Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 2

"చూస్తారు కాసేపట్లో!" అంది నర్సు.
"నేను వచ్చేస్తున్నాను."
పది నిమిషాల తర్వాత రూము బయట అడుగుల చప్పుడు వినబడింది.
నర్సు బయటికి తొంగి చూసి, "అమ్మ వస్తున్నారు" అంది.
ఆ మాట వినగానే చేతులు మంచానికి ఆనించి ఆతృతగా లేచి కూర్చోబోయింది భానురేఖ. అప్రయత్నంగా ఆ అమ్మాయి చూపులు తన చేతుల మీద పడ్డాయి.
వెంటనే అదిరిపడింది.
పెద్దవాళ్ళ చేతుల్లాగా బాగా పొడుగ్గా, నాజూగ్గా ఉన్నాయి తన చేతులు!
తనకి నిజంగా మెలకువ వచ్చిందో, లేకపోతే ఇదంతా కలలో జరుగుతోందో అర్థంకాలేదు భానురేఖకి.
గది గుమ్మంలో అడుగుపెట్టి, భానురేఖని చూస్తూ ఆగిపోయింది ఒక స్త్రీ.
ఆర్తీ, ఆనందం రెండూ కలిసిన కంఠంతో "అమ్మా!" అని అనడానికి నోరు తెరిచింది భానురేఖ.
 కానీ ఆ మాట గొంతులోనే ఆగిపోయింది.
ఆవిడ అమ్మకాదు!
మరి అమ్మేది? ఇంకా ఎందుకు రాదు?
చెప్పలేనంత నిరుత్సాహం ఆవరించింది భానురేఖని.
సంకోచంగా లోపలికి వచ్చింది ఆ స్త్రీ. విస్మయం కనబడుతోంది ఆమె మొహంలో. "ఎలా ఉంది భానురేఖ?" అంది మెల్లగా.
ఆమెని ఆపాదమస్తకం పరికించి చూసింది భాను.
"మీరు....మీరెవరు ఆంటీ?"
"ఆంటీ కాదమ్మా! నేను అమ్మని!"
వెర్రిగా చూసింది భానురేఖ. ఏమంటోంది ఈవిడ?
అమ్మనా? ఎవరికి అమ్మ?
బయట హడావిడిగా బూట్ల చప్పుడు వినబడింది. డాక్టర్ గారు లోపలికి వచ్చారు. ఆయన మొహంలో కూడా ఎగ్జయిట్ మెంట్ కనబడుతోంది. భానురేఖ కేసు చాలా విచిత్రమైనది. అది ఆయనకు బాగా తెలుసు.
"మిసెస్ రఘురాం!" అనబోయి, సకాలంలో తమాయించుకుని, "విలాసినిగారూ! మీరు కాసేపు భానూని ఒంటరిగా ఉండనిస్తే మంచిది. లెట్ హర్ టేక్ కంప్లీట్ రెస్ట్ ఫర్ ఏ వైల్! ఇవాళ పూర్తిగా చెకప్ చేసి, అంతా సంతృప్తికరంగా ఉంటే రేపు డిశ్చార్జ్ చేస్తాం" అన్నాడు. తర్వాత భాను మీదికి వంగి, "హౌ ఆర్ యూ భానూ?" అని పలకరించి, పరీక్షలు చెయ్యడం మొదలెట్టాడు.
విలాసిని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
డాక్టర్ తనని పరీక్ష చేస్తుంటే ఆయనని పరీక్షగా చూస్తోంది భాను. ఆయన తన పాదాలు తాకి చూస్తున్నాడు.
ఉలిక్కిపడింది భానూ. తన పాదాలు అంత దూరంలో ఉన్నాయేమిటి తనకి? దాదాపు మంచం అంచుని తాకేంత పొడుగు ఉన్నాయి తన కాళ్ళు! మంత్రం వేసినట్లు ఉన్నట్లుండి ఇంత పొడుగ్గా ఎలా అయిపోయింది తను?
కాదు! ఇదేదో పీడ కల అయి ఉంటుంది! ష్యూర్!
పీడ కలలు వస్తే ఆంజనేయ దండకం చదువుకోమని చెబుతుంది అమ్మ ఎప్పుడూ! మనసులో చదువుకోవడం మొదలెట్టింది భానురేఖ. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్య....
మెల్లిగా మళ్ళీ నిద్రపట్టేసింది తనకి.

                                                               * * * *

నగరంలోని ప్రముఖ వైద్యులందరూ ఆ హాస్పిటల్ లోనే ఉన్నారు. మెడికల్ హిస్టరీలోనే సంచలనం కలిగించిన ఆ కేసు సంగతి వాళ్ళందరికీ తెలుసు. ఎనిమిదేళ్ళ క్రితం కారు యాక్సిడెంటులో తలకీ, వెన్నెముకకీ గాయాలు తగిలి కోమాలో వుండిపోయిన భానురేఖ, ఇన్నేళ్ళ తర్వాత హఠాత్తుగా స్పృహలోకి రావడం వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
రకరకాల పరీక్షలు చేసి, ఆమెకి పూర్తిగా ఆరోగ్యం చేకూరిందని నమ్మకం కుదిరాక, భానురేఖని డిశ్చార్జ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నారు డాక్టర్లు.
పదేళ్ళ పసిపిల్లగా హాస్పిటల్లో చేరిన భానురేఖ, ఎనిమిదేళ్ళ తర్వాత పద్దెనిమిదేళ్ళ పరువంలో ఉన్న యువతిగా హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చింది.
ఇలాంటి కేసులు చాలా అరుదే గానీ అసంభవం మాత్రం కాదు.
ఈ ఎనిమిదేళ్ళలో ఆమె శరీరంలో పెరుగుదల మామూలుగానే ఉంది.
కానీ మనసు మాత్రం వికసించలేదు.
హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యేసరికి ఆమె "మానసిక వయసు" ఇంకా పదేళ్ళ కిందే లెఖ్ఖ!
పద్దెనిమిదేళ్ళ శరీరంతో, పదేళ్ళ పాప మనసుతో ఇంటికి తిరిగి వచ్చింది భానురేఖ.
ఇల్లంతా మారిపోయి ఉంది. డెకరేషన్ ఇదివరకులా కళాత్మకంగా లేదు. చాలా గాడీగా, ముదురు రంగులలో ఉన్నాయి. కర్టెన్లు మొదలుకుని కాలెండర్ల దాకా అన్నీ.
ఇంట్లోకి రాగానే, గోడవైపు చూసింది భానురేఖ. అక్కడొక పెద్ద ఫోటో వుండాలి. తనూ, అమ్మా, నాన్నగారూ కలిసి మేడ మీద కలిసి తీయించుకున్న ఫోటో అది.
కానీ ఈ ఫోటోలో తాము లేరు! హాస్పిటల్ కి వచ్చిన విలాసిని అనే ఆమె, నాన్నగారూ ఉన్నారు. వాళ్ళిద్దరి భుజాల మీదా చెయ్యివేసి, వెనక నుంచి కొంటె నవ్వు నవ్వుతోంది ఒక చిన్న పిల్ల!


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS