తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? గత కొంతకాలంగా తమిళనాట వినిపిస్తున్న ఈ ఊహాగానాలు ఇప్పుడు మరింత పెరిగాయి. తాజాగా ఆయన తన అభిమాన సంఘం ద్వారా చేపట్టబోతున్న ఓ విద్యా కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచితంగా ఏసీ ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ధనుష్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన రాజకీయ ఆరంగేట్రానికి ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారనే చర్చ మొదలైంది.
ధనుష్ తన ‘ధనుష్ నార్పని ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. 2027 జనవరి నుంచి ‘స్మార్ట్ స్టడీ హబ్స్’ పేరుతో ఈ కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఒక్కో కేంద్రంలో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఒక సహాయకుడిని నియమించనున్నారు. వీరికి సంబంధించిన జీతభత్యాలను కూడా ధనుష్ సంక్షేమ సంస్థే భరించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ధనుష్ తన అభిమాన సంఘాలను సంక్షేమ కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. ఇటీవల చెన్నైలో సుమారు 3,000 మంది మహిళా సభ్యులతో నిర్వహించిన సమావేశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అభిమాన సంఘాలను ప్రజలకు సేవ చేసే సంస్థలుగా మార్చడం, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం వంటి పరిణామాలను పరిశీలిస్తే.. ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో విజయ్ కూడా అభిమాన సంఘాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ధనుష్ విషయంలోనూ అలాంటి పోలికలు కనిపిస్తున్నాయి.
మరోవైపు, ధనుష్ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని నమోదు చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఉచిత ట్యూషన్ సెంటర్ల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా భావిస్తున్నప్పటికీ, వాటి ఆధారంగా ధనుష్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేం. మరి ఈ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యే ధనుష్.. భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
[Dhanush Political Entry, Dhanush Politics, Dhanush Narpani Iyakkam, Smart Study Hubs, Dhanush Free Tuition Centres, Tamil Nadu Politics, Dhanush Political Party, Dhanush Latest News]





