Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 1

 

                      ప్రియా.....ప్రియతమా

                                                                         ----ముచ్చర్ల రజనీశకుంతల
    

                                     

 

   అద్దం ముందు నిలబడి అదేపనిగా అరగంటనుంచి తన అందానికి తుది మెరుగులు దిద్దుకుంటోన్న ఆ బాపూ బొమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గోడ గడియారం తొమ్మిది గంటలను కర్ణకఠోరంగా వినిపించడంతో.. చివరిసారిగా కనుబొమ్మల మధ్య గుండ్రంగా ఉన్న  శింగార్ ని ఓసారి తృప్తిగా చూసుకుని "ప్రనూషా... యూ ఆర్ యాన్  ఏంజిల్." అని తనకు తానే కాంప్లిమెంట్ ఇచ్చుకుని హాల్లోకి మిసైలంత వేగంగా పరుగెత్తి హైహీల్స్ ని పాదాలకు తగిలించుకుని, బయటకు పరుగెత్తింది.
    ఆమె పరుగెత్తినంత వేగంగా నడుస్తూంటే, ఆమె చెవులకున్న జూకాలు అందంగా అటూ ఇటూ వూగుతున్నాయి. ఆమె వేగంగా, నిర్లక్ష్యంగా , టెన్షన్ గా నడుస్తోన్న నడుం లయబద్దమైన, ఆమె నడకలో రాజసాన్ని, స్త్రీత్వాన్ని చూపెడుతోంది.
    అయిదంటే అయిదు నిమిషాల్లో కాలనీకి దగ్గర్లో వున్న బస్టాప్ ని చేరుకుంది. ఆమె గుండెలు వేగంగా ఎగిరిపడుతూంటే, ఉచ్చ్వాసం సంబరంగా, నిశ్వాసం అబ్బురంగా ఆ దృశ్యాన్ని వీక్షిస్తున్నాయి.
    ఆమె ఎర్రటి పెదాలకు లిప్ స్టిక్ అవసరం లేదు. ఎర్రటి ఆ పెదాలు అదురుతూంటే, అద్భుతంగా వుంది. ఏ చిత్రకారుడైనా చూస్తే, తన కుంచెకు పని కల్పించేవాడే. ఆమె బస్సు కోసం వెయిట్ చేస్తోంది.
    సరిగ్గా పది గంటలు ఠంగుఠంగుమని కొట్టేసరికి తను ఆఫీసులో వుండాలి. లేకపోతే మేనేజర్ పీనుగు ఊర్కోడు. భూతద్దంలాంటి కళ్ళజోడులోనుంచి తనని ఆపాదమస్తకం చూస్తాడు.
    తర్వాత ఓ వెర్రి నవ్వు నవ్వుతాడు.
    "అదేంటమ్మాయ్..నువ్వెప్పుడూ లేటే...నువ్వెక్కాల్సిన రైలు ఒక జీవితకాలవున్నట్టు...' అంటూ ఓజోకు జోకి తన నున్నటి భుజం మీద చేయేస్తాడు.
    తను సీరియస్ గా చూస్తుంది.
    వెంటనే అతను తనను తాను సరిదిద్దుకుని, ప్చ్.....యిలా అయితే మరో మారు ఊర్కునేది లేదు. ఆబ్సెంట్ మార్క్ వేసేస్తానంతే." అంటాడు.
    వాడి కోపం తను లేట్ గా వచ్చినందుకు కాదు. అలా, అతడు తన భుజం మీద చేయెసినప్పుడు తను కోపంగా చూసి, ఆ ఛాన్స్ (?) ఇవ్వనందుకు!
    పైగా, తను గట్టిగా మాట్లాడబోతే 'నిన్ను చూస్తుంటే నా మనవరాలు గుర్తుకోస్తోంది" అని ప్లేటూ, గ్లాసు     ఫిరాయించగల నక్క..... అతగాడు.
    ప్రనూషకు సిటీబస్సులమీద పీకల్దాకా కోపం వచ్చింది. ఛీ....ఛీ....బస్సులకు కామన్సెన్స్, మగాళ్ళకు మినిమమ్ సెన్సూ లేదు. అనుకుంది.
    తొమ్మిదీ ఇరవై...
    'అయిపోయింది. లాభం లేదు...మేనేజర్ పీనుగ ఇవ్వాళ తనకు క్లాసు పీకడం గ్యారంటీ అనుకుంది.
    పోనీ ఆటోలో వెళ్తే....?
    ఆ ఆలోచన ఆమెకు వచ్చినా, ఆమె పర్స్ కు నచ్చలేదు.
    'ఏయ్. ప్రనూషా...ఎందుకే ఆటోకు పాతిక రూపాయలు తగలెడతావు. బస్సులో అయితే పాసుంది. ఎక్స్ ట్రా వేషాలేసి, ఎక్స్ ట్రా డబ్బులు తగలెట్టడం నాకే మాత్రం నచ్చదు." అంటూ అంతరాత్మ వార్నింగిచ్చింది. ప్రనూష అప్పుడప్పుడూ అలా తన అంతరాత్మతో మాట్లాడుకుంటుంది. తన సాధక బాధకాలు చెప్పుకుంటుంది.
    తొమ్మిదీ ముప్పయి......
    షి...ట్....తల విదిల్చింది.
    అప్పుడే ఓ బస్సు నిండుగర్బిణిళా వచ్చి, తొమ్మిది నెలలైనా ప్రసవించని సహనశీలి అయిన తల్లిలా... ఒకరు కూడా ఆ క్రిక్కిరిసిన బస్సులో నుంచి దిగకపోవడంతో కనీసం ఫుట్ పాత్ కూడా కాలు నిలిపే స్థలం లేనందున....బస్సాగకముందే....
    'రైట్...రైట్" అని కండక్టర్ అరిచేశాడు. అసహనంగా చూస్తోంది. మరో బస్సుకోసం ప్రనూష.
    
                                                              * * *
    
    బాత్రూంలోనుంచి తాపీగా బెడ్రూంలోకి వచ్చి, డ్రస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి, ఓసారి తన అవతారాన్ని చూసుకుని 'క్యా బాడీ హై క్యా పర్సనాలిటీ హై.." అనుకుంటూ మండిపోయాడు శ్రీచరణ్. తన బాడీ అంతా బాగానే వున్నట్టు అనిపించింది. ఇంత మంచి బాడీని, వెధవ బట్టలు కప్పుకుని వెళ్ళాలా? ఈ బట్టలు ఎవడు కనిపెట్టాడో...మనసులో అనుకుని మెల్లిగా బయటకు వచ్చి పక్క గదిలోకి చూసి....
    'హమ్మయ్య....మూనింగ్ వాక్ ఉమెన్ వెళ్ళిపోయిందన్నమాట..." అనుకున్నాడు.
    హుషారుగా ఈల వేసుకున్నాడు.
    మెయిన్ రోడ్ చేరుకున్నాడు. నాకిప్పుడు స్వేచ్చ వచ్చిందోచ్...అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రయింగ్ పాన్ గ్యాస్ స్టవ్ మీద పెట్టి, అయిదు నిమిషాల్లో రెండు కోడిగుడ్లతో ఓ ఆమ్లెట్ వేపుకుని, రెండు బ్రెడ్ స్లయిస్ మధ్య పెట్టుకుని..... మరి పది నిమిషాల్లో బ్రేక్ ఫాస్ట్ ముగించేశాడు.
    తొమ్మిదీ నలభై అయిదు కల్లా, నీట్ గా తయారై ఇంటికి తాళం వేసి, స్కూటర్ బయటకు తీసి కిక్ కొట్టాడు.
    విసుగ్గా టైం చూసుకుంది ప్రనూష.
    తొమ్మిదీ నలభై అయిదు.
    శ్రీచరణ్ హుషారుగా స్కూటర్ నడిపిస్తున్నాడు.
    అతని ఆఫీసు పదిగంటలకే.....
    అయినా....తాపీగా పదిన్నర..లేదా పదకొండు గంటలకు వెళ్తాడు.
    రిజిస్టర్ ఎప్పుడో పన్నెండు గంటలకు బాస్ రూమ్లోకి వెళ్తుంది. అందుగ్గాను, రిజిస్టర్ ఆలస్యంగా పట్టుకెళ్ళే ఫ్యూన్ పూర్ణానందానికి ఆఫీసులో తలకు ఒక్కింటికి పాతిక చొప్పున ఇస్తారు. ఎవరు ఆలస్యంగా వచ్చినా నో ప్రాబ్లెం.
    ఈ వెసులుబాటు అయిడియా! శ్రీచరణ్ కు వచ్చింది. ఇలాంటి ఐడియాలు బోల్డు స్టాకు వుంటాయి శ్రీచరణ్ మెదడులో. కుదురుగా ఆఫీసులో వుండటం, ఆ మాటకొస్తే ఎక్కడైనా అలా వుండటం కుదరదు... అనే మెంటాలిటీని డెవలప్ చేసుకున్న వ్యక్తి శ్రీచరణ్?
    ఎప్పుడూ హుషారుగా వుంటాడు.
    అతని ఆలోచనలన్నీ మోడ్రన్ గా వుంటాయి. అప్పుడప్పుడు ఆ మోడ్రన్ ఆలోచనలకు వెరయిటీ థాట్స్ కూడా పుడుతుంటాయి.
    స్కూటర్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చింది. సడన్ గా ఆపాడు స్కూటర్ ని. బస్టాప్ లో చాలామంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు అఫ్కోర్స్....అబ్బాయిలు కూడా వున్నా కూడా శ్రీచరణ్ దృష్టి మాత్రం అమ్మాయిలమీదే వుంటుంది.
    అందర్నీ కూలింగ్ గ్లాసెస్ లో నుంచి చూసాడు. "అటు చూస్తే బాదం హల్వా. ఇటుచూస్తే సేమ్యా పాయసం..." ఎటుచూసినా బందరు లాడ్దూలా ఘుమఘుమలాడే.... అనుకుంటూ,  డైలమాలో పడ్డాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS