అందరూ దొంగలే - 84

Listen Audio File :

రాంబాబు, చిన్నారావ్ మొహాలకున్న కట్లు విప్పదీసి "ఊ.... అద్దంలో మీ మొహాలను చూస్కోండి" అన్నాడు విల్సన్.

రాంబాబు, చిన్నారావ్ లు తమ ఎదురుగా వున్న అద్దంలో మొహాలు చూస్కుని ఆశ్చర్యంలో తలమునకలయ్యారు. తమ కళ్ళ ఎదురుగా కనిపిస్తున్న నిజాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు.

రాంబాబు మొహం అచ్చుగుద్దినట్టు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మొహంలా, చిన్నారావ్ మొహం కానిస్టేబుల్ 420 లాగా వుంది. కేవలం ఫోటోలని చూసి సరిగ్గా అందులో కనిపించే మొహాల్లా మార్చేయడం సాధ్యమేనా? కానీ సాధ్యమేనని విల్సన్ నిరూపించాడు.

“యూ ఆర్ రియల్లీ గ్రేట్ అంకుల్!” అన్నాడు రాంబాబు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ.

సమాధానంగా విల్సన్ చిరునవ్వు నవ్వాడు. “సో..... ఈ రోజునుండీ నువ్వు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వి..... అతను కానిస్టేబుల్ 420.... కానీ మీరు వాళ్ళ రూపాలు కావాలని ఎందుకు కోరుకున్నారో చెప్తారా?” అడిగాడు విల్సన్.

“గజదొంగ మంగులుని కలిసి రాకాగాడి అడ్రస్ తెల్సుకోవాలంటే నాకు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గాడి రూపం అవసరసం అంకుల్" చెప్పాడు రాంబాబు.

“ఓ... ఐసీ...” తల పంకించాడు విల్సన్.

“ఇంక వెళ్ళొస్తాం అంకుల్" అన్నాడు రాంబాబు.

“ఒక్కే.. బెస్ట్ అఫ్ లక్" అంటూ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు విల్సన్.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రూపంలో వున్న రాంబాబు, కానిస్టేబుల్ 420 రూపంలో వున్న చిన్నారావ్ పోలీస్ స్టేషన్ని సమీపించారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఫుల్ యూనిఫాంలో వున్నారు. డ్రామా కంపెనీనుండి ఆ యూనిఫాంలను అద్దెకి తెచ్చుకుని వేస్కున్నారు ఇద్దరూ. అప్పుడు సమయం 12 గంటలైంది. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఎనిమిది దాటితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలిసే రాంబాబు, చిన్నారావ్ లు ఆ సమయంలో అక్కడికి వచ్చారు.

“నువ్వు ఈ బిల్డింగ్ వెనకాల దాక్కో, నేను విజిలేశాక లోపలోకి రా" అన్నాడు రాంబాబు.

చిన్నారావ్ తల ఊపి పోలీస్ స్టేషన్ వెనకవైపుకి వెళ్ళాడు. రాంబాబు, బూట్లు టకటకలాడించుకుంటూ స్టేషన్ లోకి అడుగు పెట్టాడు. నైట్ డ్యూటీ లో వున్న ఇద్దరూ కానిస్టేబుల్స్, ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రూపంలో వున్న రాంబాబుని చూసి ముందుగా ఆశ్చర్యపోయారు, తర్వాత కంగారుగా వాళ్ళు ఆడ్తున్న పెకల్ని టేబులు కిందకి తోసేసి గబుక్కున లేచి నిలబడి బూట్లు ఠాకామని నేలకి తాటించి సెల్యూట్ చేశాడు.

“ఏం ఫరవాలేదు... ఆడుకోండి.. హాయిగా ఆడుకోండి" అన్నాడు రాంబాబు కుర్చీలో కూర్చుంటూ.

“సారీ.... తప్పయిపోయింది" అన్నాడు కానిస్టేబుల్ 420.

“ఏం... నేను వ్యంగ్యంగా మాట్లాడ్తున్నానని అనుకుంటున్నారా? అదేం కాదు. మీరు స్టేషన్లో హాయిగా పేకాడుకోండి.... మందు కొట్టండి.... సిగరెట్లు కాల్చండి... నేనేం అనుకోను.”

“సార్!” ఆశ్చర్యంగా అన్నాడు కానిస్టేబుల్ నూట పదకొండు.

రాంబాబు చిరునవ్వు నవ్వాడు.

“ఏంటి సార్... మీరు ఇందాకే కద్సార్ యింటికి వెళ్ళారు. మళ్ళీ అర్ధరాత్రి స్టేషన్ కి ఎందుకొచ్చారు సార్? ఏమైనా అర్జంట్ కేసోచ్చిందా?” అడిగాడు కానిస్టేబుల్ 420.

“అప్పుడప్పుడూ అర్ధరాత్రుళ్ళు సర్ ప్రయిజ్ విజిట్స్ చేయమని కమీషనర్ గారి నుండి ఇన్స్ స్ట్రక్షన్స్ వచ్చాయ్.. మీరేం కంగారు పడకండి. నేను మీరు స్టేషన్ లో పేకాడుతున్న విషయాన్ని ఆయనకీ చెప్పనులే" నవ్వుతూ అన్నాడు రాంబాబు.

“థాంక్యూ సార్" అన్నాడు కానిస్టేబుల్ నూటపదకొండు.

“సరేగానీ.... నీకీపూట ఆఫ్ ఇచ్చేశాను... నువ్వు ఇంటికెళ్ళిపో" అన్నాడు రాంబాబు.

“సార్.. మరి స్టేషన్ లో" నసిగాడు నూటపదకొండు.

“ఫోర్ట్వంటీ నేనూ ఇద్దరం వుంటాంగా.. నాకీపూట ఇక్కడ చిన్న పనుంది.నువ్వెళ్ళిపో.”

“థాంక్యూ సార్.. వస్తాను సార్" అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ నూటపదకొండు.

కొన్ని సెకన్ లు ఆగి రాంబాబు రెండు వేళ్ళూ నోట్లో పెట్టుకుని విజిల్ వేశాడు.

“అదేంటి సార్..... అలా విజిల్ వేశారు?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కానిస్టేబుల్ 420.

“అదా? ఓ గమ్మత్తులే! నువ్వు అలా నన్నే చూస్తూ ఉండు.... ఓ విచిత్రం జరుగుతుంది" అన్నాడు రాంబాబు.

“అలాగా? అయితే చూస్తా సార్" అని రాంబాబు వంక ఉత్సాహంతో చూడసాగాడు కానిస్టేబుల్ 420.

అప్పుడే శబ్దం కాకుండా చిన్నారావ్ లోపలికి వచ్చి కానిస్టేబుల్ 420 వెనక్కి మెల్లగా వెళ్ళి జేబులోంచి క్లోరోఫాం ముంచిన కర్చీఫ్ తీసి అతని ముక్కుకి గట్టిగా అదిమిపెట్టాడు.

కానిస్టేబుల్ 420 స్పృహ తప్పి నేలమీద బోర్లాపడిపోయాడు.