Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 2


    గుడిచుట్టూ విశాలమైన ఆవరణ ఉంది. రెండుమూడు చెట్లు ఉపగుడులు చిన్న అరుగులు ఏవేవో ఉంటాయి. గుడిమాత్రం చాలాపెద్దది. అంతా రాతితో కట్టిందే. లోపలి ద్వారాలుకూడా అన్నీ ఒకేరకంగా ఉండి వెళ్ళినదోవనే మళ్ళీ వెడుతున్నామా అనిపిస్తూ ఉంటుంది.
    అమ్మవారి గుడి ఎంతపెద్దదో చుట్టూవున్న ప్రహరీకూడా రాతిగోడలతో ఎత్తుగాకట్టి గట్టిగా వుంది.
    గుడి గురించి అమ్మవారి మహత్యాల గురించి చరిత్ర గురించి రక రకాల కథలూ వినవస్తుంటాయి. నిజానిజాలు ఆ పరమేశ్వరీదేవికే తెలియాలి.
    యాభై ఏళ్ల క్రితం అంత పెద్దగుడికీ పూజారులు ఇద్దరేఉండేవారు. ఇప్పుడు భక్తులూ పెరిగారు పూజారులు పెరిగారు. పూజారులు రెండు పక్క రెండు ఇరవై రెండు మంది అయారు. దేవాలయ ఆదాయం ట్రష్టీ అధికారులు అందరూ పెరిగారు. భక్తులసంఖ్య పెరగటంతో.
    గతంలో
    గుడి విషయం ఎవరూ గట్టిగా పట్టించుకోకపోవటంవల్ల ఓ దొంగతనంకూడా జరిగింది. గుడిలో అమ్మవారి ముందున్న వెండియిత్తడి దీపం సెమ్మెలు పళ్ళాలు బిందెలు దొంగలు ఎత్తుకెళ్ళారు. ఆతర్వాత జాగ్రత్త వహించటంతో మళ్ళీ దొంగతనం అనేది జరగలేదు.
    కొంతవరకు అ గుడి గురించి తెలిసింది ప్రజలకు అంతే.
    భక్తులు మొక్కు కోంగానే పనులు కావటంతో భక్తగణం ఎక్కువయ్యారు, పరమేశ్వరీ అమ్మవారి ఖ్యాతి. నలువైపులా పాకింది. ఆతర్వాత గుడిఅన్న పదం మానేసి దేవాలయంగా పేరుపొందటం జరిగింది.
    సింహాచలం ఒకభక్తుడు. అతనికీ కొన్నికష్టాలు ఉన్నాయి. ఆనోట ఆనోట పరమేశ్వరీ అమ్మవారి పేరుప్రఖ్యాతులు మహత్యాలు విని అమ్మవారి దర్శనంచేసుకొని మొక్కుకుందామని బైలుదేరివచ్చాడు సింహాచలం,
    సింహాచలం బస్సు దిగేసరికి రాత్రి పదయింది. చిన్న హోటల్లో కిందనే భోంచేసి, ఆ రాత్రే మెట్లెక్కివచ్చి అన్నింటికన్నా పైమెట్లమీద గుడి ప్రహరీగోడకి పక్కనే తువ్వాలు పరచుకుని తలకింద పంచీపెట్టుకుని పడుకున్నాడు. ఎంతకీ నిద్రరాలేదు.
    అలా అలా రాత్రి రెండు కావస్తుండగా గుడిలోపలనుంచి టక్ టక్ మన్న చప్పుళ్ళు ఆగి ఆగి వినిపించాయి. దాంతో లేచి కూర్చోటం జరిగింది.
    సింహాచలం వాచ్ మాన్ కోసం చూశాడు.
    ఆ స్థానం ఖాళీగా దర్శనం ఇచ్చింది.
    వాచ్ మాన్ శివుడికి ఇద్దరు పెళ్ళాలున్నారు. కట్టుకున్నది ఒకతి ఉంచుకున్నది వకతి. కాస్త తిరకాసు ఏమిటంటే వీడు దాన్ని ఉంచుకో లేదు. అదే వీడిని ఉంచుకుంది మగతోడుకోసం. కొండకింద పూల మాలక్షమ్మ కొట్టు ఏదని అడిగితే ఎవరైనా ఇట్టేచెబుతారు.
    ఎత్తుగా లావుగా పోతపోసిన నల్లరాతి విగ్రహంలా ఉంటుంది. అది అలంకరించుకుంటే జాతరలో పోలేరమ్మలా ఉంటుంది. ఎంతైనా నేను ఆడదాన్ని, వంటరి ఆడది వీధికుక్క బతుకు అనుకుని శివుడిని ఉంచేసుకుంది.
    శివుడి సొంత పెళ్ళానికి పిల్లలున్నారు. అందుకని వాడు పెళ్ళాన్ని, పిల్లలని చచ్చినట్టు పోషించాలి. మాలక్ష్మమ్మ అలాకాదు. వాడికే మొగుడు అది. వాడి అవసరాలకి పదీ పరకా డబ్బులిస్తుంటుంది. చేపల పులుసు, రొయ్యల వేపుడు చేసి అన్నంలోకలిపి ముద్దలుచేసి స్వయంగా తనే దగ్గర కూర్చుని తినిపిస్తుంది. అదే పెళ్ళాం  అయితే ఏ ఇగురుకూరో రెండు ఉల్లి రెబ్బలువేసి తగలెట్టి సంకటిగాచేసిన అన్నంలోవేసి కూడు పడేస్తుంది.
    శివుడు పగలంతా పెద్దమనిషి భక్త్ఘులను అదిలిస్తూ, క్యూలోజనాన్ని సర్దుతూ డ్యూటీ చక్కగా చేస్తాడు. డ్యూటీ లేనప్పుడు ఇంటిపట్టున బుద్దిగావుంటాడు.
    శివుడు డ్యూటీలో రాత్రుళ్ళు ఉన్నప్పుడే బుద్ధి సరీగా ఉండదు. దొంగలు కొండయెక్కి రావటానికి చుట్టూ కొండ సరీగా వుండదు, కొండనిండా చెట్టూచేమలు, పుట్టలు గుట్టలు, ఎగుడు దిగుడు రాళ్ళు. కనుక ఏ దొంగలువచ్చినా మెట్లమీదనుంచి రావాలి. మెట్ల మీద లైట్లు ఉంటాయి. బిచ్చగాళ్ళు పడుకునివుంటారు. గుడి తలుపులదగ్గర కాపలాగా వాచ్ మాన్ ఉంటాడు. పైగా పెద్దపెద్ద తలుపులకి తాటికాయంత తాళంకప్ప ఉంటుంది. దానితాలూకా తాళంచెవులు పెద్ద పూజారిదగ్గర ఉంటాయి.
    "అక్కడ తనువున్నా వకటే, లేకపోయినా వకటే. వంట్లో శక్తి' చేతిలో మూరెడుపొడుగు కర్రతప్పించి దగ్గర కత్తివుందా, తుపాకివుందా!" అలా అనుకుంటూ శివుడికి నైట్ డ్యూటీ పడినప్పుడల్లా పరమేశ్వరి పరమ శివుడిని కాపలాకాయటం (గుడికాపలా) ఆపై వాడు ఇంకెవరైనా ఉంటే ఆ పరమాత్ముడిపై భారంపెట్టి వదిలేసి శివుడు దర్జాగ మాలక్షమ్మ కొట్టు వెనుకనే ఉన్న దానింటికి వెళ్ళి నైట్ డ్యూటీ చేస్తుంటాడు.
    ఇప్పుడు వాచ్ మన్ శివుడు గుడి గుమ్మందగ్గర లేడు. మాలక్షమ్మ గుడిశలో ఉన్నాడు.
    శివుడి కథ తెలియని సింహాచలం వాచ్ మన్ కోసం చూసి అలాంటి శాల్తీ దరిదాపుల్లో కానరాకపోవటంతో మరోసారి గుడి తలుపులకి చెవి యొగ్గి అలకించి ఆ తర్వాత రెండేసిమెట్లకో అంగచొప్పున వేస్తూ కిందకి పరుగుతీశాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS