LATEST NEWS
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు.  అప్పట్లో  రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే   వాతావరణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్న కొండా సురేఖ  కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కించపరచాలనే ఉద్దేశం గానీ, ఆయన కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయాలని కానీ తాను ఎన్నడూ భావించలేదని వివరణ ఇచ్చారు.   ఆ వ్యాఖ్యల వల్ల కేటీఆర్ కు కలిగిన మనస్తాపానికి చింతిస్తున్నాని పేర్కొన్న ఆమె  ఈ వివాదానికి పూర్తిగా ముగింపు పలకాలనే సదుద్దేశంతోనే  క్షమాపణలు చెబుతూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.  కాగా కొండా సురేఖను రేవంత్ తన కేబినెట్ నుంచి తొలగించిన తరువాత ఇప్పుడు కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  సరైన కారణాలు వెల్లడించకుండా, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి తొలగించడాన్ని ఆమె అప్పట్లోనే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.  బీసీ మహిళగా తనకు జరుగుతున్న అన్యాయంపై ఆమె బహిరంగంగానే  నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణ చెప్పడం, ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం పొలిటికల్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె బీఆర్ఎస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారన్న చర్చ జోరందుకుంది. ఈ చర్చకు కొండా సురేఖ భర్త కొండా మురళితో కలిసి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.    [Konda Surekha Apologizes to KTR, Telangana Politics, Konda Surekha Murali, BRS Reentry Rumors, Telugu One]
రాను రానంటూనే  చిన్నదీ రాములోరి గుడికొచ్చే అనే పాట చందంగా రాజకీయాలలో పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తోంది. తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆంధ్రప్రదేశ్ లోనూ, జాతీయ స్థాయిలోనూ జనసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో ఎటువంటి పొత్తూ ఉండదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇప్పటికే పలుమార్లు విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోటీకి జనసేన రెడీ అవుతోంది.  రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేనతో  కలిసి ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  ఉమ్మడి ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఎమ్మెల్సీ పోరులో జనసేన   అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ పార్టీకి అండగా నిలబడుతోందన్న అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారికంగా మిత్రపక్షాలుగా కొనసాగుతున్న జనసేన,  బీజేపీలు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ ఎవరికి వారే యమునా తీరే చందంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తీరు మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, రెండు పార్టీలూ అనివార్యంగా అవగాహనకు వచ్చాయంటున్నారు పరిశీలకులు.   జనసేన అభ్యర్థి బరిలో నిలిచే స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని పోటీకి పెట్టకుండా పరోక్షంగా మద్దతు తెలిపేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇదే జరిగితే.. ముందు ముందు జరగనున్న స్థానిక ఎన్నికలు, ఆ పై 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలూ జతకట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Jana Sena  BJP Alleance Telangana,  MLC Elections, Graduate MLC,Telangana Politics,  , Warangal Khammam Nalgonda Graduates MLC, Telugu One]
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన సినీమా అయిపోయిందా? స్థానిక నామినేషన్లలో ఆ నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ స్థానాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఏకగ్రీవం కావడం దీనినే సూచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  స్థానిక   ఎన్నికల ప్రచారంలో అధికార తెలుగుదేశం కూటమి నేతలు  జగన్‌ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.  జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందుల గడ్డపై   జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.  పక్కా ప్రణాళికతోనే తాము పులివెందులలో అడుగుపెట్టామని, మాజీ సీఎంకు సినిమా చూపిస్తామంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పులివెందులలో జగన్ సినిమాకు ఎండ్ కార్డ్ పడిందా? అన్న అనుమానాలకు తావిచ్చాయి.  జగన్‌  సినిమా డైలాగులు చెబుతున్నారని, చొక్కాలు మడతపె డతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని పరాజయ భయాన్ని ఎత్తి చూపుతున్నాయనీ ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చొక్కా చేతులు మడతపెడితే భయపడే పరిస్థితులు పులివెందులలో ఇప్పుడు లేవని ఎద్దేవా చేశారు. పులివెందులలో జగన్ కు ఇప్పుడు తాము సినిమా చూపిస్తామని హెచ్చరించారు.   ఒకప్పుడు జగన్ వెంటే నడిచి, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశంకూటమి అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ఇదే సభలో ఆయనతో పాటు పాల్గొన్న పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి కూడా  జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. తనను అంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా తాను ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, పులివెందుల ప్రజల మద్దతుతోనే మునుపటి కంటే బలంగా నిలబడ్డానన్న ఆయన.. గత నాల్గ దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేసిన తప్పిదాలకు పులివెందుల ప్రజలు ఇప్పుడు సరైన సమాధానం చెబుతున్నారన్నారు. నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Local Body Elections Pulivendula, Jagan, Ycp, Backfoot, Adinarayana Reddy, Pulivendula Politics, BTech Ravi, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, డ్యాన్సర్‌ శ్రష్టి వర్మ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి జానీ మాస్టర్‌ తాజాగా ‘ఢీ’ డ్యాన్స్‌ షోలో మాట్లాడటంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. దీనిపై శ్రష్టి వర్మ సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని, తన గొంతును ఎవరూ మూయించలేరని స్పష్టం చేశారు. ‘ఢీ’ కొత్త సీజన్‌కు జానీ మాస్టర్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మీద లక్ష ఆరోపణలు చేశారు. ఒక అమ్మాయి, మన డ్యాన్సరే వచ్చి ‘జానీ మాస్టర్‌ జీరో జీరో’ అని చెప్పింది. నేను కరెక్ట్‌ అయినప్పుడు అవతలివాళ్లు ఎన్ని అనుకుంటే నాకెందుకు?’’ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జానీ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వీడియోపై శ్రష్టి వర్మ స్పందిస్తూ.. జానీ మాస్టర్‌ మాట్లాడిన క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘నిజం వెలుగులోకి వచ్చినప్పుడు అపరాధభావం ఉన్న వ్యక్తి మరింత గట్టిగా మాట్లాడతాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. తనను ఓ మహిళా డ్యాన్సర్‌ ‘జీరో జీరో’ అని అన్న విషయాన్ని జానీ బహిరంగ వేదికపై ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా మాట్లాడితే, ఆమె మాటలను ప్రశ్నించడం ఎందుకని నిలదీశారు. అంతేకాదు, తనకు మద్దతుగా నిలుస్తున్నవారికి వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి వారిని మాట్లాడకుండా ఆపే హక్కు జానీ మాస్టర్‌కు లేదని శ్రష్టి వర్మ పేర్కొన్నారు. ‘‘దాదాపు నాలుగేళ్లపాటు ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడి, నాకు ఎదురైన అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడే స్థాయికి వచ్చాను. అలాంటప్పుడు నన్ను కానీ, నాకు మద్దతుగా నిలబడాలనుకునే వారిని కానీ అడ్డుకునే హక్కు నీకు లేదు. నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నా నోరు మూయించలేరు’’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని శ్రష్టి వర్మ గతంలో ఆరోపించారు. తాను మైనర్‌గా ఉన్నప్పటి ఘటనల గురించి ఆమె ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2024 సెప్టెంబర్‌లో ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు, స్పందనలను వేర్వేరుగా చూడాల్సిన నేపథ్యంలో.. తాజాగా ‘ఢీ’ షోలో జానీ చేసిన వ్యాఖ్యలు, వాటికి శ్రష్టి ఇచ్చిన కౌంటర్‌ మరోసారి చర్చకు దారితీశాయి.     [Shrasti Verma, Jani Master, Shrasti Verma Latest News, Dhee Dance Show, Jani Master Controversy, Shrasti Verma Instagram, Jani Master Allegations, Telugu Cinema News]
విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నంబర్‌ 47’. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విషయంలో సెంటిమెంట్ల కంటే ప్రేక్షకుల తీర్పుకే ప్రాధాన్యం ఇస్తాననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో త్రివిక్రమ్‌తో కలిసి ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి విజయవంతమైన సినిమాలు చేశానని వెంకటేశ్‌ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సినిమాల తర్వాత మళ్లీ కలిసి పనిచేసేటప్పుడు ఎలాంటి కథను ఎంచుకోవాలనే విషయంలో సహజంగానే ఒత్తిడి ఉంటుందని చెప్పారు. అయితే త్రివిక్రమ్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు అందులోని అంశాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్‌ సన్నివేశాలు, సస్పెన్స్‌, వివిధ రకాల భావోద్వేగాలు ఇందులో ఉంటాయని వివరించారు. తాను గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించినప్పటికీ ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని వెంకటేశ్‌ అన్నారు. ఇందులో తన పాత్ర పేరు చిట్టిబాబు. కుటుంబానికి ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించడానికి, తన వాళ్లను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్లే వ్యక్తిగా ఈ పాత్ర ఉంటుందని చెప్పారు. కుటుంబ అనుబంధాలతో పాటు ఉత్కంఠభరితమైన అంశాలు కూడా కథలో భాగమవుతాయని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక అక్టోబర్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంతో, ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో వస్తారనే ఆసక్తి నెలకొంది. కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్‌ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. అయితే సినిమా విజయం విషయంలో అంతిమ నిర్ణయం ప్రేక్షకులదే అన్నది వెంకటేశ్‌ వ్యాఖ్యల సారాంశం.     [Venkatesh, Aadarsha Kutumbam, Venkatesh Trivikram Movie, Aadarsha Kutumbam Press Meet, Trivikram Srinivas, Venkatesh Latest News, Aadarsha Kutumbam Release Date, Telugu Cinema News]
సినిమా పాట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సంగీత దర్శకుడు, గాయకుడు, గేయ రచయిత. కానీ ఒక పాటను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడంలో వాయిద్య కళాకారుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ఇళయరాజా సంగీతంలో గిటార్ వినిపిస్తే చాలు.. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించకుండా ఉండలేం. అలాంటి ఎన్నో మధురమైన పాటలకు తన గిటార్‌తో ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చిన సీనియర్ సంగీత విద్వాంసుడు సదా మాస్టర్ కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. ఎస్. సదానందం అలియాస్ సదా మాస్టర్ దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ప్రముఖ గిటార్ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం కుమారుడైన ఆయన.. చిన్నప్పటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగారు. ఇళయరాజా సంగీత బృందంలో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రధాన గిటారిస్ట్‌గా పనిచేశారు. ఇళయరాజా సంగీత దర్శకుడిగా పరిచయమైన ‘అన్నకిళి’ సినిమా నుంచి ఆయనతో కలిసి ప్రయాణించారు. అలా వేలాది పాటలకు తన గిటార్ సంగీతాన్ని అందించారు. ఎన్నో పాటల్లో ప్రారంభ సంగీతం, మధ్యలో వచ్చే వాయిద్యాల బిట్స్‌ ప్రత్యేకంగా వినిపించడానికి సదా మాస్టర్ వంటి కళాకారుల ప్రతిభ కూడా ఒక కారణం. తనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేసిన సదా మాస్టర్ మరణవార్తపై ఇళయరాజా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తన తొలి రోజుల నుంచే తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తనతో కలిసి జీవించినవారిని, తన జీవితంలో అంతర్భాగమైనవారిని మరణించినవారిగా చూడలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు. సదానందం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.  ఇది కూడా చదవండి: బాలయ్య vs మంచు మనోజ్.. క్లైమాక్స్‌కు వచ్చేసిన ‘దాదా’.!       [Guitarist Sada Master Passed Away, Ilaiyaraaja Guitarist Sada Master, Sada Master Passes Away, Ilaiyaraaja Guitarist, Ilaiyaraaja Music Team, Sadanandam Guitarist, Ilaiyaraaja, Sada Master]  
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు విమాన ప్రయాణంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా అభిమానులతో సరదాగా మాట్లాడటం, వారితో ఫొటోలు దిగడం ఇష్టపడే కీర్తికి.. ఓ వ్యక్తి ప్రవర్తన ఇబ్బందికరంగా మారింది. మిలన్‌ నుంచి ఇండియాకు తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కీర్తి సురేష్‌ ప్రయాణిస్తున్న విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. సరిగా నిలబడలేని స్థితిలో ఉన్న అతను తనతో సెల్ఫీ దిగాలని పట్టుబట్టాడు. అయితే, ఆ సమయంలో ఫొటో దిగడం సాధ్యం కాదని, కొద్దిసేపటి తర్వాత దిగుదామని కీర్తి చెప్పింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆమె మాటలను పట్టించుకోకుండా వెంటనే సెల్ఫీ కావాలని ఒత్తిడి చేశాడు. దీంతో కీర్తి అతనికి గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. తన తరఫున నిర్ణయం తీసుకునే హక్కు అతనికి లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీర్తి భర్త ఆంటోనీ తట్టిల్‌ కూడా ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం. సాధారణంగా అభిమానులతో ఎంతో సౌమ్యంగా ఉండే తన భర్త గొంతు పెంచి మాట్లాడటం తాను మొదటిసారి చూశానని కీర్తి చెప్పింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు విమాన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. సెలబ్రిటీలైనా సరే, తమ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఈ సంఘటన ద్వారా ఆమె చెప్పకనే చెప్పారు. అయితే, విమాన ప్రయాణాల్లో అభిమానులందరి వల్ల ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని కీర్తి అనడం లేదు. చాలామంది ఎంతో మర్యాదగా మాట్లాడతారని, కొందరైతే ఫొటో కూడా అడగకుండా ప్రయాణమంతా సరదాగా కబుర్లు చెబుతుంటారని ఆమె వివరించింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలను తాను గౌరవిస్తానని, అయితే ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు మాత్రం ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలనుకోవడం తప్పు కాకపోయినా, వారి ఇష్టాయిష్టాలను, వ్యక్తిగత పరిధిని గౌరవించడం ముఖ్యమనే విషయం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.     [Keerthy Suresh, Keerthy Suresh Flight Incident, Keerthy Suresh Husband Antony Thattil, Keerthy Suresh Interview, Keerthy Suresh Latest News, Celebrity Fan Incident, Keerthy Suresh Selfie Incident]
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దాదా’. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 80ల నాటి ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మధ్యలో బాలయ్య గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయన కోలుకుని తిరిగి సెట్స్‌లోకి రావడంతో సినిమా పనులు వేగం పుంజుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ‘దాదా’ క్లైమాక్స్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు టాక్. ‘దాదా’లో బాలకృష్ణ లుక్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. రెట్రో గెటప్‌లో, గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో ఆయన కనిపించనున్నారు. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలపై అంచనాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘వారణాసి’ వాయిదా పడుతుందా?.. క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్.!       [Dada Movie Climax Shoot, Balakrishna vs Manchu Manoj, Dada Movie, Nandamuri Balakrishna, Gopichand Malineni, Manchu Manoj, Kajal Aggarwal, Telugu Film News]  
‘అర్జున్ రెడ్డి’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. ఇప్పటివరకు నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు చేసిన ఆయన.. ఇక మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘హుషారు-2’ సినిమా పూర్తయిన వెంటనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాహుల్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాహుల్ తెరకెక్కించబోయే ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తానని తెలిపారు. అయితే ఈ సినిమాలో మరో నటుడు ప్రియదర్శి హీరోగా నటించనున్నట్లు రాహుల్ స్పష్టం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నటుడిగా తనకు ఎక్కువగా హీరో స్నేహితుడి పాత్రలే వస్తున్నాయని, అలాంటి పాత్రలను పదేపదే చేయడం బోర్‌ కొట్టిందని రాహుల్ చెప్పారు. అందుకే కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ‘అర్జున్ రెడ్డి’లో శివ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. ‘జాతిరత్నాలు’తో పాటు పలు సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగానూ తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి కథను ఎంచుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, రాహుల్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించనున్నారనే విషయం ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే కామెడీ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం విశేషం. రాహుల్ తనదైన హాస్యాన్ని కథలో ఎలా మేళవిస్తారు? ప్రియదర్శిని హీరోగా ఎలా చూపించబోతున్నారు? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ‘హుషారు-2’లో నటిస్తున్న రాహుల్.. ఆ సినిమా తర్వాత దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.   [Rahul Ramakrishna, Priyadarshi, Rahul Ramakrishna Director, Priyadarshi New Movie, Husharu 2, Telugu Cinema News, Rahul Ramakrishna Directorial Debut, Telugu Comedy Movies]
తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారా? గత కొంతకాలంగా తమిళనాట వినిపిస్తున్న ఈ ఊహాగానాలు ఇప్పుడు మరింత పెరిగాయి. తాజాగా ఆయన తన అభిమాన సంఘం ద్వారా చేపట్టబోతున్న ఓ విద్యా కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచితంగా ఏసీ ట్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ధనుష్‌ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన రాజకీయ ఆరంగేట్రానికి ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారనే చర్చ మొదలైంది. ధనుష్‌ తన ‘ధనుష్‌ నార్పని ఇయక్కం’ (ధనుష్‌ సంక్షేమ ఉద్యమం) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. 2027 జనవరి నుంచి ‘స్మార్ట్‌ స్టడీ హబ్స్‌’ పేరుతో ఈ కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్‌ చెప్పించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఒక్కో కేంద్రంలో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఒక సహాయకుడిని నియమించనున్నారు. వీరికి సంబంధించిన జీతభత్యాలను కూడా ధనుష్‌ సంక్షేమ సంస్థే భరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధనుష్‌ తన అభిమాన సంఘాలను సంక్షేమ కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. ఇటీవల చెన్నైలో సుమారు 3,000 మంది మహిళా సభ్యులతో నిర్వహించిన సమావేశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అభిమాన సంఘాలను ప్రజలకు సేవ చేసే సంస్థలుగా మార్చడం, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం వంటి పరిణామాలను పరిశీలిస్తే.. ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో విజయ్‌ కూడా అభిమాన సంఘాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ధనుష్‌ విషయంలోనూ అలాంటి పోలికలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ధనుష్‌ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని నమోదు చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఉచిత ట్యూషన్‌ సెంటర్ల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా భావిస్తున్నప్పటికీ, వాటి ఆధారంగా ధనుష్‌ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేం. మరి ఈ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యే ధనుష్‌.. భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.     [Dhanush Political Entry, Dhanush Politics, Dhanush Narpani Iyakkam, Smart Study Hubs, Dhanush Free Tuition Centres, Tamil Nadu Politics, Dhanush Political Party, Dhanush Latest News]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్‌కు ‘వారణాసి’ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. వారణాసి వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. నిర్మాతలు ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న తప్పకుండా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. విడుదల తేదీలో మార్పు లేదా అని మరోసారి అడగ్గా.. అవును, కచ్చితంగా అదే రోజున విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు. రాజమౌళి సినిమా అంటేనే విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ‘వారణాసి’ని అంతకుమించిన స్థాయిలో రూపొందిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి భారీ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. అయితే విజయేంద్ర ప్రసాద్ తాజా వ్యాఖ్యలతో ఈ అనుమానాలకు సమాధానం లభించినట్లయింది. ‘వారణాసి’లో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, పురాణ అంశాలు, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇది కూడా చదవండి: రామాయణ రిలీజ్.. పాకిస్థాన్‌లో రియాక్షన్ ఎలా ఉందంటే.? https://x.com/Theteluguone/status/2115782861051830718       [Varanasi Postponement Rumours, Varanasi Release Date, Vijayendra Prasad, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Telugu Film News]  
మన సమాజంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో మొహమాటం ఒకటి. ఎదుటివారు ఏది అడిగినా, ఏ పని చెప్పినా కాదనలేక, మనసులో ఇష్టం లేకపోయినా సరే.. పైకి తల ఊపే అలవాటు చాలామందికి ఉంటుంది. అవతలివారు ఎక్కడ బాధపడతారో, ఎక్కడ తమపై చెడు అభిప్రాయం ఏర్పడుతుందో అనే భయంతో ప్రతీదానికీ అవును అని చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలను, మనశ్శాంతి లేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల మన సొంత లక్ష్యాలు, ఆత్మగౌరవంతో పాటు సమయం కూడా వృథా అవుతాయి. జీవితంలో విజయం సాధించాలన్నా, సమాజంలో గౌరవంగా బతకాలన్నా కొన్ని పరిస్థితుల్లో నిర్మొహమాటంగా కాదు అని చెప్పడం చాలా అవసరం. గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్త్వవేత్త అయిన ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా వివరించారు. మంచికి కూడా ఒక హద్దు ఉంటుందని, అందరికీ అన్నింటికీ అవును అని చెప్పడం వల్ల జీవితం  నాశనమవుతుందని ఆయన తెలిపారు. ఏ ఏ సమయాల్లో ధైర్యంగా కాదని  చెప్పాలో చాణక్యుడు తెలిపాడు.  ఆ విషయాలేంటో,  అలాంటి పరిస్థితులలో కాదని చెప్పడం వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. తప్పుడు పనులు లేదా అన్యాయం జరుగుతున్నప్పుడు.. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా తప్పు పని చేయమని ప్రేరేపిస్తున్నప్పుడు లేదా అన్యాయపు పనులు చేయానికి సహాయపడమని  ఒత్తిడి తెస్తున్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే కాదు అని చెప్పాలి. ఎవరి ఒత్తిడికో లొంగిపోయి తప్పు పనికి సహకరించినట్లయితే, ఆ తప్పు చేసిన వారితో సమానంగా మనమూ బాధ్యులమవుతాము. ఇతరుల ప్రభావంతో తప్పుడు మార్గంలోకి వెళ్లడం జీవితంలో పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. అబద్ధాలు చెప్పాల్సి వచ్చినప్పుడు.. సరదాకి కూడా అబద్ధాలు చెప్పడం మంచిది కాదు. ఎవరైనా తమ స్వార్థం కోసం మిమ్మల్ని అబద్ధం చెప్పమని అడిగితే, నిర్భయంగా కాదనాలి. అబద్ధానికి తోడుగా ఉండటం అంటే ఒక రకమైన నేరంలో భాగస్వామి కావడమే అవుతుంది. అబద్ధాన్ని సమర్థించడం లేదా దానికి సహకరించడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. దొంగతనం లేదా అక్రమార్జన.. దొంగతనం లేదా అక్రమ మార్గాల్లో లాభం పొందే సలహాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎలాంటి చిన్న దొంగతనానికైనా లేదా అక్రమ సంపాదనకు సహకరించమని ఎవరైనా కోరితే వెంటనే వద్దని చెప్పాలి. అక్రమ మార్గాల్లో సంపాదించే ధనం లేదా పొందే లాభం ఎప్పటికైనా పతనానికే కారణమవుతుంది. ఇందులో భాగస్వామి అయినవారు తమ జీవితాన్ని తామే స్వయంగా నాశనం చేసుకున్నట్లవుతుంది. స్వార్థపరుల దగ్గర.. ఇతరులు స్వార్థంతో మిమ్మల్ని వాడుకుంటున్నారని అనిపించినప్పుడు నో చెప్పడం నేర్చుకోవాలి. సమాజంలో కొందరు వ్యక్తులు కేవలం తమ పనులు జరగాలనే ఆలోచనతో మాత్రమే మన మంచి తనాన్ని వాడుకుంటూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి, అలాంటి వారికి దూరంగా ఉండాలి. మిమ్మల్ని ఆయుధంగా వాడుకునే వారికి పదే పదే అవును అని చెప్పడం వల్ల మీ విలువ తగ్గడమే కాకుండా, మిమ్మల్ని చులకనగా చూసే అవకాశం ఉంది. సామర్థ్యానికి మించిన, అనవసరమైన బాధ్యతలలో.. ఎవరైనా అనవసరమైన లేదా  సామర్థ్యానికి మించిన బాధ్యతలను మోపినప్పుడు కాదని చెప్పాలి. మీ పరిధిలో లేని, మీకు ఏమాత్రం కుదరని లేదా ఇష్టం లేని పనులను ఇతరులు మీపై రుద్దాలని చూస్తే వెంటనే నైస్‌గా కాదని చెప్పడం శ్రేయస్కరం. బాధ్యతారాహిత్యంగా ఉన్నవారి పనులను నెత్తిన వేసుకోవడం వల్ల మీ సొంత పనులు దెబ్బతింటాయి, ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి జీవితంలో మొహమాటానికి పోయి ప్రతీదానికీ తల ఊపడం చాలా పెద్ద తప్పు. అవసరమైన చోట సరైన సమయంలో కాదు అని చెప్పడం వ్యతిరేకంగా మాట్లాడటం లేదా ఎదుటివారిని నొప్పించడం  కాదు, అది మీ ఆత్మగౌరవాన్ని, సమయాన్ని , భవిష్యత్తును కాపాడుకునే ఒక గొప్ప విచక్షణ. చాణక్యుడి ఈ నీతి సూత్రాలను పాటించడం ద్వారా జీవితంలో అనవసరమైన చిక్కుల నుంచి బయటపడి సాఫీగా విజయం వైపు సాగిపోవచ్చు.                             *రూపశ్రీ
మనలో చాలామందికి ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్లు రాసిచ్చిన మందులను వేసుకోవడం సర్వసాధారణం. అయితే, కొన్నిసార్లు హడావుడిగా లేదా నీరు తాగడం ఇష్టం లేక కొందరు కేవలం ఒక గుక్క నీటితో లేదా నీరు లేకుండానే నేరుగా మాత్రలు మింగుతుంటారు. కానీ, ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతటి ప్రమాదకరమో చాలామందికి తెలియదు. మాత్రలు మింగేటప్పుడు తగినంత నీటితో తీసుకోకపోతే జరిగే తీవ్రమైన నష్టాలు ఏమిటి? వైద్యులు ఇస్తున్న హెచ్చరికలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం. మనం ఏదైనా టాబ్లెట్ లేదా క్యాప్సూల్ తీసుకున్నప్పుడు అది గొంతు దాటి సులభంగా కడుపులోకి చేరాలి. అయితే తగినన్ని నీరు తాగకపోతే, ఆ మాత్ర నేరుగా కిందికి వెళ్లకుండా గొంతులో లేదా ఆహార నాళ మార్గంలోనే అతుక్కుపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, మరియు క్యాల్షియం మాత్రలు ఇలా గొంతులో లేదా ఆహార నాళంలో నిలిచిపోయినప్పుడు, వాటి రసాయన ధర్మాల వల్ల ఆహార నాళం పొరల్లో తీవ్రమైన మంట, చికాకు, వాపు, చివరికి పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తగినంత నీరు లేకపోవడం వల్ల మందులు జీర్ణకోశంలో సరిగ్గా కరిగి, శరీరంలో శోషించబడే ప్రక్రియ కూడా తీవ్రంగా మందగిస్తుంది. దీనివల్ల ఆ మందులు పూర్తి స్థాయిలో పనిచేయకపోగా, ఆ వ్యాధి నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాకుండా, వృద్ధులలో, మింగేయడంలో ఇబ్బంది ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారవచ్చు. అందువల్ల వైద్యులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను సూచిస్తున్నారు. డాక్టర్ ప్రత్యేకంగా పరిమితం చేయకపోతే, ప్రతిసారీ మాత్రలు వేసుకునేటప్పుడు ఒక పెద్ద గ్లాసు నిండా సాధారణ నీటిని తాగడం చాలా ముఖ్యం. మాత్ర లేదా క్యాప్సూల్ వేసుకున్న వెంటనే పడుకోవడం పూర్తిగా మానుకోవాలి. మందులు సులభంగా కడుపులోకి చేరేలా కనీసం కొద్దిసేపు నిలబడటం లేదా కూర్చోవడం చాలా మంచిది. మింగడానికి కష్టంగా ఉందని చాలామంది మందులను పొడిగా చేయడం లేదా ముక్కలుగా చేయడం చేస్తుంటారు. ఇది మందుల పనితీరును మరియు మోతాదు ప్రభావాన్ని పూర్తిగా మార్చివేస్తుంది కాబట్టి వైద్యుల సలహా లేకుండా అలా చేయడం సురక్షితం కాదు. మీకు గొంతులో ఏదైనా అడ్డు పడినట్లుగా అనిపించినా లేదా మింగేటప్పుడు తీవ్రమైన నొప్పి ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.     Swallowing Pills With Little Water, Medication Safety Tips, Side Effects Of Taking Tablets Dry, Esophageal Pill Injury, Doctor Warning On Water Intake, Health Risks Of Bad Habits, Proper Way To Take Medicines.  
క్యాన్సర్ అనే పేరు వినగానే ప్రతి ఒక్కరి మనసులో మొదట మెదిలే ఆలోచన సర్జరీ లేదా ఆపరేషన్. క్యాన్సర్ చికిత్సకు సర్జరీ అత్యంత కీలకమైన భాగమే అయినప్పటికీ, నేడు వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల కారణంగా అన్ని రకాల క్యాన్సర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో, రేడియేషన్ థెరపీ మరియు రేడియోసర్జరీ వంటి అత్యాధునిక పద్ధతుల ద్వారా ఎలాంటి చీరా లేదా కోతలు లేకుండానే క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా తొలగించడం సాధ్యమవుతోంది. ఇది రోగులకు శస్త్రచికిత్స భయాల నుంచి పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. రేడియేషన్ థెరపీలో శక్తివంతమైన హై ఎనర్జీ కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయడం లేదా వాటి వృద్ధిని పూర్తిగా అడ్డుకోవడం జరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లకు ఇదే ప్రధాన చికిత్సగా ఉపయోగపడుతుండగా, మరికొన్ని సందర్భాల్లో కీమోథెరపీ లేదా సర్జరీతో కలిపి దీనిని అందిస్తారు. ముఖ్యంగా IMRT (ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ), IGRT (ఇమేజ్  గైడెడ్ రేడియేషన్ థెరపీ) వంటి అధునాతన సాంకేతికతలతో ట్యూమర్‌ను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోవచ్చు. దీనివల్ల క్యాన్సర్ కణాలపై మాత్రమే ప్రభావం పడి, చుట్టూ ఉండే ఆరోగ్యకరమైన కణజాలాలకు అతి తక్కువ నష్టం వాటిల్లుతుంది. ఈ ఆధునిక చికిత్సల్లో  ఆన్‌లైన్ అడాప్టివ్ రేడియోథెరపీ  మరింత విప్లవాత్మకమైనదిగా నిలుస్తోంది. రోగి రోజువారీ శారీరక స్థితికి అనుగుణంగా చికిత్స ప్రణాళికను ఎప్పటికప్పుడు మార్చుకునే వెసులుబాటును ఈ టెక్నాలజీ అందిస్తుంది. చికిత్స సమయంలో ట్యూమర్ పరిమాణంలో లేదా ఆకారంలో మార్పులు జరిగితే, ప్రతి సెషన్‌కు ముందు తీసే ఇమేజింగ్ స్కానింగ్ ఆధారంగా వైద్యులు రేడియేషన్ ప్లాన్‌లో తక్షణ మార్పులు చేస్తారు. ఇది సున్నితమైన అవయవాలను సురక్షితంగా రక్షించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక  రేడియోసర్జరీ  విషయానికి వస్తే, పేరులో సర్జరీ ఉన్నప్పటికీ ఇందులో ఎలాంటి కోతలు లేదా చీల్చడం ఉండదు. ఇది ఒక ప్రత్యేకమైన మరియు అత్యంత ప్రభావవంతమైన రేడియేషన్ టెక్నిక్. దీనిలో భాగంగా హై డోస్ రేడియేషన్‌ను నేరుగా ట్యూమర్‌పై ప్రయోగిస్తారు. మెదడులోని కొన్ని రకాల గడ్డల కోసం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీని ఉపయోగిస్తే, ఊపిరితిత్తులు మరియు కాలేయం వంటి సున్నితమైన భాగాలకు స్టీరియోటాక్టిక్ బాడీ రేడియోథెరపీని వాడతారు. ఈ పద్ధతి ద్వారా చాలా తక్కువ సెషన్లలోనే చికిత్స పూర్తవుతుంది. అయితే, ఈ అత్యాధునిక పద్ధతులన్నీ ప్రతి రోగికి మరియు అన్ని రకాల క్యాన్సర్లకు సరిపోవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్యూమర్ పరిమాణం, అది శరీరం ఏ భాగంలో ఉంది, మరియు రోగి మొత్తం ఆరోగ్య పరిస్థితిని బట్టి నిపుణులైన ఆంకాలజిస్ట్ సరైన చికిత్స విధానాన్ని నిర్ణయిస్తారు. క్యాన్సర్ చికిత్సలో ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకుండా, వైద్యుల పర్యవేక్షణలో తగిన పద్ధతిని ఎంచుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.     Cancer Treatment Without Surgery, Radiation Therapy Benefits, Incision Free Cancer Care, Oncology Treatments, Surgery Vs Radiation, Modern Cancer Healing, Advanced Medical Care.  
కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం వల్ల నడుము నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మంట వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమస్యలకు పిండికూర (కొండపిండి) ఉపయోగపడుతుందని చాలామంది చెబుతుంటారు. మరి పిండికూరలో ఉండే ఔషధ గుణాలు ఏమిటి? కిడ్నీలో రాళ్లు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యల విషయంలో ఈ ఆకు పాత్ర ఏమిటి? కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది నిజంగా సహాయపడుతుందా? ఈ వీడియోలో యునాని వైద్య నిపుణులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య గారు పిండికూర (Konda Pindi) గురించి వివరించారు. Erva lanata అనే శాస్త్రీయ నామంతో గుర్తించే ఈ మొక్కను సంప్రదాయ వైద్యంలో ఎలా ఉపయోగిస్తారు? మూత్ర వ్యవస్థకు సంబంధించి ఈ ఆకుకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? కిడ్నీల ఆరోగ్యానికి సంబంధించి పిండికూర గురించి ప్రచారంలో ఉన్న విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి? వాటి పరిమాణం, రకం, స్థానం ఆధారంగా చికిత్స ఎలా మారుతుంది? పిండికూర కిడ్నీలో రాళ్ల సమస్యలో ఏ విధంగా ఉపయోగపడుతుందని సంప్రదాయ వైద్యంలో భావిస్తారు? అలాగే గాల్‌స్టోన్స్ (Gallstones) అని పిలిచే పిత్తాశయ రాళ్లకు, మూత్ర సంబంధిత సమస్యలకు ఈ మొక్కకు ఉన్న సంబంధం గురించి డాక్టర్ వివరాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, కిడ్నీల పనితీరును అంచనా వేయడంలో ముఖ్యమైన GFR (Glomerular Filtration Rate) అంటే ఏమిటి? కిడ్నీలు రక్తాన్ని ఎంత సమర్థంగా వడపోస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఎందుకు ఉపయోగపడుతుంది? GFR విలువలు కిడ్నీల ఆరోగ్యం గురించి ఎలాంటి సమాచారాన్ని అందిస్తాయి? అనే ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో వివరించారు. పిండికూర వంటి ఆకులను సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే విధానాల గురించి తెలుసుకోవడంతో పాటు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా ఎందుకు తీసుకోవాలి? అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పిండికూర కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని నిర్ధారించే బలమైన వైద్య ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. కాబట్టి కిడ్నీ రాళ్ల చికిత్సకు బదులుగా దీనిని ఉపయోగించకూడదు. వైద్యుల సూచన లేకుండా మందులను ఆపడం లేదా మూలికా చికిత్సను ప్రారంభించడం మంచిది కాదు. కిడ్నీలో రాళ్లు, పిత్తాశయ రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలు, GFR విలువలు, పిండికూర సంప్రదాయ ఉపయోగాల గురించి మరింత తెలుసుకోవడానికి డాక్టర్ ఎస్.జి.వి. సత్య గారి ఈ వీడియోను చూడండి.
పక్షవాతం (స్ట్రోక్) అనేది అత్యంత ప్రమాదకరమైన వైద్య అత్యవసర పరిస్థితి. మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ నిలిచిపోవడం లేదా రక్తనాళం పగిలి రక్తస్రావం కావడం వల్ల ఇది సంభవిస్తుంది. తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల మెదడు కణాలు కొన్ని నిమిషాల్లోనే దెబ్బతినడం మొదలవుతాయి. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సూరిశెట్టి మరియు అత్యవసర వైద్య నిపుణులు డాక్టర్ నిఖిల్ వంగపల్లి తెలిపిన వివరాల ప్రకారం, పక్షవాతం వచ్చిన తొలి ఐదు నిమిషాలు ఇంట్లోనే చికిత్స చేయడానికి ప్రయత్నించకుండా, తక్షణమే అత్యవసర వైద్య సహాయం కోరడం మరియు రోగిని సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రపంచ స్ట్రోక్ సంస్థ (World Stroke Organization) మరియు వరల్డ్ స్ట్రోక్ డే ప్రచారాల ప్రకారం, ఈ సమయంలో ప్రతి నిమిషం చాలా అమూల్యమైనది. పక్షవాతం లక్షణాలను గుర్తించడానికి  BE FAST  పరీక్ష ఎంతగానో సహాయపడుతుంది.  B  అంటే బ్యాలెన్స్ (నడకలో లేదా సమన్వయంలో అకస్మాత్తుగా ఇబ్బంది కలగడం), E  అంటే ఐస్ (ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మందగించడం లేదా కోల్పోవడం),  F  అంటే ఫేస్ (నవ్వుతున్నప్పుడు ముఖం ఒకవైపుకు వంగిపోవడం),  A  అంటే ఆర్మ్స్ (రెండు చేతుల్లో ఏదో ఒక చేతిలో బలహీనత లేదా కిందికి జారడం),  S  అంటే స్పీచ్ (మాట తడబడటం లేదా వింతగా మాట్లాడటం), మరియు  T అంటే టైమ్ (ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అత్యవసర సేవలకి కాల్ చేయడం). ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌కు కాల్ చేయాలి. భారతదేశంలో 112 నంబర్‌కు డయల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు. అలాగే, రోగి లక్షణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో కచ్చితమైన సమయాన్ని గమనించడం వైద్యులకు అత్యంత కీలకం. ఒకవేళ ఎవరూ గమనించకపోతే, ఆ వ్యక్తి చివరిసారిగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నారో గుర్తుంచుకోవాలి. రోగిని సురక్షితమైన ప్రదేశంలో కూర్చోబెట్టడం లేదా పడుకోబెట్టడం చేయాలి. అనవసరమైన కదలికలను నివారించి, వైద్యులు వచ్చే వరకు వారి దగ్గరే ఉండాలి. ముఖ్యంగా, రోగికి నోటి ద్వారా ఎలాంటి ఆహారం, నీరు, మాత్రలు లేదా ఇంటి చిట్కాలు ఇవ్వకూడదు. పక్షవాతం మింగే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, దీనివల్ల ఊపిరితిత్తులలోకి ఆహారం వెళ్లి ఊపిరి ఆడకుండా పోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు లక్షణాలు కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోయి సాధారణ స్థితికి రావచ్చు. అయితే, దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది తాత్కాలిక ఇస్కీమిక్ అటాక్ (TIA) అనబడే  మినీ స్ట్రోక్  కావచ్చని, భవిష్యత్తులో వచ్చే పెద్ద స్ట్రోక్‌కు ఇది హెచ్చరిక అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలు అదృశ్యమైనప్పటికీ వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. అదనంగా, బ్లీడింగ్ స్ట్రోక్ ప్రమాదం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పిరిన్ (Aspirin) వంటి మందులను సొంతంగా ఇవ్వకూడదు. ప్రతి నిమిషం విలువైన ఈ ప్రాణాపాయ స్థితిలో, సరైన సమయంలో తీసుకునే వేగవంతమైన నిర్ణయాలే రోగి ప్రాణాలను మరియు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.     stroke first aid first 5 minutes, be fast stroke symptoms, what to do during a stroke emergency, doctor advice on stroke care, common mistakes during stroke attack, stroke warning signs and symptoms, emergency brain stroke treatment tips.