అందరూ దొంగలే - 80

Listen Audio File :

డిప్పల్లో నర్శింగ్ హోంని సమీపించారు రాంబాబు, చిన్నారావ్ లు. అక్కడ నలుగురు కానిస్టేబుల్స్ కాపలా వున్నారు. “ఆ వెధవలు మన కోసమే కాపు కాసినట్టున్నారు....” అన్నాడు రాంబాబు.

“సందేహమా?” అన్నాడు చిన్నారావ్.

“పద.. వాళ్ళని ఓ ఆట ఆడిద్దాం!” ఇద్దరూ కానిస్టేబుల్స్ ని సమీపించారు.

“ఏంటిసారూ ఇక్కడున్నారు? ఏదైనా మర్డర్ జరిగిందా?” అడిగాడు రాంబాబు.

“మర్డరేమీ జరగలేదుగానీ, ముందు ముందు జరగొచ్చు" అన్నాడు ఓ కానిస్టేబుల్.

“అమ్మో! ఎవరు ఎవర్ని మర్డర్ చేస్తారు కానిస్టేబుల్ గారూ?” గుండెలమీద చేయ్యేస్కుంటూ అడిగాడు చిన్నారావ్.

“మీరు రోజు పేపర్ చదువుతారా?” అడిగాడు ఆ కానిస్టేబుల్.

“చదువుతాం సార్!” అన్నాడు చిన్నారావ్.

“అయితే ఆ రాంబాబూ, చిన్నారావ్ ల గురించి చదివే వుంటారుగా! వాళ్ళని మేం మర్డర్ చేస్తాం" అన్నాడు ఇంకో కానిస్టేబుల్.

“అయ్యోపాపం.. ఎందుకు సార్?” వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగాడు రాంబాబు.

“ఎందుకో పేపర్లో పడ్తుందిగా... అప్పుడు చదువుకోండి.”

“అయినా వాళ్ళని మీరెలా పట్టుకుంటారు సార్?” అడిగాడు చిన్నారావ్.

“ఈ నర్శింగ్ హోం లో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వున్నారులే. వాళ్ళని కలవడానికి ఎలాగూ ఇక్కడికి వస్తారు. అప్పుడు మర్డర్ చేస్తాం" అన్నాడు మొదటి కానిస్టేబుల్.

“కానీ వాళ్ళు మామూలుగా ఎందుకు వస్తారు సార్? ఏదైనా మారు వేషం వేస్కుని వస్తారుగానీ అన్నాడు రాంబాబు.

“వాళ్ళు ఏ రూపంలో వున్నా గుర్తుపడ్తామోయ్" అంత దగ్గర్నుండి మాట్లాడ్తున్నా తమని వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నందుకు రాంబాబు, చిన్నారావ్ లు లోపల్లోపల చాలా సంతోషపడిపోయారు .

“అంతేలెండి సార్! మీ మోకాలు చూస్తుంటేనే తెల్సిపోతుంది మీరెంత తెలివైనవారో" అన్నాడు రాంబాబు.

“ఇంకా పదరా... మనం లోపలికి వెళదాం...” అన్నాడు చిన్నారావ్.

ఇద్దరూ నర్శింగ్ హోం లోకి అడుగుపెట్టారు.

సరోజ, సునీతలు వార్డులో పేషంట్స్ కి జ్వరం చూడడంలోనూ, మందులు ఇవ్వడంలోనూ, బి.పి. చెక్ చెయ్యడంలోనూ చాలా బిజీగా వున్నాను. వార్డులో చివరి పేషంట్ నోట్లో ధర్మామీటర్ పెట్టి "వీళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో!” అని దిగులుగా అంది సరోజ.

“పోలీసులవల్ల ఏం అవస్థలు పడుతున్నారో!” అంది సునీత.

సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన రాంబాబు, సరోజ భుజం మీద చెయ్యివేసి. “వాళ్ళెవరి గురించో ఎందుకు ఆల్లోచిస్తావ్ చిలకా! మీకు మేమున్నాంగా?” అన్నాడు.

“అవునుకదా!” అంటూ చిన్నారావ్ సునీత భుజం మీద చేయ్యేశాడు.

సరోజ, సునీతలు క్షణంపాటు బిత్తరపోయారు. తర్వాత ఇద్దరూ తేరుకుని ఒక్కసారిగా రాంబాబు, చిన్నారావ్ ల చెంపలు చెళ్ళుమనిపించారు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ వెనక్కి తూలిపడ్డారు.

రాంబాబు, చిన్నారావ్ లు ఇద్దరూ మొహమొహాలు చూస్కుని ఫకాలుమని నవ్వారు. ఇద్దరూ నేలమీదినుండి లేచి మళ్ళీ సరోజ, సునీతల్ని సమీపించారు. “మాకోసం కలవరిస్తూ తీరా ఎదురుగా నిలబడిన మమ్మల్నే కొడ్తారా? అయినా నీ చేతిలో ఇంత బలం వుందని అనుకోలేదు సరూ" అన్నాడు రాంబాబు.

“అసలు డిష్యూం డిష్యూం పెప్సోడెంట్ పని కదా! మరి మీరెందుకబ్బా మమ్మల్ని అలా కొట్టారు?” ఆశ్చర్యంగా మొహం పెట్టాడు చిన్నారావ్.

“ఏయ్.. ఎవడ్రా నువ్వు?!” అంటూ మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తింది. సునీత.