మై డియర్ రోమియో - 17

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 17

 

స్వప్న కంఠంనేని

 

వారం రోజులు గడిచాయి ...
హనిత కాలేజీకి రావడంలేదు.
'హనిత కాలేజీకి రాకపోతే ఎంత బోర్ కొడుతోందో?' అనుకున్నాడు వైభవ్.
ఒక్క క్షణం అతనికి హనిత ఓరచూపు, కొంటె నవ్వు గుర్తొచ్చాయి.
మళ్ళీ తనలో తనే నవ్వుకున్నాడు. హనిత కాలేజీకి వచ్చినన్నాళ్ళూ ఆమెతో ఏదో ఒక రకంగా తగాదా పెట్టుకున్న తను ఆమె గురించి ఆలోచించడమేమిటి? అనుకున్నాడు.
అలా అనుకుని సరిపెట్టుకోలేకపోయాడు. సురేష్ తో ఆమె గురించి ప్రస్తావించాడు.
"హనిత కాలీజీకి రావడంలేదేమిటి సురేష్?''
"ఆ రోజు పాముని చూసి జడుసుకుంది కదా! అప్పట్నుంచీ జ్వరం వచ్చిందట. మంచం మీద నుంచి లేవడంలేదుట. అయినా ఆ కుర్చీకి పామునెవరు తగిలించారు? ఆడపిల్ల మీద అటువంటి డర్టీ ట్రిక్స్ ప్లే చేయడానకి ఎవరికైనా మనసెట్లా వస్తుందో?'' అన్నాడు సురేష్.
తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నాడు వైభవ్.
హనిత గురించి మీనాని అడుగుదామనుకున్నాడు.
పాముని చూసి హనిత స్పృహ తప్పి పడిపోయినప్పుడు మీనా తనకేసి చూసిన చూపు గుర్తొచ్చి ఆమెనడగాడానికి జన్కాడు.
"నాకెందుకొచ్చిన గొడవ. ఊరుకుంటే పోలా?'' తనలో తను అనుకున్నాడు.
ఎంత ప్రయత్నించినా మీనాని అడగాలన్న కోరికను చంపుకోలేకపోయాడు.
ఆఖరికి లాస్ట్ అవర్ జరుగుతుండగా వైభవ్ ఒక నిశ్చయానికి వచ్చాడు. అమైతే అయింది కాలేజీ అయిపోయాక హనిత గురించి మీనాని అడగాలని.
బెల్ మోగింది.
లెక్చరర్ క్లాస్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు.
ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న వైభవ్ వెనక్కి తిరిగాడు.
మేనా సీట్ ఖాళీగా వుంది.
హతాశుడైపోయాడు.
"మీనా ఏది?'' సురేష్ ని అడిగాడు.
"ఇందాక క్లాస్ మధ్యలోనే రాజాతో కలిసి వెళ్ళిపోయింది''
"అయ్యో'' నిరాశగా అన్నాడు వైభవ్.
"ఏమైంది ఈరోజు? హనిత, మీనాల గురించి అడుగుతున్నావేమిటి?'' అనుమానంగా చూస్తూ అన్నాడు సురేష్.
"ఏం లేదు. ఊరికినే'' బలవంతంగా నవ్వాడు వైభవ్.
పక్కమీద పడుకున్నాడన్న మాటేగానీ వైభవ్ కి ఎంతకీ నిద్రపట్టడం లేదు. అటూ ఇటూ దొర్లసాగాడు.
మాటిమాటికీ కళ్ళముందు హనిత కదుల్తోంది.
నిజంగా హనితది చిన్నపిల్లల మనస్తత్వం అనుకున్నాడు.
"నేనంత హార్ష్ గా ప్రవర్తించకుండా వుండాల్సింది. అయినా పాముని కుర్చీకి అటాచ్ చేయాలన్న ఆలోచన నాకెందుకొచ్చింది?'' తనని తనే నెత్తి మీది మొట్టుకున్నాడు.
"హనిత మాత్రం తక్కువ తిందేమిటి? నన్నేన్నిసార్లు ఆటలు పట్టించలేదు?'' అనుకోబోయాడు. కానీ అతని మనసు అంగీకరించలేదు.
'హనిత చేసిందని నేనూ చేస్తే ఆమెకీ నాకూ తేడా ఏముంది?'' అనుకున్నాడు.
"రేపెలాగైనా సరే. హనితని చూడాలి' ఆఖరికి డిసైడ్ చేసుకున్నాడు.
మర్నాడు ....
క్లాస్ లోకి వెళ్తూనే మీనా దగ్గరకు నడిచాడు.
"హనిత రావడంలేదేమిటి మీనా?'' అన్నాడు.
"పద బయటికి వెళ్దాం'' అంటూ మీనా అతడిని లాన్ లోకి తీసుకెళ్ళింది.
అక్కడికి చేరుకుంటూనే వైభవ్ మీద విరుచుకుపడింది.
"అవునూ, నేనొకటడుగుతాను చెప్పు. ఆరోజు ఆమె కుర్చీకి పామును అంటించింది నువ్వేకదూ?''
ఆమె కళ్ళల్లోకి చూడలేక తలొంచుకున్నాడు వైభవ్.
"సారీ మీనా! అబద్ధం చెప్పడం నాకు చేతకాదు. నేనే చేసాను'' అన్నాడు.
"నేను అప్పుడే అనుకున్నాలే నాయనా! నేఎ మూలంగానే అదివాళ భయంతో మంచం పట్టింది. ఒకటే కలవరింతలు. ఉలికిపాట్లు. నిద్రలో ప్రేలాపనలు, అసలు ఇప్పుడది ఎల్లా వుందో తెలుసా? శవంలా వుంది. నా మనస్సు ఇప్పుడు చల్లగా వుందా?''
మీనాది పైకి భారీ శరీరమేగానీ లోపల మనస్సు నవనీతమని వైభవ్ కి తెలుసు. పైగా తన మీద ఎంతో అభిమానముందనీ తెలుసు. అలాంటి మీనా అంత కోపంగా తనను అటాక్ చేస్తుండేసరికి ఆమెలో ఎంత కోపం పెల్లుబుకుతుందో అర్థమైందతనికి.
"సారీ మీనా. నన్ను అపార్థం చేసుకోకు. అయినా ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అంటేనే భయంలేని హనిత అందర్నీ టీజ్ చేసే హనిత ఆఫ్ట్రాల్ కట్టేసివున్న ఒక నీటిపాముకే అంత కోపంగా భయపడిపోయిందా? ఆమె చాలా ధైర్యస్థురాలు కదా'' అన్నాడు వైభవ్.
"అర్థం లేకుండా మాట్లాడకు వైభవ్. ఆడవాళ్ళకు సరీసృపాలంటే ఎంత ఎలర్జీనో తెలుసా? బొద్దింక, సాలీడు, జెర్రిలాంటి వాటిని చూస్తేనే భయపడతారు. అలాంటిది పాము ఆమె వొంటిమీద పాకితే ఎంత ధైర్యస్థురాలైనా బెదిరిపోక ఏమవుతుంది? అసలయినా నువ్వేదో మంచివాడివనుకున్నాను. నీ అమాయకత్వం, ఒకరిని పట్టించుకోని తత్త్వం, నీ రూపం చూసి నీ మీద మంచి అభిప్రాయ ఏర్పరచుకున్నాను. కానీ నువ్వింత క్రూరుడివి అనుకోలేదు వైభవ్. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. ఆఫ్ కోర్స్! హనిత నిన్ను టీజ్ చేసి ఉండవచ్చు. నువ్వూ ఆమెని అదే పద్ధతిలో టీజ్ చేయాల్సింది! అంతేగానీ మరీ ఇంత పైశాచికంగానా? నిరసనగా అంది మీనా.
"హనిత నుదేష్ణకి నా గొంతుతో ఫోన్ చేయలేదేంటి? విక్రమ్ గాళ్ ఫ్రెండ్ కి నేను రాసినట్లుగా లెటర్ రాయలేదేంటి? కాలేజీలో వున్న ప్రతి అమ్మాయికి నేను లైనేస్తున్నట్టుగా క్రియేట్ చేయలేదా? అసలు నేనెంత మంచివాడినో తెలుసా? అలాంటి నన్ను ఒక పెద్ద ప్లేబాయ్ గా, ఫ్లర్ట్ గా చిత్రీకరించింది హనిత. మరి హనిత చేసినవి మంచి పనులంటావా?'' రోషంగా అన్నాడు వైభవ్.
"అదో పిచ్చిది. అతి గారాబంగా పెరిగింది. పసితనం, పెంకితనం, పంతం చెల్లించుకోవాలనే మొండితనమే తప్ప హనిత స్వతహాగా చాలా మంచిది వైభవ్. నీకు తెలుసా? రోడ్డుమీద ఎవరైనా గుడ్డివాళ్ళు కనిపిస్తే హనిత వాళ్ళను రోడ్డు దాటితుంది. చిన్నపిల్లలెవరైనా లిఫ్ట్ అడిగితె వాళ్ళను స్కూల్ వరకు తీసుకెళ్ళి దిగబెడుతుంది. అవతల తనకెంత అర్జంట్ పని వున్నా సరే తన పాకెట్ మనీతో అనాథ శరణాలయంలోని ఇద్దరు స్టూడెంట్ లకు తన పేరు తెలియకుండా ఫీజులు కడుతుంది. అసలంతదాకా ఎందుకు? నా విషయమే తీసుకో. నా బట్టల్ని, నన్ను చూసి అందరూ నేనేదో బాగా డబ్బున్నదాన్ననుకుంటారు. కానీ నిజానికి నేనొక లోమిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన దాన్ని. ఆరుగురు పిల్లలున్న మా ఇంటిలో 'నీకు తిండే దండగ, చదువు కూడా ఎందుకు? అనవసరమైన ఖర్చు తప్ప' అని స్కూల్ చదువుతోనే చదువు మానిపించబోయారు. హనితే నన్ను కాలేజీలో చేర్పించి తనతోపాటు చదివిస్తోంది. నా ఈ బట్టలు, కాలేజీ చదువు, అంతా హనిత చలువే తెలుసా వైభవ్?'' బాధగా చెప్పింది మీనా.
వైభవ్ కదిలిపోయాడు. అతని దృష్టిలో హనిత చాలా ఎత్తుకు ఎదిగిపోయింది.
"హనితని నేను కలుసుకోవాలి. ఆమె అడ్రస్ ఇవ్వు'' మీనాని అడిగాడు వైభవ్.
"పద నేనూ వస్తాను''అంది మీనా.