అందరూ దొంగలే - 90

Listen Audio File :

డిటెక్టివ్ పాండు వ్యాను ని ముందుకు పరిగెత్తించాలని అనుకుంటుండగా అతనికి ఓ గొంతు వినిపించింది. “పాప చాలా ముద్దుగా వుంది.”

పాండు తల ప్రక్కకితిప్పి చూశాడు. ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. అతను ఎవరో కాదు. గజదొంగ మంగులు!

“పాప చాలా ముగ్గుగా వుంది. మీ పాపా?” అడిగాడు గజదొంగ మంగులు డిటెక్టివ్ పాండుని.

“ఆ... ఆ... అంతే....” అన్నాడు డిటెక్టివ్ పాండు తడబడ్తూ.

“చాలా ముద్దుగా వుంది. నిద్ర పోతుందా?” అడిగాడు మంగులు.

“ఆ......ఆ.....ఆ.... అవును!” అన్నాడు పాండు.

“సార్! వీడెవడోగానీ వీడ్ని చూస్తుంటే వెర్రిసన్నాసిలా వున్నాడు. వీడిద్వారా కమీషనర్ లింగారావ్ కి దీపని అందచేస్తే?” డిటెక్టివ్ పాండు చెవిలో గుసగుసలాడుతూ చెప్పాడు రాజు.

“గుడ్ ఐడియా.....” అని మంగులు వైపు తిరిగి "చూడు మిస్టర్! మాకో సాయం చేసి పెడ్తావా?” అని అడిగాడు డిటెక్టివ్ పాండు.

“చెప్పండి....” అన్నాడు మంగులు వినయం నటిస్తూ.

పాండు వ్యాన్ దిగి మంగులుతో ఇలా అన్నాడు. “ఆ పాపని మేము చెప్పిన ఓ వ్యక్తికి అప్పగిస్తే అతను నీకు పది లక్షలూ ఇస్తాడు. ఆ పదిలక్షలూ మాకు తెచ్చిస్తే, నీకు ఒక లక్షరూపాయలు ఇస్తాం..... ఏ మాత్రం రిస్కులేని పని....”

మంగులు భయం నటిస్తూ చూశాడు.

“మేం ఏ వ్యక్తికైతే అందజేయమన్నామో అతను పోలీస్ కమీషనర్. ఆ పదిలక్షలు అతను ప్రకటించిన బహుమతి. మేము అతనికి బాగా తెలుసు. కాబట్టి మేము పాపని తీస్కెళ్ళి ఆయనకి అప్పగిస్తే మాకు బహుమతి ఇవ్వడు. అందుచేత నీ ద్వారా ఆ పదిలక్షలు మేము పొందాలని నీకు ఆ పని అప్పగిస్తున్నాం....” నచ్చజెప్తూ అన్నాడు డిటెక్టివ్ పాండు.

“ఇంత చిన్న పనికి నాకు లక్ష రూపాయలెందుకు సార్? నా పెట్రోలు ఖర్చు క్రింద వందరూపాయలిస్తే చాలు... సాటి మనిషికి ఆ మాత్రం సాయం చెయ్యమా?” అన్నాడు మంగులు. మనసులో మంగులుకి మహా ఆనందంగా వుంది. వూహించని విధంగా దీప తన దగ్గరికే చేరుకున్నందుకు.

“ఇదిగో... మా అడ్రస్" అంటూ జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి మంగులుకిచ్చాడు డిటెక్టివ్ పాండు.

“నువ్వు పది లక్షలు ఈ అడ్రస్ కే తెచ్చివ్వాలి!”

“అలాగే! పాపని ఇవ్వండి...” అన్నాడు మంగులు మెరిసే కళ్ళతో.

“ఎలా తీసుకెళతావ్?” అడిగాడు పాండు.

రోడ్డుకి అటువైపు వున్న జీపుని చూపించాడు మంగులు.

“నువ్వు జీపులో కూర్చో! నేను పాపని తీసుకొస్తా....”

మంగులు గబగబా రోడ్డుదాటి జీపు ఎక్కి డ్రయివింగ్ సీట్లో కూర్చున్నాడు. డిటెక్టివ్ పాండు వ్యాన్ లోని దీపని ఎత్తుకుని రోడ్డు క్రాస్ చేయ్యసాగాడు. సరిగ్గా అక్కడికి యాభై గజాల దూరంలో ఓ టీ స్టాల్ నుండి అప్పుడే రాంబాబు, చిన్నారావ్ లు బయటికివచ్చి దీపని ఎత్తుకుని రోడ్డు దాటుతున్న డిటెక్టివ్ పాండుని చూసి "కె వ్ వ్ వ్ " మని అరిచారు.

“మన దీపలా వుందికదూ?” అన్నాడు చిన్నారావ్.

“దీపలా వుండటం ఏంటీ? దీపే!” అన్నాడు రాంబాబు.

అప్పటికి డిటెక్టివ్ పాండు రోడ్డు దాటేశాడు. దీపని జీపులో పడుకోబెడ్తూండగా, రాంబాబు, చిన్నారావ్ లు డ్రయివింగ్ సీట్లో కూర్చుని వున్న మంగుల్ని చూశారు. “నో....” అని అరుస్తూ ముందుకు పరుగు తీశారు రాంబాబు, చిన్నారావ్ లు. కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది. జీపు దీపతో సహా వాయు వేగంతో ముందుకు కదిలింది.