అందరూ దొంగలే - 88

Listen Audio File :

మొదట మంగులు ఉలికిపడ్డాడు. తర్వాత రాంబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు. “అదేంటి? దీపని ఆ రాకాగాడు నా దగ్గర్నుండి తన్నుకుపోయినట్టు నీకు తెల్సుకదా?” అన్నాడు మంగులు.

ఈసారి రాంబాబు ఉలిక్కిపడ్డాడు. తర్వాత సర్దుకుని చిరునవ్వు నవ్వాడు. “అంటే ఆ రాకా గాడిని ఎటాక్ చేసి ఈ పాటికి నువ్వు దీపని వెనక్కి తెచ్చేస్కుని వుంటావనుకున్నాను ….”

“నువ్వన్నట్టు ఆ పని చేసేవాడినే.... కానీ రాకా దగ్గర నాకంటే పెద్దబలగం వుంది. ఇంకాస్త బలాన్ని కూడగట్టుకుని వాడిని ఎటాక్ చేద్దామను కుంటున్నాను" అన్నాడు మంగులు.

“ఈలోగా వాడు పోలీస్ కమీషనర్ దగ్గర డబ్బులు తీస్కుని దీపని అతనికి అప్పగించేస్తాడు... అంచేత ఆ రాకా గాడి దగ్గర్నుండి దీపని నేనే తీసుకొస్తా.... వాడిని టాకిల్ చెయ్యడానికి నేనొక్కడిని చాలు. ఏదీ... ఆ రాకా అడ్రస్ కాస్త చెప్పు.”

మంగులు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. “అదేంటీ... రాకా ఎక్కడుంటాడో నీకు తెలుసుకదా?.....” అన్నాడు.

“హమ్మ అప్పారావ్! నీకు రాకా అడ్రస్ కూడా తెలుసా?” అని మనసులో అనుకున్నాడు రాంబాబు. “అదికాదు మంగులూ! దీపని నువ్వు కిడ్నాప్ చేయించడం కాదు గానీ, మా మీద పై అధికారుల ప్రెషర్ చాలా వుంది మమ్మల్ని వెంటబడి ఒకటే తరుముతున్నారు. ఆ టెన్షన్స్ లో ఏదీ గుర్తుండడం లేదు.... ఏదీ.... ఓసారి వాడి అడ్రస్ వివరంగా చెప్పు" అన్నాడు రాంబాబు.

“దీపని నువ్వు రాకా దగ్గర్నుంచి తేగలిగితే నీకు రెండు లక్షలు ఇస్తా" అన్నాడు మంగులు.

“సరేలే! ముందు అడ్రస్ చెప్పు.” మంగులు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రూపంలో వున్న రాంబాబుకి రాకా అడ్రస్ చెప్పసాగాడు.

రాకా డెన్ లో....

రాకా గుండుమీద చేతులు పెట్టుకుని బాధగా కూర్చున్నాడు. “మీరు బాధపడకండి బాస్! ఆ దీప ఎక్కడున్నా మేం వెతికి పట్టుకుని మీకు అప్పగిస్తాం...” అన్నాడు ఆ రౌడీ.

“నోర్ముయ్యండి. మీరంతా ఎక్కడో చావబట్టే కదా వాళ్ళెవరో నన్ను తన్ని దీపని తీస్కెళ్ళిపోయారు....” మండిపడ్డాడు రాకా.

“మేం ఎక్కడ చస్తాం బాస్! మీరు గోదావరి ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ దోపీడీ చెయ్యమని పంపిస్తేనే కదా మేమంతా వెళ్ళాం.....” నసిగాడు ఆ గూండా.

“పోనీ ఆ ట్రెయిన్ దోపిడీ చేశారా? లేదే?!... వెర్రిమొహాలు వేస్కుని వెనక్కి తిరిగొచ్చారు.”

“మేం ఆ ట్రెయిన్ ని ఆపి దోపిడీ చేద్దామనుకునేలోగానే అది ముందు స్టేషన్ లో బయలు దేరిన పది నిముషాలకే పట్టాలు తప్పి ఘోరప్రమాదానికి గురైంది బాస్..... ఆ సంగతి మీకు చెప్పాం బాస్. కానీ దీపని వాళ్ళెవరో తీస్కెళ్ళిపోయారన్న బాధలో మీరు వినిపించుకోలేదు" అన్నాడు గూండా నీళ్ళు నముల్తూ.

“మనవి అంత దరిద్రగొట్టు మొహాలన్నమాట! రైలు దోపిడీ చేద్దామనుకుంటే రైలు పట్టాలు తప్పింది... బ్యాంకు దోపిడీ చేద్దామనుకుంటే అది మనం దోపిడీ చెయ్యకముందే దివాలా తీస్తుంది" గుండుమీద బాధగా మొట్టుకుంటూ అన్నాడు రాకా.

“ఇప్పుడు నిన్ను దివాలా తీయించడానికి వచ్చాం రాకా....” ఓ గొంతు ఖంగుమని మోగింది.

రాకా, ఇతర గూండాలూ తలత్రిప్పి చూశారు. గుమ్మంలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రూపంలో రాంబాబు, అతని ప్రక్కనే కానిస్టేబుల్ రూపంలో చిన్నారావ్. రాంబాబు చేతిలో రివాల్వర్ మెరుస్తుంది.

“ఎవరూ కదలకండి. మర్యాదగా దీపని మాకు అప్పగించండి......” అన్నాడు రాంబాబు రివాల్వర్ రాకాకి గురిపెడుతూ.

రాకా భళ్ళున నవ్వేశాడు. అతన్ని చూసి మిగతా గూండాలు కూడా నవ్వడం మొదలుపెట్టారు.

“ఏం....? ఎందుకలా నవ్వుతున్నారు?” కన్ప్యూజ్ అవుతూ అడిగాడు రాంబాబు.

“మీ పోలీసోళ్ళు ఎప్పుడూ ఇంతే! అంతా అయిపోయాక వస్తారు" అని మళ్ళీ పెద్ద పెట్టున నవ్వాడు రాకా. గూండాలందరు కూడా అతని నవ్వుతో శృతి కలిపారు.

రాంబాబు కంగారుపడ్డాడు. “అంతా అయిపోయాక అంటే....? దీపని చంపేశారా?! దీప కేంఅయ్యింది?” కంగారుగా అడిగాడు.

“దానికేం అవుతుంది? లాస్ అయ్యిందంటే మాకే. మా బాస్ కి కాజాలు తినిపించి ఎవరో దీపని తీస్కెళ్ళిపోయారు!” చెప్పాడో గూండా.

రాంబాబు, చిన్నారావ్ లు నోళ్ళు తెర్చుకుని అలానే నిలబడిపోయారు. మంగులు ముఠా, రాకా ముఠా కాకుండా ఈ మూడో ముఠా ఎవరబ్బా?!.... వాళ్ళని పట్టుకోవడం ఎలా?...