మై డియర్ రోమియో - 23

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 23

 

స్వప్న కంఠంనేని

 

వైభవ్ బైక్ గాలికన్నా వేగంగా దూసుకుపోసాగింది.
"వామ్మో! ఈ రాక్షసే ఆ రాక్షసా? అవున్లే ... అయినా ఇంట రాక్షసి ఇంకెక్కడ ఉంటుందని'' పదేపదే అనుకోసాగాడు.
ఇల్లు రాగానే దూకుడుగా బైక్ నాపేసి లోపలికి పరుగెత్తాడు.
గబగబా తల్లి దగ్గరకు వెళ్ళి చెప్పాడు.
"అమ్మా! చిన్నప్పుడు మన ఊళ్ళో ఒక రాక్షసి ఉండేదే ...'' వైభవ్ మాటల్ని సగంలోనే కట్ చేస్తూ అంది వైభవ్ తల్లి సుజాత "అదంతా వట్టిదే బాబూ ... రాక్షసి లేదు, ఏమీ లేదు. నువ్వు అన్నం తినకపోతే ఊరికే అలా బెదిరించేదాన్నంతే''
"అబ్బా!'' బాధగా అరిచాడు వైభవ్.
"అది కాదమ్మా! నా చిన్నప్పుడు మన ఊళ్ళో చిన్నారి అని ఒక పిల్ల ఉండేది. నన్ను కొరికేసింది తర్వాత గొడవయితే వాళ్ళు ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయారు. గుర్తొచ్చిందా?''
"ఆ! ఆ! దాన్నెలా మర్చిపోతాను. అవునూ! నీ షర్ట్ అంతా చిరిగిపోయిందేమిట్రా''
"అదే చెప్తున్నా. ఇప్పుడు అది మా క్లాస్ లోనే చదువుతోంది. ఇప్పుడు దాని పేరు హానిత''
"కొంపదీసి అది నిన్ను మళ్ళీ కొరికిందేమిట్రా. షర్ట్ అంతా చిరిగింది కదా'' రాగం తీయబోయింది సుజాత.
"కొరకలేదు కానీ షర్ట్ అదే చింపేసింది''
"అమ్మో! అమ్మో అయితే ఇంకా అది మారలేదన్నమాట''
"సరే కానీ! తొందరగా షర్ట్ మార్చుకో. మీ వదినలు చూస్తె ఆడపిల్లతో కూడా గెలవలేని వాడంటారు''
"సరేనమ్మా! అంటూ గబగబా తన రూంలోకి వెళ్ళిపోయాడు వైభవ్.
మరో పదిరోజులు గడిచాక పూర్తిగా ఆరోగ్యాన్ని పుంజుకుని తిరిగి కాలేజ్ లోకి అడుగుపెట్టింది హానిత.
"హాయ్ ఇడ్లీ!'' గ్రీట్ చేస్తున్నట్టుగా అంది.
వైభవ్ పట్టనట్టుగా ఊరుకున్నాడు.
"వైభవ్! హానిత నిన్ను ఇడ్లీ అంటోందిరా'' సురేష్ రెచ్చగొట్టబోయాడు వైభవ్ ని.
"చావనీరా. పిశాచాల్తో మాట్లాడొద్దని చెప్పింది మా అమ్మ'' హనితకు వినిపించేట్టుగా అన్నాడు వైభవ్.
హానిత గబగబా వైభవ్ దగ్గరికొచ్చి అంది.
"ఓహో, కష్టమే మరి. అయితే మీ అమ్మతో నువ్విప్పుడు మాట్లాడడం లేదన్నమాట''
"షటప్!' 'అరిచాడు వైభవ్.
"ఇడ్లీ, అందుకే నిన్ను ఇడ్లీ అనేది'' కసిగా అంది హానిత.
ఇంతలో మీనా వచ్చింది క్లాస్ లోకి.
వస్తూనే హనితకి, వైభవ్ కి మధ్య ఏదో గొడవ జరగబోతుందని గమనించి హనితని చేయి పట్టుకుని అవతలికి లాక్కెళ్ళింది.
"ఏమిటి హనీ! ఎందుకు మీరిద్దరూ పోట్లాడుకుంటున్నారు? చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా మీరు'' అంది మీనా.
"అయితే మాత్రం చిన్నప్పుడు నేనేదో తెలీక అతన్ని కొరికితే వాళ్ళమ్మ ఎంత గొడవ చేసిందో తెలుసా?''
"గొడవ చేసింది వైభవ్ వాళ్ళమ్మ అని నువ్వే చెబుతున్నావ్ కదా! దానికతనేం చేస్తాడు''
"నా ఇష్టం! మేమిద్దరం ఒకే ఊరి వాళ్ళం. మధ్య నీకెందుకే?'' అంది హానిత.
"సరే తల్లీ! నువ్వా రూట్ లో వచ్చావా? నాకెందుకులే. మీ ఇష్టం వచ్చినట్టు ఏడవండి'' చెప్పింది మీనా.
తర్వాత వెళ్ళి వైభవ్ వెనకే కూర్చుంది హానిత.
క్లాస్ జరిగినంత సేపూ వెనకనుంచి వైభవ్ మీదకు కాగితం ముక్కలు విసురుతూ ఆనందించింది హానిత.
క్లాసయ్యాక వైభవ్ కోపంగా లేచి హనిత మీద కోపంగా ఏదో అరవబోయాడు.
సడన్ గా బావురుమంది హానిత.
వైభవ్ భయపడిపోయాడు.
"ఏమైంది? హనితా?'' చుటూ మూగిన క్లాస్ మేట్స్ అడిగారు.
"నా కింకా జ్వరమైనా తగ్గలేదు. ఊరికే నన్నెలా బెదిరిస్తున్నాడో చూశారా? అసలు నా సీట్ కి పాముని కట్టింది కూడా వైభవే. పోన్లే, ఏదో టీజ్ చేసినంత మాత్రాన అందరికీ చ్ప్పటం ఎందుకని నేను మీకసలు చెప్పలేదు తెలుసా? ప్రిన్సిపాల్ కి కంప్లయింట్ చేస్తే ఈ పాటికి ఇతని పని ఏమయ్యేది?'' అంది హానిత రాగాలు తీస్తూ.
"ఆహా! కరుణామయి, దయామయి కాబట్టే నా మీద కంప్లయింట్ కూడా చెయ్యలేదు. మొహం చూడు. కంట్లోంచి చుక్క నీరు కూడా రావట్లేదు. కొట్టానంటేనా? ముందు ఏడుపు ఆపు''అన్నాడు వైభవ్ చిరంజీవిలా పోజిస్తూ.
వెంటనే హానిత కుళాయి తిప్పినట్టు బొటబొటా కన్నీళ్ళు కారుస్తూ అంది "చూశారా! చుక్క నీళ్ళు కూడా రావట్లేదన్నాడు. అమ్మో ఎన్ని కన్నీళ్ళు కార్చానో మీరే చూశారుగా'' గారడీవాడు విద్యల్ని ప్రదర్శించినట్టుగా తన కన్నీళ్ళను ప్రదర్శనకు పెట్టింది హానిత.
"పోన్లేరా. ఆడవాళ్ళతో నీకెందుకు? నువ్వు రారా'' వైభవ్ చేయి పట్టుకున్నాడు సురేష్.