అందరూ దొంగలే - 86

Listen Audio File :

"నేనింక నడవలేను బాస్" అన్నాడు రాజు రోడ్డు ప్రక్కన వున్న మైలురాయిమీద కూర్చుంటూ.

“నోర్ముయ్... ఆ మాట బాస్ ని అయిన నేననాలిగానీ నువ్వనకూడదు" అన్నాడు డిటెక్టివ్ పాండు.

"పోనీ - మీరే అనండి బాస్.... ఇద్దరం హాయిగా కాస్సేపు కూర్చోవచ్చు.”

“సర్లే..... నేనే అంటున్నా... నేనిక నడవలేను! నువ్వా మైలురాయిమీదినుండి లే....” అని రాజుని జబ్బపట్టిలేపి, తను ఆ మైలుస్టోన్ మీద కూర్చున్నాడు డిటెక్టివ్ పాండు.

“మరి నేనెక్కడ కూర్చోను బాస్?” అడిగాడు రాజు.

“ఇదిగో... ఈ చెట్టెక్కి కోతిలా కూర్చో" అన్నాడు డిటెక్టివ్ పాండు.

రాజు ఆ ప్రక్కనే వున్న చెట్టెక్కి ఓ కొమ్మమీద సెటిల్ అయిపోయాడు. “కానీ ఊరంతా వదిలిపెట్టి ఊరి పొలిమేరలకి తీస్కోచ్చారేంటి బాస్?” అన్నాడు రాజు.

“ఒరేయ్ తిక్కసన్నాసీ.. క్రిమినల్స్ ఊళ్లో జనం మధ్యలో తిరుగుతారా ఎక్కడయినా....? ఇలా ఊరి చివర ఎవరూ లేనిచోటే సంచరిస్తారు.”

“ఏంటో బాస్..... మీదంతా చాదస్తం" అన్నాడు రాజు.

“ఆ దీపని పట్టుకుని కమీషనర్ కి అప్పగించాక అప్పుడు నీ మాటల్ని వెనక్కి తీస్కుంటావ్!” అన్నాడు డిటెక్టివ్ పాండు. అతను అలా అంటుండగానే చెట్టుపై నుండి రాజు "కేవ్ వ్....” మని అరిచాడు.

“ఏమైంది.....? చెట్టుమీద నీతోబాటు ఎలుగుబంటేమైనా వుందా?” అడిగాడు డిటెక్టివ్ పాండు.

“కాదు సార్.. శవాలు సార్" అరిచాడు రాజు.

“ఏంటి.. చెట్టుకొమ్మలికి శవాలు వేలాడ్తున్నాయా?” కంగారుగా లేచి నిలబడి పైకి చూశాడు పాండు.

“కాదు సార్.... అక్కడ దూరంగా రోడ్డు ప్రక్కన శవాలు పడి వున్నాయ్.”

“మరి కోతిలా ఇంకా అక్కడే కూర్చుని వున్నావేం? త్వరగా కిందకి దిగు....” అరిచాడు డిటెక్టివ్ పాండు.

రాజు గబగబా చెట్టు దిగాడు. ఇద్దరూ ఆ రెండు శరీరాలూ పడివున్న దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళారు. నేలమీదపడి వున్న ఆ ఇద్దర్నీ చూడగానే డిటెక్టివ్ పాండు, అసిస్టెంట్ రాజు ఇద్దరూ కెవ్వుమని కోరస గా అరిచారు.

“అరె! రాంబాబు, చిన్నారావ్ లని ఎవరు హత్య చేశారబ్బా....? ఇప్పుడు కేసు మరింత జటిలమైందే....” బుర్రగోక్కుంటూ అన్నాడు డిటెక్టివ్ పాండు.

“సార్...... వాళ్ళు చినిపోలేదు సార్.. ప్రాణంతోనే వున్నారు.... ఇద్దరి పొట్టలూ చూశారా పైకి క్రిందకి ఎలా కదులుతున్నాయో ఊపిరి తీస్తున్నట్టు? అన్నాడు రాజు.

“ఓహ్... వీళ్ళు భలే టైంలో మనకి చిక్కారులే. ఇక మనచేతికి రెండు లక్షలూ వచ్చేసినట్టే" సంతోషంగా అన్నాడు డిటెక్టివ్ పాండు. ఆ వైపుగా వెళుతున్న ఖాళీ టాక్సీని ఆపారు ఇద్దరూ.

అది డిటెక్టివ్ పాండు ఆఫీసు. “బాబోయ్... నాయనోయ్....” అంటూ కేకలతో ఆ ప్రదేశం మార్మోగిపోయింది.

అలా కేకలు వేసింది ఎవరో కాదు. రాంబాబు, చిన్నారావ్ రూపాల్లో వున్న ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్ 420. ఆ ఇద్దరూ చెరో కుర్చీలో తాళ్ళతో కట్టివేయబడ్డారు. వాళ్ళ ఒంటి మీద నిక్కర్లు తప్ప మరేంలేదు. ఇద్దరి తొడలూ, బుగ్గలూ ఎర్రగా కమిలిపోయాయ్.

“మేం ఆ రాంబాబు, చిన్నారావ్ లం కాదయ్యా అంటే నమ్మరేం... నేను ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ని, ఇతను కానిస్టేబుల్ 420” ఏడుస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“మళ్ళీ అదే కూడా" అంటూ డిటెక్టివ్ పాండు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి తొడపాశం పెట్టేశాడు.

రాజు కానిస్టేబుల్ 420 బుగ్గలు పిండేశాడు. బాబోయ్...

అంటూ బాధగా అరిచారు ఇద్దరూ. అప్పటికి రెండు గంటల నుండీ వాళ్ళిద్దర్నీ తొడపాశం పెట్టి, ఒళ్ళంతా గిచ్చి, నెత్తిమీద మొట్టికాయలు వేసి హింస పెడుతున్నారు డిటెక్టివ్ పాండు, అసిస్టెంట్ రాజులు.

“ఇక ఇలా లాభంలేదు... రాజూ... నువ్వు వెళ్ళి ఓ ఇనపకడ్డీని ఎర్రగా కాల్చి తీసుకురా" అన్నాడు డిటెక్టివ్ పాండు.

“వద్దు బాబోయ్.. నేను రాంబాబు, వీడేమో చిన్నారావ్! ఒప్పెసుకుంటున్నాం. ఇక వదిలి పెడ్తారా!” అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఏడుపు మొహం పెడుతూ.

“అప్పుడేనా...? దీప కిడ్నాప్ కేసులో మీ పాత్ర ఉందని ఒప్పుకోండి" అన్నాడు పాండు.