తాతా ధిత్తై తరిగిణతోం 23

తాతా ధిత్తై తరిగిణతోం 23

 

జీడిగుంట రామచంద్రమూర్తి

 

Get latest telugu famous comedy serials, telugu serial comics and latest jokes online

 

ఆ రోజుతో పరీక్షలైపోయాయి.
ఆఖరి పరీక్ష కూడా బాగా రాసిన ఆనందంతోనూ, వెంటనే తన ఊరికి ప్రయాణమవ్వాలన్న ఉత్సాహంతోనూ, వేగంగా, 'హాస్టల్' వైపు నడుస్తున్నాడు శ్రీరామ్.
అంతలో, హఠాత్తుగా అతని పాదాల ముందు ఓ మనీపర్సు వచ్చిపడింది. ఎక్కణ్ణించి వచ్చిందో అర్థంకాక, అటూ ఇటూ చూశాడు....చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదు. మెరిసిపోతూ అందంగా కనిపిస్తున్న ఆ పర్సును చేతిలో తీసుకుని అందులో ఏదైనా 'విజిటింగ్ కార్డు' లాంటిది ఏదైనా కనిపిస్తుందేమోనని తెరచిచూశాడు.
యధాలాపంగానే పర్సులోవున్న అరలన్నీ చూశాడు. చినిగిపోయిన రూపాయినోటు తప్ప అందులో మరేం లేదు. ఆ మణీ పర్సును, తిరిగి రోడ్డు మీదనే విసిరేయబోయాడు...అదేక్షణంలో రోడ్డుకి అవతలి వైపున వున్న కిళ్లీ షాపు దగ్గర్నుంచి ఇద్దరు యువకులు శ్రీరామ్ వైపు వస్తూ పిలిచారు.
"ఏయ్ మిష్టర్!"
శ్రీరామ్ ఆగిపోయాడు.
ఇద్దరూ అతనికి దగ్గరగా వచ్చారు. చాలా బలిష్టంగా, ఎత్తుగా వున్నారు. ఒకడు జీన్స్ ప్యాంటు మీద టీషర్టు వేసుకున్నాడు.  రెండోవాడు లాల్చీ పైజామాల్లో వున్నాడు. చూడబోతే రౌడీల్లా కనిపించారు.
"ఆ పర్సునాది!" అన్నాడు టీ షర్టు రౌడీ.
"తీసుకోండి!" మర్యాదగానే, దాన్ని అతని చేతికి అందించాడు శ్రీరామ్.
అతను పర్సు తీసుకుని ఆతృతగా తెరచి చూశాడు.
"ఇందులో డబ్బేదీ?"
"డబ్బా?" తెల్లబోయాడు శ్రీరామ్.
అవును! డబ్బే! మనీ పర్సులో 'డబ్బు' కాక బఠానీలుంటాయా?"
ఏమో!...నాకు తెలీదు నాకాళ్ళ దగ్గరకొచ్చి పడితే 'ఎవరిదో' అనుకుంటూ తీసాను. 'పర్సులో డబ్బేంలేదు. చెప్పాడు.
ఇప్పుడు పైజామా కుర్రాడు శ్రీరామ్ మీదకు వచ్చాడు.
"ఏయ్ మిష్టర్! నకరాలు...చేస్తున్నావా? మాతో పెట్టుకున్నావంటే, మట్టికరిపించేయగల మర్యాదగా అయిదువేలూ ఇచ్చేయ్!" అన్నాడు.
"ఐయిదువేలా?..."
"అవును! ఇంతకముందే 'బ్యాంక్' లో 'డ్రా' చేశాను!...అన్నీ 'వెయ్యి' నోట్లు! నామాట అబద్దం అనుకుంటే బ్యాంక్ కీ రా!...చెప్పిస్తాను!" టీ షర్టు కుర్రాడు చెప్పాడు.
"అబద్దం! పర్సులో చిరిగిపోయిన రూపాయినోటు తప్ప ఇంకేం లేదు!" మొండిగా అన్నాడు శ్రీరామ్.
"ఓహో! చిరిగిపోయింది కాబట్టి దాన్ని వదిలేసి 'వెయ్యి' నోట్లు అయిదూ నొక్కేశావన్న మాట. మర్యాదగా డబ్బివ్వకపోతే షేపులు మారిపోతాయి'' అంటూ అతను శ్రీరామ్ కాలరు పట్టుకున్నాడు.
శ్రీరామ్ బెదిరిపోయాడు...ఎవరైనా చూస్తే తనపరువు పోతుందన్న భయం ఒకవైపు వాళ్ళనుంచి ఎలా తప్పించుకోవాలా అనే ఆందోళన మరోవైపు...పరీక్షలు బాగా రాసిన ఆనందం, ఇంటికి తిరిగి వెడుతున్న ఉత్సాహం వుట్టికెగిరిపోయాయి...పారిపోయేందుకు ధైర్యం లేకపోయింది. ఏడుపొచ్చినంత పనైంది.
అంతలో కీచుమని శబ్దం చేస్తూ సడెన్ బ్రేకుతో అతనిపక్కగా 'సాంత్రో' వచ్చి ఆగింది.
అందులోంచి అశ్విని క్రిందకు దిగింది.
"ఏయ్...ఎవరు మీరు?...ఎందుకితన్ని బెదిరిస్తున్నారూ?" శ్రీరామ్ ని పక్కకి తప్పించి, తన రెండడుగులు ముందుకొచ్చి అడిగింది.
"నువ్వెవరివే? వాడికి పెళ్లానివా? ప్రియురాలివా?" వెటకారంగా అడిగాడు టీషర్టు కుర్రాడు.
తనను అలా ఏకవచన ప్రయోగం చేయటంతో శ్రీరామ్ కీ కోపం ముంచుకొచ్చింది.
"మర్యాదగా మాట్లాడు!" అంటూ వాడిమీదకు వెళ్ళబోయాడు.
అతన్ని చేత్తోనే వారించింది అశ్విని.
అంతలో 'పైజామా' గాడు చెప్పాడు.
"మెడలో తాళిబొట్టు లేదుగా...పెళ్లాం కాదు. బహుశా ప్రియురాలే అయ్యుంటుంది."
అశ్విని వెంటనే వాడి దగ్గరగా వచ్చి భుజం మీద చెయివేసి అడిగింది.
"అవును! ప్రియురాల్నే! మీకేమైనా ప్రాబ్లమా?"
వాడు కొంచెం డౌనయ్యాడు.
"అబ్బే...నువ్ చూడబోతే కార్లో వచ్చావ్. 'కాస్ట్ లీ'గా కనిపిస్తున్నావ్. వీడేమో 'చీప్'గా కాలినడకన పోతున్నాడు. పైగా 'పిక్ పాకెట్ గాడి' ళా కనిపిస్తున్నాడు. ఇట్టాంటి వాడిని నువ్ 'లవ్' చేస్తున్నావంటే నమ్మబుద్ధి కావటం లేదు."
"షటప్! ఇతని గురించి మరోమాట మాట్లాడితే పళ్ళు రాలగొట్టి జేబులో వేస్తాను..."
"మేం గాజులు తొడిగించుకోలేదు. మీసమున్న మగాళ్ళం రోషమున్న మొనగాళ్ళం. నీలాంటి వాళ్ళను చాలామందిని చూశాం. 'కారులో వచ్చిన పిల్లవి కదా' అని కనికరించి ఊరుకుంటున్నాం లేకపోతేనా?"
"ఊ లేకపోతే ఏం చేస్తారూ" నడుంమీద చేతులేసుకుని వాళ్ళమీదకు వెళ్ళింది అశ్విని.
"సినీమాలు చూడవానువ్వు?...అందమైన ఆడపిల్ల కనిపిస్తే మాలాంటి రౌడీలు ఏం చేస్తారో అదే చేస్తాం."
"షటప్!"
"నమ్మకం లేదా?...రా చూపిస్తాం!" అంటూ అశ్విని రెండు భుజాల్నీ గట్టిగా పట్టి తన మీదకు లాక్కోబోయాడు వాడు...

 

(ఇంకా వుంది ...)