మై డియర్ రోమియో - 20

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 20

 

స్వప్న కంఠంనేని

 

చిన్న పిల్లల కబుర్లకీ, ప్రేయసీ ప్రియుల కబుర్లకీ ఒక సామ్యం వుంది. రెండూ అర్థం పర్థంలేని స్వీట్ నథింగ్సే. ఒక టాపిక్ అంటూ ఉండాల్సిన పనిలేదు. అన్నీ విచిత్రంగా కనిపిస్తూంటాయి. పిట్టలు పైకి ఎలా ఎగురుతాయో దగ్గర నుంచి కొమ్మలు తలలూపుతూ కదలటం దాకా, తేలిపోయే మబ్బుతునకల నుంచి నూరు కాళ్ళ గాజుల పురుగుదాకా ప్రతీదీ వింతగా విడ్డూరంగా ప్రతీదీ చర్చనీయాంశంగా కనిపిస్తాయి వాళ్ళకు.
తెలిసీ తెలియని మిడిమిడి జ్ఞానంతో వాటి గురించి గోరింతలు కొండంతలుగా చెప్పుకుంటారు. కావాల్సిందల్లా వాళ్ళకు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం. మాట్లాడుతున్నా విషయం ఏమిటన్నది కాదు.
చిన్నారికి బాబిగాడిని ఏదో ఒకటి అని కోపం తెప్పించడం ఇష్టం. వేరే విషయాల పట్ల ఆసక్తిపోయి బోరు కొట్టినప్పుడల్లా అలాంటి అఘాయిత్యానికి పూనుకుంటుంది. ఇప్పుడూ అదే జరిగింది.
"అవునురా బాబీ మీ అమ్మ ఎప్పుడూ అలా కోతిలా అరుస్తుంటుంది. ఎందుకు?''
ఆ పిల్లకు అతడినుంచి కావాల్సిన రియాక్షన్ రానే వచ్చింది. తన తల్లిని కోటి అనగానే బాబిగాడికి కోపం ముంచుకొచ్చింది.
"మా అమ్మను ఇంకోసారలా అన్నావంటే ఊరుకోను''
"ఏం చేస్తావేమిటి?''
"చంపేస్తాను''
"ఇక్కడి నుంచి దూకటం చాతకాదు గాని చంపుతాడట''
అని అంత ఎత్తు నుంచి కిందికి స్ప్రింగ్ లా దూకి నిలబడింది చిన్నారి.
బాబిగాడు చెట్టు దిగి వచ్చేసరికి దూరంగా పారిపోయింది.
ఒకరినొకళ్ళు  చేజ్ చేసుకుంటూ తోటలో వాళ్ళు కాసేపు పరుగులు తీశారు. కాసేపటికి వాళ్ళకు అదీ విసుగొచ్చింది.
"వొరేయ్ వొరేయ్ ఈ పరుగులొద్దుగాని విసుగుపుడుతుంది. ఏదన్నా ఆట ఆడుకుందాం రా''
ఇంతకు ముందు ఆ ప్పిల్ల తన తల్లిని వెక్కిరించిన సంగతిని మర్చిపోయాడు.
"కోతి కొమ్మచ్చి ఆడదామా?'' సంబరంగా అన్నాడు.
"వొద్దురా! దూకుళ్ళాట ఆడుకుందాం''
"అమ్మో నేనాడను తల్లీ నువ్వు తొండి చేస్తావు''
"చేయ్యన్లే''
"ఊహూ! నేనాడను. నువ్వు తొండి చేస్తావు''
"నేను తొండి చేస్తానని కాదు. నువ్వు వోడిపోతావని భయం. నాతో ఆడలేక ...''
చిన్నారి మాటలు పూర్తికాక ముందే అతనికి పౌరుషం పొడుచుకొచ్చింది.
"సరే ఆడదాం'' అన్నాడు.
"అయితే ముందు నువ్వు వొంగో. నేను దూకుతాను'' చెప్పింది.
"వొద్దు వొద్దు నువ్వే వొంగోవాలి. నేను దూకుతాను'' చెప్పింది.
"అమ్మా ఆశ దోశ అప్పడం! బొమ్మాబొరుసూ వేద్దాం. బొమ్మపడితే నువ్వు ఔట్ ఉండాలి. బొరుసు పడితే నేను ఔట్ ఉండను. సరేనా!''
చిన్నారి మాటలన్నీ గందరగోళంగా అనిపించాయి బాబిగాడికి బుర్ర గోక్కున్నాడు. ఏం అర్థం కాలేదు.
"సరే'' అన్నాడు.
టాస్ వేశారు.
బొరుసు పడింది.
"బొరుసు పడిందిగా! నేను ఔట్ ఉండను. అంటే నువ్వే ఔట్!'' అంది చిన్నారి.
ఆమె తొండి మాటలు అర్థం కాక సరేనన్నాడు బాబిగాడు.
ఆట మొదలైంది.
ముందు బాబిగాడు బాగా వంగి నిలబడ్డాడు.
చిన్నారి పరిగెత్తుకుంటూ వచ్చి బాబీ మీద నుంచి అవతలికి దూకేసింది.
తర్వాత బాబిగాడు ఇంకొంచెం ఎత్తు పెంచి మోకాళ్ళ మీద చేతులానించి వంగి నిలబడ్డాడు.
బాబిగాడు మీద నుంచి దూకటం చిన్నారికి కొంచెం కష్టమైంది. అయినా సరే ఎలాగోలా దూకేసింది.
ఇప్పుడు బాబిగాడు ఇంకా ఎత్తుని పెంచి వంగాడు.
ఈసారి దూకటం తనవల్ల కాదని చిన్నారికి ముందే అర్థమైపోయింది.
దూరాన్నుంచి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి సరిగ్గా బాబిగాడి వద్దకు రాగానే పిడికిలి బిగించి అతని వీపు మీద ఒక్క పోతూ పొడిచింది.
ఆ నేప్పికి అతడు కేవ్వుమంటూ కింద కూలబడగానే అవలీలగా అవతలికి దూకింది.
బాబిగాడు కోపంతో లేచి నిలబడ్డాడు.
"అందుకే నీతో ఆడకూడదు. నువ్వెప్పుడూ ఇట్లాగే తొండి చేస్తావు'' ఏడుపు మొహంతో అన్నాడు.
"సరే సరే ఈసారి నేను ఔట్ ఉంటాను. నువ్వు దూకు'' అతడి మాటల్ని పట్టించుకోనట్టుగా అని ఈసారి తాను వంగుని నిలబడింది చిన్నారి.
అంతకు ముందు జరిగింది మర్చిపోయి బాబిగాడు దూకటానికి పరిగెత్తుకుంటూ రాసాగాడు.
"అసలే ఇడ్లీలాగున్నావ్! జాగ్రత్తగా దూకరా. మీద పడ్డావంటే పచ్చడై పోతాను'' వాడు దగ్గరకు వస్తుంటే అన్నది చిన్నారి.
రెండు మూడు ఎత్తులయిపోయాయి.
ఈసారి బాబిగాడు సరిగ్గా దూకబోయే సమయానికి చిన్నారి నిటారుగా నిలబడేసరికి ఆమె తల తగిలి బాలెన్స్ తప్పి అంత ఎత్తునుంచీ ఆటను చచ్చేట్లుగా బీళ్ళబీటను నేలమీద పడ్డాడు.
ముక్కుతూ మూలుగుతూ లేవటానికి వాడు చేస్తున్న ప్రయత్నాలను చూసి చిన్నారి కడుపు పట్టుకుని ఒకటే నవ్వసాగింది.
తగిలిన దెబ్బ కాక ఇంకా ఆమె నవ్వు కూడా చూసేసరికి బాబిగాడికి ఒళ్ళు మండిపోయింది.
"నన్ను పడేసి ఇంకా నవ్వుతావంటే ... నిన్నూ ...'' అంటూ చాచిపెట్టి చిన్నారి మూతిమీద ఒక్క దెబ్బ కొట్టాడు.
ఆ దెబ్బకు చిన్నారి పెదిమ చిట్లి ఉప్పగా నెత్తురు నోటికి అంటింది.
ఇంట్లో గారాబంగా వైల్డ్ గా పెరిగిన పిల్లేమో తిక్కరేగిపోయింది.
"నన్నంత దెబ్బ కొడతావురా'' అంటూ గభాల్న వెళ్ళి బాబిగాడితో కలబడింది.
అతడి షర్ట్ కాలర్ పట్టుకుని ఒక్క గుంజు గుంజేసరికి గుండీలన్నీ ఊడిపోయాయి. ఏం చేస్తుందో తెలియని కోపంతో అతడి ఛాతీ మీద గట్టిగా కొరికింది. ఆమె పళ్ళు పీవీ కిందవీ మెత్తటి అతడి కండల్లోకి దిగబడి రక్తం కమ్ముకుని అక్కడ క్రమంగా పైకి ఉబకసాగింది. పైవి అయిదు, కిందివి అయిదు గాట్లలోంచి నెత్తురు చిమ్ముతూ బయటికి రాసాగింది.
తల పైకెత్తిన చిన్నారి మొహం అతని కంటికి ఆ క్షణాన భయంకరంగా కనిపించి భయపడిపోయాడు. తన ఛాతీ నుంచి కారుతున్న నెత్తురు చూసి ఇంకా బెదిరిపోయాడు.