Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 2

    అందుకే రాత్రి చాలాసేపు ఆమెకు నిద్రపట్టలేదు.
   
    కలలాంటి, నిజంలాంటి, భ్రమలాంటి, అసత్యంలాంటి అర్ధస్వప్నాల్లాంటి ఆలోచనలు....
   
    అందుకే ఉదయాన్నే తొందరగా లేచి కరివేపాకు కోయాలనే మిషతో చాలాసేపు పెరట్లో తిరిగింది.
   
    బాత్ రూమ్ వేపు చూసింది.
   
    ఆ బాత్ రూమ్ గోడ అక్కడకు చాలా దగ్గర. మయూషకు అటుపక్క జరిగేది చక్కగా కనిపిస్తుంది తప్ప అవతలివాళ్ళకు ఇటు వేపు గుబురుకొమ్మలు తప్ప మరేమీ కనిపించవు.
   
    ఆ రోజు కూడా అలాంటి దృశ్యాన్ని చూడాలని వుంది మయూషకు, రహస్యంగా జరిగే ఆ ముద్దు ప్రక్రియ వెనక దాగిన ఆనందం గురించి తెలుసుకోవాలని వుందామెకు. కానీ ఉదయం ఆమెకు వాళ్ళిద్దరూ కన్పించలేదు.
   
    ఒకవేపు కరివేపాకు రెమ్మల్ని కోస్తూనే వున్నా రెండోవేపు ఆమె చూపులు, చెవులు పక్కింటివేపే వున్నాయి.
   
    సరిగ్గా అదే సమయంలో-
   
    విన్పించిందో శబ్దం!
   
    బకెట్ లో నీళ్ళు తోడుతున్న నీళ్ళ చప్పుడు....
   
    అంతే ఉత్సాహం పొంగిపోయిన మనసుతో దానిమ్మచెట్టు పక్కనున్న గట్టెక్కి పక్కింటి పెరట్లోకి చూసింది.
   
    నిన్న చూసిన యువతే బకెట్ నిండా నీళ్ళను తోడి బకెట్ పట్టుకుని బాత్ రూమ్ వేపు నడుస్తోంది.
   
    నిన్నటిలాగే అతనిప్పుడు వస్తాడా? వచ్చి ముద్దు పెట్టుకుంటాడా నిన్నటిలాగా ఆమె అతడ్ని వారించలేదా? ఏమిటా ముద్దు రహస్యం!
   
    రెండు మనసులు చెప్పుకోలేని కనురెప్పల మూగ భాషమో ముద్దు.
   
    రెండు హృదయాల అంతరాత్మలలోని మధురాకృతుల అక్షర ఘోషకి ముద్దు.
   
    ముద్దుకు ముచ్చటైన శబ్దాలే తప్ప లిపి లేదు.
   
    లిప్త కాలపు బావలయ పేరే ముద్దు.
   
    ఎక్కడో కవిత్వం పుస్తకంలో చదివిన వాక్యాలు జ్ఞాపకానికొచ్చాయి మయూషకు.
   
    దాంతో మరింతగా రిక్కించి చూస్తోందామె.
   
    పక్కింటి యువతి బాత్ రూమ్ లోకి అడుగుపెట్టే క్షణంలో-
   
    పరుగు, పరుగున వచ్చాడతను.
   
    ఆమె చెయ్యి పట్టుకుని పక్కకు లాగాడు. ఆ విసురుకి బాత్ రూమ్ వెనక గోడకు చేరబడిపోయిందామె. ఆమె ఎదురుగా ఎగిసిపడుతున్న ఉచ్చ్వాస నిశ్వాసల్తో అతను! రెండే రెండు క్షణాలు. మయూష ఆ దృశ్యాన్ని చూస్తూ ఊపిరి బిగపట్టింది.
   
    "ఉష్.....ష్.....ష్...." ఇష్టా ఇష్టాల మధ్య ఆమె ఊగిసలాడుతోంది.
   
    "నువ్వు సరిగ్గా ఇక్కడే ఈ స్పాట్ లోనే చక్కగా నాకు దొరికిపోతావని నాకు తెలుసు" గర్వంగా అల్లరిగా అన్నాడతను.
   
    "భాగానే వుంది సంబడం. అత్తగారు చూస్తే? మీకేం మగ మహారాజులు, నా పరువుపోతుంది. అయినా శ్రావణ మాసం మనిద్దరం కలవగూడదని" ఆమె గుసగుసలాడుతోంది ఓపక్క సిగ్గుపడుతూనే.
   
    సరిగ్గా అదే సమయంలో ఆమెను మరోసారి అతను ముద్దుపెట్టుకున్నాడు.
   
    "మొండి.... అయినా.... యింకా పదిహేను రోజు....లే.....గ....దా...." ఆమె అన్నది.
   
    "పదిహేనురోజులే గదా....అలా సాగదీసుకుని పెద్ద ఆరిందాలా చెప్పకు. అయినా ఈ శ్రావణమాసాల్ని, ఆషాడమాసాల్ని కేలండర్ లోంచి బాన్ చేస్తే గానీ, మనలాంటి వాళ్ళకు మనశ్శాంతి వుండదు. రాత్రిళ్ళు అత్తగారి పక్కన అలా మొద్దుగా పడుకోవడమేనా నేను చేసే సంజ్ఞ లేవీ నీకు విన్పించవా?" చిరుకోపంగా అడిగాడతను.
   
    "విన్పిస్తాయి. ఎందుకు విన్పించవూ- ఏం నన్నొదిలి వుండలేరా ఆఫీసులో ఎలా వుంటున్నారు?" సిగ్గుపడుతూ నెమ్మదిగా అడిగిందామె.
   
    "కమ్....టు....ది...పాయింట్, ఇవాళ రాత్రి సరిగ్గా పదిగంటలకు, అలారమ్ పెడతాను. అలారమ్ మోగిందంటే అర్ధం. నేను నిన్ను పిలుస్తున్నానని అర్ధమైందా?"
   
    "బాగుంది. నేనేం రౌడీ పిల్లననుకొన్నారా? నేన్రాను. అత్తగారికి  తెలిస్తే" అమాయకంగా అంది ఆ అమ్మాయి.
   
    "తెలిస్తే ఏమవుతుందట?" అసహజంగా అన్నాడతను.
   
    అప్పుడే లోపల్నుంచి పిలుపు వినబడేసరికి ఆ యువతి తుళ్ళిపడింది.
   
    "మీ కోసం ఎవరో వచ్చారట. మీ అమ్మగారు పిలుస్తున్నారు" వేళాకోళంగా నవ్విందామె.
   
    "అందరూ ఇప్పుడే తగలబడతారు. నువ్వు రాత్రికి వస్తావు అంతే" డిమాండింగ్ గా అనేసి కంగారుగా ఆమెను వదిలేసి పరుగు పరుగున వెళ్ళిపోతున్న భర్తవేపు సంతోషంగా, సంతృప్తిగా చూసి బాత్ రూమ్ లో కెళ్ళిపోయిందామె.
   
    వాళ్ళ మాటల్ని, చేష్టల్ని చాలా దగ్గరగా, రహస్యంగా చూసిన మయూష మాటలురాని బొమ్మలా నిలబడిపోయింది.
   
    వళ్ళంతా అచేతనంగా అయిపోయింది. ఆమెలో ఉచ్చ్వాస నిశ్వాసలు ఎగిసెగిసి పడుతున్నాయి.
   
    ఒక్క క్షణం ఆలోచించిందామె.
   
    తనని కూడా తన భర్త యిలా గోడచాటున అందంగా ముద్దు పెట్టుకుంటాడా? ఈ ఆలోచన మయూషకు చెప్పలేనంత హుషారు నిచ్చింది.
   
    అంతట్లోనే లోన్నించి తల్లి పిలుపు వినబడేసరికి గట్టు మీద నుంచి కిందకు దూకి కిచెన్ రూమ్ లోకి పరుగు పెట్టింది మయూష.
   
    "రెండు రెమ్మలు తేవడానికి ఇంతసేపటే?" తల్లి చోద్యంగా చూస్తూ అడిగి, పక్క గదిలో కెళ్ళిపోయింది.
   
    వదిన మాలతి మాత్రం ఎగాదిగా మయూష వేపు చూసి-
   
    "అవునుగానీ మరదలు పిల్లా ఆ ముఖమ్మీద చెమట, ఆ తొట్రుపాటు ఏవిటిదంతా-మొగుడితో రహస్యంగా సంసారం చేసినట్టు......" నవ్వుతూ కొంటెగా కన్ను గీటుతూ అందామె.
   
    "ఛీ.....పో వదినా నువ్వెప్పుడూ ఇంతే అయినా మీ తమ్ముడు ఇక్కడ లేడుగా?" జవాబు చెప్పేసి తన రూమ్ లోకెళ్ళి పుస్తకాలందుకొని కిచెన్ రూమ్ దగ్గరకొచ్చి నిలబడింది మయూష.
   
    "మా తమ్ముడుంటే పెళ్ళి కాకుండా సంసారం చేసేద్దామనా?" ఏదో అల్లరిగా అనబోయిన మాలతి అప్పుడే వరండాలోకి అడుగుపెట్టిన మావగారిని చూసి మాటల్ని మింగేసింది భయంతో.
   
    "నువ్వు నాతో కాలేజీకి వస్తావా? సిటీ బస్సులో వెళతావా......?" అడిగాడు మయూష తండ్రి పీతాంబరరావు.
   
    "అదే ఆలోచిస్తున్నాను" అని తండ్రికి జవాబు చెప్పి "వదినా నీ ప్రశ్నకు ఈవెనింగు ఆన్సర్ చెప్తా" అని చెప్పి-
   
    "నాన్నా నేను సిటీ బస్సులో కాలేజీకెల్తా. నువ్వెళ్ళిపో" అంది మయూష.
   
    "అయితే నిను బస్టాప్ లో డ్రాప్ చేస్తాన్రా" ఆ మాట అంటూ ఆయన మొదటి గదిలోకొచ్చి ఏవో ఫైల్స్ తీసుకుని స్కూటర్ ని స్టార్ట్ చేశాడు.
   
    వెనక సీట్లో మయూష కూర్చుంది. స్కూటర్ కొన్ని క్షణాల తర్వాత ముందుకు పరిగెత్తింది.
   
                                *    *    *    *
   

    బర్కత్ పురా బస్టాప్ లో మయూష ను డ్రాప్ చేసేసి, తను నారాయణగూడ వేపు వెళ్ళిపోయాడు పీతాంబరరావు.
   
    ఉదయం తొమ్మిదీ ఇరవై అయిదు నిమిషాలు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS