Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 22

ఈ మాదిరి అభివందన వాఖ్యాలు ఏ సందర్భానికయినా వర్తిస్తాయి. ఎదుటమనిషి చెబుతున్నదేమిటో మనం వినిపించుకోనప్పుడూ ఆ విషయాన్ని గురించే మన అభిప్రాయాన్ని ఆ మనిషి అడిగినప్పుడూ ఈ తరహా అభివందన ఠక్కున సరిపోతుందని మంజరికి తెలుసు. అందుకే ఆ వాఖ్యాలు చక్కగా వల్లించి చలపతిని నిరుత్తరున్ని చేసేసింది మంజరి.
"అదిగో! ఆ మూలమీదుగా తోటకనిపిస్తున్నది చూశావా?"
"ఆఁ" అన్నాది మంజరి.
"అది రావుగారిల్లు ఇంకో రెండు మూడు నిమిషాలు - నేను కారు మెల్లగా నడుపుతాను గానీ, ఈ లోగా నువ్వోసారి మేకప్ చెరిగి పోయిందేమో చూసుకో!" అన్నాడు చలపతి.
మరో రెండు నిమిషాల కల్లా కారు ఓ పెద్ద తోటలోగుండా పరుగెత్తి పోర్టికోలో కొచ్చి ఆగింది.
ఆ క్షణాన మంజరి అనుభూతులెలా వున్నాయో మనం తెలుసుకొనేందుకు ఆ దరిమిలా ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ చూడటం అవసరం. అందులో మంజరి ఇలా వ్రాసింది -
"నాలుగు సంవత్సరాలనాటి సంగతిది. ఆప్పటికి నేనింకా చలన చిత్రరంగంలోకి అడుగు పెట్టలేదు. ఆ కళామతల్లి చల్లని దృక్కులు ణా మీద ప్రసరించలేదు. ఏదో పనిమీద మద్రాసు వచ్చాను. వచ్చాను గదాని ణా అభిమాన నటీనటులను వొకసారి చూడాలని నిశ్చయించుకొన్నాను. చాలా మంది షూటింగ్సు లో ఉండడంవల్ల ఎక్కువసేపు వారితో గడిపేందుకు అవకాశం కలుగలేదు. ముందుగా టెలిఫోన్ చేసి తేదీ, టైమూ నిర్ణయించుకొన్నాక రావుగారిని నేను కలుసుకొన్నాను. వారు ణా అభిమాన నటుడు నా చిన్నతనో శ్రీ రావుగారు నటించిన యెన్నో సినిమాలు చూశాను. సినిమాల్లో వారు చేసే సాహసకృత్యాలు నన్ను ముగ్దురాలిని చేశాయి. ఆ రోజుల్లోనూ, ఆ తరువాతనూ -నేను వారిప్రక్క హీరోయిన్ గా నటించవలసి వస్తుందని కలలో గూడా అనుకోలేదు. నేనింతదాన్నయ్యానంటే పరిశ్రమలోని పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, సహనటులు, ముఖ్యంగా ప్రేక్షకులు నాపట్ల చూపించిన ఆదరాభిమానాలే కారణం. ఈ అభివృద్దికి పరోక్షంగా సాయం చేసినవారు శ్రీ రావుగారు, వారికి నేను ఆజన్మాంతరం కృతజ్ఞతా బద్దురాలిని" అని జవాబు చెప్పింది మంజరి.
"రావుగారిని చూసినపుడు మీరేం ఫీలయ్యారండీ?" అని అడిగాడు పత్రికా విలేఖరి.
"నా ఆరాధ్యదైవాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నానన్న ఉత్సాహం నాలో ఉరకలు వేసింది. అడుగులు తడబడ్డాయి మాట పెగిలిరాలేదు. గొంతుక పోడారిపోయింది. గుండెల్లో భయమూ, ఉద్వేగమూ పెనవేసుకుపోయాయి. ఆంధ్ర చలనచిత్ర రంగంలో ఒక ధృవతారగా వెలిగిపోతున్న ఒక కళామూర్తిని దర్సించనున్నాననే గాఢమైన సంతృప్తితోబాటు చెప్పరాని భయంకూడా నన్ను ఆవేశించింది. ఆనాటి నా అనుభూతులను నేను మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాను. మన్నించాలి. నన్నడిగితే రావుగారొక కళాద్రష్ట. కళాస్రష్ట. చిత్రకాళామతల్లి దశాబ్దాలుగా నోచిననోములు ఫలించి శ్రీ రావుగారి లాగా మూర్తీభావించాయనుకొంటాను. వారు నన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. అంతకన్నా ఆప్యాయంగా ఆదరించారు. అరవిడిచి మాట్లాడారు. నా యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. అంతక్రితమే నన్ను గురించి వారు విన్నారట. నా నాటకాలు మాత్రం ఏమీ చూడలేదట.
మీలాంటి విదుషీమణులు, కళాభిమానులు ఈ రంగంలోకి విరివిగా రావాలి. మాలాంటివారం తప్పుకోవాలి. మీ కళాకృషిని సినిమారంగానికి కూడా విస్తరింపచేయవలసిందిగా నేను కోరుకున్నాను అన్నారు రావుగారు.
"అంతవరకూ, సినిమాల్లోకి రావాలన్న ఆలోచనకూడా లేని నేను వారలా అవడంతో ఆలోచించుకోవాలనిపించింది. అందరూ అనుకొంటున్న మాటలను శ్రీ రావుగారితో చెప్పాను. వారు హృదయపూర్వకంగా నవ్వారు.
"ఈ పరిశ్రమ విషయం తెలియనివారు అలానే అంటుంటారు. మీవంటి సమర్ధులు ఈ రంగంలోకి రావాలేగానీ తప్పకుండా ప్రోత్సాహం లభిస్తుంది" అన్నారు శ్రీ రావుగారు.
"ఆ తరువాత వారన్నమాటలు అక్షరాలా నిజమయ్యాయి. వారి ద్వారా నేనుఎంతో అభివృద్దిని పొందాను. అభినయంలోని అతి సున్నితమైన విషయాలను వారు నాకు వోపికగా భోధించారు. సంభాషణలను ఉచ్చరించడంలోని సులువులు, భావాలను పలికించడంలోకి రీతులు - ఇవి వారే నాకు ప్రసాదించారు. దాదాపుగా వొకటిన్నరసంవత్సరాల కఠిన శిక్షణానంతరం శ్రీ రావుగారు నన్ను చలనచిత్ర కళామతల్లి పాదార విన్దాలకు అంకితం చేశాడు. ఆ నాటినుండి నేటిదాకా, నేనా దేవికి అర్పిస్తూనే ఉన్నాను. ఇంత వరకూ నేను నాలుగు చిత్రాల్లో శ్రీ రావుగారి ప్రక్కన హీరోయిన్ గా నటించాను. నేనెలా నటించిందీ చెప్పవలసినవారు సహృదయులైన పత్రికలవారూ, ప్రేక్షకులూను" అని వ్రాసింది మంజరి!
లోగుట్టు తెలిసినవారు ఇదంతా నిజమనుకోవచ్చు. జరిగిందేమిటంటే రావుగారు ఆమెను ఆహ్వానించడమైతే చేశారుగానీ తాము మాత్రం ఏ ముక్కా 'కమిట్' కాలేదు. మంజరి యోగక్షేమాలడగటం చలపతిని కుశల ప్రశ్నలు వేయడం నిజమే.
"మిమ్మల్ని గురించి చలపతిగారు నాతో చాలాసార్లు చెప్పారు నాకు బొత్తిగా టైం లేకుండా వుంది. ఇప్పుడయినా నాకు తీరుబడి లేదు. వొంట్లో బావుండలేదని సెక్రటరీతో చెప్పేశాను.....ణా సినిమాలు మీ రేం చూశారండీ?" అన్నాడు రావు.
ఆ ప్రశ్న వింటూనే మంజరి బిత్తరోయింది.
ఏం చెప్పాలో తోచక గిజగిజలాడింది.
చలపతి పరిస్థితిని అర్ధంచేసుకొని రంగంలోకి దూకాడు.
"అలా విడమరిచి చెప్పడం కష్టంలెండి బాబుగారూ! మీరు యాక్ట్ చేసిన అన్ని సినిమాలూ మంజరి చూసింది. చిన్నప్పట్నించీ దానికి సినిమాలంటే వల్లమాలిన పిచ్చి, ఒకసారి ఏం జరిగిందంటేనండి -మీరన్న పిక్చర్ గుంటూర్లో రిలీజయింది. నెలరోజులక్కూడా టిక్కెట్లు అందడం లేదు. ముఖ్యం మీరు తాగుబోతుగా చేసిన యాక్షన్ జనాన్ని పట్టేసింది. పనీపాటా లేని కుర్రకారంతా పెందరాడే బుకింగ్సు దగ్గర చేరి పాతికేసి టిక్కెట్లు కొనేసి, బ్లాక్ లో అమ్ముకొని వేలు సంపాదించాడు. మా కృష్ణుడూ అలా బాగుపడ్డవాడే ననుకోండి. ఆ సినిమా చూడాలని దీనికి పట్టుకొంది. టిక్కెట్లు దొరకడం లేదని చెప్పినా వినలేదు. ఆఖరుకు మాతో చెప్పకుండా గుంటూరు వచ్చేసింది. మా బావగారేమో లబ్బుమని గోల. ఆయన బావులూ చెరువులూ వెదుకుతుంటే, నేను ఓ యాభై పుచ్చుకొని గుంటూరొచ్చాను. అదెక్కడుండేదీ నాకు తెలుసుగదా! హాల్లో పట్టేసాను. వరసగా వారం రోజులనుండీ రోజూ రెండాతలూ చూశాక గానీ అది నిద్రపోయింది కాదు....మీ ఫోటో పత్రికల్లో కనపడితే చాలునండీ అంతమేరా కత్తిరించేసి దాచుకొంటూ ఉండేది. అనగూడదుగానీ రావుగారు మీకు పెళ్ళేకాకుండా వుంటే మా మంజరి తనను పెళ్ళాడమంటూ మీ వాకిటముందర సత్యాగ్రహం చేసేదనుకోండి. ఇదీ దాని వ్యవహారం.... మంజరీ! అలా సిగ్గుడతావేం? ఇది నిజమా కాదా?" అన్నాడు చలపతి.
ఇంతసేపూ ఏమనవలసిందీ తోచక కొట్టుమిట్టాడుతున్న మంజరి కాస్త తెరపి ఇచ్చినట్లయింది. తానిప్పుడు సిగ్గుపడాలని చలపతి భావం. పోనీ అలాగే చేద్దాం. తప్పోం?
"పోండి బాబూ! మీరిద్దరూ కలసి నన్ను వెర్రిబాగులదాన్ని చేసేస్తున్నారు" అన్నది మంజరి సిగ్గునభినయిస్తూ.
రావుగారు సంతృప్తిగా నవ్వినట్లు అభినయించారు.
"అంతేకాదండీ! మూడు నాలుగేళ్ల క్రిందట మీకు ఉత్తరాలు కూడా రాసిందండీ! మీరో ఫోటో మీద సంతకం చేసి ఈవిడకు పంపించారు. దాన్ని చక్కా తన ఫోటోలో ఇన్ సర్ట్ చేసి ఫ్రేం కట్టించేసుకొంది....ఇన్నితికి అసలు సంగతి మీకు చెప్పనేలేదు. మంజరి నాకు కాస్త దూరంగా బంధువు. మా పెదతాతగారి మనమరాలు, వరసకు మరదలవుతుంది. వీళ్ళ వంశం సాహిత్యంలోనూ, కళల్లోనూ బాగా పేరు పొందిన వంశం. వీళ్ళ నాన్నగారు బ్రహ్మాండంగా నాటకాలు ఆడించారు. ఆ లక్షణాలు దీనికి అబ్బాయి. చాలా సంవత్సరాలపాటు అనేక రకాల నాటకాలు వేసింది. చాలా కప్పులు సంపాదించింది. మా మంజరికి సినిమాల్లోకి రావాలని అట్టేలేదనుకోండి. నేనే బలవంతాన ఫీల్డులోకి లాక్కొచ్చాను. మీ లాంటివారు సాయపదతారన్న నమ్మకం నాకుంది గనకనే నేనూ ధైర్యం చేశాను. నా పనేదో అయిపోయింది. తెచ్చి మీకప్పగించాణు. ఇహ మీరూ మీరూ ఏమనుకొంటారో అనుకోండి. నాకేమీ సంబంధంలేదు" అని చేతులు దులుపుకొన్నాడు చలపతి.
"వెరీగుడ్ వెరీగుడ్, తప్పకుండా చూదాం, కానీ -పాపం - అనుకొన్నంతగా పాప స్టార్ కావడం కష్టం...."
చలపతి -లోగడ అనుకొన్న సంకేతం ప్రకారం, ఓ పొడిదగ్గు దగ్గి అగ్గి పెట్టె చప్పుడు చేశాడు. ఇహ తను ఎలర్ట్ గా ఉండాలనుకొంది మంజరి. చలపతి ఏదో పనున్నవాడిలా అవతలకు వెళ్ళిపోయాడు. గదిలో రామారావుగారు, మంజరి తప్ప మరో ప్రాణి లేదు. కిందినుంచి ప్రతి పదేసి నిమిషాలకూ ఫోన్ మోగడమూ సెక్రెటరీ ఏదో అస్పష్టంగా అనడమూ వినిపిస్తోంది.
"ఆఁ....ఇంకేమిటండీ సంగతులు....వచ్చాక ఎవర్నయినా చూశారా?....మూర్తిగారిని కలుసుకోవడం కూడా అవసరమే! వారూ లీడింగ్ యాక్టరే! చాలా మంచివారు చేతనయినంత సహాయం చెయ్యగలవారు. మరోమాట వారినిచూడ్డం అవసరమనుకొంటాను" అన్నాడు రావుగారు.
ఆయన మాట ఎందుకన్నదీ మంజరికి ఇట్టే తెలిసిపోయింది. వారిద్దరిమధ్యా పచ్చగడ్డికూడా భగ్గుమంటోందన్న విషయం ఆవిడకు ఎప్పుడో తెలుసు తన ఉద్దేశం గ్రహించేందుకే రావుగారీ ప్రస్తావన తెచ్చారన్న నిర్ణయానికి మంజరి తక్షణమే వచ్చేసింది.
"నాకా వుద్దేశం లేదండీ! సినిమా ఫీల్డన్నా వదిలేస్తానుగానీ, మూర్తిగారిని మాత్రం నే చూడను, అసలాయనంటేనే నాకు గిట్టదు. వెనక అండదంలున్నాయి గనక నెట్టుకొస్తున్నాడు గానీ, లేకపోతే ఆయనకు బుకింగ్స్ కూడా రావని నా నమ్మకం, ఆయనగారు సహాయం చేస్తాడో లేదో నాకు తెలీదనుకోండి, చేసినా పుచ్చుకొనేందుకు నాకిష్టం లేదు.....నాకయినా ఈ సినిమాల్లో చేరిపోవాలని లేనే లేదు. ముఖ్యంగా మిమ్మల్ని చూదామని పనిమాలా వచ్చాను మా చలపతిగారికి మీరంటే వల్లమాలిన గురి. మీరు పూనుకుంటే పది కంపెనీలతో మాట్లాడి, నాకు వేషాలిప్పించగలరని చెప్పారు. మీరు మహానటులనీ కళాప్రపూర్ణులనీ నాకు తెలుసుగానీ, పరిశ్రమలలో యింత పలుకుబడి ఉన్నదని తెలీదు....అదీగాక చాలామంది ఈ ఇండస్ట్రీలోని వారుకూడా మీ ఆశీర్వాదం పొందితే చాలునని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే వచ్చాను. మరోసారి మూర్తిగారి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకండి" అన్నది మంజరి.
రావుగారేమీ మాట్లాడలేదు.
"మీరు ఎవర్ని కలుసుకొన్నారో చెబితే, వారికి నేనూ ఓ మాట చెబుతాను...." అన్నాడు రావుగారు.
ఏం చెప్పవలసిందీ మంజరికి తోచలేదు. ఎవరెవర్నీ తను కలుసుకోలేదు. కనీసం వాళ్ళ పేర్లయినా తనకు సరిగ్గా రావు. కల్పించే చెప్పొచ్చు - కానీ రావుగారు ఫోనుచేసి కనుక్కొంటే తను అభాసుపాలు కావలిసొస్తుంది. ఆదిలోనే తనమీద బాడ్ ఇంప్రెషన్ కలిగించుకోవడం యే మాత్రం భావ్యంకాదు. ఇప్పు డేమిటి చేయడం?
"పోనీ ఆలోచించుకొని తరువాతనే చెప్పండి....మరో సంగతి .... ముందుగా మీకు పెద్ద వేషాలు దొరకవు, కాస్త పుటింగ్ దొరికిందాకా దొరికిన వేషాలేవో వేస్తుండాలి హీరోయిన్ గా మీరెంత వరకూ పనికొస్తారో నేను చెప్పలేను...."
మంజరి గుండె గతుక్కుమన్నది.
"అదంతా మీదయ. నేను మీదాన్ని, నన్నేం చెయ్యమంటే అదే చేస్తాను. ఏ క్షణాన రమ్మన్నా వస్తాను. మీలాంటి కళామూర్తుల పాదసేవచేసే భాగ్యం నాకింత లభిస్తే అదే పదివేలు....మీరు మనస్పూర్తిగా నన్ను దాసీవేషం వేయమన్నా వేస్తాను. మీకులేని అభ్యంతరం నాకూలేదు...మీకు యివ్వాళ తీరుబాటే గదా! ఏదన్నా హోటల్ కెడదాం పదండి. అక్కడ మనం ఇంకా స్వేచ్చగా మాట్లాడుకోవచ్చు.....నేనో విషయం చెప్పడం ఆలస్యమైంది, నవకళా చిత్రాలయావారు మా చలపతిగారికి తెలుసు. వారికీ, మా నాన్నగారికీ బాగా పరిచయం. ఆ కంపెనీవారు. నాకో వేషం యిస్తామన్నారు. కధ తయారవుతూ వుంది." అనికూడా వోముక్క కలిపింది మంజరి.
"అలాగా!" అన్నారు రావుగారు. ఆయనలోని సంచలనాన్ని మంజరి గమనించి "మందు పనిచేసింది" అనుకొన్నది.
"ఇంకా ఎవర్నీ బుక్ చేయలేదేమో! ఒకవేళ చేసినా మీకా సంగతి తెలిసే అవకాశం లేదనుకోండి-" అని మధ్యలోనే ఆపేశారు రావుగారు.
"కధ పూర్తికానిదే బుకింగ్స్ విషయం ఆలోచించమన్నారు వారు. వెంకటేశ్వర్లుగారు,. రామబ్రహ్మంగారు నాకు తెలిసినవారు గనక ఆ కంపెనీ విషయాలేవీ నా దగ్గర దాచుకోరు. మాంచి పోక్ లోర్ కధకోసం చూస్తున్నారు. ఇంకా కొంత కాలం పట్టేలా వుంది" అన్నది మంజరి.
రావుగారు ఓ నిముషంపాటు ఏదో ఆలోచించి ఆ తరువాత సన్నగా నవ్వి అంతకన్నా సన్నగా నిట్టూర్చాడు.
"ఏదో లెండి, ఆ రోజులే వేరు, ఏడెనిమిదేళ్ళ కిందటిదాకా నాకు అచ్చంగా పొక్ లోర్ పిక్చర్సే వచ్చేవి. ఇప్పుడన్నీ సాంఘికాలే, మళ్ళా మన కంపెనీవారి ప్రవేశంతో రధం ఫోక్ లోర్ వేలో పోతుందనుకొంటాను. ఇప్పుడేవరన్నా మాంచి జానపద చిత్రం బావున్ననీ, అందులో హీరోగా వేదామనీ, చాలాసార్లు అనుకొన్నాను ...కానీ, - నిజంగా నాకు క్షణం తీరుబాటు లేదు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అయినాసరే - జానపద చిత్రమంటే నాకు ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుంది. నన్ను నటున్నిగా నిలబెట్టినవి ఆ సినిమాలే! అసలీదిక్కుమాలిన సాంగికాల కన్నా ఆ కధలే హాయిగా ఉంటాయి. మనవాళ్ళు మళ్ళా జానపదం తీస్తున్నారని మీరనేప్పటికి -ఈ సంగతులన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏదోలాగా కాల్ షీట్సు ఎడ్జెస్టు చేసుకొంటాను. మరి త్వరగా కధ తెమల్చుకోమనండి" అన్నారు రావుగారు.
రావుగారి అభిప్రాయం మంజరికి అవగాహనయింది. తన భావాలను ఎంత జాగ్రత్తగా ఆయన బయటబెట్టాడో చూస్తే ఆవిడకు ఆశ్చర్యం వేసింది.
"అలాగేనండీ! వారికింకా బుకింగ్సు ణు గురించి ఆలోచించే తీరికలేదు. నేను తప్పకుండా చెబుతాను...."
రావుగారు లేచి నుంచున్నారు.
మంజరి లేవక తప్పలేదు.
"లోపలికెళ్ళి కాఫీ పంపిస్తాను. ఈ లోగా డ్రైవరొస్తాడు, మిమ్మల్ని ఇంటిదగ్గర దిగబెట్టిరమ్మని చెబుతాను. మీరు సరాసరి ఇంటికేవెడతారా?" అన్నాడు రావుగారు.
"ఇలా?" అని ఓ క్షణం ఆగిపోయింది మంజరి, నేనడిగిన దానికి మీరు సమాధానం చెప్పనేలేదు. అలా ఏదన్నా హోటల్ కెళ్ళి ఓ గంట కులాసాగా గడిపేద్దాం. మళ్ళా మిమ్మల్ని పువ్వుల్లో బెట్టి తీసుకొచ్చి ఇక్కడ దించేస్తాను... ప్లీజ్.... నేనిలాలేకిగా అగుగుతున్నానని మీ రానుకొన్నా మాబాగై! నాకు మీరు ముఖ్యంగానీ, ఇతరులేమనుకొంటున్నారన్నది ముఖ్యం కాదు" అన్నది మంజరి.
"ఎక్స్ క్యూజ్ మీ మంజరీ! మరోసారి మనం తప్పకుండా వెడదాం. ఓ గంటేం ఖర్మ! ఓ రాత్రల్లా ఉండిపోదాం కూడానూ..... ఇంతకుముందు మనం కొత్తవాళ్ళం, ఈ క్షణంనుండి సహనతులం. ఇలాంటి సమావేశాలు కొన్నివేలు జరగవలసి ఉంది....వన్ సెకెండ్, నేను కాఫీని,. డ్రైవర్నీ పంపుతాను....నేనే
వద్దునుగానీ, అవతల అర్జంటుగా చూసుకోవలసిన పనులుండి పోయాయి"
"నేను కారు తీసుకొచ్చాను మరి నాకు సెలవు" అన్నది మంజరి రెండు చేతులూ జోడించి.
"అయ్యయ్యో! అదేమిటమ్మా! ఇక్కడకొస్తే నేను కారివ్వననుకున్నావా, అసలు నాకే కారులేదనుకొన్నావా? ఇహ ముందెప్పుడూ అలా చెయ్యకండి."
ఇద్దరూ పోర్టికోలో కొచ్చారు.
చలపతి మంజరి కార్లో ఎక్కిందాకా ఉండి, తలిపు జాగ్రత్తగా వేసి, రావుగారితో షేక్ హాండ్ చేసి కారును స్టార్ట్ చేశాడు. మంజరి రావు వొకరినొకరు చూసుకొన్నారు. హాయిగా నవ్వుకొన్నారు. కానీ ఆ నవ్వులో ఏదో లోపించి, అదేమిటో వారిద్దరిలో ఏ ఒక్కరికి తెలీదు.
అనుకొన్న రోజు తారకంగారు కధను తీసుకురాలేదు. ఆయనొస్తాడని కధ వినిపిస్తాడనీ, అందులో తనవేషం ఎలా ఉంటుందో, విని ఆనందించామనీ మంజరి మురిసిపోయింది అప్పటికి ఉండబట్టలేక చలపతిని పాతిక్కి పదిసార్లు కదిలించి చూసింది కూడాను.
చలపతి చాలా వోపిగా, "అలాగే చూద్దాం -" "వెళ్ళి కనుక్కొంటాను" - "రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను" లాంటి సమాధానాలు చెప్పుకొంటూ వచ్చాడు గానీ, ఇవేవీ మంజరికి నచ్చలేదు.
"అనుకొన్నపని అనుకొన్న వేళకు జరగాలిగానీ, ఇంతలేసి ఆలస్యాలయితే ఎలానండీ?" అన్నది మంజరి.
చలపతి పూర్తిగా సహనాన్ని కోల్పోయాడు.
"అమ్మాయీ! వెనకటికో సామెతది - నీకు తెలుసుననుకొంటాను. "నక్క పుట్టి నాలుగురోజులు కాలేదట- ఇంతగొప్ప గాలివాన నా జన్మలో ఎరుగనన్నదట, నీ కెన్నోసార్లు చెప్పాను, నీ కామెంట్స్ దేన్నీ గురించయినాసరే పాస్ చెయ్యొద్దని నా మాటంటే నీరు లక్ష్యం లేదా? అప్పుడే అన్న విషయాలూ తెలిసిపోయాయనుకొంటున్నావా నీకు తెలియనందుకు నాకు బాధలేదు. కనీసం చెబితేనన్నా గ్రహింపు లేకపోతే ఎలా?" అని మండిపడ్డాడు చలపతి.
మంజరి ఖిన్నురాలయింది.
"నేను మాత్రం కానిమాటలేమన్నానండీ?" అన్నది మంజరి. భితుకు భితుగ్గా.
రెండుమూడు నిముషాలు ఏమీ అనలేదుగానీ, తరవాత ఫక్కున నవ్వుతూ మంజరి భుజమ్మీద చెయ్యివేసి "కోపం వచ్చిందా?" అన్నాడు.
మంజరి పలకలేదు.
"ఇక్కడ వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి మంజరీ! ముష్టి కధను రాయడానికి ఇన్నిరోజులు అవసరం లేనేలేదు. పట్టుమని కూచుంటే నాలుగైదు రోజులే చాలు. కానీ, అంత తొందరగా ఏ కవి రాయడు, అధవా రాశాడో వాడి పుఠమారిందన్నమాటే!" అన్నాడు చలపతి.
మంజరి కళ్ళింత చేసుకొని చూసింది.
"ఇక్కడున్నచిత్రమేదీ! సినిమాకధంటే - అదమ పక్షం అయిదారు మాసాలపాటు నలగాలి. కవిగారు రాసింది రాసినట్టుగానే తీయడం ఎప్పుడూ జరగదు. డైరెక్టరూ, ప్రొడ్యూసరూ, ఒక్కోసారి హీరో, హీరోయిన్లు కూడా కధను మారుస్తూ ఉంటారు. సెన్సార్ వెళ్ళబోయేనాటికి, కవిరాసిందానికి, తయారయిందానికీ ఎక్కడా పోలికలుండవు."
మంజరికి ఎందుకనో నవ్వొచ్చింది.
"అయితే నేనుకూడా కధను మార్చమంటూ అడగోచ్చునన్నమాట" అన్నదావిడ ఈ విషయం నమ్మనట్లుగా.
"ఆఁ" అన్నాడు చలపతి "కానీ, నువ్వు హీరోయిన్ వి కావాలిగా ముందు, నీకోసం జనం విరగబడతారన్న నమ్మకం ప్రొడ్యూసర్ కు కలగాలి. నువ్వంటే బాక్సా ఫీస్ బ్రేక్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్ అనుకోవాలి. ఆ రోజున నువ్వేం చెప్పు అది వేద వాక్యమయిపోతుంది. అదో ఫార్ములా కింద ఫారమయిపోతుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు పత్రికల కెక్కవనుకో కంపెనీ మనదే అయితే మనం న్యూస్ గా కూడా వేయించొచ్చు, అయితే ఆ స్థాయికి నువ్వు రావాలంటే అందిన వేషాలేస్తూ, అందరకీ అనుకువగా "ఉండాల్సిందే!" నన్నాడు చలపతి.
ఇంకా అడుకువేమిటి నా బొంద అనుకొంది మంజరి.
పదిహేనురోజుల తరువాత తారకం గారు కధను పట్టుకొచ్చారు. కధంటే ఎంత ఉంటుందో ననుకొంది మంజరి, ఆయన చేతులలో అయిదారు అరఠావులకన్నా ఎక్కువలేవు.
"ఓ చిన్న రహస్యం" అన్నాడు తారకం తాపీగా కుర్చీలో కూచుంటూ.
చలపతి ముందుకు వంగాడు.
"ఈ కధనింకా వెంకటేశ్వర్లుగారికి చూపించలేదు. ముందుగా మనలో మనం ఓ నిర్ణయానికి కొచ్చాక మార్పులూ, చేర్పులూ చేసుకొన్నాక, ఫైనల్ గా వారికి చూపిద్దాం. నేనిలా ముందు మీకు వినిపించానని అనకండి" అన్నాడు తారకం.
హఠాత్తుగా చలపతి లేచి, తారకంగారి రెండు చేతులు పుచ్చుకొని గుండెలకు హత్తుకొన్నాడు.
"మీ మీద మీలో ఎంత అభిమానం ఉందో, ఇప్పటికి నేను తెలుసుకోలేకపోయాను తారకం గారూ! ఈ రణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడంలేదు" అన్నాడు చలపతి సన్నగా నిట్టూరుస్తూ. "నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా, మాకు కాస్త కాలూనడానికి అవకాశం దొరకనివ్వండి. మీరు మన కంపెనీకే వచ్చేద్దురు గానీ....ఏం మంజరీ! తారకంగారంటున్న మాట విన్నావా? వెంకటేశ్వర్లు మనకు తెలిసినవాడు. తారకం గారు మనకు పరమాప్తులు. కనకనే కంపెనీకన్న ముందుగా మనకు కధ చెప్పేస్తున్నారు. నీక్కావలసినవిధంగా కారెక్టర్ని మార్పించుకోవచ్చు. ....ఈ వెంకటేశ్వర్లు అడుగుతాడేమో వొక వేళ - నీకేమీ తెలీనట్టేవుండు సరేనా"
"ఎంత మాటండీ! ఇంత అభిమానంతో మీరు సాయం నాకు చేస్తుంటే నేను మరోలా అనుకోగలనా?"
నాక్కావలసిందదే అమ్మాయిగారూ! అన్నాడు తారకం.
తాయారు అందరికీ కాఫీలిచ్చింది.
తారకంగారు కధను చదవడం ప్రారంభించారు. ఉపోద్ఘాతంగా -
"ఇదే ఫైనల్ కాదు. ముందు మనం రఫ్ గా అనుకొంటున్నాం, తోటల ఫ్లాట్ మనకు నచ్చితే సినేరియో రాసేస్తాను. కొసకు దైలాగ్సు చూచుకోవచ్చు" అన్నాడు తారకం.
"అలాగే బాబుగారూ!" అన్నది మంజరి.
తారకం గొంతు సవరించుకొని, కాగితాల వోసారి విదిలించి, కళ్ళజోడు పైపంచతో తుడుచుకొన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS