Next Page 
అహో! విక్రమార్క పేజి 1


                                 అహో! విక్రమార్క

                                              _ సూర్యదేవర రామ్ మోహన్ రావు


    నజాయతే మ్రియతే వా కదా చి    
    న్నాయం భూత్వా భవితా వాన భూయః
    అజోనిత్య శ్శాశ్వతోయం పురాణో
    న హన్యతే హన్యమానే శరీరే...

 

    ప్రాణుల శరీరంలోని ఆత్మ నిత్యమైనది. సత్యమైనది. అనాదియైనది. అలాగే ఆత్మకు జనించుట, మరణించుట అనునవి కూడా లేవు.

 

    ఆత్మకు చాంచల్యము లేదు. భౌతికమైన శరీరము మాసిపోయి మట్టిలో కలిసినా, ఆత్మకు చావు లేదు.

 

    వాసాంసి జీర్ణాని యధా విహాయ
    నవాని గృహ్ణాతి నరోపరాణి
    తధా శరీరాణి నిహాయ జీర్ణా
    న్యన్యాని సంయాతి నవాని దేహీ

 

    మానవుడు మాసిన బట్టలను మార్చివేసి కొత్తవానిని ధరించినట్లుగా, ఆత్మలు జీర్ణించిపోయిన దేహమును వదిలి కొత్తదైన శరీరమును ధరించును.

 

                                                           - భగవద్గీత

 

                                          *    *    *    *

 

    జనన మరణాల్లా పునర్జన్మ కూడా తిరుగులేని ఆధ్యాత్మిక సత్యం అని భారతీయ సంస్కృతి నమ్ముతోంది. పునర్జన్మ అరుదైన ఒక శాస్త్రీయ సంఘటన అని విదేశీ శాస్త్రజ్ఞుల నమ్మకం.

 

    జనన, మరణాల వలయం నుండి కొంతమంది యోగులు, తపో సాధకులు బయటపడి ముక్తి పొందినట్లుగా, పునర్జన్మ సాధించినట్టుగా భారతీయ ప్రాచీన గ్రంథాలు చెపుతున్నాయి.

 

    ఆది శంకరాచార్యుల- "పునరపి జననం- పునరపి మరణం, పునరపి జనని, జఠరేశయనం" అని పునర్జన్మ తత్వాన్ని విశదీకరిస్తే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు "ధృవం జన్మ మృతస్యచ" అని ఆర్యవాక్కుకి సూత్రీకరణ చేయడం జరిగింది.

 

    మృత్యువు తర్వాత కూడా ఆత్మ జీవించి వుంటుందని, ఈ మానవ దేహాన్ని వదిలి మరో శరీరాన్ని ఆశ్రయిస్తుందని ఋషులు చెప్తున్నారు.

 

                             *    *    *    *

 

    ఒక సనాతన కుటుంబంలో ఒక కన్య జన్మించింది. ఆమె పేరు వేదవతి. వేదవతి ఆజన్మ బ్రహ్మచర్యం స్వీకరించి, చిన్నప్పట్నుంచే తపస్సు చేయడం ప్రారంభించింది. భగవంతుడ్ని భర్తగా పొందాలని ఆమె అనుకుంది. మే అపూర్వ సౌందర్యవతి.

 

    ఒకరోజు రావణుని చూపు ఆమెపై బడింది. అతనిలో దుర్భుద్ధి పుట్టింది. ఆమెను సమీపించాడు, వేదవతి తేజస్సుకు అతని కళ్ళు తిరిగిపోయాయి.

 

    వేదవతి అతనిని- "ఒకనాడు ఒక పతివ్రతను తాకిన నేరానికి నువ్వు నాశనమవుతావు" అని శపించి మళ్ళీ ఆమె తపస్సులో లీనమైపోయింది.

 

    వేదవతి తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆమె తన కోరిక తెలియపరిచింది.    

 

    కొన్నాళ్ళు స్వర్గంలో లక్ష్మీదేవిగా వుండి భూలోకంలో నువ్వు అవతరిస్తావు. నన్ను పొందగలుగుతావు. అయితే విరహంలో మాత్రమే అది నీకు సాధ్యపడుతుంది- అని భగవంతుడు ఆమెకు వరమిస్తాడు.

 

    ఈ విధంగా ఛాయాసీత జన్మించింది.

 

    రావణుడు సీతను అపహరించేసరికి, అసలు సీత అగ్నిప్రవేశం చేస్తుంది.

 

    రావణుడు ఛాయాసీతను అపహరిస్తాడు. అగ్నిపరీక్షలో ఛాయాసీత అదృశ్యమవుతుంది. తపస్సు చేస్తుంది. ఆమె ఘోరతపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమవుతాడు. ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. తపస్సమాధిలో మునిగి వుండడం, విరహంతో వేగిపోవడంవల్ల ఆమె తన మనస్సులోని వాక్యం పూర్తిగా చెప్పలేక భర్త... భర్త.... అని అయిదుసార్లు ఉచ్ఛరిస్తుంది. 'తథాస్తు' అంటూ శంకరుడు అదృశ్యమవుతాడు.

 

    మొదటి జన్మలో వేదవతి, రెండవజన్మలో ఛాయాసీత, మూడవ జన్మలో ద్రౌపది అయింది.

 

    ఆధ్యాత్మ రామాయణం, తులసీదాసు రామచరిత మానస్ లలో సీత పునర్జన్మ గురించి కథ ఇది.

 

    ఋషిప్రోక్తాలైన పౌరాణిక గాథల వెనుక నమ్మకాలు బలమైన ఆధారాలైతే, ఆధునిక మానవచరిత్రలో అరుదైన పునర్జన్మ వృత్తాంతాలు, ప్రపంచ శాస్త్రజ్ఞులకు పరిశోధనలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

 

                            *    *    *    *

 

    The after life has not been 'thought up, it is not a rational construction of a religious philosophy that has been, imposed on belivers, it has sprung from with in the hearts of masses, of men and women, a sort of  consensus genium, inside out, a hope beyond and above the rational a longing for the warm sun of eternity.'  

 

    It is axiomatic, It is to the soul what oxygen is to the lungs.

 

                                        *    *    *    *

 

    దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు పూర్వం హంపీ విజయనగరం.... రాజమందిరంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర ఆలోచనామగ్నుడై వున్నారు.

 

    నిలువెత్తు భారీ విగ్రహం, ఆకర్ణాంత విశాల నేత్రాలు. ఆ నేత్రాలు శత్రురాజుల గుండెల్ని చీల్చడానికి సిద్ధంగా వాడి కరవాలాల్లా వున్నాయి.   

 

    అరుణ కషాయితమైన ఆ నేత్రాలవైపు మహారాజు ప్రతిస్పందన కోసం ప్రక్కనే నిల్చున్న మహామంత్రి రాజ్యాంగ యుద్ధతంత్రవేత్త అయిన అప్పాజీ ఎదురుచూస్తున్నాడు.

 

    సంధ్యాసమయం నిశ్శబ్దంగా వుంది.

 

    ఇటు వున్న తుంగభద్రా నది, అటు వున్న కృష్ణానది పైనుంచి చల్లనిగాలి వీస్తోంది.

 

    అప్రయత్నంగా శ్రీకృష్ణదేవరాయల ఎడమచేతి వేళ్ళు మీసంవైపు కదిలాయి.

 

    మీసాన్ని మెలిపెడుతూ, ఆయనొక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి అనువుగా, ఆయన గంభీరమైన కంఠంలోంచి మాటలు మృదంగధ్వనితో వినిపించాయి. "అప్పాజీ... తప్పదు. ఉదయగిరి దుర్గాన్ని మనం వశం చేసుకోక తప్పదు"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS