Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 46

ఆమర్నాడు సత్యం గారు, యాజులుగారు, మూర్తిగారింట్లో సమావేశమయ్యారు.
"నిన్న మీరు వెళ్ళారా?" అన్నాడు మూర్తి.
ఏమంటే ఏమవుతుందో తెలీదు గనక,యాజులు అటూ ఇటూ అర్ధమొచ్చేలాగా తలపంకించాడు. మూర్తిగారు సత్యం కేసి చూశాడు.
"పెళ్ళాం" అన్నాడు సత్యం.
"ఎలా ఉంది?" అని మూర్తిగారడగలేదు. సత్యమే చెప్పుకొచ్చాడు.
"మిమ్మల్ని అంచనా వేయడం చాలా కష్టమండీ మూర్తిగారు అంతంత మాత్రపు వాళ్ళనయితే మీరూ రికమెండ్ చెయ్యరని నాకు తెలుసు ననుకోండి! కానీ ఏ మూలనో రవంత అనుమానం పట్టుకు పీడిస్తూంది. నిన్నావిణ్ని చూశాక -" అని  ఆగిపోయాడు సత్యం.
అంటే విజయ మనవాడికి నచ్చినట్లేనని అర్ధం చేసుకొన్నాడు యాజులు.
"ఎందుకైనా మంచిదని నిన్న బాస్ గారూ, నేనూ, తమ పి.ఏ. గారూ ఆ అమ్మాయిగారిని చూడ్డానికి వెళ్ళామండీ! ఓహోహో! ఏం స్ట్రక్చర్, ఏం ఫినిషింగ్, ఏం బ్యూటీలెండీ! వాయిస్ ఎలా వుంటుందోనని నాలుగైదు నిమిషాలు సత్యంగారు మాట్లాడించి చూశారు. గొంతుకూడా వారికి బాగా నచ్చింది లెండి!" అన్నాడు యాజులు.
మూర్తిగారు నవ్వి లోపలకు వెళ్ళారు.
"బాబుగారు ధర్మరాజు లాంటివారు సత్యంగారూ! కొత్త కంపెనీ వాళ్ళొస్తే  వారికి చాతనయినంత సాయం చేయిందే నిద్ర పట్టదాయనకు. అదే ఆ రావుగారయితేనా ఇప్పటికి మిమ్మల్ని పీల్చి పిప్పిచేసి ఉందురు. ఆ పుణ్య పురుషుడికి డబ్బు తప్ప మరో యావే లేదు రూపాయి ఖర్చు చేస్తున్నాం అంటే, దాని మూలంగా పది రూపాయలు వస్తున్నాయో లేదో చూస్తాడు. అంతా బిజినెస్ ఔట్ లుక్ - మన అయ్యగారున్నారు  చూశారా - ఫక్తు దానికి వ్యతిరేకం! పది రూపాయలివ్వడమే తెలుసు గానీ, పది పైసల లాభం వస్తుందో లేదో వారు చూడరు..బాబూ! అనకూడదుగానీ - మూర్తిగారు ఈ చేత్తో సంపాదించి, ఆచేత్తో అలా ఖర్చు చేస్తూ ఉంటారు. అంచేత మనవాడి దగ్గర ఎప్పుడూ, వందలే తప్ప వేలు ఉండవు అయ్య బాబో! వారిది ఎముకలేని చెయ్యి కాదుటండీ!"
పి.ఏ. గారి ధోరణి అంతూ పంతూ కనిపించడం లేదు. ఈ పంపిణీ మీద ఆయనదారెంత సేపయినా మాట్లాడ గలరు. ఐతే అసలీ ధోరణికి కారణమేమిటో, యాజులుకు తెలియలేదు. ఆయనోసారి చుట్టూ చూశాడు. మేడమీద కిటికీలో మూర్తిగారి తమ్ముడు కూచున్నాడు.           
పి.ఏ. సన్నగా నిట్టూర్చి పైకి చూశాడు. మూర్తిగారి తమ్ముడు కిటికీ రెక్కలు మూసేశాడు.
"ఊఁ తరవాత?" అన్నాడు యాజులు విషయాన్ని కదలేస్తూ.
"మనం రేపో ఎల్లుండో మంచిరోజు చూసుకొని, విజయతో ఎగ్రిమెంటు రాసుకొందాం. అప్పుడే -ఎంతో కొంత ఎడ్వాన్స్ గా ఇచ్చేద్దాం." అన్నాడు పి.ఏ.
"పిక్చర్ కి ఏమాత్రం ముట్టచెబితే  బావుంటుందో కూడా తెలిస్తే తీరిపోనే!" అన్నారు యాజులు.
పి.ఏ.గారు సత్యం చూడకుండా యాజులకు కన్ను మలిపాడు. అతగాడు పిల్ల దగ్గులు దగ్గుకుంటూ అవతలకు వెళ్ళాక పి.ఏ. సరాసరిగా సత్యాన్ని ముగ్గులోకి దింపాడు.
"నాకు తెలియదు" అన్నాడు సత్యం.
"తెలియకపోవడానికి దేమన్నా బ్రహ్మవిద్య  గనకనా సత్యం గారూ! విజయ మన  ఆర్టిస్టు. ఈ రోజునుండి మన చెప్పుచేతుల్లో ఉండే మనిషని చూశారుగా, ఎంత స్పోర్టివ్ గా ఉంటుందో! మనమో వెయ్యి అదనంగా పారేస్తే పొయేదేమీ లేదు. ఆ వార మీకు ఏదో రూపములో ముట్టనే ముడుతుంది. ఆర్టిస్టును ఉల్లాసపరచి, మనం వ్యవహారాలను నడుపుకోవాలి గానీ - మరీ గిరిగీసినట్టుగా ఉన్నామనుకోండి, ఆవిడా అలాగే వుంటుంది" అని సలహా ఇచ్చాడు పి.ఏ.
"అసలెంత ఇద్దామంటారు?" అన్నాడు సత్యం.
"ఆ అంకె ఏమాత్రముంటుందో  మూర్తిగారినే చెప్పనిద్దాం. మన కంపెనీకోసం ఇన్ని పనులు చేసి పెట్టినవారు, ఈ కాస్త పనీ వారు చెయ్యకపోరు. వారు చెప్పిన అంకెమీద ఉపరిగా మనమో వెయ్యి పారేస్తే మనిషి మన డిస్పోజ్ లో ఉంటుంది."
"విజయ చాలా బాగుంటుంది గదూ?" అన్నాడు సత్యం మధ్యలో అడ్డుపడి.
ఆవులించకపోయినా పేగులు లెక్కపెట్ట గలిగిన పి.ఏ. గారు, సత్యంలో కలిగిన మార్పును పసిగట్టాడు.
"నేనొక్కటి చెబుతాను వినండి సత్యంగారూ! ఈ ఇండస్ట్రీలో పైకి రావడానికి లక్ కావాలి. మిగతావేమీ దమ్మిడీకి పనికిరావు. ఇప్పుడు ఫైల్లో వున్న ఏ హీరోయిన్ కూ విజయ తీసిపోదు. మేకప్ లేకుండానే ఆవిణ్ను షూట్ చెయ్యవచ్చు. మార్వొలెస్ బ్యూటీ! కానీ అదృష్టం లేదు, అలా మూలాన పడిపోయింది. నేనన్నానని కాదుగానీ మీరే చెప్పండి! చాలామంది స్టార్స్ కన్నా విజయ అందంగా ఉంటుందా, లేదా?" అన్నాడు పి.ఏ.
సత్యం ఏమీ మాట్లాడకుండా తలవూపి, హఠాత్తుగా పి.ఏ. వేపు కొరకొరలాడుతూ చూశాడు.
"నిన్న మిమ్మల్ని వెనక్కి పిలిచిందిగదా విజయ, ఎందుకండీ?" అన్నాడు సత్యం.
"ఆవిడే చెప్పిందిగా జేబుగుడ్డ కోసమని."
"చెప్పిందనుకోండి. దానికోసం అంత ఆలస్యమయిందెందుకు?" అన్నాడు సత్యం.
"ఈ చవట రాత్రల్లా దీన్ని గురించే ఆలోచించి వుంటా"డనుకొన్నాడు పి.ఏ. అతనో క్షణం ఆలోచించి మందహాసం చేశాడు.
"మీరిలా ప్రతిదాన్ని నిగ్గదీసి అడిగితే, నాబోటి వాడు చచ్చిపోతాడు సత్యంగారూ!....ఇంకో సంగతేమిటంటే కొన్ని విషయాలు ముందుగా చెప్పడం వల్ల అనేక చిక్కులొస్తాయి-"
"ఏమిటో చెప్పితీరాలి" అన్నాడు సత్యం.
పి.ఏ. గారు అటూ ఇటూ ఎవరన్నా ఉన్నారేమోనన్నట్లుగా చూసి, కుడి చేతిని ముందుకు చాపుతూ" మళ్ళీ ఎక్కడా అనరుగదా?" అన్నాడు.
సత్యం చేతిలో చెయ్యి వేశాడు.
"నాకైతే ఆవిడ మనసులో ఉద్దేశం తెలీదు. మే ఎడ్రస్ మాత్రం నన్నడిగింది. నాకు తెలీదన్నాను. జ్ఞాపకం చేసుకొని చెప్పమన్నది. రేపు చేబుతానన్నాను. రేపటి దాకా ఆగవలసిందేనా అన్నట్టు చూసింది!" అన్నాడు పి.ఏ.
సత్యం శరీరం గగుర్పొడవటం పి.ఏ. గమనించాడు.
"నా ఎడ్రస్ ఎందుకండీ? పనేమిటో అడక్కపోయారా పోనీ?" అన్నాడు సత్యం.
పి.ఏ. ఓ నమస్కారం చేసి చెంపలు వాయించుకొన్నాడు.
"సత్యంగారూ! నాలాంటివాడు అంత   దూరం వెళ్ళడం భావ్యం కాదు."
"అయితే ఇప్పుడు నన్నోసారి వెళ్ళమంటారా ఏమిటి?" అన్నాడు సత్యం.
"ఈవేళప్పుడు విజయ ఇంట్లో ఉంటుందనుకోను. ఆవిడకేదో పిక్చర్ లో చిన్న వేషమున్నదట....పోనీ రాత్రికి వెళ్ళండి -లేదా - రెండు రోజులు ఓపిక పడితే, మన ఆఫీసుకే వస్తుంది.!"
"అనవసరంగా టైం వేస్టు కావడం నా కిష్టం లేదండీ! ఇవ్వాళ వెడతాను" అన్నాడు సత్యం.
"నీరోగం కుదిర్చాలే గాడిద కొడకా, నువ్వింతట్లో  మనిషివి కావు" అనుకొన్నాడు పి.ఏ.
అతనికక్కడ కూచోబుద్దికాలేదు.. తలలో కందిరీగల రొదలాంటి దేదో బయలుదేరింది. మధ్యాహ్నం నుండి తను రానని మూర్తి గారికి చెప్పేసి బయలుదేరాడు. తిన్నగా విజయ ఇంటికొచ్చాడు.
"రండి రండి!" విజయ నవ్వుతూ, "మీకోసమనే ఎదురు చూస్తున్నాను. ఇంతాలస్యమయిందేం?"
"నేనీ పూట వస్తానని అనలేదే!" అన్నాడు పి.ఏ.
"అనలేదు గానీ - అరే నిలబడే ఉన్నారేమండీ, ముందు కూచోండి!"
పి.ఏ. వసారాలో కూచోలేదు. గదిలో కొచ్చి, వాకిలికి వో పక్కగా కుర్చీలాక్కుని కూచున్నాడు.
"మీరింకా భోజనం చేసినట్లులేదు. పోనీ...."
"నాకాకలిగా లేదు" అన్నాడు పి.ఏ.
"అదేం?" అన్నది విజయ.
"నిజం చెబుదామా?" అనుకొన్నాడతను, కానీ "నిన్ను చూశాక ఆకలి కాస్తా ఎగిరి చక్కా పోయిం"దనడం మర్యాదగా ఉంటుందా?
"మాట్లాడరేమండీ బాబూ! ఆ దిక్కుమాలిన ఆఫీసు వ్యవహారాలు కాస్సేపు మరిచిపోదురూ!....మరి వడ్డించేస్తున్నాను. మీరొస్తారుగదాని నేనూ అన్నం తినకుండా కూచుంటే, మీరేమో ఆకలిగా లేదంటారేం! ఉన్నంతవరకే తినండి! పోనీ చారూ, పెరుగుతో రెండు ముద్దలు తినేద్ధురు గాని!"
"వొద్దులెస్తూ!" అన్నాడు పి.ఏ.
నిజంగా అతనికి అన్నం మీద  ధ్యాసలేదు.
"నేను గోరుముద్దలు తినిపించాననుకోండి! అప్పుడూ వద్దంటారా?"
అతగాడికి పిచ్చెత్తేందుకు అవొక్క వాక్యమూ చాలు!
"వీధి తలుపులు తీసే ఉన్నాయే!" అన్నాడు పి.ఏ.
విజయ విరగబడి నవ్వింది!
"మీరన్నం తినడానికి, వీధి తలుపులు తీసి ఉంచడానికి సంబంధమేమిటండీ నా తలకాయ! తలుపులు తీసుంటే మాత్రమేం, అన్నం తినొచ్చుగా" అన్నది విజయ.
పి.ఏ. సమాధానం చెప్పలేక పోయాడు. విజయ అతని చూసి మరోసారి నవ్వింది.
"పోన్లెండి! మరీ మీరంతా సిగ్గుపడేట్లయితే తలుపులు వేసే వస్తాను, మీరైనా అన్నం తినడమే గదా చేస్తారు?"
విజయ వీధి తలుపుకు గడియ పెట్టి గదిలో కొచ్చింది. పి.ఏ. లేచి నిలబడ్డాడు. అతని కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి. నిలదొక్కుకుని గది తలుపులు చేరవేశాడు.
"అదేమిటి?" అన్నది విజయ ఆశ్చర్యపోయినట్టు.
ఆవిడ పెదవులు నవ్వును దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు పి.ఏ.గ్రహించాడు.
"రాత్రి నేను నిద్రపోలేదంటే నువ్వు నమ్ముతావా?" అన్నాడు పి.ఏ. విజయను దగ్గరగా తీసుకొంటూ.
"నమ్ముతాను. ఎందుకంటే రాత్రల్లా నాకూ సరిగ్గా నిద్ర పట్టలేదు. మిమ్మల్ని నిన్న సాయంత్రమే నేనుండి పొమ్మన్నాను. ఆ చీంబోతు వెధవ ఉన్నాడని మీరు మానేశారు....మీరేగనక ఉన్నట్లయితే, ఇలా జరిగేదనీ, అలా జరిగేదనీ అనుకొంటూ రాత్రల్లా - అయ్యోరామ - అదేమిటండీ పట్టపగలా - ఉండండీ చెబుతాను - ఛీఛీ - ఆఁ నా బొంద - అబ్బా నన్ను మత్తులో ముంచేశావు చిన్నీ!"
పి.ఏ. కళ్ళు మూసుకు పోయాయి. అతని వెచ్చని ఊపిరి ఆమె చెంపల్ని కాల్చింది. విజయ రెండు చేతులూ అతని భుజాల వెనక కలుసుకున్నాయి. అతను ఆత్రంగా విజయ చెక్కిళ్ళకోసం వెదుకుతున్నాడు. ఓ సారి అతనికేసి చూసి తనలో తనే  నవ్వుకొన్నది విజయ.
                                                    *    *    *    *
పీయూషా పిక్చర్స్ వారు, విజయతో ఎగ్రిమెంట్ చేశారు. మూర్తిగారు డబ్బు విషయంకూడా తేల్చి పారేశారు. తొలిసారిగా హీరోయిన్ వేషం ఇస్తున్నారు గనక, అయిదువేలకు పనిచెయ్యమని విజయతో చెప్పాడు. అలాంటి ఆర్టిస్టుకు పదివేలిచ్చినా దండగ లేదనీ, కంపెనీ కొత్తది గనక - అందులో సగమిస్తే పని చెయ్యడానికి విజయను వొప్పించాననీ సత్యంతో చెప్పాడు.
సత్యం ప్రస్తుతమున్న ఊపులో, అయిదువేలు కాదు, అయిదయిదులు ఇరవయ్యయిదు వేలివ్వడానికి సిద్దముగా ఉన్నాడు, విజయ వాణ్ని సుఖ సముద్రంలో ముంచి లేవనెత్తింది. వారంరోజులు తిరక్కుండానే సత్యం తన మకాంను విజయ ఇంటికి మార్చేస్తానన్నాడు.
"అలా వొద్దులెండి!" అన్నది విజయ.
"ఎందుకని, మనమిద్దరం ఒకటేగా. మన శరీరాలు వేరయినా, మనస్సు ఒక్కటేనని రాత్రేగా అన్నావు. ఇంతలోకే మర్చిపోయావా?" అన్నాడు సత్యం.
విజయ చాటుకు తిరిగి నిట్టూర్చింది.
"మాట్లాడవే విజ్జీ?" అన్నాడు సత్యం.
"అందుక్కాదు నానీ! మాంసం తింటున్నామని, ఎముకలు మెళ్ళో వేసుకొని తిరగంగదా! కొంతకాలం జరగనీండి! ఏదో ఓ మంచి ముహూర్తంచూసి కలిసి కాపరం పెట్టేద్దాం!" అన్నది విజయ అతని చొక్కా గుండీలు మెలిపెడుతూ "ఇప్పుడు మీకేం తక్కువయింది చెప్పండి! మీరే నిమిషాన్నయినా ఇక్కడికి రావొచ్చు"
"నీ కళ్ళు ఎంత బావుంటాయి విజయా?" అన్నాడు సత్యం మెల్లిగా.
"అబ్బ! మీరలా చెవులో నోరు పెట్టి గుస గుస లాడకండి! నాకసలే చక్కలిగిలి" అన్నది విజయ పకపకా నవ్వుతూ!
సత్యం చిత్తుచిత్తయి పోయాడు.
                                               *    *    *    *
పి.ఏ. అన్ని విషయాలూ ముందుగానే విజయకు చెప్పడం మేలయింది. అందువల్ల ఆవిడ దేనికీ తడువుకోనవసరం లేకపోయింది. కార్యక్రమమంతా అనుకొన్న ప్రకారం, చక చకా సాగిపోతూ ఉంది!
"ఆ చీంబోతుగాడ్ని, నీకో వెయ్యిరూపాయలు అదనంగా ఇవ్వమన్నాను. వాడు 'సరే' నన్నాడు, అయితే నీ అంతట నువ్వేమీ బయట పడమాకు. వాడిస్తానంటే మాత్రం తీసుకో....నువ్వంటే పడి చస్తున్నాడు. ఇరవై నాలుగ్గంటలూ నీ స్మరణేననుకో!" అన్నాడు పి.ఏ.
"ఇక నా కొంపచుట్టూ తిరిగి చస్తాడల్లే ఉంది! ఈ పీడా నెందుకు తగిలించారండీ బాబూ! వీడి ముష్టి వెయ్యి లేకపోతే పీడాబోయిరి. ఎందుకొచ్చిన హైరానా ఇదంతా?" అన్నది విజయ.
ఆవిడ నాయగారాలు పోతున్నదని పి.ఏ.కి తెలిసిపోయింది.
"నువ్వు వెయ్యి పుచ్చుకొన్నా, పుచ్చుకోక పోయినా అతన్ని కాదని అతని  కంపెనీలో వేషం వెయ్యలేవు. వెయ్యగల ననుకోవడం భ్రమ! ఔనుమరి! ఎటుకూడీ తప్పనిసరిగా చెయ్యవలసిన వోపని చేసినందుకు అదనంగా వెయ్యి రూపాయిలొస్తున్నాయనుకో - తప్పేముందీ!" అన్నాడు పి.ఏ.
"అబ్బ మీకెంత కోపమండీ?"
అన్నది విజయ, అతని రెండు చెంపలను అరచేతితో రాస్తూ.
"నేనింకో కంపెనీ వారితో కూడా చెప్పాను. అయితే పీయూషావారి రషెన్ చూసిందాకా ఏ మాటా చెప్పలేమన్నారు. నువ్వు కాస్తంత కష్టపడి పనిచేశావంటే - పది కంపెనీలు నిన్ను పిలుస్తాయి. ఎవరైనా నీకు నిచ్చె నివ్వగలరే గానీ, మెట్ల మీదుగా ఎక్కించలేరు!" అని హితోపదేశం చేశాడు పి.ఏ.
విజయ చేతులు ముడుచుకు కూచోలేరు. పీయూషా పిక్చర్స్ వారు హిరోయిన్ వేషమిచ్చారనీ, అందుక్కారణం మూర్తిగారనీ, ఆవిడ చాలా మందికి పనిమాలా చెప్పింది. మూర్తిగారి మనుషులు, ఈ వార్తను అదేపనిగా కొన్ని రోజులపాటు ప్రచారం చేశారు.
"మూర్తిగారు మాటల మనిషి కాదు. చేతల మనిషి. ఆయన సాధారణంగా నోరు జారడు. జారాడంటే అన్నదానికి కట్టుబడి ఉంటాడు. విజయకు లిప్ట్ ఇస్తానన్నారు. వారం తిరక్కుండానే హీరోయిన్ వేషం ఇప్పించారు. ఇప్పుడా విజయ మూర్తిగారి ప్రక్కన వేషమేస్తున్నది!"
విజయ ఇదే! దీన్నే రకరకాలుగా ప్రచారం చేశారు. మూర్తిగారు ఆవిడకు బ్రహ్మాండమైన ఉపకారం చేశాడని మాత్రమే కాదు. రావుగారేమి చెయ్లేదన్న ధ్వనికూడా అందులో గర్భితమై ఉన్నది. మంజరి అహం అణచడమే కాకుండా, పనిలో పనిగా రావు గారిమీద ఇంత దుమ్ము చల్లడానికి కూడా, మూర్తిగారి మనుషులకిప్పుడు అవకాశం చిక్కింది!
ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు రావుగారికి తెలుస్తూనే ఉన్నాయి. ఆయన చిరాకు పడుతూనే ఉన్నాడు.
"అసలు మంజరితో తగాదా పెట్టుకోవాలని నాకు లేనేలేదు. మూర్తిగారే లేనిపోని పేచీలన్నీ లేవదీసుకొచ్చాడు. మానవుడన్న తరవాత ఉద్రేకాలు రావడమూ సహజమే  అప్పుడో మాట- అనకూడదని మాట - తూలి అనడమూ సహజమూ సహజమే! ఇలా మనం ప్రతి డానికి గింజుకొంటూ కూచుంటే లాభంలేదు....మనలో మనం దెబ్బలాడుకొంటే, మంజరికి చులకనయి పోతామని చూస్తున్నాను గానీ, ఈ మూర్తిగాడి వ్యవహారం తేల్చడం గంటల్లో పని!" అన్నాడు రావుగారు.
"ఆయనగారు విజయకు మంచి వేషం ఇప్పించారుట. ఓహ్ - దాన్ని గురించి వొకటే టాం టాం కొట్టుకొంటున్నారు!" అన్నాడొక బంటు.
"మనం దాని బాబులాంటి వేషం ఇంకో అమ్మాయికి ఇప్పింస్తాం. అదేమంత ఘనం గనక?" అన్నాడాయన.
"ఇంకో అమ్మాయి కిప్పిస్తే మన గొప్పతనమేముంది సార్! ఆ విజయనే పిలిపించండి! మూర్తి గారిప్పించిన వేషం కన్నా, మాంచి రోల్ ఇప్పించండి. అంతకన్నా రెండు మూడు వేలు ఎక్కువ ఇవ్వమనండి! ఒక్ దెబ్బతో రెండు పిట్టలు ఠాఁ మంటాయి. మూర్తిగారి విర్రవీగుడుకు విరుగుడు వేసినట్లు అవుతుంది. మంజరికి డొక్కలో కత్తిలాగా విజయ నిలబడనూ నిలబడు గలుగుతుంది!" అని సలహా ఇచ్చాడు బంటు.
"వెరీగుడ్!" అన్నాడు రావుగారు.
ఈ వార్తను అరగంటకల్లా విజయకు చేరవేశాడు బంటు.
"బాగా 'కీ'యిచ్చాడు. ఇహ చచ్చేటట్టు పనిచేస్తాడు. బహుశా నాలుగైదు రోజుల్లో నీకు కబురుగానీ చేస్తాడేమో! ఈ లోగా నువ్వోసారి వారిని కలుసుకో.  రావుగారు ఎలాంటి మనిషో నీకు తెలుసు. నీళ్ళల్లో చేపల అడుగు జాడల్ని గుర్తు పడతాడాయన. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి....నేను చెయ్యగలిగిందేదో చేశాను" అన్నాడు రావుగారు బంటు.
విజయ బీరువాలోంచి పది పది రూపాయల నోట్లుతీసి 'బంటు'కిచ్చాడు.
"ఇప్పటికి దీనితో సంతోషించు. రావుగారి ద్వారా పిక్చరేమన్నా వస్తే నిన్ను  మరచిపోను. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు" అని పంపేసింది విజయ.
పీయూషా పిక్చర్సువారు మూడు రీళ్ళు తీసేనాటికి, విజయ ఆరు కంపెనీలలో ఎగ్రిమెంట్స్ కుదుర్చుకొన్నది. అందులో నాలుగు కంపెనీలకు మూర్తిగారు రికమెండ్ చేశారు.ఒక కంపెనీకి రావు గారు రికమెండ్ చేశారు. ఆరో కంపెనీవారు స్వయంగానే విజయను కలుసుకొని మాట్లాడారు. ఆవిడ 'సరే' నన్నది. ఓ వెయ్యి రూపాయలు అడ్వాన్సిచ్చి  రసీదు తీసుకొన్నారు. అప్పటికింకా కధే తయారుకాలేదు. ఎవరెవర్ని బుక్ చెయ్యాలో నిర్ణయించుకొంటే తప్ప కధ తయారు చేసుకోవడానికి లేదు. ఆర్టిస్టుల్ని బట్టి, కధ మార్పులు చేసుకోవాలి. కధననుసరించి  ఆర్టిస్టుల్ని బుక్ చేసుకోవడమన్న పద్ధతిపోయి చాలా రోజులైంది.
వాళ్ళు మూర్తినిగానీ, రావుగానీ హీరోగా తీసుకో దలచలేదు. లోగాడకన్నా అయిదారు వేలు తక్కువకే వస్తారు. కానీ కాల్ షీట్సు  దొరకవు. దొరికినా సమయానికి రారు. ఎనిమిది గంటల కాల్ షీట్ లో రెండు గంటలయినా పనికాదు. వీటన్నిటినీ హించిన డజైరెక్టరన్నవాడి మాటకు బొత్తిగా విలువ లేకుండా పోయింది. కొమ్ములు తిరిగిన డైరెక్టర్లను, హీరోలు వణికించారు. అతడేమన్నా  చెబితే వీళ్ళు కాదనేవాళ్ళు 'ఇలా డైలాగ్ అనవయ్యా బాబూ!' అంటే వల్లమాలిన కోపం వచ్చేది. వాళ్ళు చెప్పిందాన్ని కాదనడమంటే, వాళ్ళను అవమానించడం కిందనే జమ. గట్టిగా ఏమన్నా అంటే 'మూడ్స్ బావోలేవు' అంటూ వెళ్ళిపోతారు. ఇహమళ్ళీ ఎంత కాలానికి వాళ్ళు ప్రసన్నులవుతారో ఎవ్వరూ చెప్పలేరు. అందాకా వేసిన సెట్ ను డిస్ మాంటిల్ చెయ్యడానికి లేదు. స్టూడియోవాళ్ళు వేలకు వేలు గుంజి పారేస్తారు. కంపెనీ 'గోవిందా' అంటుంది.
అంచాతనే ప్రొడ్యూసర్లు చాలామంది, ప్లెక్సిబుల్ గా ఉండే డైరెక్టర్లనే పెట్టుకొంటారు. వీళ్ళు చవగ్గా పనిచెయ్యడమే కాదు, హీరోలు చెప్పిందానికల్లా  'ఆహాహా' -'ఒహోహో' అంటూ వుంటారు. అటు వాళ్ళపనీ సులువవుతుంది. ఇటు డైరెక్టర్లకీ మంచి పేరొస్తుంది. ఫలానా ఫలానా డైరెక్టర్లే కావాలని పెద్ద ఆర్టిస్టులు కోరడం ఇందుకే! పిక్చర్ ఏ గంగలో కలిస్తే ఎవడిక్కావాలిట!
విజయ దగ్గరకు స్వయంగా వచ్చిన ఆరో కంపెనీ -పద్మా ఫాంట్ సీన్- వారు ఈ బాధలన్నీ పడటానికి సిద్దంగా లేరు. హేమా హేమీల్లాంటి ఆర్టిస్టులను వారసులు పలకరించలేదు. కాస్త పేరున్న విజయా లాంటి కొత్త హీరోయిన్నూ, చంద్రం లాంటి  హీరోనూ బుక్ చేసి, కధా బలంమీద పిక్చర్స్ ను సక్సెస్ చేయాలని నిర్ణయించారు.
తీరా చంద్రాన్ని కలుసుకొని మాట్లాడక, అతనంత తేలిగ్గాలేడని వారి కనిపించింది.
"మంజరికిప్పుడు పన్నెండు పిక్చర్లున్నాయి. వాటన్నింటిలోనూ నేను హీరోగా ఉన్నాను. వీటిని త్వరగా ఫినిష్ చెయ్యాలని అమ్మాయిగారు తొందర పడుతున్నారు. ఆమె కోసం బొంబాయి నుండి ఉత్తరాలమీద ఉత్తరాలు, టెలిగ్రాములు దూకుతున్నాయి" అన్నాడు చంద్రం.
"ఆవిడ బిజీగా ఉంటే ఉండనివ్వండి. ఆవిడకు బొంబాయి నుండి టెలిగ్రాములొచ్చినా, హాలివుడ్ నుండి వచ్చినా మాకేమీ అభ్యంతరం లేదు. ఆమెను మేము బుక్ చెయ్యబోవడం లేదు కూడాను. మీసంగతేమిటో చెప్పమనే మేమడుగుతున్నాం!" అన్నాడొకాయన.
"అవుననుకోండీ? ఏ సంగతీ నేను అమ్మాయిగార్ని కనుక్కొని గానీ చెప్పలేను. ఎందుకంటే-"
"కారణం నేనడగలేదు. మీరు చెప్పనవసరమూ లేదు. ఇదిగో -ఇదీ మా ఆఫీసు ఎడ్రసు. రెండు మూడు రోజుల్లోగా ఏ సంగతీ మాకు ఫోన్ చెయ్యండి....మీరు రానవసరం లేదు. మంజరి పర్మిట్ చేస్తే చెప్పండి - మేమే వొచ్చి మిగతా విషయాలు  మాట్లాడుతాం" అన్నాడాయన.
ఇలాంటి ధోరణిని చంద్రం ఈ మధ్యకాలంలో చూడలేదు. అతను ఆశ్చర్యంతో అతనికేసి చూడసాగాడు.
"అన్ న్టు  ఇంకో సంగతి. యిప్పుడు మీరెంత డిమాండ్ చేస్తున్నారు?" అన్నాడాయన చంద్రంకేసి గుచ్చి గుచ్చి చూస్తూ.
"మొత్తం పదిహేను తీసుకొంటున్నాను. అయిదు ఎగ్రిమెంటు ప్రకారం మిగతాది ముందుగా ఇవ్వాలి."
అతనోసారి కళ్ళెగరేసి, పెదవి విరిచాడు.
"సరేలెండి! మీరు చెప్పిన అంకె పెద్దదని పించింది మాకు. ఏదైనా ముందా అమ్మాయి మణిగారు అనుమతిస్తేగదా ఈ గొడవలన్నీనూ!" అంటూ ఆయన బయలుదేరాడు. మీరు అట్టే టైం తీసుకోకండి! విషయాన్ని నానబెట్టడం నాకు బొత్తిగా  యిష్టం లేదు మీరు 'యస్' అన్నా 'నో' అన్నా నాకభ్యంతరం లేదు. ఏ సంగతీ చెప్పడమే నాకు ముఖ్యం."
ఆయన వెళ్ళిపోయాడు.
చంద్రం చాలా సేపటిదాకా అతన్ని గురించే ఆలోచిస్తున్నాడు. అతనన్న మాటలు జ్ఞాపకం వస్తున్న కొలది చంద్రం మనస్సు చిన్నపోసాగింది. తనకు వ్యక్తిత్వమనేదే లేదనీ, తను మంజరి చేతిలో కీలు బొమ్మననీ, ఆవిడ ఆడించి నట్లల్లా ఆడటం తప్ప తనకు వేరే జీవితం లేదనీ, అతనొచ్చి స్పష్టం చేశాడనిపించింది. చిత్రమేమిటంటే, ఈ సంగతులేవీ తనకు కొత్తకాదు. ఇవన్నీ రోజూ తను అనుకొంటూ ఉన్నవే! అయితే -అవే మాటలు ఎదుటివారి నోటినుండి వచ్చే సరికి తను భరించలేకపోయాడు. అతనైనా కోపంగా అన్న దేమీలేదు. చాలా మెత్తగా సున్నితంగా మాట్లాడాడు. తనిలాంటి వాటికి బాధ పడకూడదని చాలా సార్లు అనుకొన్నాడు. ఆంతరంగికమైన విలువలకన్నా, బహిర్గతమైన విలువలకే సమాజం తలొగ్గుతుందని తనకు తెలుసు. తమ వ్యక్తిత్వం కోసం నిలబడినంతకాలం, మట్టిగొట్టుకు పోయాడు. "అమ్మాయి" గారి సేవ చేయడం ప్రారంభించాక పచ్చబడ్డాడు. తనకిప్పుడో సొంత కారుంది. ఫోనుంది, తనకోసం మనుషులొచ్చి  కాచుక్కూచుంటున్నారు. తన సంతకానికి ఈ క్షణాన ముప్పయ్యయిదు వేలపై చిల్లర విలువ వున్నది. తనో గంట ఆలస్యంగా వెడితే లబ్బుమని గోలకెత్తే ప్రొడ్యూసర్లున్నారు! తనీరోజున ఏ చెత్త మాట్లాడినా 'న్యూస్' అవుతుంది దీనిక్కారణం, తన ప్రతిభ అనుకొనేవాళ్ళు మూర్ఖులు. అసలు సంగతి తనకు తెలుసు. తను వ్యక్తి విలువల్ని చంపుకొన్నాడు. తన జీవితం జీవించడం మానేశాడు. ఇంకొకరు "ఔ" నన్నదాన్ని తనూ "ఔ"నన్నాడు. వాళ్ళు "కా" దన్నదాన్ని తనూ "కా"దన్నాడు. ఇందువల్ల నిజమైన చంద్రం చచ్చిపోయిన మాటనిజమే! కానీ, వాడు ఉండి తనకు వొరగపెట్టిందేమీ లేదు. వాడున్నంతకాలం తనను నానా బాధలూ పెట్టాడు. వాణ్ని చంపేశాకనే తన జాతకం తిరిగింది.
"మనిషి క్కావలసిందేమిటి?" అని ప్రశ్నించుకొన్నాడు చంద్రం.
"పైకి రావడం! ఎలా పైకొచ్చావన్నప్రశ్నకు తావేలేదు. పైకొచ్చావా, లేదా అన్నదే ముఖ్యం. అందుకు నువ్వు చెల్లించిన మూల్యం లెక్కలోకి రాదు. ఒంటరిగా కూచుని నువ్వు కార్చిన కన్నీరు లెక్కలోకి రాదు. నీ బౌతిక జీవితం మాత్రమే లోకులు చూస్తారు. నీకున్న డబ్బు, మేడలు, కారు, హొదా, కీర్తి ప్రతిష్టలు -ఇవీ లోకులు  చూస్తారు. వీటినిబట్టి నీ గురించి భజనలు చేస్తారు. వీటిని బట్టే నీ గొప్పతనాన్ని అంచనా వేస్తారు. వ్యక్తిగత విలువలు గోప్పవనుకుంటే మాడిచావు. చివరికి "పాపం" అనే వాడుకూడా నీకు దొరకడు. అంతరాత్మ పెట్టే ఘోషకు చెవులు మూసుకొన్నావో నిన్నందరూ అందలం ఎక్కిస్తారు" అనుకొన్నాడు చంద్రం.
అతనికి పాతరోజులు జ్ఞాపకం వచ్చి జలదరించి పోయాడు.
"నిజాయితీగా ఉన్నా ననుకొని దుస్సహమైన దరిద్రం అనుభవించడం కన్నా, మరొక విధంగా పది రూపాయలు సంపాదించడం మెరుగు"
చంద్రానికి ఆ పెద్దమనిషి, ఇందాక అన్న మాటలు జ్ఞాపకం వచ్చి నవ్వుకొన్నాడు.
"అతను శుద్ధ తెలివితక్కువ సన్యాసన్నా కావాలి. లేదా గొప్ప మేధావైనా కావాలి. వీళ్ళిద్దరూ ఈ సినిమాలకు పనికిరారు."
అతనికేదో సరదా వేసింది. చిరునవ్వు నవ్వుకొంటూ ఓ నంబరు డయల్ చేశాడు. అవతలనుంచి  'హలో' అని వినిపించింది. చంద్రం ముఖంలోంచి చిరునవ్వు మాయమయింది. అవతలి నుండి 'హలో హోలో'అని గోలకెత్తుతున్నా వినిపించుకోకుండా అతను ఫోను పెట్టేసి, చేతివేళ్ళు విరుచుకొన్నాడు.
                                                             24
సత్యం వెళ్ళిపోయాడు. అతను పోయినవేపే కన్నార్పకుండా చూసి, వీధిగడప దాటాకా, తుభుక్కున ఉమ్మి వేసింది విజయ. ఆమె కళ్ళు అసహ్యంతో మండిపోతున్నాయి. అయిష్టాన్ని లోపల ఇముడ్చుకోలేక బయటికి కక్కనూలేక విజయ మల్లగుల్లాలు పడిపోతోంది. పని మనిషి కాఫీ తెచ్చి బల్లమీద పెట్టి కూడా పది నిమిషాలయింది ఆవిడ కెందుకో కాఫీ సైతం తాగబుద్ది కాలేదు. అలానే కుర్చీకి చేరిగిల బడిపోయింది.
కిటికీలోంచి, ఎదర గోడమీద సినిమా పోస్టరు కనిపిస్తోంది. మంజరి చిరునవ్వుతో, చంద్రంకేసి చూస్తూంటే అతగాడు రెండు చేతులతోనూ ఆమె నడుమును చుట్టేసి  దగ్గరకు తీసుకుంటున్న దృశ్యమది.
తను చంద్రాన్ని కలుసుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించింది.
తనకు తీరుబాటుగా ఉన్నప్పుడు, అతనికి తలమునకగా పనులున్నాయి. చంద్రానికి రవంత వెసులుబాటుగా ఉండి, తనకు ఫోను చేసినప్పుడు, తను స్టూడియోకు బయలుదేరుతూనో అప్పుడే షూటింగ్ నుండో వచ్చి రంగు కడుక్కుంటూనో ఉన్నది. రెండు మూడు దఫాలు, సత్యంగారున్నప్పుడు చంద్రం ఫోన్ చేశాడు. తను 'రా' ననడానికి ప్రాణం వొప్పిచావదు. 'వస్తా'ననడానికి సత్యం ఉండిపోయాడు.
తన కనేకసార్లు చంద్రం జ్ఞాపకం రావడానికి కారణాలేమిటో చాలా రోజులపాటు విజయ చెప్పుకోలేక పోయింది. అతని పేరు విన్నా, అతని గొంతు విన్నా ఆవిడకు ప్రాణం లేచి వచ్చేది. చంద్రం కోసం నాళ్ళూ నరాలూ పీక్కుపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మిగతా వారందరికన్నా ఈ చంద్రంగారు వొరిగించిందేమిటన్న ప్రశ్నకు విజయ జవాబు చెప్పుకోలేదు. కానీ, ఆ అనుభవం మాత్రం వాస్తవమే.
"నేను గానీ చంద్రాన్ని...." అని విజయ చాలాసార్లు తనలో తాను గొణుకున్నది.
సత్యం తనదగ్గరకొచ్చి, తననడుంచుట్టూ చేతులు వేసినప్పుడూ, మొఖంలో మొఖం పెట్టినప్పుడూ, కళ్ళల్లోకి చూసినప్పుడూ -ఆస్థానంలో ఉన్నది సత్యం కాదనీ, చంద్రమనీ తను భావించినప్పుడు, మనస్సు గాలిమీద తేలిపోతున్నట్లనిపించేది. శరీరంనిండా తియ్యని ప్రవాహాలేవో పరుగెత్తి నట్లనిపించేది. ఆ సుఖం కోసం, సరిగ్గా అలాంటి అనుభవం కోసమే, ఆవిడ ఆత్మ ఘోష పెట్టేది. పగటి కలలని తెలిసి కూడా సత్యాన్ని గురించి వైన వైనాలుగా కలలుకన్నది విజయ. అందులో ఆవిడ పోయిన వయ్యారాలు ఇన్నీ అన్నీ కావు.
చంద్రమున్నాడేమోనని విజయ ఫోను చేసింది!
"హలో! నీకోసమనే ఇంతకు ముందు ఫోను చేశాను. ఎవడో పలికాడు, భయంవేసి మానేశాను....
హలో....హలో....వింటున్నావా" అన్నాడు చంద్రం.
"ఆఁ"
"పరధ్యానంగా ఉన్నావా? నవ్వుతున్నావేం?" అన్నాడు చంద్రం.
"ఆఫోను చేసిందెవరని సత్యం నన్ను రాచి రంపాన పెట్టాడు. నేనేం చెప్పను చంద్రం! నువ్వని తెలిసినట్లయితే వెధవకు రోగం కుదిర్చేదాన్ని!" అన్నది విజయ.
"ఏం చేసేదానివి?"
"నువ్వు మా ఆయనవని చెప్పేదాన్ని! ఆయనోస్తున్నాడనీ చూస్తే చీల్చేస్తాడనీ, ఏ చాపలోనో చుట్టి మూలకు నిలవేసి వుండేదాన్ని!" అన్నది విజయ.
చంద్రం విరగబడి నవ్వడం, విని తను కూడా నవ్వింది.
"నాకీపూట మనస్సేమీ హాయిగా లేదు విజయా! ఇప్పుడే మంజరి దగ్గరికెళ్ళొచ్చాను. ఆవిడ నన్ను గానుగాడినంత పని చేసింది కాస్సేపు నన్ను నేను మరిచిపోతే బావుండు ననిపించింది. అదృష్ట వశాత్తూ నువ్వు ఫోను చేశావు"
విజయ కళ్ళు మిలమిల్లాడాయి.
నీకేమన్నా పనివుందా" అన్నాడు చంద్రం.
"లేదు....ఉన్నా నీకోసమని నేనీపూట మానేస్తున్నాను అజంతాకు రాగలవా  చంద్రం!....ఆల్ రైట్..
..నేనిప్పుడే...."
చంద్రం ఫోన్ పెట్టిన చప్పుడు వినిగానీ, విజయ పెట్టింది కాదు.
"అసలేం జరిగింది చంద్రం?" అన్నది విజయ గంట తరవాత అతన్ని అజంతాలో కలుసుకోగానే!
చంద్రం ఎంతగా కుంగిపోయాడో అతన్ని చూసిందాకా విజయ ఊహించలేక పోయింది. చంద్రం కాస్సేపు ఆవిడ కళ్ళల్లోకి చూసి, తలొంచుకున్నాడు. ఆ చూపుల్లో పిచ్చితనం ఉన్నదనుకొంది విజయ.
"నేనింత బుద్దితక్కువ వాణ్నంటే విజయ - ఉదాహరణ యిచ్చుకోవడానిక్కూడా, నేను తప్ప మరో ప్రాణిలేదు. ఎంత బడతనం తెచ్చి పెట్టుకొన్నా జన్మ సిద్దమైన గుణమేదో పైకుబికి నన్ను చిరాకు పెడుతోంది" అన్నాడు చంద్రం.
విజయ ఏమీ అనలేదు. ఊరికే వింటూ కూచున్నది!
"ఇటువంటి సమస్య ఏదో వొకనాడు ఎదురవుతుందని నాకు తెలుసు. దగాన్నెదుర్కొవడానికి నేను సిద్దంగా కూడా ఉన్నాను. కానీ గమ్మత్తేమిటంటే విజయా! ఆ సమస్య నేను ఊహించిన రూపంలో ఎదురయి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది!" అన్నాడు చంద్రం.
విజయ అలానే చూస్తూ కూచుంది.
"మంజరీ నాకూ, ఈ పూటతో  రాం రాం" అన్నాడు చంద్రం.
"హమ్మయ్య" అనుకొన్నది విజయ.
"ఏం జరిగింది చంద్రం! అసలంతదాకా ఎందుకొచ్చిందట!" అన్నది తాపీగా.
చంద్రం పద్మాపాంటసీస్ వారి సంగతి చెప్పుకొచ్చాడు.
"తనందులో ఉండటం లేదుగనక నన్ను ఉండొద్దంటుంది. నువ్వు హీరోయిన్ పని చెప్పాక, మరీ మండిపోయింది. నువ్వా దిక్కు మాలిన దాని సరసన పనిచెయ్యడానికి వీల్లేదంటుంది. ఎందుకమ్మా అంటే -ఆవిడ చెప్పిన సమాధానం మహాఘోరం!" అన్నాడు చంద్రం!
విజయ ఏమీ అనకుండా తలపంకించింది.
"నీ పక్కన హీరోగా ఉన్న మనిషితో, పని చేయడానికి ఆవిడ సిగ్గు పడుతుందట! తనమాటే శాసనమనీ దాన్ని దాటడానికి వీల్లేదనీ అన్నది. నిజంగా నాకు కోపం రావలసింది కాదు - ఆవిడనోటంట అంతకన్నా భయంకరమైన మాటలువిన్నాను. అప్పుడెప్పుడూ రానంత కోపం నాకా సమయంలో వచ్చింది."
అతని కళ్ళు నీటితో నిండిపోయాయి.
"లాభం లేదు విజ్జీ! నేనిందుకు పనికిరాను. బొత్తిగా పనికిరాను. ఈ సినిమాలూ ఈ మనుషులూ, ఈ డబ్బూ, ఈక్షుద్రమైన సంబంధాలూ, ఈ మురుగూ -నేను భరించలేను. బేడతో సాంబారన్నం పొట్లం కొనుక్కుతిని, పానగల్ పార్కులో పడుకొన్న రోజులు నాకెంతో హాయిగా ఉన్నాయి. మళ్ళా నాకా రోజులొస్తే వచ్చే అవకాశమే ఉంటే నేనింకేమీ కోరను!"
చంద్రం కళ్ళు మూసుకొనే ఉన్నాయి. ఆ కనురెప్పల నుండి నీటి దారాలు స్రవిస్తున్నాయి. విజయ అతని తలను గుండెలకు హత్తుకొన్నది. బలవంతాన కన్నీటిని ఆపుకోడానికి ప్రయత్నిస్తున్నది.

                                       *    *    *    *
ఈ సంఘటన, తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన పరిణామానికి పరోక్షంగా కారణ భూతమయింది. అప్పటికే అటు మంజరీ, ఇటు మూర్తి, రావుగారులూ ఈ గొడవల వల్�

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS