Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 2


    చీకటిలోంచి వెలుతురులోకి రాగానే కొన్ని క్షణాలపాటు కళ్ళు చీకట్లు కమ్మినట్లయింది. చూడగలిగిన తక్షణం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. భయాశ్చర్యాలతో కూడిన అవ్యక్త ధ్వని వెలువడింది ఇద్దరి కంఠాలనుంచి ఒకేసారిగా.
    "మీ బట్టలనిండా వంటినిండా రక్తం వరకలు?" అంది అనిల.
    "మీరూ అలాగే ఉన్నారు"
    తనను తను చూసుకుంది. ఎవరో రక్తంతో చెయ్యి ముంచి వంటిమీద చిలకరించినట్లుగా - చిరు రక్తపు జల్లు పడినట్లుగా ఉంది. శరీరం-స్పర్శకు చాలాజ్ జిగటగా ఉంది.
    "అటు చూడండి" చూపించాడు రవి. అక్కడ నిలబడి ఉన్నది త్రిసికి. అందమైన కొండజాతి అడవిపిల్ల. మెడనిండా పూసల పేర్లు. ముఖానికి పసుపు. పెద్ద కుంకుమ బొట్టు అనాగరికంగా ఉన్న చీరకట్టు.
    కూలి జనం ఎవరూ అక్కడ లేరు. కిందకు వెళ్ళిపోయారు. కొండ మీదనుంచి చూస్తోంటే చీమల్లా ఉన్నారు. వాళ్ళ హావభావాలు తెలుసుకోవటం కాని, మాటలు వినటం కాని అసంభవం.
    త్రిసికి మాత్రమే నిలబడి ఉంది. ఒంటరిగా...తూర్పు వైపు తిరిగి చేతులెత్తి ఏవో మంత్రాలు చదువుతోంది. అతి నెమ్మదిగా...
    ఆమెను సమీపించబోయాడు రవి.
    "వద్దు" అన్నట్లు అతడి చెయ్యి పట్టుకుంది అనిల.


                             *    *    *    *


    "మనకి అర్జంటుగా సహాయం కావాలి?" విసుగ్గా అన్నాడు రవి.
    "ఆమె ధ్యానంలో ఉంది డిస్టర్బ్ చెయ్యకూడదు"
    "దొంగ ధ్యానాలు"
    "కాదు"
    "ఎలా చెప్పగలరూ?"
    "మా ఇంట్లో మా తాతయ్య ధ్యానం చేసేవారు. ఆ సమయంలో ముఖకవళికలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలేవీ ఆమెకు వినిపించవు. కాదు-వినదు"
    "అయితే కావచ్చు కానీ, మనం వాళ్ళని గుహలో ఆ స్థితిలో ఎక్కువసేపు ఒదిలెయ్యడం ప్రమాదం."
    "ఏం చేద్దామని?"
    "ఒక చిన్న గునపం, పొడుగ్గా ఉన్న మోకు కావాలి. గునపం ఇక్కడ లోతుగా పాతి, దానికి మోకు కట్టి ఒక చివర నా నడుముకు కట్టుకుని గుహలోకి దిగి వాళ్ళని బయటికి తీసుకురావాలి."
    కొంచెం భయంగా చూసింది.
    "ఈ పని మీరు చెయ్యగలరా?"
    "ఇది నాకు బాగా అలవాటు. అనేక యెక్స్ కవేషన్స్ లో ఆ రకంగా ఎన్నో సమాధులలోకి దిగి చాలా అస్థిపంజరాలు బయటికి తీశాను."
    "అయితే మనం కిందికి వెళ్దామా?"
    "మీరు ఎక్స్ కవేషన్స్ కి రావటం కొత్తా?"
    "అలా అడిగారేం?"
    "ఈ గ్రామీణుల సంగతి బొత్తిగా తెలియనట్లు మాట్లాడుతుంటేనూ...మనం ఇలా రక్తం మరకలతో వాళ్ళముందు నిలబడ్డామంటే సహాయం మాట అలా ఉంచి మనమే దయ్యాలమనుకుని పారిపోతారు. లేదా, ముందు భయంతో మనల్ని చంపేసి, ఆ తరువాత మనకి గుడికట్టి పూజలు చేస్తారు."
    "పూజలు దేనికి?"
    "చచ్చిపోయిన మనం వాళ్ళని ఏమీ చెయ్యకుండా...."
    నవ్వింది ఆ నవ్వులో నిట్టూర్పు ఉంది.
    అంతలో త్రిసికి మంత్రాలు చదవటం ఆపి ఇటు తిరిగింది. వీళ్ళను చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. సంతోషం వల్ల వచ్చిన ఆ మెరుపును ఇద్దరూ గమనించారు. అయితే అంత సంతోషం ఎందుకో అర్థంకాలేదు.
    "మాకు నీ వల్ల ఒక సహాయం కావాలి" అన్నాడు రవి త్రిసికిని ఉద్దేశించి. ఆమె సమాధానం చెప్పలేదు. ముఖ భంగిమలని బట్టి తన మాటలు ఆమె విందో లేదో కూడా తెలియటంలేదు. అప్పటి పరిస్థితిని బట్టి రవికి ముందు చికాకు కలిగింది. అంతలో నరసింవ్వ మాటలు గుర్తొచ్చాయి.
    "త్రిసికి ఎప్పుడూ ఎవ్వరితోనూ మాట్లాడదు. మౌనం వహిస్తుంది. ఎంతో అవసరమైనప్పుడు ఒకటి రెండు మాటలు అతి క్లుప్తంగా మాట్లాడుతుంది. అది ఆమె వ్రతం. ఆమె ద్వారా దేవతలు మాట్లాడతారు."
    భాష ఇది కాకపోయినా ఇదే భావాన్ని తన భాషలో చెప్పాడు.
    "మాతో వచ్చిన మరో ఇద్దరు గుహలో తెలివితప్పి పడిపోయారు. వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఒక పొడుగాటి మోకు, చిన్న గునపమూ, పెద్ద సుత్తీ తీసుకురావాలి."
    త్రిసికి కళ్ళలో వెనుకటి మెరుపు మళ్ళీ కనిపించింది. వాయు వేగంతో ఒక క్రమంలో లేని మెట్లన్నీ దిగి కావలసిన వస్తువులతో, అంత ఎత్తూ పది నిముషాల్లో ఎక్కి వచ్చింది.
    కొండరాళ్ళు పగిలి నేల కనపడుతున్న చోట గునపం పాతి దానికి మోకు బిగించాడు. ఒకసారి గట్టిగా లాగి చూసుకున్నాడు. టార్చిలైట్ ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. మోకు రెండవవైపు తన నడుముకి గట్టిగా బిగించుకున్నాడు. గుహలోకి దిగాడు. కొన్ని నిముషాల్లోనే ముందు జెన్నిఫర్ ని అందించాడు. త్రిసికి, అనిల ఇద్దరూ కలిసి అందుకున్నారు ఆమెని. విష్ణువర్ధన్ ని ఒక రకంగా ఈడ్చుకుంటూ వచ్చాడు రవి. అతడిది బాగా స్థూలకాయం. మొయ్యటం కష్టం. గట్టిగా ప్రయత్నిస్తే ఒకవేళ మోకు తెగిపోతుందేమోనని భయపడ్డాడు. శరీరం కొంచెం గీసుకుపోయినా, ప్రాణాలు నిలవాలని అలా చేశాడు.
    అతడిని అందుకోవడం అనిలా త్రిసికిలకి కూడా అంతే కష్టమయింది. వాళ్ళూ ఒకరకంగా అతడిని బయటికి ఈడ్చారు. తర్వాత రవి బయటికి వచ్చాడు.
    "థాంక్యూ" అన్నాడు త్రిసికితో.
    అప్పటివరకూ అంత సహాయం చేసిన ఆమె చలనం లేకుండా నిలబడింది భావరహితంగా.
    వాటర్ బాటిల్ లో నీళ్ళు జెన్నిఫర్, విష్ణువర్ధన్ ల మీద చల్లారు. ఇద్దరూ కొద్దిసేపట్లోనే తెప్పరిల్లారు. వాళ్ళ ఒంటిమీద కూడా రక్తపు జల్లు ఉంది. ఇంకా ఎక్కువగా ఉంది.
    ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని భయంతో అవ్యక్త ధ్వనులు చేశారు. కొద్దిసేపట్లోనే కొన్ని సంవత్సరాలుగా జైల్లో ఉన్నట్లు పాలిపోయి ఉన్నాయి ఇద్దరి ముఖాలూ.
    "వాటీజ్ దిస్ బ్లడ్?" అడిగింది జెన్నిఫర్.
    "తెలీదు. అవన్నీ తర్వాత ఆలోచించుకోవాలి? నేను ముందు ఆ విగ్రహాల కింద ఉన్న లిపిని నోట్ చేసుకోవాలనుకుంటున్నాను."
    "ఇప్పుడా?" నీరసంగా అన్నాడు విష్ణువర్ధన్.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS