Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 1

           

                                     ఈ దేశంలో ఒక భాగమిది!
   
                                         --కొమ్మూరి వేణుగోపాలరావు
   
   
   

                            

    

 

     ఉండటానికి కొంపాగోడూ వున్నా, సరిపెట్టుకోవటానికి, సర్దుకు పోవటానికి ఉద్యోగమో వృత్తో వున్నా, అందచందాలు, తగినంత చదువూ వున్న పెళ్ళాం దొరికినా, ఇంకా కొన్ని సౌకర్యాలు చేసుకోగలిగినా, మనిషి సుఖపడటానికి వీల్లేని రోజులు-పగళ్ళూ వాటితో పోటీపడుతూ రాత్రులూ, ఎంతమంది జీవితాల్లోనో కోకొల్లలు.
   
    పోనీ ఈ దేశంలో-
   
                                * * *
   
    అలాంటి రాత్రులలో ఒకరాత్రి పన్నెండుగంటల వేళ, ఊరికి అందుబాతుగా వున్న ఒక పేటలో, ఓ మోస్తరు అందంగా వున్న మేడమీద తన గదిలో గాఢనిద్రా పరవశుడై వున్న కుమార్ ఉలికిపడి నిద్రలేచాడు.
   
    చెంపమీద చురుక్కుమన్నట్లనిపించింది.
   
    చెంప చురుక్కుమన్నందువల్లే తనకు నిద్రాభంగం కలిగినట్లుగా అతను గుర్తించాడు. ఇంతలో ఉక్కకూడా పోస్తున్నట్లు తెలిసిపోయింది. చెవులకు లయబద్దమైన దోమల సంగీతం వినవచ్చింది. వాటి స్పర్శకూడా వాడిగా శరీరంమీద అక్కడక్కడా గుచ్చుకోసాగింది.
   
    కరెంటు పోయినట్టుంది. పైన ఫ్యాన్ తిరగటంలేదు. గదంతా చీకటి వ్యాపించి వుంది.
   
    అతను ఈ దేశంనుంచి పారిపోవాలని కుర్రతనంగా అనుకున్న కారణాల్లో ముఖ్యమైనవి రెండు - పగలు ఈగలు, రాత్రి దోమలు.
   
    ఫ్యాన్ తిరుగుతున్నంతసేపూ ఆ గాలివేగాన్ని తట్టుకోలేక దూరదూరంగా తారట్లాడిన దోమలు కసిగా ఒక్కసారి విజ్రుంభించినట్లయింది.

    "పాడు కరెంటు" అని అతను విసుక్కున్నాడు. అంతకు మినహా ఏమీ చేయలేడు కాబట్టి. కిటికీ తలుపులు తెరచివున్నా బయట గాలిలేకపోవటం వల్ల సుఖంలేకుండా వుంది.
   
    లేచి కూర్చుందామన్న ఆలోచన వచ్చిందిగానీ, నిద్రపోవాలన్న కోరిక అంతకంటే బలవత్తరంగా వుంది.
   
    ప్రక్కకు ఒత్తిగిల్లుదామని తిరగబోయాడు. తన నడుముమీదుగా చుట్టుకున్న భార్య ప్రభావతి కాలు అతన్ని ఆటంకపరిచినట్లయింది. మెల్లగా చేత్తో ఆమె కాలిని అవతలకి నెట్టి దాన్నుంచి తప్పించుకున్నాడు. గోడవైపు తిరిగాడో లేదో ఆమె మృదుహస్తం వచ్చి అతని కంఠాన్నలంకరించింది.
   
    కుమార్ కి ఏడుపొచ్చినట్లయింది.
   
    మొదట్నుంచీ తన ప్రక్కలో ఎవరయినా పడుకుంటే అతనికి చిరాకు అసలెవర్నీ ఎలోవ్ చేసేవాడుకాదు. మోకాళ్ళు డొక్కలో దూర్చుకుని పడుకోవటం అలవాటు. ఈ అలవాటు పెళ్ళయేవరకూ అవిఘ్నంగా సాగిపోతూ వచ్చింది.
   
    తర్వాత చిక్కు వచ్చిపడింది. కొత్త పెళ్ళికూతురితో ఏరోజుకారోజు ఆనాటి సరదా తీరిపోయాక "నువ్వు పోయి విడిగా పడుకో" అని నాలికదాకా వచ్చికూడా, ఎలా చెప్పాలో తెలియక సతమతమై ఆమె మనస్సుని నొప్పించలేక తెల్లవార్లూ తన ప్రక్కమీదనే పడుకోనిచ్చి తానవస్థపడుతూ వచ్చాడు.
   
    ఎంత వేసవికాలమైనా ఏదో పల్చటిదుప్పటి పైన కప్పుకోకపోయినా, పక్కలో ఎవరన్నా పడుకున్నా అతనికి తోచదు. ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా వుంటుంది.
   
    అయినా పెళ్ళాంమీది ప్రేమకొద్దీ, తీపికొద్దీ భరించాడు. ఆమె అతను కప్పుకున్న దుప్పటి తీసిపారేసేది. అతన్ని కరుచుకుని పెనవేసుకుపోయేది.
   
    బయటకు అతి గంభీరంగా లేకపోతే నంగనాచుల్లా లేకపోతే అమాయకుల్లా కనబడే భార్యాభర్తలు పడకగదుల్లో ఎంత ఒడుపుగా లేకపోతే, ఎంత చిలిపిగా లేకపోతే, ఎంతకసిగా లేకపోతే, ఎంత భీభత్సంగా లేకపోతే, ఎంత చౌకబారుగా వుంటారో చాలామంది ఊహించలేని సంగతి. అనేకులు తామే అలా ప్రవర్తిస్తున్నామని మిగతావారంతా గదుల్లోకూడా చాలా సీరియస్ గా వుంటారని అపోహపడుతూ వుంటారు.

    చాలామంది భార్యాభర్తలు తమ సంతానాన్ని వేసుకుని ఓ సినిమాకి వచ్చి నప్పుడో, లేకపోతే ఏ రైలు ప్రయాణంలోనో కనిపించినప్పుడో, ఆలోచిస్తూ చూస్తే వీళ్ళింతమంది పిల్లల్నెలా కన్నారా అనిపిస్తుంది. వాళ్ళను చూస్తే నమ్మబుద్దెయ్యదు.
   
    అతని ఆలోచనల్లో మళ్ళీ ప్రభావతి మెదిలింది. మొదటి ఆరునెలల్లో ఆమెతో తనకు నచ్చని విషయాలు చెప్పడానికి మొహమాటపడినట్లే "నువ్వు విడిగా పడుకో" అని చెప్పడానికి కూడా మొహమాటపడ్డాడు. అలా పడబట్టి తర్వాత ఇబ్బందుల్లో పడ్డాడు. ఆమెదగ్గిర చనువు అధికమైనకొద్దీ ఆమె తన ప్రక్కలో పడుకోవటం ఇష్టంలేదన్న సంగతి ఆమెకర్ధమయ్యే ప్రయత్నాలు చెయ్యసాగాడు. ఆమె ఇటు పడుకుంటే అతను అటుకేసి తిరిగి ముడుచుకుని పడుకునేవాడు. అతను తన ప్రక్కలోంచి బయటకు త్రోసివేసినంతగా ఆమె ఫీలయ్యేది. అది భరించినా, అతని ముఖం కనబడటంలేదని గోలపెట్టేది. ఆమె మనసు తీర్చడానికన్నట్లుగాను ఒక్కనిముషం ఆమెకేసి తిరిగినట్లే తిరిగి మళ్ళీ అటువైపు దొర్లిపోయేవాడు.
   
    "ఎందుకలా దూరంగా జరిగిపోతారు? నేనంటే మొహం మొత్తిందా?" అనడిగింది ఒకరోజు.
   
    "ఛఛ! ఎంతమాట? నాకు మొదట్నుంచీ వంటరిగా పడుకోవటం అలవాటు ప్రక్కలో ఎవరన్నా వుంటే ఎలర్జీగా వుంటుంది" అని జవాబిచ్చాడు తప్పనిసరిగా.
   
    "ఇన్నాళ్ళూ లేని ఎలర్జీ ఇప్పుడు కొత్తగా ఎక్కడ్నుంచి వచ్చింది? మీరు మారిపోయారు. అవును, మీరు మారిపోయారు". అంది ప్రభావతి ముఖం ముడుచుకుని.
   
    బహుశా "మారిపోయారు" అన్నపదం ఉపయోగించటం వాళ్ళ జీవితంలో అది మొదటిసారయివుంటుంది. తర్వాత్తర్వాత రోజూ భోజనం చెయ్యటంకంటే మంచి నీళ్ళు త్రాగటంకంటే రొటీన్ అయిపోయింది-ఆ పదం ప్రయోగించటం.
   
    అతను స్నేహితులతో తిరిగి ఇంటికి ఆలస్యంగా వచ్చినా, చెప్పవలసిన విషయాన్ని చెప్పటం మరిచిపోయినా, కొన్ని విషయాలు చెప్పటం అవసరమని భావించి చెప్పటం అలక్ష్యం చేసినా, పరధ్యానంగా వున్నా, అసలేమి చేసినా 'మీరు మారిపోయారు' అనటం పరిపాటయిపోయింది.
   
    మొదటి రెండు మూడు నెలల్లోనూ వున్నట్లు, పనులన్నీ మానుకుని గంటల తరబడి పెళ్ళాంతో కబుర్లు చెప్పటం, లేకపోతే సరససల్లాపాలు సాగించటం పనిపాటలు వున్న ఏ భర్తకైనా సాధ్యమా?
   
    అలా చేయలేదని 'మీరు మారిపోయారు' అని నెపంవేసేది.
   
    పెళ్ళయినప్పుడు అతనింకా స్టూడెంటు. కొన్నాళ్ళు కాపురంకూడా వెలగబెట్టాడు. మధ్య మధ్య పరీక్షలుకూడా తప్పాడు. అందుకని భార్యతో కబుర్లు చెప్పడానికి, అస్తమానమూ ఆవిడని అంటిపెట్టుకుని తిరగటానికీ అవకాశం వుండేది.
   
    కానీ ఇప్పుడు తను డాక్టరు. ఇంటిబాధ్యత, పేషెంట్లు, డబ్బు సంపాదనలు ఇలా ఎన్నో సమస్యలు నెత్తిమీద వున్నాయి. ఆమెతో తీరుబాటుగా గంటల తరబడి మాట్లాడటానికీ, కరువుతీరా కాలక్షేపం చేయడానికీ అవకాశమూ లేదు, అభిరుచీ లేదు.
   
    మనిషి ఆలోచన్లకు అర్ధం వుండదు. ఉండకపోగా ఎంతో అవకతవకగా కూడా వుంటాయి. ఏ సమయంలో ఏది జ్ఞాపకం వస్తుందో, దేన్నిగురించి మనసు పరిపరివిధాల పోతుందో చెప్పటం కష్టం.
   
    అతను ప్రభావతిని గురించి ఆలోచించటం మాణి, ఎంతో జాగ్రత్తగా, ఆమె చేతిని తన మెడమీదనుంచి విడతీసి, ఇంకా కొంచెం అటువైపుగా జరిగాడు. అతనికాశ్చర్యంగా వుంటుంది. ఇదే స్వరూపం ఎంతదూరంలో వున్నా ఒక్కోసారి ఎంతో మోహావేశం కలిగిస్తుంది. కొన్ని సమయాలలో ఎంత దగ్గరగా వున్నా ఏ వికారమూ కలిగించదు.
   
    ఏ మాత్రం కదిలినా వంటికి గోడ తగులుతూ చిరాకు కలిగిస్తోంది. ఫ్యాన్ లేకపోవటంవల్ల ఎప్పుడూ అలవాటుపడ్డ ప్రాణమేమో, మరింత దుస్సహంగా వుంది.
   
    అతి ప్రయత్నం చేసినమీదట కొద్దిగా కునుకు రాసాగింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS