మై డియర్ రోమియో - 1

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 1

 

స్వప్న కంఠంనేని

 

లవ్
మొహబ్బత్
ఇష్క్
ప్రేమ ...
ఇవన్నీ పదాలు వేరైనా అర్థం ఒక్కటే.
భాషలు వేరైనా భావం ఒక్కటే.
లేత హృదయాలకి గిలిగింతలు పెట్టే పదం ప్రేమ!
యవ్వనుల్ని వెర్రెత్తించే అనుభూతి ప్రేమ.
యువతరాన్ని ఉర్రూతలూగించే అనుభవం ప్రేమ.
రెండు కోమల హృదయాల కలయిక ప్రేమ!
ప్రేమ కోసం వలలో పడుతుంటారు యవ్వనంలోకి ప్రవేశించే అబ్బాయిలూ, అమ్మాయిలూ. ఆ 'వల' వాళ్ళకొక ప్రేమ పంజరం.
అది వాళ్ళకొక హార్ట్ గ్యాలరీ!
అబ్బాయిల్నీ, అమ్మాయిల్నీ పెనుతుఫాను లాంటి మనఃస్థితిలో పడవేసే ఆ ప్రేమ ఒక మాంత్రికుని ముగ్గులాంటిది.
ఆ ముగ్గులోకి ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ప్రవేశిస్తారో ఎవరికీ తెలియదు. ఈ ప్రేమ ముగ్గు అదృశ్యరూపంలో లోకం నిండా విరజిమ్మబడి ఉంటుంది.
ఆ ముగ్గు మధ్యలోకి అమ్మాయిలూ, అబ్బాయిలూ ఎప్పుడు ప్రవేశిస్తారా అని ఎదురు చూస్తుంటారు ప్రేమ దేవుళ్ళు.
ఆ రోజు ...
ప్రేమదేవుళ్ళ దృష్టి భూలోకంలోని ... ఆంధ్దేశంలోని ... ఒకానొక కాలేజ్ మీద పడింది.
అప్పుడే ఆ కాలేజీలోకి ప్రవేశిస్తున్న ఒక పరువాల పాపాయి మీద పడింది.
కోటేరులా  కొనదేలి చివర చిలక ముక్కులా వంపు తిరిగిన ఆమె నాసిక మీద పడింది.
పొగరుతో మిడిసి పడుతున్న ఆమె ముక్కును చూడగానే వాళ్ళలో ఒక చిలిపి ఆలోచన ప్రవేశించింది.
ఆ పొగరు ముక్కుకు ముకుతాడు వేస్తేనో?!
ఒకే క్షణాన అందరిలోకి ప్రవేశించిన ఆ ఆలోచనకు వాళ్ళు మందస్మితంగా ఒకరివైపు ఒకళ్ళు చూసుకుని చేతుల్ని పైకెత్తి ఆమె ప్రవేశిస్తున్న కాలేజీ ఆవరణలోకి ప్రేమ ముగ్గును విరజిమ్మారు ...
                    *****
పద్దెనిమిదేళ్ళుళ్లుంటాయామెకి.
సన్నగా పొడుగ్గా ఉంది. అయిదడుగుల ఆరంగుళాల పొడుగు ... జీన్స్ వేసుకుని ఉంది. బాయ్ కట్ క్రాఫ్, కళ్ళు పెద్దగా మిలమిలా మెరుస్తున్నాయి. వొంటి నునువు బంగారు ఛాయతో పోటీ పడుతోంది.
"అమ్మో! కాలేజీకి ఇవాళ కూడా లేటయింది. ఇక గెట్ కీపర్ దగ్గర్నుంచీ ప్రిన్సిపాల్ వరకూ అందరితో తిట్లు తినక తప్పదు'' గెట్ వద్దకు చేరుకుంటూనే అనుకుందామె.
ఆమె పేరు హానిత.
హనీ లాగానే ఆమె రూపం, స్వరం మధురం మధురంగా ఉంటాయి.
కాలేజీ కాంపౌండ్ ను సమీపిస్తున్న ఆమెను చూసి గెట్ కీపర్ గెట్ మూసేసి లోపలికి వెళ్ళిపోయాడు.
గెట్ మోగించింది హానిత. లోపల్నుంచీ గెట్ కీపర్ గట్టిగా అరిచాడు.
"కాలేజీలో చేరిన దగ్గర్నుంచీ చూస్తున్నా. రోజూ లేటే. ఏమన్నా అంటే కథలు చెప్తావు. ఏమైనా సరే! ఇవాళ కూడా నువ్వు లేటొస్తే లోపలికి పంపొద్దని జెప్పిండు ప్రిన్సిపాల్ సారూ''
ఒళ్ళు మండిపోయింది హనితకి. "వీడు పంపేదేంటి నన్ను. గెట్ తెరవకపోతే మాత్రం నేను వెళ్ళలేనా ఏంటి? అయినా, ఒక్క గంట లేటయితే కూడా అంత గొడవేంటి?'' అనుకుంది.
కాంపౌండ్ చుట్టూ నడుస్తూ కాలేజీ వెనకవేపుకి చేరుకుంది. కాలేజీ వెనక వేపున ఒక ఇల్లుంది. ఇంటికి కాలేజీకి మధ్య ఒక పెద్ద గోడ వుంది. సాధారణంగా కాలేజీ వెనక భాగాన ఎవరూ ఉండరు కాబట్టి జాలేజీలో బోర్ కొట్టినప్పుడల్లా ఆ గోడ దూకి ఇంటికి వెళ్ళిపోతుంటుంది హానిత.
ఇంటి గెట్ ని నెమ్మదిగా తెరిచి గోడ వరకూ వెళ్ళింది. ఇంతలో ఆ ఇంట్లో నుంచి ఆల్సేషియన్ కుక్క ఒకటి భౌ భౌమని అరుస్తూ మృతువులా దూసుకురాసాగింది. హానిత గుండె గుభేలుమంది. వెంటనే చెప్పులు, బ్యాగ్ తీసి కాలేజీ కాంపౌండ్ లోపలికి విసిరేసి ఒక్క గెంతున తను కూడా అవతలికి దూకింది.
బట్టలు దులుపుకుంటూ "ఇంతకూ ముందెప్పుడూ లేదు. ఈ కుక్కనెప్పుడు తెచ్చి చచ్చారో. ఆ ఇంట్లో వెధవలకు బుద్ధి లేదు. అసలు కుక్కని పెంచుకోవడమేంటో? పెంచుకున్నా చక్కగా ఏ పావురాన్నో లేకపోతే పిల్లినో పెంచుకోవచ్చు కదా> ఆల్సేషియన్  కుక్కట. ఆల్సేషియన్  కుక్క! వెధవ ఆల్సేషియన్ మొహాలూ వాళ్ళూ!! ఇంకా నయం. కొంచెమాగితే కండలూడబెరికేది దొంగముండ'' గొణుక్కుంటూ తలెత్తింది.
ఎదురుగా ప్రిన్సిపాల్ ఆమె ఇవతల పడేసిన చెప్పుల్ని కర్రపుల్లతో ఎత్తి పట్టుకుని కోపంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. ప్రిన్సిపాల్ పక్కనే గెట్ కీపర్ ముసలి మోహంలో మందహాసం.
"కమ్ విత్ మీ'' చెప్పుల్ని విసిరేస్తూ కోపంగా అరిచాడు ప్రిన్సిపాల్.
అసలు జరిగింది ఏమిటంటే ... హనితను వెళ్ళిపొమ్మనగానే మారు మాట్లాడకుండా అవతలికి వెళ్తోంటే గెట్ కీపర్ కి అనుమానం వచ్చింది. ప్రిన్సిపాల్ వద్దకెళ్ళి ఆయనను వెంటబెట్టుకుని కాలేజీ వెనకవేపున నిలబడ్డాడు. అదే సమయంలో హానిత విసిరిన చెప్పులు నేరుగా వచ్చి ప్రిన్సిపాల్ బట్టతలకు ఠంగ్ ఠంగ్ న తగిలి కింద పడ్డాయి. దాంతో ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంది.
చెప్పులు గబగబా వేసుకుని బ్యాగ్ భుజానికి తగిలించుకుని ప్రిన్సిపాల్ వెనకే నడిచింది. ఆ వెనక గెట్ కీపర్ ముసిముసి నవ్వులతో నడిచాడు.

 

   (ఇంకావుంది)