అందరూ దొంగలే - 87

Listen Audio File :

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కానిస్టేబుల్ 420 వైపు చూశాడు. “ఒప్పేస్కోండి బాస్.... మనం అవును అంటే ఆ నేరం రాంబాబు, చిన్నారావ్ ల మీదికి కదా పోతుంది?” అన్నాడు రాజు గుసగుసలాడుతూ.

“అవును! దీపని మేమే కిడ్నాప్ చేయించి గజదొంగ మంగులుకి అప్పగించాం.... అసలు దీపని హత్య చెయ్యాలనే ఆలోచన కూడా మాకు వుంది...” అన్నాడు ఇన్స్ పెక్టర్ ఆప్పారావ్ లోలోపల రాంబాబు, చిన్నారావ్ ల మీదికి ఆ నేరం పోతుందని సంతోషిస్తూ.

డిటెక్టివ్ పాండు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ చెంప చెళ్ళుమనిపించాడు. “పసిపాపని చంపాలనుకుంటున్నావా?” అన్నాడు హుంకరిస్తూ.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బిక్కమొహం వేశాడు. “అంటే నేను కాదు.... ఆ రాంబాబుగాడన్నామాట" అన్నాడు ఏడుపు గొంతుతో.

“అరే.... మళ్ళీ మొదటికొచ్చావే.... నువ్వే రాంబాబువి" అంటూ చెంపమీద మళ్ళీ చెళ్ళుమని కొట్టి

"రాజూ..... ఇనపకడ్డి ఎర్రగా కాల్చితీసుకురా" అన్నాడు డిటెక్టివ్ పాండు.

“వద్దు... నేనే రాంబాబుని... వీడేమో చిన్నారావ్" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ భయంగా.

“అలారా దారికి.... ఇప్పుడు చెప్పు! మంగులు అడ్రస్ ఏంటీ?”

“కానీ దీప యిప్పుడు మంగులు దగ్గర లేదు. అక్కడినుండి రాకా దీపని తీస్కెళ్ళిపోయాడు.”

“రాకా ఎవడు?”

“వాడు మరో గజదొంగ. మంగులికి శత్రువు.”

“వాడి అడ్రస్ చెప్పు.”

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ చెప్పాడు.

డిటెక్టివ్ పాండు జైలర్ కి ఫోన్ చేసి "మీ జైల్లోంచి తప్పించుకుని పోయిన ఖైదీలు రాంబాబు, చిన్నారావ్ లు నా దగ్గరున్నారు....... మీరు వాళ్ళని తీస్కెళ్ళోచ్చు" అని తన అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేశాడు.

పావుగంట తర్వాత జైలర్ వచ్చి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ నీ, కానిస్టేబుల్ 420నీ తన్నుకుంటూ బయటికి తీసుకెళ్ళి జీపు ఎక్కించుకుని జైలుకి బయలుదేరాడు.

డిటెక్టివ్ పాండు, రాజు పదిమంది కిరాయి గూండాలని మాట్లాడుకుని వ్యాన్ లో రాకా డెన్ కి వెళ్ళారు. వాళ్ళ అదృష్టం బాగుండి అప్పుడే డెన్ లో రాకాతోపాటు మారో నలుగురు దొంగలు మాత్రమే వున్నారు. ఈ పదిమందీ ఆ అయిదుమందిని చెత్తకింద కొట్టి దీపని తీసుకుని బయటికి పరుగుతీశారు. అందరూ వ్యాన్ ఎక్కారు. వ్యాన్ వేగంగా ముందుకు కదిలింది. పావుగంట తర్వాత డిటెక్టివ్ పాండు వ్యాన్ ఆపి పదిమంది గూండాలకీ తలో వెయ్యి ఇచ్చి అక్కడ దిగిపోమ్మన్నాడు. గూండాలు పాండుకి థాంక్స్ చెప్పి వ్యాన్ లోంచి క్రిందికి దిగిపోయారు.

వ్యాన్ ని ముందుకి పోనిచ్చాడు డిటెక్టివ్ పాండు. గజదొంగ మంగులు తన డెన్ లో బాధగా పచార్లు చేసున్నాడు. ఆ పచార్లు ఆపి బాధగా జుట్టు పీక్కున్నాడు మంగులు. “ఆ కమీషనర్ గాడి మీద నా పగ తీరలేదు..... రాంబాబు, చిన్నారావ్ ల మీద నా పగ తీరలేదు.... పదిలక్షలు విలువచేసే దీపని నా నుండి లాక్కెళ్ళిపోయిన రాకా మీద నా పగ తీరలేదు.... వీళ్ళందర్నీ కలిపి చంపుతానని హోల్ సేల్ గా ప్రకటన ఇవ్వాలిగానీ.... ఓ లావుపాటి కొవ్వుత్తి తీసుకురా డేవిడ్" అన్నాడు మంగులు.

“కొవ్వొత్తులు స్టాక్ అయిపొయింది బాస్! ఫాపునుండి చెప్పించాలి" అన్నాడు డేవిడ్.

“ఆ...” మళ్ళీ బాధగా అరుస్తూ జుట్టు పీక్కున్నాడు గజదొంగ మంగులు.

సరిగ్గా అప్పుడే ఎంటర్ అయ్యారు ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్ 420 రూపాల్లో వున్న రాంబాబు, చిన్నారావ్ లు.

“ఏంటి మంగులూ అంత బాధపడుతున్నావు?” అని అడిగాడు రాంబాబు.

“బాధ కాక నాకు ఇంకేం మిగిలింది ఇన్స్ పెక్టర్... నీకు తెలీని విషయాలేమున్నాయ్" అన్నాడు గజదొంగ మంగులు.

“ఏం? దీప ఈ మధ్య ఇంకా ఎక్కువ సతాయిస్తుందా?” అని అడిగాడు రాంబాబు.