అందరూ దొంగలే - 77

Listen Audio File :

రాంబాబు, చిన్నారావ్ లు వేగంగా పరుగు తీస్తున్నారు. వాళ్ళకి కాస్త దూరంలో జీపులో ఇన్స్ పెక్టర్ అప్పారావ్, మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తో వెంబడిస్తున్నాడు. జీపు వాళ్ళని అతివేగంగా సమీపించింది, మరో రెండు క్షణాల్లో రాంబాబు, చిన్నారావ్ లు వాళ్ళకి దొరకుతారనగా చిన్న డొంక రోడ్డులోకి ఇద్దరూ తిరిగి పరుగు ప్రారంభించారు. ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఆ ఇరుకు రోడ్డు మొదట్లో జీపు ఆపి "ఆ....” అని అరిచాడు

“సార్... మీరిలా అరిస్తే పన్లుకావు...... మనం ఇప్పుడు జీపు దిగి వాళ్ళని వెంబడిస్తే వాళ్ళని పట్టుకోవచ్చు.....” అన్నాడు మొదటి కానిస్టేబుల్.

“అవును.... పదండి" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ జీపులోంచి కిందకు దూకుతూ.

రాంబాబు, చిన్నారావ్ ల వెనకాలే వేగంగా పరుగుతీయడం ప్రారంభించింది ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బృందం. రాంబాబు, చిన్నారావ్ లు ఎప్పటినుండో పరుగు చేస్తుండడంతో వాళ్ళలో అలసట క్షణం క్షణం పెరగసాగింది, శక్తి కూడా సన్నగిల్లసాగింది, ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బృందం అప్పుడే పరుగు ప్రారంభించింది కాబట్టి పరుగులో వేగం వుంది. అందుచేత ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బృందం క్రమేపీ రాంబాబు, చిన్నారావ్ లకి దగ్గర అవుతుంది.

ఒకటి.... రెండు.... మూడు... నాలుగు.... పది క్షణాలు గడిచాయ్. ఇన్స్ పెక్టర్ బృందం రాంబాబు, చిన్నారావ్ లకి చాలా సమీపంలోకి వచ్చేసింది. మరో నాలుగు క్షణాల్లో వాళ్ళు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి దొరికిపోతారనగా, ఓ గమ్మత్తయిన సంఘటన జరిగింది.

"భౌ....భౌ భౌ భౌ....” అంటూ నాలుగు బలిసిన కుక్కలు వాళ్ళ మీదకు విరుచుకుపడ్డాయ్.

రాంబాబు, చిన్నారావ్ ల మీదకి కాదు! ఇన్స్ పెక్టర్ అప్పారావ్, కానిస్టేబుల్స్ మీదికి! అప్పారావ్, కానిస్టేబుల్స్ చటుక్కున ఆగి పోయారు. వాళ్ళకి ఎదురుగా గంభీరంగా కనిపించే నాలుగు కుక్కలు! “గుర్ ర్ ర్....” అంటూ పళ్ళు బైటపెట్టి రెండడుగులు ముందుకు వేసింది ఒక కుక్క.

అప్పారావ్, కానిస్టేబుల్స్ భయంగా నాలుగడుగులు వెనక్కి వేశారు. “ఒసేవ్ దొంగ ముండా... మేము పోలీసులమే..... నువ్వు వాళ్ళ వెంటపడాలి! ఏయ్... హుష్ హుష్...” అన్నాడు చేతులు ఊపి అదిలిస్తూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అలా చేతులు విదిలించేసరికి, అవి వాటి నేదో చెయ్యబోతున్నాడనుకుని కోపంతో గుండెలదిరిపోయేలా అరుస్తూ రెండడుగులు ముందుకు వేశాయ్.

“ఓసి మీ అమ్మా కడుపులు మాడా... మీరు నన్ను పట్టించారేమిటే?!” ఠారుకుంటూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“అంటే మీకూ, వాటికి సేమ్ టైప్ కిడ్నీస్ ఉన్నాయ్ కదండీ.... అందుకని మిమ్మల్ని వాళ్ళ ఆత్మబంధువుగా భావించి సంతోషంగా అరుస్తున్నాయేమోనండీ ...” అన్నాడు ఒక కానిస్టేబుల్.

“షటప్... నువ్వు నోర్ముయ్...” అరుస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. అతనలా అరిచేసరికి, కుక్కలు నాలుగూ ఒక్కసారిగా మొరుగుతూ, పళ్ళన్నీ బయటపెట్టి మీదిమీడికి వచ్చాయ్.

“సార్... దయచేసి మీరేం మాట్లాడకుండా అలాగే నిల్చోండి సార్! కాస్సేపు మొరిగి అవే పోతాయ్" అన్నాడు ఇంకో కానిస్టేబుల్. అందరూ నిశ్శబ్దంగా నిల్చున్నారు. ఆ కానిస్టేబుల్ చెప్పిన విధంగానే అవి ఓ అయిదు నిముషాల పాటు మొరిగి, వాటి దారిన అవి వెళ్లిపోయాయ్.

“ఏరి వీళ్ళు?” అన్నాడు దిక్కులు చూస్తూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

“మీరు భలేవారు సార్! వాళ్ళింకా ఇక్కడే వుంటారా! ఈపాటికి బోల్డన్ని సందులు తిరిగి చాలాదూరం వెళ్ళిపోయి వుంటారు....” అన్నాడు నలుగురు కానిస్టేబుల్స్ లో ఒకడు.