Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 21

చలపతి మనస్సు కరిగిపోయిన వాడులాగా అభినయించాడు.
"ఓసి వెర్రిదానా! ఈమాత్రం డానికి ఇంత బేజారయితే ఎలా? నేనేమన్నా తమాషాకు తిరుగుతున్నాననుకొన్నావా? అవతల నాకు బోలెడన్ని పనులున్నాయి.....రాత్రి రావుగార్ని కలుసుకొన్నాను."
"ఏమన్నారు?" అన్నది మంజరి.
చలపతి చిరునవ్వు నవ్వాడు.
"నీ జాతకం బ్రహ్మాండమయింది మంజరీ! పరబ్రహ్మశాస్త్రిగారు చెప్పిననదంతా జరుగుతోంది. వారికి నీ సంగతంతా చెప్పాను. "అలాగే చూద్దాం" అన్నారు మామూలుగా. "ఆ అమ్మాయి మీ దర్శనం చేసుకోవాలని ఆరాటపడిపోతూ ఉంది. సార్, ఒక్కసారి మీ అప్పాయింట్ మెంట్ ఇప్పించమన్నాను. ముందుగా టైం లేదని గోనుగుతూనే, చివరికి ఈరోజు సాయంత్రం రమ్మన్నాడు. వారిచేత ఆమాట తీసుకొని, నవకళాచిత్రాలయ కెళ్ళాను. తెల్లవారుజాము దాకా మేమిద్దరమూ కధను గురించే మాట్లాడుకొన్నాం. ఆయన ఫోక్ పిక్చర్ తీయడానికి రెడీగానే ఉన్నాడు రావుగారికి ఫోక్ హీరోగా బోలెడంత పేరుంది. ప్రొడ్యూసర్ మనవాడే గనక, నువ్వు హీరోయిన్ గాక తప్పదు. తోలిసారిగానే, రావుగారి ప్రక్కన హీరోయిన్ చాన్సు దొరకడమంటే, నీ అదృష్టం పండిందన్నమాటే! రేపట్నుంచీ, నీ గుమ్మంముందు ఎన్ని గొర్రెలు క్యూలో నిలబడతాయో నీవు వూహించలేవు" అన్నాడు చలపతి.
ఇప్పటి కిప్పుడే పొద్దుగూకితే బావుండుననిపించింది మంజరికి ఆవిదకున్న బద్దకమంతా వదిలిపోయింది. గబగబా స్నానం చేసి బట్టలు మార్చుకొచ్చింది.
"నేనన్ని ఏర్పాట్లూ చేశాను" అన్నాడు చలపతి కాఫీ చప్పరిస్తూ.
మంజరికి అర్ధంకాలేదు.
మొట్టమొదటిసారిగా నిన్ను చూడటం గనక, వారికి నీ మీద మంచి అభిప్రాయం కలగాలి.
"నాకేదో భయంగా ఉన్నదండీ!" అన్నది మంజరి.
"ఫర్వాలేదు. నేను నీకన్నీ విడమరచి చెబుతాను. నా మాట ప్రకారం నడుచుకో నువ్వు వొడ్డెక్కుతావు. మనం కారుమీద పోతున్నాం. వెంకటేశ్వర్లుగారిని కారడిగాను. వారూ యిస్తామన్నారు. వెంకటేశ్వర్లుకు రావుగార్ని హీరోగా బుక్ చేద్దామని ఉంది. రావుగారికేమో ఇప్పటికే పదిహేను పిక్చర్లున్నాయి. తీరా అడిగితే వీలుపడదంటాడేమోనని వెంకటేశ్వర్లు భయం! కానీ రావుగారలా అనరు. ఆమాట కొస్తే ఏ యాక్టరూ అనడు వేలకువేలు డబ్బొస్తుంటే చేదా వద్దనేందుకు? మరెందుకంటున్నారంటే రిమాండ్ పెరిగేందుకు. "నా వల్ల కాదయ్యా బాబూ!" అని వారంపాటు తిప్పించుకొని ఇంకో పదివేలు ఎక్కువ గుంజి వేషాలు వేసేస్తారు. రేపు నీకూ పేరొచ్చి నీకూ డిమాండ్ పెరిగితే నువ్వూ ఇలానే అనాలి, అప్పుడు నేనే చూసుకొంటాననుకో,......చెప్పవచ్చిందేమిటంటే మంజూ! నువ్వు ఫలానా కంపెనీవారి కారులో వచ్చావని రావుగారికి తెలియడం ముఖ్యం. మంజరి మరి అంత దిక్కులేని మనిషి కాదని, ఆవిడ వెనక వో కంపెనీ ఉన్నదనీ రావుగారికి తెలిస్తే నీ విలువ తప్పకుండా పెరుగుతుంది. నీ ద్వారా ఆ కంపెనీలో వేషం సంపాదించవలసిన అవసరం రావుగారికి లేదనుకో. కనీసం ఆయన్ను గురించి నాలుగు మంచిమాటలన్నా చెబుతావుగదా! ఆ ఆశతోనైనా వారు నిన్ను మర్యాదగా చూస్తారు. నీకు సాయంచేస్తారు." అన్నాడు చలపతి.
ఇందులో యిన్ని గుంటచిక్కులున్నాయని మంజరికి తెలీనే తెలీదు. ఆవిడ ఆశ్చర్యపోయి కళ్ళింత చేసుకొని చలపతికేసి చూసింది.
"ఇంతకీ నన్నేం చెయ్యమంటారో మీరు చెప్పనే లేదు." అన్నది మంజరి.
"వస్తున్నాను" అంటూ ప్రారంభించాడు చలపతి. "చలపతి రావుగారి పర్సనల్ రూములోకి తీసుకుపోతాను 'వారే రావుగారు' అని నేనక్కడ అనడం బావుండదు తనను గురించి మూడున్నరకోట్ల మంది ఆంధ్రులకూ క్షుణ్ణంగా తెలుసునన్న భ్రమ ప్రతిసినిమావాడికి ఉన్నట్టే, ఆయనకూ ఉంది. ఆయన్ను చూస్తూనే నువ్వు నమస్కారం పెట్టేయాలి. ఆయన కూచోమంటాడు."
"కూచోమంటే కూచోనుటండి మీ పిచ్చిగానీ, ఆ మాత్రం తెలీదా నాకు?" అన్నది మంజరి.
చలపతి రెండు చేతులతోనూ తల పట్టుకొన్నాడు. మళ్ళా ఏదో కొంపమునిగిందనుకొన్నది మంజరి.
"నువ్వా వెధవపని చేస్తావని నాకు తెలుసు. చెయ్యకూడదనే నేను చెబుతూంట. ఆయన్ని చూసి దిమ్మరపోయినట్లు కనిపించాలి. కన్నార్పకుండా చూడాలి. నాలుగైదుసార్లు కూచో కూచోమని అనిపించుకొన్నాక, ఫర్వాలేదు, ఫర్వాలేదు, నేనిలా నిలబడతాన్లెండి' అంటూనే కూచోవాలి. "మిమ్మల్ని చూడటంవల్ల మాజన్మ ధన్యమయిందన్న ధోరణిలో మాట్లాడాలి. ఆ ధోరణిలోనే అనాలి గానీ, అవే మాటలు అనకు....రావుగారు కాలాంతకుడు. ఆవలిస్తే పేగులు లెక్కించేరకం. ఆయనతో మాట్లాడటమంటే కత్తుల మీద నడిచినట్టుగా ఉంటుంది. మనిషిలో లోతులేదు. లోతు ఉన్నట్లుగా కనిపిస్తాడు. నటుడు గనక మరింత సహజంగా నటిస్తాడు. ఆయన ఏకపత్నీ వ్రతుడు కాడు -మంచి రసికుడు. సౌందర్యాన్ని ఆరాధించే తత్వం. ఆయనకు నచ్చావో నీచక్రం తిరిగిందన్నమాటే!" అన్నాడు చలపతి.
"మీరు పక్కనే ఉంటారు గనక, నెగ్గుకొస్తాన్లెండి ఫర్వాలేదు" అన్నది మంజరి. తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ.
"నో నో" అనేశాడు చలపతి "మహా" ఉంటే పదినిమిషాలుంటారేమో! తరవాత నేనే బయటికోచ్చేస్తాను. అరగంటో ముప్పావు గంటో, గంటో ఉండిరా, ఒక్కటే గుర్తు మాంచిపట్టులోనేను ముందుగా జేబు తడుముకొని అగ్గిపెట్టె చప్పుడు చేస్తాను. సిగరెట్ కాల్చుకునేందుకు వెళ్ళాడని రావుగారనుకొంటారు. నీకా చప్పుడే సిగ్నల్" అన్నాడు చలపతి.
"ఇంకేమన్నా జరుగుతుందేమోనండీ!" అన్నది మంజరి.
చలపతికి మండిపోయింది.
"అయితే వెళ్ళి గంగలో దూకు. ఇహ నావల్లకాదు" అన్నాడతను.
మంజరి చిన్నపోయింది.
"అదిగాదే పెద్దమ్మా! చిలక్కు చెప్పినట్లు ఇన్ని చెప్పినా నీకర్ధం కాకపోతే నువ్వెలా పైకొస్తావాని?  ఆయన నీరాక్షసుడా! నీ ప్రాణాలు తినెయ్యడానికి? అయితే అవుతుంది; కాకపోతే కాదు యింతలో కొంపలు మునిగిపోవు."
మంజరి పలుకలేదు.
"సాయంత్రం మూడున్నరా నాలుగింటి కల్లా నటేశాన్ని రమ్మన్నాను. ఇందాకనే నీ ఫోటో చూపించానతనికి నీకు సరిపడే మేకప్ సామానుతో వస్తాడు. చక్కా మేకప్ కావాలి చూచేసరికి కళ్ళు చెదిరిపోవాలి. ఎల్లోరా హెయిర్ స్టయిల్ ఎప్లయి చేయడంలో నటేసం అసాధ్యుడు. అన్నట్లు ఇంకో సంగతమ్మాయ్! రావుకు స్ట్రాంగ్ సెంట్స్ పనికిరావు. డిమ్ వెరైటీస్ వాడాలి. అవీ ఆయనే తెస్తానన్నాడు. ఈ లోగా నువ్వు స్నానం చేసి రెడీగా వుండాలి. నిద్రపోవా కళ్ళు వాచిపోతాయి. నీకు విడిగా లిప్ స్టిక్ బావుండదు. తాంబూలం వేసుకొని నోరు శుభ్రం చేసుకో....ఇదంతా నీకు కొత్త గనక చెబుతున్నాను."
నాలుగులోపుగానే నటేశం వచ్చాడు. భుజాలమీదపడే పెద్ద జుట్టు. తాబూలం చర్వణంతో గారపట్టిన పళ్ళూ, తెల్ల లుంగీలూ గ్లాస్కోలాల్చీ మెళ్ళో సన్నని బంగారు గొలుసూ, చడావులూ చూడ్డానికి చిత్రంగా ఉన్నాడతను.
"వణక్కంమాయీ, వణక్కం" అన్నాడు నటేసం మంజరిని చూస్తూనే.
"తెలుగు స్టారేనయ్యా! ఇంకా అరవంకాదు" అన్నాడు చలపతి నవ్వి.
"అట్లానా!" అన్నాడు నటేశం.
ఆ తరువాత తలపంకిస్తూ, "రొంబా బ్యూటిఫుల్ ఫేస్ కట్ సామీ! టెర్రిబుల్ ఫోటో జెనిక్ ఫేస్ దా. నానుదా వత్తున్నారు సమచ్చరం యిండమాదిరి మేకప్ సేస్తాడంటిమి. ఈ తల్లిగా మాణుమణిసి. నిక్కాయం సాల్లుదును,. వండ్రఫుల్ సామీ!" అన్నాడు నటేశం.
అతనంటున్నది. అర్ధమయి కాదనా. ఆధోరణికి మంజరి నవ్వుకొంది.
"నువ్వు తొందరగా కానివ్వు నటేశం, నేనీలోగా కారు పట్టుకొచ్చేస్తాను" అని లేచాడు చలపతి.
"కట్ యం నేస్తును సామీ! అంగ వా అమ్మా! రూమ్ కు దా!" అనీ లోపలికొచ్చాడు నటేశ.
వీడేమన్నా అఘాయిత్యం చేస్తాడేమోనని మంజరికి అనుమానం వేసింది. చలపతేమో ఆ సరికే వెళ్ళిపోయాడు. ఇప్పుడు భయపడినా ప్రయోజనం లేదని తేలిపోయింది. ఆ నిశ్చయమయ్యాక "ఆఁ చేస్తే చెయ్యనిద్దూ, ఇంతలో ముంచుకుపోయిందేమిటి?" అనుకొంది మంజరి.
అదృష్టవశాత్తూ నటేశం ఏ అఘాయిత్యమూ చెయ్యలేదు. పెట్టెలోంచి రకరకాల డబ్బాలూ, పౌడర్లూ, ట్యూబులూ, సెంట్సు, బ్రషులూ తీశాడు. ముందుగా ముఖాన్ని నీటితో కడిగి, ఆ తరువాత మేకప్ చేశాడు. కనుబొమ్మలు దిద్దాడు. కనురెప్పలు దిద్దాడు. అందంగా కాటుక తీర్చాడు. రెండు, మూడు సవరాలు చేర్చి అద్భుతంగా జుట్టు ముడివేశాడు,. మాయ ముత్యాల దండను తలలో అమర్చాడు. కణతలమీదినుండి కొద్దిజుట్టును చెంపలమీదికిజార్చి, వంకీగా మెలితిప్పి, అది మళ్లీ గాలికి లేవకుండా జిగురుతో అంటించాడు. మంజరి నుదురు మరీ విశాలం. అంచేత జుట్టును నుదురు కప్పడిపోయేలాగా ముందుగా దువ్వాడు. కాసిన్ని వెంట్రుకలు పొరబాటున మొఖం మీద పడ్డాయన్న భ్రమకలిగేలా ఏర్పాటు చేశాడు. జుత్తు ముడిమీద బంగారురంగులీనే పువ్వులు తాపిన గుడ్డను పిన్నులతో గుచ్చాడు. దూరంనుంచి చూస్తుంటే, మంజరి జుట్టుముడి మీద మిణుగురులు ఎగురుతున్నాయేమో ననిపిస్తుంది.
'చీరేకట్టుకుర'మన్నాడు నటేశం.
ఆవిడ వచ్చాక పెదవి విరిచేశాడు.
"అదిదా సరిగా లేదు మేడమ్, నేనుదా సరిచేస్తునా?" అన్నాడు నటేశం.
"కొంప మునిగింది" అనుకొన్నది మంజరి. 'ఏదయితే అదే అవుతుంది' అని ధైర్యం కూడ చెప్పుకొంది. ఈలోగా చలపతి కారు తీసుకువచ్చాడు. మంజరి హాయిగా వూపిరిపీల్చుకొంది.
"ఇంకా కాలేదా?" అని మంజరి కేసి త్యిరిగి చీరె కట్టును చూసి పక పక మన్నాడు చలపతి. అచ్చమైన పల్లెటూరిదానిలాగా ఉన్నావు నువ్వు గడ్డిమోపులు మొయ్యడానికి పోవడంలేదు. ఏమిటా చీరకట్టుకోవడం? నటేశం త్వరగా చూడు నాయనా!"
నటేశం అధ్బుతంగా చీరెకట్టాడు. చీరె అంచులు నేలకు జీరాడుతున్నాయి. దాదాపు మోకాళ్ళదిగువదాకా పమిట జారి ఉన్నది. ఉన్నంతలో పెద్దసైజు బ్రేసరీస్ వేసుకోమన్నాడు చలపతి. దానిమీద బాడీ, ఆపైన పలచని జాకెట్టు వేసుకొంది. వస్తూ వస్తూ ఓ చెమ్కీ బుట్టలాంటిది తీసుకొచ్చాడు చలపతి హై హీరోబుట్ వేసుకోమన్నాడు.
అంతా తయారయ్యాక ముందో అద్దం. వెనకో అద్దం పెట్టి "చూసుకోం"డన్నాడు నటేసం.
"బ్యూటిఫుల్" అన్నాడు చలపతి.
అతను మరోమాట లేకుండా పదిరూపాయలు నటేశం చేతిలో వుంచి 'చాలా తక్కువేననుకో! ఇంకా పనేమీ కాలేదు. కాస్త తాళితే ఈ వారా, ఆ వారా కలిపి నేనే ముట్టచెబుతాను. నీ చెయి మంచిది, నాకు తెలుసు. నువ్వు తొలిసారిగా మేకప్ చేసినవారందరూ చుక్కల్లో కెక్కారు. అంచేత మా వాళ్ళకు నీచేత చేయించాను. మళ్ళా కలుస్తాను గదూ!" అని పంపించేశాడు.
"ఈ కాస్సేపుకూ పదిరూపాయలా?" అన్నది మంజరి కళ్ళు చికిలిస్తూ.
"నువ్వు డబ్బు మొహమేచూశావు గానీ, నువ్వెంత బావుందీ చూసుకోలేదు. అవతల రావుగారికి అప్పాయింట్ మెంట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే నిన్నిప్పుడు అమాంతం నమిలిమింగేసి ఉందును" అన్నాడు చలపతి పళ్ళు కొరుక్కుంటూ.
"పోనీ మింగేయండి" అన్నది మంజరి కూడా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి ప్రయత్నిస్తూ.
"అనే ఉందిగానీ, మళ్ళా మేకప్ పాడయిపోదూ! అందుకు ణా భయం! సరే నువ్వింకా సెంట్సు రాసుకోనేలేదు....లైట్ గా చాలా లైట్ గా ఉండాలి పీనాసిగుణం కట్టేసి, కాస్త వళ్ళంతా పట్టించుకో. వళ్ళంతా అంటే- అర్ధమయిందిగా - పోనీ నేను పూయనేమిటి?" అంటూ దగ్గరగా వచ్చాడు చలపతి.
మంజరి నవ్వుతూనే అవతలికెళ్ళింది. ఆవిడ తిరిగొచ్చేసరికి చలపతి తిరుపతి వెంకటేశ్వరస్వామి పఠం ముందు నిలబడి దణ్ణం పెడుతున్నాడు. రెండు మూడు నిముషాలయ్యాక చెంపలు వేసుకొని ఇవతలగా వచ్చి నిలబడటమే కాకుండా, మంజరినికూడా దణ్ణం పెట్టమన్నాడు.
- వారు బయలుదేరేసరికి ఆరు గంటలు కావస్తోంది. తాయారును ఇంట్లో ఉంచి ఎవరు వచ్చినా కూచోమన్నారని చెప్పి, స్టీరింగ్ దగ్గర కూచున్నాడు చలపతి. మంజరి రెండోవేపు నుండి తలుపు తీసుకొని అతని ప్రక్కన కూచోబోయింది.
"నీ కీమాత్రంకూడా తెలియదేం మంజరీ! నువ్వొంటరిగానే వెనకనే కూచోవాలి. నీ ప్రక్కన ఎవ్వరూ ఉండకూడదు. అది నీ డిగ్వనిటీకిలోపం దయచేసి నువ్వలా వెనక్కూచో" అని సలహా యిచ్చాడు చలపతి.
కారు బయలుదేరాక చలపతి అడిగాడు 'వెంకన్నకు ఏమని దణ్ణం పెట్టుకొన్నావు మంజరీ?' అని.
మంజరి గుండెలు గతుక్కుమన్నాయి. నిజానికీవిడ ఏమనుకొని దణ్ణం పెట్టలేదు. ఊరికే నమస్కారం చేసింది. ఆమాటపైకి చెప్పేస్తే చలపతి చంపేలాగా కనిపిస్తున్నాడు. అందుకని -
"మీరే మనుకొన్నారో ముందు చెప్పండి మరి!" ఆనంది మంజరి.
"మన ప్రయత్నం సఫలమైతే మొదటి బుకింగ్ లో వచ్చేదాంట్లో సగం నీకిస్తానని..."
"నాకా?" అన్నది మంజరి నవ్వి.
"నీక్కాదోయ్! వెంకన్నకూ - "అన్నాడు చలపతి కూడా నవ్వుతూ, "ఇస్తాననీ, వింటున్నావా, ఇద్దరమూ వచ్చి స్వయంగా దర్శనం చేసుకొంటామనీ మొక్కుకొన్నాను. మరి నువ్వో -"
"డబ్బు సంగతి అనుకోలేదు. దర్శనం చేసుకొంటానని మాత్రం మొక్కుకొన్నాను." అని అబద్దమాడేసింది మంజరి.
"నిజంగా మంజరీ! తిరుపతి వెంకన్న నమ్మినవాళ్ళను చెడగొట్టడు. కృష్ణాసినీ మూవీస్ వారి పిక్చరు డబ్బు లేక నాలుగేళ్ళు మూలపాడిపోయింది. నేనే వెళ్ళి ఈ సలహా యిచ్చాను. నాలుగో నాటికి కృష్ణాజిల్లా నుంచి ఓ ఆసామి వచ్చి నాలుగు లక్షలు పెట్టి డబ్బాలు బైటికి లాగాడు,. ప్రివ్యూ ఇచ్చాం, నాలుగోనాటికి పెట్టెలు తిరిగొస్తాయన్నారు. పత్రికలవాళ్ళు కూడా చీల్చిపారేశారు. ఆ డిస్ట్రిబ్యూటర్ లబోమని గోల. డబ్బుపెట్టిన ఆసామి జబ్బుచేసి ఆసుపత్రిలో చేరాడు, ఆఖరుకు ఆఫీసుకొచ్చిన ఉత్తరాలు చూసే దిక్కు కూడా లేదు. ఏమిటి చేయడం? పరబ్రహ్మశాస్త్రిగారిని సలహా అడిగాను ఆయనగారు స్వామివారిసన్నిధిన డబ్బాలకు అధిషేకం చేయించమన్నారు. నేనే బలవంతాన ఆపని చేయించాను. ధియేటర్లకు పిక్చర్ పంపించింది కూడా నేనే! ఓ వారంరోజులు కలెక్షన్ చాలా డల్ గా ఉన్నాయి. ఇహ ఆ తరవాత స్పీడ్ అందుకొన్నదనుకో మంజరీ! జనం వేలంవెర్రిగా చూశారు. ఊళ్లనించి బళ్ళు కట్టుకొచ్చి మరీ చూశారు. ఇరవై నాలుగు సెంటర్స్ లో శతదినోత్సవాలు చేసుకొన్నది, డిస్ట్రిబ్యూటర్సు వాటాపోను, కంపెనీకి తొమ్మిది లక్షలు లాభం వచ్చింది. ఆ దెబ్బతో వాళ్ళు ఒకేసారి రెండు పిక్చర్సు ప్రారంభించారు. దేవుణ్ణి మరచిపోయారు. తమ పిక్చర్లో స్టార్ వాల్యూ ఉంది గనుకనే పోయిందన్నారు."
డబ్బాలు అభిషేకం చేయించాగానే వొరుగుతుందనుకోవడం అబద్దమన్నారు. నేను చెప్పినా వినలేదు. 'అనుభవిస్తార్లే' అనుకొన్నాను ఏడాది తిరక్కముందే మొత్తం ఆరిపోయాడు.. ఆఫీసు బిల్డింగుకు మూడుమాసాల అద్దె బకాయిపడి చెల్లించలేక ఇంటాయనకు కుర్చీలూ, బల్లలూ అప్పగించేశారు. కాబట్టి - ఆ అహం మనిషికి పనికిరాదు. సినిమావాళ్ళకు అసలే ఉండకూడదు" అన్నాడు చలపతి.
ఈ విషయాలేవీ మంజరికి రుచించడంలేదు. ఆవిడ మనస్సంతా రావుగారు చుట్టూ తిరుగుతూ వుంది. అతన్ని తను చాలాసార్లు తెరమీద చూసింది. చూసినప్పుడేమనిపించిందో తనకిప్పుడు జ్ఞాపకం లేదు. కానీ, ఈ మనిషిని ఇహ ముందు ముందు తను కలుకొనవలసి వస్తుందని మాత్రం అనుకోలేదు. అప్పటికి తనింకా నాటకాల కంపెనీలోకి కూడా రాలేదు. నాగమణి దగ్గర 'వ్యాపారంలో' వున్నది.
"నే చెప్పింది విన్నావా?" అని మరోసారి జ్ఞాపకం చేశాడు చలపతి.
"ఆఁ ఆఁ, వింటూనే ఉన్నాను, దాన్ని గురించే ఆలోచిస్తున్నాను. కొన్ని కొన్ని విషయాలు ఎంత చిత్రంగా ఉంటాయోమరి!" అన్నది మంజరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS