అందరూ దొంగలే - 85

Listen Audio File :

కానిస్టేబుల్ 420 ని రాంబాబు, చిన్నారావ్ లు లోపలికి లాకెళ్ళిపడేశారు.

“ఇప్పుడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గాడి పనిపట్టాలి" అంటూ రిసీవర్ ని తీసి అప్పారావ్ ఇంటి నెంబర్ డయల్ చేశాడు రాంబాబు.

“హలో....” అన్నాడు అవతలి నుండి ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“హలో... నేనే అప్పారావ్!” అన్నాడు రాంబాబు కమీషనర్ లింగారావ్ గొంతుతో.

“సార్... మీరా సార్! నమస్తే సార్" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“నీ దొంగ నమస్కారాలాపు... అవతల నీ స్టేషన్ లో కొంపలంటుకుంటుంటే నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నావోయ్?”

“బాబోయ్... స్టేషన్ లో ఏం జరుగుతుంది సార్?” కంగారుగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“నేను చెప్పడం కాదు...... నువ్వెళ్ళి చూడు" అంటూ ఫోన్ పెట్టేశాడు రాంబాబు.

“ఇక చూస్కో... ఆ అప్పారావ్ గాడు కిందా మీదా పడుతూ పరిగెట్టుకువస్తాడు" అన్నాడు చిన్నారావ్. ఇద్దరూ ఘొల్లున నవ్వారు.

పావుగంట తర్వాత పోలీస్ స్టేషన్ ముందు జీపు ఆగిన శబ్దం వినిపించింది రాంబాబు, చిన్నారావ్ లకి. వెంటనే ఇద్దరూ గబగబా స్టేషన్ తలుపులు వెనకాల నక్కారు. నాలుగు క్షణాల తర్వాత ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అడుగుల శబ్దం గుమ్మానికి దగ్గరవుతూ వినిపించింది. “అదేంటీ? తలుపులు బార్లా తెరిచి ఉన్నాయ్.. లోపల ఎవరూ లేరెంటీ? ఒరేయ్ ఫోర్ ట్వంటీ" అని అరుస్తూ లోపలికి అడుగుపెట్టాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

వెంటనే తలుపు చాటునుండి రాంబాబు ముందుకి దూకి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు. చిన్నారావ్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ముక్కుకి క్లోరోఫాంలో ముంచిన కర్చీఫ్ గట్టిగా అదిమాడు. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ స్పృహ తప్పాడు. రాంబాబు, చిన్నారావ్ లు ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్ 420 లను జీపులో వేస్కుని విల్సన్ ఇంటికి వెళ్ళారు.

“మేం వీళ్ళ రూపంలో వున్నాం కదా... వీళ్ళకి మా రూపు ఇవ్వండి అంకుల్! అంటే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి నా రూపూ, కానిస్టేబుల్ 420 కి చిన్నారావ్ రూపూ అన్నమాట.....” అన్నాడు రాంబాబు విల్సన్ తో

“దానివల్ల మీకు ఉపయోగం వుందా?” అడిగాడు విల్సన్.

“బోల్డంత ఉపయోగం వుంది అంకుల్" అన్నాడు రాంబాబు. విల్సన్ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి, కానిస్టేబుల్ 420 కి 3 రోజుల పాటు ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. వాళ్ళకి మెలకువ వచ్చినప్పుడల్లా మత్తు ఇంజక్షను ఇవ్వడం లేదా తాళ్ళతో ఆపరేషన్ టేబులుకి కట్టెయ్యడం లాంటి పనులు చేస్తూ సర్జరీ ముగించాడు విల్సన్. మూడు రోజుల తర్వాత ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అచ్చుగుద్దినట్టు రాంబాబులా, కానిస్టేబుల్ 420 చిన్నారావ్ లా మారిపోయారు.

విల్సన్ ఆ ఇద్దరికీ అద్దంలో మొహాలు చూపిస్తే వాళ్ళు ఘోల్లుమన్నారు. “ఇది అన్యాయం.... నన్ను రాంబాబులా మార్చడం ఏంటీ?” అని అరిచాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

అప్పుడే గదిలోకి వచ్చిన రాంబాబు, చిన్నారావ్ లను చూసిన ఇన్స్ పెక్టర్ అప్పారావ్ షాక్ తిన్నాడు. “వీళ్ళెవరు....? అచ్చు నాలాగా, మా కానిస్టేబుల్ 420లాగా వున్నారు?” అని కంగారుగా విల్సన్ని అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“నేను రాంబాబుని" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావు రూపంలో వున్న రాంబాబు.

“నేను చిన్నారావ్ ని!" అన్నాడు కానిస్టేబుల్ రూపంలో వున్న చిన్నారావ్.

“బాబోయ్... వీళ్ళేదో పెద్ద కుట్ర పన్నారుగా దేవుడోయ్....” అంటూ గుండెలు బాదుకున్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

రాంబాబు, చిన్నారావ్ లు ఆ ఇద్దరి మొహాల మీద క్లోరోఫాంలో ముంచిన కర్చీఫ్ లను అదిమారు. ఆ ఇద్దరూ మూర్చపోయారు. విల్సన్ కి థాంక్స్ చెప్పి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ నీ, కానిస్టేబుల్ 420 నీ ఊరు చివర రోడ్డు ప్రక్కన పారేసి వెళ్ళిపోయారు రాంబాబు, చిన్నారావ్ లు.