్సాచారించి అణిమాదిసిదులు సాధించి ఇప్పుడు కాలినడకన కన్యాకుమారి వెడుతూ మార్గమధ్యంలో మనిల్లుపావనం చేశాడు. అభ్యాగతి శ్రేయస్సును వంచించే అతిథిగా నాకు సలహా అందించాడు. ఆచరించుట నాకర్తవ్యం." అన్నాడు శ్రీరామ్. ఏం బదులు చెప్పాలో తెలీక బుర్రగోక్కున్నాడు అదొక సున్నితమైన సమస్య, ఇబ్బందికరమైన సందర్భం కావటంతో అశ్విని కూడా వెంటనే ఏమీ మాటాడలేకపోయింది.

అంతలో వీరభద్రం, శ్రీరామ్ దగ్గర కొచ్చాడు.

"మాటకు కట్టుబడే వంశం మనది. నాతాత ముత్తాతలకు తలవంపులు తెచ్చేవిధంగా ఇవాళ నీకోసం చెల్లెలి కిచ్చిన మాట తప్పి నువ్వు 'లవ్వు' చేసిన పిల్లతో నీ పెళ్లి జరిపించాను. ఇప్పుడు నామాటను గౌరవించలేవా? నా కోరిక మేరకు నడుచుకోలేవా?" అడిగాడు.

శ్రీరామ్ నిస్సహాయంగా తండ్రివైపు చూశాడు. ఈలోగా అశ్విని ఓ అడుగు ముందుకొచ్చింది.

"అదికాదు మావయ్యగారూ. ఆసాదువెవడో, ఈ ఏడాదిలో మీరు 'తాత' కాకూడదని చెప్పాడే తప్ప ఇప్పుడి వేడుకలు జరపద్దని చెప్పలేదుగా?" కొంచెం మొహమాటపడుతూనే అడిగింది.

వీరభద్రంలో కోపం తారాస్థాయికి చేరుకుంది.

"చాలించు. మా గృహమున ప్రవేశించి ఇరువైనాల్గుంటలు కాలేదు....అప్పుడే నాముందు నిలబడి...సలహాలు ఇచ్చేటంతటి దానివైనావా?"

ఆ కోపంలో ఊగిపోతూ అడిగాడు.

"చాదస్తం మనుషులకు సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు. ఎప్పుడైనా ఇవ్వచ్చు." మోడిగా బదులిచ్చిందామె.

"వ్వాట్? నేను ....నేను చాదస్తం మనిషినా?" అంటూ గుడ్లెర్రచేసి ఆమె వైపు ఉరిమిచూశాడు వీరభద్రం. తర్వాత శ్రీరామ్ వైపు వెళ్లి అతని చొక్కా పట్టుకుని ముందుకు లాగుతూ అన్నాడు.

"చూశావురా నీ భార్య ప్రతాపం? పెద్దలంటే నీ భార్యకు ఎంతటి గౌరవం వున్నదో చూశావా? అసలు నువ్వే పుట్టేవరకూ మీ అమ్మ ఏనాడూ మా నాన్న వైపు తలెత్తి చూడలేదురా కానీ నీముద్దుల భార్య మాత్రం ఇలా బరితెగించి నాకే బిరుదులిస్తోంది.  నేను చాదస్తం మనిషినట."

"అవును. ఆ మాట మళ్లీ అంటున్నాను...మీకు చాదస్తం ఎక్కువే." అశ్వినిలో కూడా కోపం ఎక్కువైంది. అంతలో పార్వతమ్మ ఆమె చేయిపట్టుకుని నచ్చచెప్పింది.

"ఊరుకో తల్లీ. ఆయనసలే గుండె జబ్బు మనిషి. నేను నెమ్మదిగా నచ్చచెప్పి ఒప్పిస్తాను ఇవాళ కాకపోతే రేపెప్పుడో మా పంతులుగారి చేత మరో మంచి ముహూర్తం పెట్టించి ఈ ముచ్చట నేను జరిపిస్తాను."

"జరిపించు తమరి కొడుకూ, కోడలూ సుఖముగా వున్నచాలూ. ఇక కట్టుకున్న భర్త వుంటే ఎంత? లేకుంటే ఎంత? వారికి ఆ ముచ్చట జరిపించి తదుపరి మమ్మల్ని కాటికి పంపించి, అటుపై ఏడాదికో మనుమణ్ణో మానుమరాల్నో ఎత్తి వారితో కాలక్షేపం చేయండి." తన కోపావేశాన్ని పళ్ళబిగువున అణచిపెట్టి అక్కణ్ణించి విసవిసా వీధిలోకి వెళ్ళిపోయాడు వీరభద్రం. అశ్విని వస్తున్న ఏడుపు ఆపుకునే ప్రయత్నం చేస్తూ తన గదిలోకి వెళ్లిపోయింది.

"అశ్విని" అంటూ ఆమెను ఓదార్చేందుకు శ్రీరామ్ కూడా అనుసరించాడు.

"అంతా నాఖర్మ 'చాదస్తం మొగుడు చెబితే వినడు. అరిస్తే కరుస్తాడూ' అన్నట్టుంది ఈయన గారితో" నుదుటి కొట్టుకుంటూ వంటగదివైపు నడిచింది పార్వతమ్మ.

ఇక ఆ హాల్లో ఒకవైపు గీత మరోవైపు రాజేంద్రా మిగిలిపోయారు.

"మొత్తానికి ఛాదస్తం మావకి ఛలాకీ కోడలే వచ్చింది." అని కామెంట్ చేశాడు రాజేంద్ర భుజాలెగరేస్తూ.

"ఇక ఇక్కడ మనకేం పనీ? మనం కూడా ప్రయాణమవుదాం. రాత్రి బస్సుకి టిక్కెట్లు దొరుకుతాయేమో, వెళ్లి తీసుకురండి." చెప్పింది గీత.

"అంటే...నా కట్నం బాకీ గురించి మీ నాన్నని ఇప్పుడు అడగటంలేదా?"

"ఆయనగారు మామూలు 'మూడ్'లో వున్నప్పుడే అడగటానికి మీ నోట మాటపడిపోయింది. 'అప్ప' న బోయి 'పప్పు' న్నారు. ఇప్పుడింకేం అడుగుతారూ?"

"నేను కాదు...నువ్వడుగు." చెప్పాడు రాజేంద్ర.

"చాల్లెండి. అనలే తిక్కలోవున్నాడు. ఇప్పుడా ప్రస్తావన తీసుకువస్తే నా రెక్క పట్టుకుని బయటకు తోసేసినా తోసేస్తాడు. ఎలాగా వచ్చే సంక్రాంతికి ఇప్పిస్తానని అమ్మ చెప్పిందిగా. ఇంకెంత?....ఆర్నెల్లు. ఓపికపట్టండి." అంటూ లోపలకు వెళ్లిపోయింది గీత.

రాజేంద్ర బస్సు టిక్కెట్లు తీసుకురావటానికి బయటకు నడిచాడు.