ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించుకునేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు.  ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే దిశగా బాబు, పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.   తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. పొదుపు చర్యలలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ తన వాహన శ్రేణిని కుదించాలని ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు అదే దారిని ఎంచుకోవడం గమనార్హం.  సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే..  దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా..  ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని  భావించిన సీఎం, డిప్యూటీ సీఎం..  ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.  వీరు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక   పొదుపు వ్యూహం కనిపిస్తోంది. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో, పై స్థాయి నుండి పొదుపు చర్యలు ప్రారంభం కావాలని  భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా నెలకు లక్షల రూపాయల ఇంధన ఖర్చు ఆదా కావడమే కాకుండా, నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  ప్రజా ప్రతినిధులు,  ఉన్నతాధికారులు అనవసర ఆడంబరాలకు పోకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న బలమైన సందేహాన్ని కూడా వీరి నిర్ణయంతో ఇచ్చారని చెప్పాలి.  గతంలో కూడా చంద్రబాబు తన పర్యటనల సమయంలో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదని ట్రాఫిక్ ఆంక్షలను తగ్గించాలని ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా తన కాన్వాయ్‌పైనే నియంత్రణ విధించడం చర్చనీయాంశంగా మారింది. 
తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నేపధ్యంలో బీఆర్ఎస్ విమర్శల దాడి ఉధృతం చేసింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య సీక్రెట్ బంధం ఉందంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు   ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   సంచలన వ్యాఖ్యలు చేశారు.   తీవ్రమైన పోక్సో   కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి.   మైనర్ బాలికపై జరిగిన అకృత్యానికి సంబంధించిన కేసులో నిందితులకు కొమ్ముకాసేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి  ప్రభుత్వం,  బీజేపీ అగ్రనేత బండి సంజయ్ మధ్య ఉన్నరహస్య పొత్తు కారణంగానే  ఈ కేసులో సాక్ష్యాధారాలు తారుమారయ్యాయ ఆరోపించారు.  రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నారుల భద్రతను కూడా ఫణంగా పెడుతున్నారని విమర్శించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో బాధితులకు అండగా ఉండాల్సిన పాలకులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. మంగళవారం అమరావతిలో బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్  యూనివర్శిటీ (బిసెర్ ) నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి భవిష్యత్తుపై తనకున్న విజన్‌ను పంచుకున్నారు.  పాతిక ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. కేవలం వైద్య సేవలే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ కి ఈ సంస్థ పెద్దపీట వేయనుంది. రానున్న రోజుల్లో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చి..  వారిని అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మెడికల్, పారామెడికల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచానికి నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు.  అలాగే.. ఈ ప్రాజెక్టు గడువుపై స్పష్టమైన చంద్రబాబు నిర్దిష్ట గడువు నిర్దేశించారు.  వచ్చే ఏడాది మే నాటికి ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవం చేయాలని  యాజమాన్యాన్ని కోరారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల అనుమతులు  ఆటో పైలట్  మోడ్‌లో వేగంగా మంజూరు చేస్తామని,ఇన్వెస్టర్లు  పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.  గతంలో తాను హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ,  హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ..  అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు  చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్, క్వాంటం వ్యాలీ వంటి ప్రాజెక్టులతో అమరావతి అంతర్జాతీయ పటంలో నిలుస్తుందన్నారు.  రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతుల కలలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు భవిష్యత్తులో ఈ నగరం ద్వారా అత్యధిక లాభం చేకూరుతుందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని చంద్రబాబు అన్నారు.   రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్,  నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చులు తగ్గించడమే కాకుండా..  పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. యువత కేవలం ఉద్యోగాల కోసం చూడకుండా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. అమరావతి గడ్డపై బిసెర్ వంటి విద్యా, వైద్య సంస్థలు రావడం శుభపరిణామమన్న సీఎం చంద్రబాబు.. ఈ ప్రాజెక్టు ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా..  రాజధాని ప్రాంతం ఒక మెడికల్ టూరిజం హబ్‌గా మారుతుందని చెప్పారు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
ALSO ON TELUGUONE N E W S
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, మహేష్ బాబు అన్న కుమారుడిగా టాలీవుడ్ వెండితెరపై అరంగేట్రం చేస్తున్న జయకృష్ణ ఘట్టమనేని తన మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘మంగా మంగా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటగా విడుదలైన ‘మంగా మంగా’ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. నేషనల్ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ట్యూన్స్ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాట విడుదలైన అతి తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకోవడం విశేషం. పాటలో జయకృష్ణ స్టైలిష్ లుక్స్ మరియు హీరోయిన్ రాషా తడాని మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. రవీనా టాండన్ కుమార్తెగా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన రాషా, ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. వీళ్ళిద్దరి జోడీ చూడముచ్చటగా ఉందని, అజయ్ భూపతి తన మార్క్ వైలెంట్ రొమాంటిక్ డ్రామాతో మరో హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి గతంలో ‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త వారసుడిని పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగాపురం’ను రూపొందించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘అలెల్లే అలెల్లే’ చార్ట్‌బస్టర్‌గా నిలవగా, ఇప్పుడు ఈ రెండో సాంగ్ కూడా అదే జోరును కొనసాగిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ‘మంగా మంగా’ పాటను లాంచ్ చేయడం విశేషం. ఎల్.వి. రేవంత్ తనదైన శైలిలో ఎనర్జిటిక్ వాయిస్‌తో పాడగా, కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం క్యాచీగా ఉంది. ఈ సినిమాలో జయకృష్ణ బేస్ వాయిస్ మరియు నటన కృష్ణ గారి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ హంగామా కొనసాగుతోంది. ఘట్టమనేని ఫ్యాన్స్ జయకృష్ణ ఎంట్రీ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అశ్విని దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో జయకృష్ణ టాలీవుడ్‌లో కొత్త స్టార్‌గా ఎదుగుతారా లేదా అన్నది చూడాలి.
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి నెలకొంది. ఏకంగా ఎనిమిది చిత్రాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవ్వగా, అందులో సూర్య హీరోగా నటించిన 'వీరభద్రుడు' సినిమాకు ఆఖరి నిమిషంలో ఊహించని అడ్డంకులు ఎదురయ్యాయి. తమిళంలో ‘కరుప్పు’ పేరుతో రూపొందిన ఈ చిత్రం, తెలుగులో ‘వీరభద్రుడు’గా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, ఆర్థిక పరమైన చిక్కుల వల్ల విడుదల వాయిదా పడింది. తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సినిమాల విషయంలో ఇటీవల ఇలాంటి సమస్యలు తరచుగా ఎదురవుతున్నాయి. నిర్మాతలకు, పంపిణీదారులకు మధ్య ఉన్న బకాయిల కారణంగా చివరి క్షణంలో షోలు రద్దవ్వడం లేదా వాయిదా పడటం సాధారణమైపోయింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా కూడా అదే బాటలో నిలిచిపోవడం సూర్య అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. ఇక ఈ వీకెండ్‌లో వస్తున్న ఇతర అనువాద చిత్రాల విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీ నుండి రెండు ఆసక్తికర సినిమాలు రేసులో ఉన్నాయి. యాక్షన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధృవ సర్జా ‘కెడీ: ది డెవిల్’ చిత్రం ఎట్టకేలకు తెలుగులో సందడి చేయనుంది. దీనితో పాటు రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘రాక్షస పురం’ కూడా బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు స్ట్రయిట్ తెలుగు చిత్రాలు కూడా ఈ వారం క్యూ కట్టాయి. సీనియర్ నటుడు వెంకట్ స్వయంగా నిర్మించి నటించిన ‘హరుడు’ సినిమాతో పాటు, గ్రామీణ నేపథ్యం ఉన్న ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’, విభిన్న కథాంశంతో వస్తున్న ‘దూరదర్శిని’, మరియు ‘అరేయ్ ఆపండ్రా’ వంటి చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వేర్వేరు జానర్లలో ఉండటం విశేషం. చాలా కాలం తర్వాత తెలుగు బాక్సాఫీస్ వద్ద ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల హవా కొనసాగుతుందా లేక నేరుగా రూపొందిన తెలుగు సినిమాలే విజయం సాధిస్తాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాల ట్రైలర్లపై నెటిజన్లు ఆశాజనకంగా స్పందిస్తున్నారు. వాయిదా పడిన సూర్య ‘వీరభద్రుడు’ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోగా ఈ వీకెండ్‌లో అందుబాటులో ఉన్న ఎనిమిది చిత్రాలలో ఏది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలి. 
    అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతూ వీరభద్రుడు(Veerabadh ఉరఫ్ కరుప్పు ఇంకా థియేటర్స్ లోకి అడుగుపెట్టలేదు. ఉదయం తొమ్మిది గంటల షో పడకపోయినా, మార్నింగ్ షో అయినా పడుతుందని అనుకున్నారు. అది లేదు. మాట్నీ తో అయినా వస్తుందని అనుకున్నారు. అది కూడా లేదు. రీసెంట్ గా ఈ విషయమై వీరభద్రుడు దర్శకుడు ఆర్ జె బాలాజీ ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసాడు.  సదరు వీడియోలో బావోద్వేగానికి గురవుతు రెండేళ్ల కష్టాన్ని వెండితెరపై చూసుకోవాలని ఆశపడ్డాను. కానీ  ఇలాంటి ఆటంకాలు రావడం నన్ను కలిచివేస్తుంది. ఉదయం షోల కోసం థియేటర్ల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరిగిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు. ఇది నా తప్పు కాకపోయినా,  దర్శకుడిగా నేను బాధ్యత వహిస్తున్నాను. Also read: Ram Pothineni: వైల్డ్ యాక్షన్ లోకి రామ్ పోతినేని.. బిగ్ అప్డేట్ కి డేట్, టైం ఫిక్స్ రిలీజ్ కి సంబంధించి కొన్ని ఆర్థిక సమస్యలు KDM ఇష్యూస్ ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి నిర్మాతలు శ్రమిస్తున్నారు. సూర్య సార్ సినిమా అంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. దయచేసి మాపై నమ్మకం ఉంచండి. సాయంత్రం ఆరుగంటల షోస్ స్టార్ట్ అవుతాయని  సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.    
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, ఆఫ్ స్క్రీన్ బిజినెస్ స్ట్రాటజీల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సాధారణంగా సినిమా పాటలకు, డైలాగులకు కాపీరైట్ ఉండటం మనం చూస్తుంటాం. కానీ, ఒక హీరో తన డ్యాన్స్ స్టెప్పులకు, మేనరిజమ్స్‌కు కూడా చట్టపరమైన రక్షణ కల్పించుకోవాలని భావించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బన్నీ తన రాబోయే సినిమా 'రాక' (Raaka) కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో 'పుష్ప' సినిమాలోని 'తగ్గేదేలే' మేనరిజం, 'శ్రీవల్లి' స్టెప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. అయితే, వీటిని అనేక లోకల్ బ్రాండ్లు, కమర్షియల్ యాడ్స్, ఏఐ (AI) వీడియోలు తమ ప్రచారం కోసం అనుమతి లేకుండా వాడేసుకున్నాయి. దీనివల్ల నటుడిగా బన్నీ బ్రాండ్ వాల్యూ దెబ్బతినే అవకాశం ఉందని భావించిన మేకర్స్, ఈసారి ముందుగానే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం 'రాక'లో నటించబోతున్నారు. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అట్లీ కొన్ని అదిరిపోయే సిగ్నేచర్ మూమెంట్స్, స్టైలింగ్ డిజైన్ చేస్తున్నారట. ఈ స్టెప్పులు బయటకు రాకముందే వాటిపై పూర్తి హక్కులను రిజర్వ్ చేయాలని బన్నీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం డ్యాన్స్ స్టెప్పులే కాకుండా.. తన పేరు, వాయిస్, ఇమేజ్, పర్సనాలిటీ రైట్స్‌ను ఇతరులు వ్యాపార ప్రయోజనాల కోసం వాడకుండా రక్షణ కల్పించాలని బన్నీ కోరారు. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి అగ్ర నటులు కూడా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఇలాంటి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సౌత్ నుంచి అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరిన తొలి యువ హీరోగా నిలిచారు. నేటి డిజిటల్ యుగంలో ఏఐ టెక్నాలజీతో ఫేక్ వీడియోలు సృష్టించడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల మేనరిజమ్స్‌తో మీమ్ పేజీలు, చిన్న సంస్థలు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఫ్యాన్స్ చేసే రీల్స్ వల్ల ఇబ్బంది లేకపోయినా, అనుమతి లేకుండా కమర్షియల్ యాడ్స్ లో వాడితే మాత్రం ఇకపై బన్నీ టీమ్ నుంచి లీగల్ నోటీసులు వెళ్లడం ఖాయం.
తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల అద్దెలు, పర్సంటేజ్ వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద చిచ్చుకు దారితీసింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ప్రెస్ మీట్‌లో నట్టి కుమార్ ప్రధానంగా దిల్ రాజు, శిరీష్ రెడ్డి, నాగవంశీలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. థియేటర్ల వ్యవస్థను కొందరు వ్యక్తులు తమ గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తున్నారని.. దీనివల్ల చిన్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో వందల సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడటానికి ఈ 'ఏకస్వామ్య' ధోరణే కారణమని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా థియేటర్ల రెంటల్స్ విషయంలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని కొందరు కోరుతుంటే, మరికొందరు ఫిక్స్‌డ్ రెంటల్స్ కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో జరిగిన చర్చల్లో నాగవంశీ ప్రవర్తనపై నట్టి కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో సీనియర్లను గౌరవించడం లేదని, ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రవిశంకర్ వంటి పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కోసం థియేటర్ల సర్దుబాటు జరుగుతున్న సమయంలో ఇలాంటి గొడవలు రావడం మెగా అభిమానుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో థియేటర్ల మాఫియా పని చేస్తోందని, ఇది సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందని నట్టి కుమార్ ఆరోపించారు. నిర్మాతల మండలి ఈ విషయంలో మౌనంగా ఉండటం దారుణమని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కేవలం నలుగురు చేతుల్లోనే ఉంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నట్టి కుమార్ హెచ్చరించారు. థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకుండా భారీ అద్దెలు వసూలు చేయడం ఎగ్జిబిటర్ల పట్ల వివక్ష చూపడమేనని ఆయన అన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. మొత్తానికి, ‘పెద్ది’ సినిమా రిలీజ్ ముంగిట టాలీవుడ్‌లో మొదలైన ఈ 'థియేటర్ వార్' ఎటు దారితీస్తుందో చూడాలి. అగ్ర నిర్మాతలు నట్టి కుమార్ చేసిన ఈ విమర్శలకు ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా, ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని ఈ వివాదానికి స్వస్తి పలకాలని సామాన్య ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరిన్ని ఆసక్తికర సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక రకమైన అనిశ్చితి నెలకొంది. నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య తలెత్తిన పర్సంటేజీ మరియు రెంటల్ సిస్టమ్ వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతుండటంతో ఈ సమస్య ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత నాగవంశీ ఇటీవలే ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే తాము మెగాస్టార్ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరిస్తామని హింట్ ఇచ్చారు. అంటే, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే చిరంజీవి లాంటి వ్యక్తి మధ్యవర్తిత్వం వహించడమే సరైన మార్గమని నిర్మాతలు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. ప్రస్తుతం ఈ వివాదం నడుస్తోంది రామ్ చరణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రాల విడుదల సమయంలోనే. ఒకవేళ చిరంజీవి ఈ విషయంలో కలుగజేసుకుంటే, అది తన కుమారుడి సినిమా కోసమే చేస్తున్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కానీ చిరు ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే పరిశ్రమ బాగు కోసమే ఆలోచిస్తారని అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. టికెట్ రేట్ల ఇష్యూ నుంచి కరోనా సమయంలో కార్మికులను ఆదుకోవడం వరకు ఆయన ముందుండి నడిపించారు. ఇప్పుడు మరోసారి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించడానికి మెగాస్టార్ చొరవ అత్యవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎగ్జిబిటర్లు పర్సంటేజీ సిస్టమ్ కావాలని పట్టుబడుతుంటే, నిర్మాతలు మాత్రం అది తమకు నష్టదాయకమని వాదిస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరితేనే సినిమాల విడుదల సాఫీగా సాగుతుంది. ఒకవేళ చిరు గనుక రంగంలోకి దిగితే, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ఒక మధ్యేమార్గం దొరుకుతుందని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా మెగాస్టార్ అభిమానులు మరియు సినీ ప్రియులు ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇండస్ట్రీలో శాంతి నెలకొనాలన్నా, పెద్ద సినిమాల విడుదల సజావుగా జరగాలన్నా చిరంజీవి మాట చెల్లుబాటు అవుతుందని వారు గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ వివాదంపై మెగాస్టార్ ఎలా స్పందిస్తారు? ఆయన ఎప్పుడు రంగంలోకి దిగి ఈ సమస్యను కొలిక్కి తెస్తారు? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో అతిపెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 
హారర్ కామెడీ సినిమాలంటే టక్కున గుర్తొచ్చే పేరు రాఘవ లారెన్స్. 'ముని' సినిమాతో మొదలైన ఈ ప్రయాణం 'కాంచన' సిరీస్‌తో సౌత్ ఇండియాలోనే ఒక సెన్సేషనల్ బ్రాండ్‌గా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించడంలో ఈ ఫ్రాంచైజీకి పెట్టింది పేరు. తాజాగా ఈ సిరీస్‌లో వస్తున్న 'కాంచన-4' గురించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈసారి లారెన్స్ మునుపటి కంటే డబుల్ డోస్ హారర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. షూటింగ్ విషయంలో లారెన్స్ ఎక్కడా రాజీ పడటం లేదట. ఇప్పటికే ఏడాదిన్నర కాలంగా చిత్రీకరణ జరుగుతున్నప్పటికీ, కొన్ని సీన్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రీషూట్స్ చేస్తున్నట్లు సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ విషయంలో కూడా భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నారట. క్వాలిటీ కోసం మరో నాలుగు ఐదు నెలల సమయం తీసుకున్నా పర్వాలేదని లారెన్స్ పట్టుదలగా ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో అసలైన సర్‌ప్రైజ్ 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే. గ్లామర్ పాత్రలతో అలరించిన పూజాను ఈసారి లారెన్స్ ఒక పవర్‌ఫుల్ దెయ్యం పాత్రలో చూపించబోతున్నారట. ఇది ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద రిస్క్ అని కొందరు అంటున్నా, ఆ పాత్ర వెనుక ఉండే ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గతంలో వచ్చిన 'కాంచన-3' కథపరంగా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, కలెక్షన్ల పరంగా రూ. 100 కోట్లు దాటి రికార్డు సృష్టించింది. అయితే లారెన్స్ నటించిన ఇటీవలి చిత్రం 'చంద్రముఖి-2' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో, ఈసారి 'కాంచన-4'తో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆయన కసితో పనిచేస్తున్నారు. అందుకే స్క్రిప్ట్ నుండి మేకింగ్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంచన సిరీస్‌కు ఇదే ఆఖరి భాగం కావచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే చివరిదైతే, లారెన్స్ తన మార్కు హారర్ ఎలిమెంట్స్‌తో ఈ ఫ్రాంచైజీకి అదిరిపోయే ఎండ్ కార్డ్ వేయడం ఖాయం. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత, వచ్చే ఏడాది ఈ సినిమా వెండితెరపై సందడి చేసే అవకాశం ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం రాజుకుంది. గత కొన్ని రోజులుగా థియేటర్ల ఆదాయం పంపకాల విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. తాజాగా ఎగ్జిబిటర్ల డిమాండ్లపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు స్పందిస్తూ తమ గళాన్ని వినిపించారు. ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానంగా థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) సినిమా కలెక్షన్లలో తమకు నిర్ణీత 'పర్సంటేజ్' కావాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న 'రెంటల్ సిస్టమ్' (అద్దె పద్ధతి) వల్ల తాము భారీగా నష్టపోతున్నామని, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఎగ్జిబిటర్లు మీడియా ముందుకు వచ్చి నిర్మాతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై యలమంచిలి రవిశంకర్, నాగవంశీ, సాహు గారపాటి వంటి అగ్ర నిర్మాతలు గట్టిగానే బదులిచ్చారు. కేవలం ఎగ్జిబిటర్లు మాత్రమే కాదు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారని వారు గుర్తు చేశారు. పరిశ్రమలోని అన్ని వర్గాలు కలిసి చర్చించుకుంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ఇలా ఏకపక్షంగా ప్రెస్ మీట్లు పెట్టి అల్టిమేటం ఇవ్వడం సరికాదని నిర్మాతలు పేర్కొన్నారు. ముఖ్యంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఇప్పటికే 25కు పైగా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయని, వాటికి 70-80 శాతం బడ్జెట్ ఖర్చయిపోయిందని తెలిపారు. ఇలాంటి సమయంలో కొత్త నిబంధనలు తీసుకురావడం వల్ల నిర్మాతలు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. థియేటర్లలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు మాత్రమే ప్రేక్షకులను రప్పించగలమని, అది ఎగ్జిబిటర్ల బాధ్యతని వారు గుర్తుచేశారు.   గతంలో 'RRR' వంటి భారీ సినిమాలు విడుదలైనప్పుడు కూడా ఇలాంటి సమస్యలు తలెత్తలేదు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ గొడవలు మొదలవ్వడం ఇండస్ట్రీని కలవరపెడుతోంది. రామ్ చరణ్ 'పెద్ది' వంటి క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో ఉండటంతో, ఈ సమస్య సత్వరమే పరిష్కారం కాకపోతే బాక్సాఫీస్ వద్ద ఆ ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. థియేటర్ల మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగాయని కొందరు ఎగ్జిబిటర్లకు మద్దతు తెలుపుతుండగా, సినిమాల మేకింగ్ ఖర్చులు భారీగా పెరగడం వల్ల నిర్మాతలు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒకే టేబుల్ మీద కూర్చుని చర్చించి, ఓ సయోధ్యకు రావాలని అంతా కోరుకుంటున్నారు. రాబోయే సీజన్‌లో పెద్ద చిత్రాలు అడ్డంకులు లేకుండా విడుదలవ్వాలంటే ఈ వివాదానికి వీలైనంత త్వరగా పుల్‌స్టాప్ పడాల్సి ఉంది. మరి ఇరు వర్గాలు ఎప్పుడు మెట్టు దిగుతాయో వేచి చూడాలి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 (ZEE5) ఇప్పుడు మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో మన ముందుకు రాబోతోంది. అదే 'మేము COPలం' (Memu Coplam). హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చేతుల మీదుగా విడుదలైన ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నవ్వులతో పాటు పోలీస్ డ్రామాను మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సిరీస్ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సాధారణంగా పోలీస్ అంటే సీరియస్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్ సీన్లు గుర్తొస్తాయి. కానీ 'మేము COPలం' ట్రైలర్ చూస్తుంటే, ఒక పోలీస్ స్టేషన్ నేపథ్యంలో జరిగే సరదా సంఘటనలు, అక్కడ పనిచేసే సిబ్బంది మధ్య ఉండే ఫన్నీ బాండింగ్‌ను దర్శకుడు ప్రదీప్ మద్దాలి చాలా చక్కగా చూపించారని అర్థమవుతోంది. నాగబాబు ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, గెటప్ శ్రీను తనదైన కామెడీ టైమింగ్‌తో ట్రైలర్‌ను ఎలివేట్ చేశారు. కోడి పందేలకు సిద్ధమవుతున్న వేళ నాగబాబుకి చెందిన 'సలార్ రాజు' అనే కోడి మిస్ అవ్వడం ఆసక్తికరంగా ఉంది. దానిని వెతికి పట్టుకునే బాధ్యత పోలీసులైన గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల పై పడుతుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయించాయి. ఇక కథలో ఏదో మిస్టరీ కూడా ఉందని ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో మంచి కామెడీ బ్యాచ్ ఉంది. గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల, రీతూ చౌదరి, కిరీటి దామరాజు వంటి నటులు ఉండటంతో వినోదానికి లోటు ఉండదని అనిపిస్తోంది. ముఖ్యంగా గెటప్ శ్రీను మార్క్ కామెడీ పంచ్‌లు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. సాకేత్ కొమండూరి అందించిన సంగీతం సన్నివేశాలలోని హ్యూమర్‌ను సరిగ్గా క్యాచ్ చేసింది. రా ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది ఈ సిరీస్‌ను నిర్మించారు. శోభన్ చిట్టప్రోలు అందించిన కథ, మాటలు సహజత్వానికి దగ్గరగా ఉండి నవ్వు పుట్టిస్తున్నాయి. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉండటంతో డిజిటల్ ఆడియన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి 'మేము COPలం' ట్రైలర్ ఈ వేసవిలో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నట్లు సంకేతాలిచ్చింది. 'సలార్ రాజు' అనే కోడిపుంజు కోసం పోలీస్ యూనిఫాంలో ఈ టీమ్ చేసే హంగామా చూడాలంటే మే 22 వరకు ఆగాల్సిందే. మే 22 నుంచి ఈ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.  
సినిమా రంగంలో స్టార్లు అంటే కేవలం కోట్లలో పారితోషికం తీసుకోవడం, లగ్జరీ కార్లలో తిరగడమే అనుకుంటారు చాలామంది. కానీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మాత్రం అందుకు భిన్నం. వెండితెరపై విభిన్న పాత్రలతో మెప్పించడమే కాదు, సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా విద్యా దానం ద్వారా భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో సూర్య చూపిస్తున్న చొరవ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సూర్య స్థాపించిన 'అగరం ఫౌండేషన్' గత రెండు దశాబ్దాలుగా నిశ్శబ్దంగా ఒక విద్యా విప్లవాన్ని సృష్టిస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు ఏకంగా 51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ప్రొఫెషనల్స్‌గా మారడం విశేషం. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, సరైన మార్గదర్శకత్వం లేక ఇబ్బంది పడే విద్యార్థులకు అగరం ఒక వరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు, ముఖ్యంగా వారి కుటుంబంలో మొదటి తరం గ్రాడ్యుయేట్లు అవ్వాలనుకునే వారిని గుర్తించి సూర్య అండగా నిలుస్తున్నారు. 'విధై' అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా మెంటరింగ్, స్కాలర్‌షిప్స్ అందిస్తూ వారి కలలను నిజం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 8 వేల మంది విద్యార్థుల జీవితాల్లో ఈ ఫౌండేషన్ వెలుగులు నింపడం గమనార్హం. మరో విశేషమేమిటంటే, ఈ సాయం అందుకున్న వారిలో 6700 మందికి పైగా వారి కుటుంబాల్లోనే మొదటి గ్రాడ్యుయేట్లు కావడం. దళిత, గిరిజన వర్గాలతో పాటు శ్రీలంక శరణార్థుల పిల్లలకు కూడా అగరం ఫౌండేషన్ చేయూతనిస్తోంది. విద్యా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి ఉచిత వసతి, విద్య లభించేలా సూర్య వ్యక్తిగత పర్యవేక్షణలో ఈ పనులు సాగుతున్నాయి. సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఆయన కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా 'జై భీమ్' వంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తూ తన బాధ్యతను చాటుకుంటున్నారు. నెటిజన్లు కూడా సూర్య చేస్తున్న ఈ సేవపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అసలైన స్టార్‌డమ్ అంటే బాక్సాఫీస్ వసూళ్లు మాత్రమే కాదు, ఇలా ఎంతమంది జీవితాలను మార్చామనేదే ముఖ్యం" అంటూ సూర్యను రియల్ హీరోగా కొనియాడుతున్నారు. ఆయన చేస్తున్న ఈ విద్యా యజ్ఞం మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, అగరం ఫౌండేషన్ కార్యక్రమాల కోసం సూర్య ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంటారు. భవిష్యత్తులో ఈ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తరించాలని, లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని సూర్య లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
  నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో "పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిదా?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు హెల్త్ కోచ్ ఈ వీడియోలో వివరించారు. పంచదార vs బెల్లం: ఏది బెటర్? చాలా మంది పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే, వాస్తవానికి పంచదార మరియు బెల్లం రెండింటికీ దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. గ్లైసీమిక్ ఇండెక్స్: పంచదార నేరుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణం కావడం: బెల్లంలో మొలాసిస్ (Molasses) ఉండటం వల్ల, ఇది పంచదార కంటే కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. కానీ, శరీరానికి అందే క్యాలరీలు మరియు ప్రభావం విషయంలో రెండూ దాదాపు సమానమే. సలహా: మీరు ఆరోగ్యంగా ఉండి, గ్లూకోజ్ లెవల్స్ సాధారణంగా ఉంటే పరిమితంగా ఏదైనా తీసుకోవచ్చు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రెండింటికీ దూరంగా ఉండటమే మంచిది. స్వీట్నెస్ మరియు ఆరోగ్యం ప్రకృతిలో లభించే పండ్లు మొదలైనవి మనకు అలవాటైన స్వీట్లంత తీపిగా ఉండవు. బ్రాండ్లు మరియు కంపెనీలు మనకు ఈ అధిక తీపిని అలవాటు చేశాయి. పిసిఒఎస్ (PCOS), హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెర్టిలిటీ వంటి అనేక సమస్యలకు చక్కెర ప్రధాన కారణం. డయాబెటిస్ మరియు హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చక్కెరను డైట్ నుండి వీలైనంత వరకు తొలగించాలి. ప్రత్యామ్నాయాలు ఏవి? చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన స్వీట్నర్లను వాడవచ్చు: మొంక్ ఫ్రూట్ (Monk Fruit): ఇది తక్కువ క్యాలరీలను ఇస్తుంది మరియు ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచదు. స్టీవియా (Stevia): దీనిపై కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, మితంగా వాడితే ఇది సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే బాడీ సెన్సిటివిటీని బట్టి దీనిని ఎంచుకోవాలి. బయటికి సన్నగా ఉన్నా లోపల ప్రమాదమేనా? కొందరు ఎంత తిన్నా లావు అవ్వరు (Metabolism వల్ల). కానీ వారు జంక్ ఫుడ్ లేదా అధిక చక్కెర తీసుకుంటే, అది బయటికి కనిపించకపోయినా లోపల లివర్ ఇన్ఫ్లమేషన్ (Liver Inflammation) కు దారితీస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించే లేదా పెంచే ఎంజైమ్స్ లోపం వల్ల కొందరు లావు అవ్వకపోవచ్చు, కానీ వారి రక్త నాళాల్లో అడ్డంకులు (clogging) ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకరి శరీరం స్పందించే తీరు మరొకరికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇతరులను చూసి బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ముగింపు: ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం లేదా పెరగడం మాత్రమే కాదు, లోపల అవయవాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది ముఖ్యం. సరైన పోషకాహారం మరియు మితమైన తీపి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి అని అంటున్నారు ప్రముఖ ఫ్యాట్ లాస్ కోచ్ విజయ్ మంగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాత్రిపూట అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు మరియు ఆరోగ్యకరమైన మార్పుల గురించి ఈ VIDEO లో వివరించారు. రాత్రిపూట అన్నం ఎందుకు వద్దు? మనం పగటిపూట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తిని వెంటనే పడుకోవడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక, అది కొవ్వుగా (Fat) మారి శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ముఖ్యంగా పొట్ట రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? విజయ్ మంగం సూచనల ప్రకారం, రాత్రిపూట అన్నానికి బదులుగా కూరగాయలు (Vegetables), ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. సలాడ్లు, సూప్స్ లేదా తక్కువ పరిమాణంలో ఇతర చిరుధాన్యాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరదు. ముఖ్య గమనిక: మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌గా కనిపించాలన్నా కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు విజయ్ మంగం గారి ఈ టిప్స్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...