వేరికోసిల్ – 1
.png)
సంతానం కలగడంలో స్త్రీ పురుషుల పాత్ర సమానం. అయితే వివాహమైన చాలా కాలానికి కూడా భార్యాభర్తలు సంతానం పొందలేకపోతే దానికి స్త్రీలే బాధ్యత వహించాలనే భావం భారతదేశంలో వ్యాపించింది. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. పురుషులలో అనేక కారణాల వల్ల వంధ్యత్వం ఏర్పడుతుందనే వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు.
పురుషులలో వంధ్యత్వం ఏర్పడటానికి వేరికోసిల్ ఒక కారణం కావచ్చు. వృషణాల నుంచి రక్తాన్ని తీసుకువెళ్ళే సిరలు ఉబ్బడాన్నే వేరికోసిల్ అని అంటారు. వేరికోసిల్ ఎప్పుడైనా రావచ్చు. 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపించే అవకాశాలు ఎక్కువ.
వేరికోసిల్ ఎక్కువగా ఎడమవైపు వృషణాలకి వస్తుంది. కుడివైపున రాదని మాత్రం చెప్పలేం. అలా రావడమనేది అరుదు. కొంతమందిలో రెండువైపులా వేరికోసిల్ రావచ్చు. ఇటువంటి వారి వృషణాలు రెండూ పనిచేయక పోవడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గడమనేది ఎక్కువ. వీరు త్వరగా చికిత్స చేయించుకోవడం మంచిది. వేరికోసిల్ వలన వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే వారికి పిల్లలు పుట్టరు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత వేరికోసిల్ వచ్చినా ఇదే ఫలితం కలుగుతుంది.
వేరికోసిల్ కి చికిత్స ఈనాడు అందుబాటులో ఉంది. వేరికోసిల్ ఉన్న వారు చికిత్స చేయించుకుంటే వారు సంతానవంతులు కాగలరు. వేరికోసిల్ ను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నష్టం కలగక తప్పదు. ఇటువంటి వ్యాధులు ఎందుకు వస్తాయనేది చెప్పడం కొంచెం కష్టమే. వైద్యం అందుబాటులో ఉన్నందున వెంటనే చికిత్స చేయించుకుంటే నష్టం కలిగే అవకాశమే ఉండదు. సిగ్గు, మొహమాటాలతో కాలాయాపన చేయడం తగదు. వేరికోసిల్ గురించి మరికొన్ని విషయాలు వచ్చేవారం.



