మై డియర్ రోమియో - 36

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 36

 

స్వప్న కంఠంనేని

 

ఉన్నట్లుండి హనిత ఆమెకి కన్నుగీటింది. ఆమె కూడా ప్రపంచాన్ని మర్చిపోయి హనితకి కన్ను కొట్టింది. ఓరగా దీన్నంతటినీ చూస్తున్న భర్తకి తిక్కరేగిపోయింది.
భార్యనేమీ అనలేక లేచి నిలబడ్డాడు. అతని ఆకారాన్ని చూసి భయపడింది హనిత. ఆరుడుగుల రెండంగుళాల ఎత్తు, ఎక్సర్ సైజులు చేసి బలంగా తయారైన ఒళ్ళు. అతను నడుస్తుంటే భూమి అడురుతుందేమో అన్నట్లుగా ఉంది. హనిత దగ్గరక౭  ొచ్చాడతను. హనిత భయంగా లేచి నిలబడింది.
అతని ముందు హనిత పికిలి పిట్టలా ఉంది. చటుక్కున అతను హనితని రెండు చేతులతో పట్టుకుని పైకిలేపాడు. భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. పహిల్వాన్ లాంటి వ్యక్తి తన చేతుల్లో ఉన్న హనితని కసితో ముందుకు విసిరాడు.
ఈ దృశ్యాన్నంతటినీ అయోమయంగా చూస్తున్న వైభవ్ ఆఖరు క్షణంలో జరుగబోతున్నదేమిటో గ్రహించి ఆమె పడబోయే స్థలాన్ని అంచనా వేసుకుంటూ చేతుల్ని చాచి తన శరీరాన్ని సర్దుకుంటూ వెనక్కు వెనక్కు కదలసాగాడు.
అతని అంచనా కరెక్టే అయింది. స్లో మోషన్ లో లాగా గాల్లో తేలుతూ వచ్చిన ఆమె శరీరం అతని చేతుల్లో పడింది.
"అందుకే నిన్నిక్కడికి రావద్దన్నది ...'' ఆమెను సుతారంగా, భద్రంగా నేలమీదకు దించుతూ పసిపిల్లను కోప్పడుతున్నట్టుగా అన్నాడు వైభవ్.
అతని చేతుల్లోంచి నేలమీదకు దిగుతూ భయంతోనే అయినా హనిత ఆఖరు క్షణంలో అతని కళ్ళల్లోకి అలవోకగా చూసింది.
అదే సమయాన వైభవ్ కూడా అనుకోకుండా ఆమె కళ్ళల్లోకి చూశాడు.
ఆ చూపుల కలయిక ...
ఆ చూపుల తాదాత్మ్యం ...
కనుకొలకల చివరి నుంచి చూసే ఒక వాల్చూపు, ఒక పెదవి విరుపు, ఒక కొంటె నవ్వు, ఎక్కడో నరాల్ని జిల్లుమనిపించే ఒక వయ్యారం, మెడవంపులో సుతారం, కనుకోనల నుంచి జారి బుగ్గల మ్రుడుత్వంలో మాయమయ్యే బ్లష్, స్వరంలో సితార తీగను మీటినప్పుడు వచ్చేలాంటి మధుర ప్రకంపనం ... వీటిలో ఏ ఒక్కటీ, లేక ఏ కొన్నిటి కలయికో మనిషి ప్రేమలో పడేస్తాయి ... మనిషిని ప్రేమలో ముంచెత్తుతాయి.
ఆ క్షణాన వాళ్ళిద్దరినీ పైన చెప్పిన లక్షణాలలో ఏ ఒకటో ఏ కొన్నిటి కలయికో మైకంలోకి నెట్టింది ...
తన చేతుల్లోకి పూలచెండులా పడిన హనితని విసురుగా కిందకి దింపి చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు వైభవ్.
గ్లాస్ డోర్ తెరుచుకుని బార్ కెదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్ వరకూ అలాగే లాక్కెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక హనితని కైనెటిక్ హోండా మీదకి తోసేస్తూ అన్నాడు వైభవ్.
"గెట్ లాస్ట్. అర్జంట్ గా ఇక్కడ్నుంచి వెళ్ళిపో''
హనిత ఆశ్చయ్రంగా చూడసాగింది వైభవ్ ని.
"చెప్పేది నీకే'' కోపంగా అరిచాడు వైభవ్.
భయం పుట్టి గబగబా కైనెటిక్ హోండాని స్టార్ట్ చేసి క్షణంలో మాయమైంది హనిత.
దారి పొడుగునా హనిత వైభవ్ గురించే ఆలోచించసాగింది. తొలిప్రేమ మైకంలో రెండు స్కూటర్లకీ, నాలుగు లారీలకీ, అయిదు రిక్షాలకీ డాష్ యివ్వబోయి చిటికెలో తప్పించుకుంది.
ఇంటిని చేరుకున్నాక బైక్ ని ఆపి స్టాండ్ కూడా వేయకుండా దాన్నలాగే వదిలేసి లోపలికి నడించింది.
బైక్ ధబ్ మన్న శబ్దంతో పక్కనే ఉన్న హేమంత్ బైక్ మీదపడింది. హేమంత్ బైక్ పెద్ద శబ్దంతో కింద పడిపోయింది. ఈ మాటకి ఇంట్లో వాళ్ళంతా బయటికి పెరుగెత్తుకు వచ్చారు. హనితకి మాత్రం ఆ గొడవలేమీ వినిపించలేదు.
ట్రాన్స్ లో ఉన్నట్టుగా నడుస్తూ "మీలోన తుమ్ సే హమ్ గభ్ రాయే, మిలోతో ఆంఖో చురాయే, హమే క్యాహోగయా , హమే క్యా హోగయా'' పాత హిందీ పాట హమ్ చేయసాగింది.
హేమంత్ తల బాదుకుంటూ వెళ్ళి బైక్స్ రెండూ లేపి స్టాండ్ వేసి మళ్ళీ లోపలికొచ్చాడు.
"ఎందుకె అలా పాట పాడుతున్నావ్?'' విసుగ్గా అంది హనిత తల్లి గిరిజ.
హనిత పట్టించుకోలేదు. పాట పాడటం  మానలేదు. "హనీ!'' కోపంగా అరిచాడు సత్యం.
ఉలిక్కిపడి స్పృహలోకి వచ్చింది హనిత.
"రాగం, తాళం లేకుండా ఒకే రేంజ్ లో అంత భయంకరంగా పాడగలగటం నీకోక్కదానికే సాధ్యం. ఇంకోసరలా పాడితే చెంప పగలగొడతాడు'' ఏడవ బోతున్నట్టుగా మొహం పెట్టి అన్నాడు సత్యం.
హంత తండ్రికేసి భావరహితంగా చూసి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.
"అన్నం తినవా?'' తల్లి అడిగింది.
తల్లివేపోకసారి ఎగాదిగా చూసి పాట పాడటం మొదలుపెట్టింది హనిత.
"ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే ...''
మళ్ళీ ఎందుకో తండ్రివేపు చూసి పాట సగంలో ఆపేసి లోపలికి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టుకుంది.
గిరిజ ఆశ్చర్యంగా చూస్తూ బుగ్గలు నొక్కుకుంది.