అందరూ దొంగలే - 93

Listen Audio File :

డెన్ లోని దొంగలందరూ చేతులు పైకెత్తి నిల్చున్నారు. మంగులు కూడా మెల్లిగా చేతులు పైకెత్తాడు.

“పోనీ కమిషనర్ మనం ఓ ఒప్పందానికి వద్దామా?” అడిగాడు మంగులు.

“ఏంటీ?!” అడిగాడు కమీషనర్.

“నువ్వు పది లక్షలిస్తే పాపని వదిలేస్తానని అన్నాను కదా..... పోనీ అయిదు అక్షలు ఇచ్చేయ్. పాపని వదిలేస్తా" అన్నాడు మంగులు.

“ఇదేదో బాగుందే... మనకి ఇదు లక్షలు మిగిలేలా వున్నాయే" ప్రక్కనున్న కానిస్టేబుల్ తో అన్నాడు లింగారావ్.

“అయిదు లక్షలు మిగలడం ఏంటి సార్....? మనకి పదిలక్షలూ మిగుల్తాయ్. మనం వాడికి ఒక్క పైసాకూడా ఇవ్వనక్కర్లేదు" అన్నాడు కానిస్టేబుల్.

కమీషనర్ లింగారావ్ నాలుక కర్చుకున్నాడు.

“ఒరేయ్... నీకు అయిదు లక్షలేంట్రా... ఒక్క పైసాకూడా ఇవ్వనక్కర్లేదు. మా దీప ఏదిరా?” అంటూ అరిచాడు లింగారావ్.

“నేనిక్కడున్నాను డాడీ....” అని అరిచింది దీప.

కమీషనర్ లింగారావ్ దీప గొంతు వినవచ్చిన వైపు చూశాడు. దీపని జాకబ్ ఎత్తుకుని వున్నాడు.

“ఒరేయ్.. దీపని వదులు లేకపోతే షూట్ చేస్తా.....” అంటూ గాలిలోకి రివాల్వర్ ని ఢాం అని పేల్చాడు లింగారావ్.

జాకబ్ దీపని చంకలోంచి క్రిందికి దింపాడు.

దీప పరుగునవెళ్ళి తండ్రి చెంతన నిలబడింది. “డాడీ.. వాదినేం చెయ్యకు. వాడిని మనింటికి తీసుకేస్తే, వాడితో రోజూ గుర్రం ఆటా, ఉయ్యాలాటా ఆడ్తా....: అంది దీప ముద్దు ముద్దుగా.

“అలాగే చిట్టితల్లీ...” అని దీప తల నిమిరాడు కమీషనర్ లింగారావ్.

"అసలు నీకు నా డెన్ అడ్రస్ చెప్పింది ఎవరు కమీషనర్.....?” అయోమయంగా చూస్తూ ప్రశ్నించాడు గజదొంగ మంగులు.

కమీషనర్ లింగారావ్ వెనుకనుండి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రూపంలో వున్న రాంబాబు ఇవతలికి వచ్చాడు.

మంగులు ఉలిక్కిపడ్డాడు. “నువ్వా? నా సొమ్ము తిని నాకే ద్రోహం చేస్తావా?” అని అరిచి కమీషనర్ లింగారావ్ వైపుకి తిరిగి "కమీషనర్... వాడిని నమ్మొద్దు... ఈ అప్పారావ్ నా మనిషి, నా సొమ్ము చాలా తిన్నాడు....” అన్నాడు మంగులు.

కమీషనర్ లింగారావ్ అయోమయంగా రాంబాబు, వైపు చూశాడు.

రాంబాబు చిరునవ్వు నవ్వాడు. “నిజమే.. వాడికి క్లోజ్ గా వున్నట్టు నటించి నమ్మించా. నిజంగా వాడి మనిషినైతే ఇప్పుడు వాడినే ఎందుకు పట్టిస్తా?” కమీషనర్ చెవిలో మెల్లగా చెప్పాడు రాంబాబు.

“అవునవును. నువ్వన్నదీ నిజమే!” అని ముందుకి తిరిగి "మీ అందరూ మర్యాదగా లొంగిపొండి. ఏ మాత్రం తిరగబడాలని చూసినా నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తా" అన్నాడు కమీషనర్ లింగారావ్.

రాంబాబు గజదొంగ మంగులు చేతికి బేడీలు వేశాడు.

“కమీషనర్..... జైల్లో కొవ్వొత్తులు వుంటాయా?” అడిగాడు మంగులు.

“ఏం?.. ఎందుకని?” అడిగాడు కమీషనర్ లింగారావ్.

“కొవ్వొత్తుల్ని ఆర్పి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గాడిని చంపుతానని ప్రతిజ్ఞ చేయాలి.”

“చంపుకో... నాకేం?” అన్నాడు రాంబాబు నవ్వుతూ

హఠాత్తుగా మంగులు మొహం దీనంగా మారిపోయింది.

“కమీషనర్! నాకు శిక్ష చాలా తగ్గించి వేసేలా మీరు చూడాలి. ఎందుకంటే నేను అనుభవించాల్సిన శిక్షంతా ఇక్కడే అనుభవించేశా!” అన్నాడు ఏడుపు గొంతుతో.

“ఇక్కడే అనుభవించేశావా? నాకేం అర్ధం కావడంలా?” అన్నాడు లింగారావ్.

“అదే.... మీ పాప ఆటల పేరుతో నన్ను కుళ్ళబొడిచేసింది. ఉయ్యాలాట అని నన్ను చాలా సార్లు ఉరితీసింది. గుర్రం ఆటతో నా నడుములు విరక్కొట్టింది. జైలుశిక్ష ముగించుకుని బయటికి వచ్చాక నేను పెళ్ళి చేస్కుంటే సంసారానికి పనికివస్తానా అని డౌట్ గా వుంది!” ఈ మాట అంటున్నప్పుడు దుఃఖంతో మంగులు గొంతు పూడుకుపోయింది.

డెన్ లోని దొంగలందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

హఠాత్తుగా మంగులు కుళ్ళికుళ్ళి ఏడ్చాడు.

ఆ దృశ్యం చూసిన కమీషనర్ లింగారావ్ కళ్ళు చెమ్మగిల్లాయి.