వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మొక్కజొన్నలో అనేక ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్య పరంగా చూసినా మొక్కజొన్న చాలా మంచిది. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది, కాబట్టి మొక్కజొన్నను సరైన పద్ధతిలో , సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం కొందరికి ఆరోగ్యపరంగా మేలు చేస్తే.. మరికొందరికి హాని కూడా కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు, మొక్కజొన్న తినడంలో పాటించాల్సిన జాగ్రత్తలు , మొక్కజొన్న తినడానికి సేఫ్ మార్గం.. ఇలా అన్ని విషయాలు తెలుసుకుంటే..
వర్షాకాలంలో మొక్కజొన్న..
ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది , ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మొక్కజొన్నలోని రెసిస్టెంట్ స్టార్చ్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం , బి విటమిన్లు కూడా శక్తిని అందించడానికి , శరీరంలో జరిగే క్రియలను నిర్వహించడానికి తగిన శక్తి అందిస్తుంది. అందుకే వాతావరణ పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి చాలామంచిది.
అసిడిటి, గ్యాస్, ఉబ్బరం సమస్యలుంటే..
గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి, ఉడికించిన మొక్కజొన్న మంచిది. ఉడికించిన మొక్కజొన్న మృదువుగా ఉండి, సులభంగా జీర్ణమవుతుంది. అయితే, దీనిని ఎక్కువ సేపు ఉడికించడం వల్ల దానిలోని కొన్ని పోషకాలు , రెసిస్టెంట్ స్టార్చ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ఐబియస్ ఉన్న వ్యక్తులకు..
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉంటే, మొదట్లో దీనిని అర కంకికి, అంటే సుమారు 35–40 గ్రాములకు పరిమితం చేసుకుని తినడం మంచిది. ఎక్కువ మొత్తంలో స్వీట్ కార్న్ లేదా నార్మల్ కార్న్ తినడం వల్ల కొంతమందిలో గ్యాస్ , ఉబ్బరం పెరగవచ్చు.
మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత..
మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఉడకబెట్టిన లేదా ఆవిరి మీద ఉడికించిన మొక్కజొన్న మంచిదిగా. దీని గ్లైసెమిక్ ఇండెక్స్, వేయించిన మొక్కజొన్న కంటే తక్కువగా ఉంటుంది. ఒకసారికి అర కప్పు ఉడికించిన మొక్కజొన్న లేదా ఒక చిన్న మొక్కజొన్న కంకి సరిపోతుంది.
మొక్కజొన్నలో ల్యూటిన్ , జీక్సాంథిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. మొక్కజొన్నను కొద్దిగా ఆవిరి మీద ఉడికించడం వల్ల ఈ పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుతాయి.
మొక్కజొన్న తినేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు..
మొక్కజొన్నపై అధికంగా వెన్న, చీజ్ లేదా ఉప్పు వేసుకుని తినకూడదు. అసిడిటీ సమస్యలు ఉంటే, మసాలాలు , నిమ్మరసం వాడకాన్ని తగ్గించాలి. మాడిపోయిన లేదా బాగా వేయించిన మొక్కజొన్నను తినడం మానుకోవాలి. ఎల్లప్పుడూ తాజాగా, బాగా ఉడికించిన మొక్కజొన్నను తినడం మంచిది. మొక్కజొన్నను బాలెన్స్డ్ గా తీసుకోవడం మంచిది. అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.