Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 17

"ఉంది నేను చెబుతున్నదదే! ఓ ప్రొడ్యూసరో, డిస్ట్రిబ్యూటరో కనీసం పలుకుబడివున్న ఆర్టిస్టో మనల్ని సపోర్టు చేస్తుంటే తప్ప, మనకు బుకింగ్స్ రావు వీళ్ళందరికీ ఈ పరిశ్రమమీద పలుకుబడి ఉంది. కాబట్టి వీళ్ళందరితోను మనం మంచిగా ఉండాలి. వీళ్ళను చాటుగా కూడా మాట అనకూడదు. "అందరూ ఉత్తములే" అంటూ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం - వాళ్ళన్నమాటకల్లా తలూపుతూ ఉండాలి. దిక్కుమాలిన కశంకలన్నీ పెట్టుకొంటే మట్టిగొట్టుకుపోతాం. ఇందులో పాపపుణ్యాల ప్రసక్తేలేదు. పాపమేమిటి...పుణ్యమేమిటి? డబ్బు లేకపోవడం పాపం. అది ఉండటం పుణ్యం. ఇంతకు మించిన సత్యం, నీకు ఏడేడు పద్నాలుగులోకాల్లోనూ దొరకదు. పుణ్యవంతులు సుఖపడాలి కదా! ఈ రోజున సుఖపడుతున్నవారెవరూ? డబ్బున్నవాళ్ళు. అంటే వాళ్ళు పుణ్యవంతులన్నమాటే! వారిది సంపాదించిన మార్గం, అందుకు చేసిన పనులూ మంచివన్నమాటే! కాబట్టే వారిదగ్గర డబ్బు మూలుగుతూ ఉంటుంది. వాళ్ళు సుఖపడుతూ ఉంటారు. దీన్ని చాతకాని సన్యాసులు వొప్పుకోరు. పాపమనీ అన్యాయమనీ, అధర్మమనీ, గొణుగుతూ ఉంటారు. తమ అసమర్ధతను వొప్పుకోరు. ఈ మాటల వెనుక, తమ తెలివితక్కువను కప్పి పెట్టుకొంటూరు. ఫలిత మేమిటయ్యా అంటే, దరిద్రంతో లుకలుకలాడి పోవడం, కాబట్టి నేను చెబుతున్న దేమిటంటే -"
చలపతి గొంతు పొరాడిపోయి దగ్గు వచ్చింది. మంజరి కూజాలోంచి వోగ్లాసు నీరుతెచ్చి బల్లమీద ఉంచింది. చలపతి వోగుటక వేసి కాసిన్ని నీళ్ళను జేబుగుడ్డమీద చిలకరించి కళ్ళు తుడుచుకున్నాడు. తడి జేబుగుడ్డను, కుర్చీ చేతిమీద ఆరవేశాడు.
"ఏం చెబుతున్నానూ?" అన్నాడు చలపతి, తనెక్కడ ఆపింది తెలీక.
"-నేను చెబుతున్న దేమిటంటే - అన్నారు"
"ఏమిటంటే మంజరీ! ఒక పనిని మొదలెట్టకుండానే ఉండాలి కానీ, తీరా ప్రారంభించాక కుశంకలన్నీ పెట్టుకొని వ్యవహారాన్ని చేతులారా పాడుచేసుకోకూడదు. నువ్వింకా చిన్నదానివి. నాటకానుభవం ఉన్నదేమోగానీ, అదిక్కడ దమ్మిడీకి కూడా పనికిరాదు. ఈలోకమే వేరు. పదిమంది మనుషులు మనచేత్తుల్లో ఉండాలి. ఉండాలంటే వారి అవసరాలేమిటో మనం తీరుస్తూ ఉండవలసిందే! ఆ అవసరాలేమిటని అడక్కు. అవెలాంటివైనా మనం వోబ్ లైజ్ చెయ్యాలిసిందే! అలా చెయ్యగలవారే  పైకొస్తారు నిష్టలూ, నియమాలూ పెట్టుకొందామంటే కుదరదు" అన్నాడు చలపతి.
హటాత్తుగా మంజరికో అనుమానం కలిగింది. తనుగానీ పొరబాటున ఏదన్నా కానిమాట కానీ అన్నదా? ఆ ముక్కే చలపతిని అడిగేసింది.
"నోనో నువ్వన్నావని గాదోయ్, పొరబాటున అంటావేమో నని నా భయం ఇప్పుడిప్పుడే వాతావరణం మనకు - సానుకూలంగా మారుతూ ఉంది. రావుగారి మనుషులూ, మూర్తిగారి మనుషులూ, నిన్ను గురించి ప్రచారం ముమ్మరం చేశారు. రేపో మాపో పత్రికల్లో నిన్ను గురించి వ్యాసాలూ నీ ఫోటోలూ వస్తాయి. ఇప్పుడిప్పుడే ఓ ఫిలిం కంపెనీ, అదే -మన వెంకటేశ్వర్లుగారిది మన చేత్తుల్లో కొచ్చింది. రావుగారికి  నువ్వంటే మంచి అభిప్రాయం ఉంది. పది కంపెనీల్లో నీ పేరు వినపడుతూ వుండి. నువ్వు పైకి రావడానికి ఇదే గుడ్ చాన్స్, ఇటువంటప్పుడే నువ్వు రవ్వంత నాక్ గా మెలగాలి, వోబ్ లైజింగ్ గా, వోబీడియంట్ గా ఉండాలి. నీ దివిటీ దేదీప్యమానంగా వెలిగిందన్నమాటే? అప్పుడు నీకన్ని ఇబ్బందులుండవు. నీకోసం వీళ్ళంతా చుట్టూ మూగుతారు. అప్పుడు చేయవలసిన పనులు వేరు. అప్పుడు మాట్లాడే ధోరణి వేరు. ఆటైం వొచ్చినప్పుడు నేను చెబుతాను, ప్రస్తుతం నువ్వు చెయ్యవలసిందల్లా నేను చెప్పినట్లు వినడం, చెయ్యమన్నది చెయ్యడం...
నువ్వీ వాతావరణానికి తగిన వ్యక్తివని నాకు తెలుసు....అవునుగానీ మంజరీ! అసలీ విషయం ఎందుకొచ్చిందీపూట? అన్నాడు చలపతి.
మంజరి బొత్తిగా జ్ఞాపకం లేదు.
"పోన్లేగానీ - ఆ గూట్లో సిగరెట్ పెట్టి ఉంది, తెచ్చిపెట్టు."
మంజరి సిగరెట్ తెచ్చి అతనినోటి కందించి తనే వెలిగించింది.
చలపతి గట్టిగా రెండు గుక్కలు పొగత్రాగి, చిటికవేసి సిగరెట్ నుసి రాల్చేశాడు.
" ఓ పని చేద్దాం. మళ్ళా ఆ శర్మగాడు మన కొంపకు రావటం నాకిష్టం లేదు. నేవెళ్ళి వాడి మొహాన అయిదొందలూ పడేసి వస్తాను. వాడసలే తిక్కరాముడు, వస్తూ వస్తూ కొంత ఫర్నిచరు కూడా పట్టుకొస్తాను. ఈ దిక్కు మాలిన కుర్చీలో కుర్చోవడమంటే చిర్రెత్తుకొస్తుంది. అవును గదూ?"
మంజరి గుండెల్లో సన్నని కంపరం బయలుదేరింది. వెంకటేశ్వర్లు తనకు డబ్బిచ్చిపోయినట్లు, చలపతికి యెలా తెలిసిందో మంజరికి బోధపడలేదు. మెల్లగా లేచివెళ్ళి అద్దం వెనుకనుండి పదిహేడు వందల రూపాయలనోట్లూ తెచ్చి చలపతి చేతిలో ఉంచింది. చలపతి వాటినోసారి లెక్కించిచూశాడు.
"ఈ పూటకు వెయ్యి చాలు. మిగతావి ఇంట్లో ఉంచు. వీలుంటే వెంటనే వస్తాను - లేదా అటునుంచి అటే రావుగారి దగ్గర కెడతాను ఈ పూట వారికి కాల్ షీట్ లేదు. నాకోసం నువ్వు కనిపెట్టుకొని ఉండకు. డూప్లికేట్ నా దగ్గరుందిగనక ఫర్వాలేదు."
పదినిమిషాల్లో డ్రెస్ చేసుకొని చలపతి వెళ్ళిపోయాడు. మంజరి కణతలు వొకసారి గట్టిగా నొక్కుకొని కుర్చీలో కూచుంది.
"పోస్టు"
మనుషులొచ్చిందాకా ఆగకుండానే కాకిగుడ్లనవాడు దబ్ మని ఓ కట్ట పడేసి సైకిలెక్కి వెళ్ళిపోయాడు. ఈలోగా తాయారు వెళ్ళి దాన్ని తీసుకొచ్చింది.
"ఇదేదో పత్రికండీ అమ్మాయిగారూ!" అన్నది తాయారు.
ఆ మాట వినగానే మంజరిలోకి కొత్తచైతన్యం వచ్చినట్లు అయింది. చేతులు గజగాజలాడాయి. వణుకుతున్న వేళ్ళతో రేపర్ చింపి వంగిన మధ్యబాగాన్ని సరిచేసి ఒక్కో పేజీయే తిప్పసాగింది. మొదటి నాలుగు పేజీల్లోనూ తయారవుతన్న సినిమాలవీ, ఆడుతున్న సినిమాలవీ ప్రకటనలున్నాయి. ఆ తరువాత ఏవో వార్తలూ, విశేషాలూ, సినిమాతారాల బొమ్మలూ వాటికింద వ్యాఖ్యలూ ఉన్నాయి. ఆమె వేళ్ళు గబగబా పేజీలను తిప్పేస్తున్నాయి. మధ్య పేజీలో పేజీకి మధ్యగా మంజరి బొమ్మ ఉంది మంజరి మెదడు దీపం వెలిగినట్లయింది. పదేపదే ఆ బొమ్మకేసే రెప్పార్పకుండా చూసింది, మెల్లగా ఆమె చూపులు పక్కలకు మళ్ళాయి. ఆ బొమ్మకింద సంపాదకుడు వ్యాఖ్యరాశాడు__
"వైజయంతి నుండి దిగి వచ్చిన అందాలకాణాచి మంజరి. ఆంధ్ర చలనచిత్ర రంగంలో అవతరించిన వినూత్న విశిష్ట తారామణి."
ఈ వాక్యాల్లో మంజరికి కొన్ని పదాలు అర్ధంకాలేదు. "వైజయంతం" "కాణాచి" అంటే ఏమిటి? తనను తిడుతున్నట్లా? పొగుడుతున్నట్లా?
బొమ్మకు పైభాగాన పెద్ద అక్షరాలతో "మకరంద మంజూష వంటి మంజరి రాక సినిమా పరిశ్రమ కొక వెలుగురేఖ" అని అచ్చేసారు. దానికింద చిన్న అక్షరాల్లో "రచన సత్యవాదా" అని ఉంది. బొమ్మకు రెండువైపులా వ్యాసముంది. ఆ వ్యాసాన్ని వొక్కసారిగా చదవలేకపోయింది మంజరి. నాలుగు పంక్తులు చదివాక మళ్లీ బొమ్మను చూసేది, పై హెడ్డింగూ, కింద వ్యాఖ్యా చదివేది. తిరిగి వ్యాసం చదవబొయ్యేసరికి ఇందాక ఎంతవరకూ చదివిందీ గుర్తు ఉండేది కాదు. అందుకి మళ్ళా మొదటినుండీ ప్రారంభించేది.
ఈ పద్దతిమీద మంజరి ఆ వ్యాసం పూర్తిగా చదివేసరికి రెండు గంటలసేపు పట్టింది. అందులోని కొన్ని పేరాలను పదేపదే  చదువుకొంది మంజరి. ఆ పేరాలలోని విషయం ఆమెకు పూర్తిగా అర్ధమైంది. అందుచేత హాయిగా ఆనందించగలిగింది.
"మంజరి అన్న పేరుగల అందాలరాశి మద్రాసు వచ్చిందని విని పత్రికా ధర్మంగా ఆమె ఇంటికెళ్ళాను. ఆమెతో దాదాపుగా రెండు గంటలసేపు గడిపాను....మంజరి విద్యావతి. ఆంధ్రసాహిత్యంలోని అనుపానులన్నీ ఆ చిన్నారికి కరతలామలకాలు. అభినయశాస్త్రం ఆవిడకు అభిమాన విషయం. వివిధరసాలను పోషించడంలోని మెలకువలను ఆమె ఆకళించుకుంది. సంభాషణాచాతుర్యమంటే ఏమిటో మంజరినుండి తెలుసుకోవాలనడం అతిశయోక్తికాదు. గొప్ప సంస్కారం కలిగిన ఈ వ్యక్తి చిత్రపరిశ్రమలోకి రావడం ఈ పరిశ్రమ చేసుకొన్న పుణ్యమనడంలో తప్పులేదు."
మరో పేరా__
"మంజరి అప్సరాంగన అన్నా చాలదేమో ననుకొంటాను. దివినుండి భువికి దిగివచ్చిన శంపాతికలాగా పాలరాతి బొమ్మలాగా, మహాశిల్పి తీర్చిదిద్దిన స్వర్ణప్రతిమలాగా ఉంటుంది. మగువులను కూడా మోహింపచేయగల ఈ జగన్మోహిని త్వరలోనే వెండి తెరమీద దర్శనమీయబోతూవుంది."
ఇటువంటి పంక్తులు ఆ వ్యాసంలో చాలా ఉన్నాయి.
మంజరి ఆకలిమాటకూడా మరిచిపోయింది. ఆవిడ కళ్ళ కాంతిలో మిలమిల లాడిపోతున్నాయి. ఉత్సాహం ఉవ్వెత్తున పొంగులు వారుతోంది. కన్నార్పకుండా తన బొమ్మకేసి మళ్ళా మళ్ళా చూసుకొంటూ ఏవో లోకాలకు తేలిపోతూవుంది.
అనుకున్న విధంగా ఆరుగంటలకల్లా వెంకటేశ్వర్లు కార్లో వచ్చాడు. అతన్ని చూసిందాకా మంజరికి ఈ ప్రోగ్రాం సంగతి జ్ఞాపకమే రాలేదు. వెంకటేశ్వర్లు దొరబాబులా తయారయ్యాడు. మనిషి అల్లంత దూరాన ఉండగానే సేన్తువాసన గుప్పు మంటోంది.
మంజరిని చూస్తూనే అతను నవ్వేశాడు. కొంపదీసి మంజరి ఇవ్వాళ ప్రోగ్రాం కాస్తా కాన్సిల్ చేస్తుందేనని అతని భయం.
మంజరి, యధాశక్తి నవ్వింది. పత్రికలో తనను గురించి వ్యాసం వచ్చిన సంగతి వెంకటేశ్వర్లుకు చెప్పాలని ఆరాటపడింది. కానీ తనంతట తానే చెప్పడం బావుంటుందా? చెప్పినా సమయంగాని సమయంలో చెప్పడం మంచిదా? తానీ రంధిలోపడి ప్రోగ్రాం విషయం మరచిపోయానంటే వెంకటేశ్వర్లు నొచ్చుకోకుండా వుంటాడా? ఈ సందేహాలన్నీ మంజరికి తోచాయి. ఆవిదేమాట మాట్లాడకముందే వెంకటేశ్వర్లు తొందరచెయ్యసాగాడు.
"నే వచ్చేసరికే నువ్వు రెడీగా ఉంటావనుకొన్నాను. వీ ధోరణి చూస్తే అలా లేదు. చలపతిగా డేమన్నా గొడవ చేశాడా? డొక్క చీరేస్తానని చెప్పు వెధవను...నువ్వింకా షాపింగ్ కు వెళ్ళినట్టులేదు. అవునా? ఎందుకనిట?" అన్నాడు వెంకటేశ్వర్లు.
"వెళ్లలేదని కలగన్నారా?" అన్నది మంజరి.
"పిచ్చిదానా! ఇంతోసిదానికి కలలుగూడా కనాలా? నువ్వు షాపింగుకే వెడితే ఇంతదాకా నీ పర్చేజెస్ నాకు చూపకుండా ఉంటావా?" ఉండవు నాకు తెలుసు.
తనెట్లా ప్రవర్తిస్తే వెంకటేశ్వర్లు సంతోషిస్తాడో మంజరికి చూచాయగా తెలిసింది. అతడంటే తను వెర్రెత్తి పోతుంటుందని వెంకటేశ్వర్లు భ్రమపడుతున్నాడు. వెధవను పడనివ్వు. తనందుకు ఎంతమాత్రం బాధ్యురాలు కాదు. ఇప్పుడు తనేమని జవాబు చెప్పడం? సగం డబ్బు చలపతి పట్టుకెళ్ళాడనడం భావ్యంకాదు. ఈ సంబంధం చలపతికి కూడా తెలుసుననీ, అతని ఆమోదంతోనే, తనిందుకు వోప్పుకోన్నదని తెలియడంలో స్వార్ధంలేదు. ఇందువల్ల చలపతి స్థాయి పడిపోవడమే కాదు -తన స్థితికూడా అదేమేరకు దిగజారిపోయింది. చలపతి అనేవాడు ఉన్నా లేకున్నా తను వెంకటేశ్వర్లు కోసం తహతహలాడిపోవడం ఖాయమన్న భావం అతనికి కలగడమే ముఖ్యం ఇందువల్ల తనకెన్నో ప్రయోజనాలున్నాయి.
"నాతోగానీ మాట్లాడకూడదనుకొన్నావా ఏమిటోయ్?" అన్నాడు వెంకటేశ్వర్లు.
అతని ఉంగరాలమీద సాయంత్రపు నీరెండపడి జిగజిగమని మెరిసి పోతున్నాయని.
"ఈ మాత్రం మీకు తెలియకపోతుందా అనుకొన్నానుగానీ, మరేంలేదు. చలపతి మాట్లాడవద్దంటే మానుకొనే స్థితిలోనే నన్నుంచారా? ఏం మాయచేశారో గానీ, ఒక్క రాత్రిలో నన్ను పూర్తిగా ఆకట్టుకొన్నారు. చలపతిగారే కాదు. హరిహరబ్రహ్మాదులొచ్చినా నన్ను మార్చలేరు. అదిగాదండీ! నన్నొక్కదాన్నీ షాపింగుకు వెళ్ళమన్నారు గదా, నేనలా వెడతాననే మీరనుకొన్నారా? మీరు పక్కనలేకుండా నేనిక ఏ పని చెయ్యదల్చలేదు. పదే పదే ఈ విషయంలో నన్నిక బాధపెట్టకండి, మీరెప్పుడొస్తే అప్పుడే కొనుక్కుందాం. రావడానికి మీకు అవకాశం లేకపోతే కొనడమే మానేద్దాం. ఇంతలో ముంచుకుపోయిందేమిటట?" అన్నది మంజరి, అతని ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ.
వెంకటేశ్వర్లు పూర్తిగా కరిగిపోయాడు. గబాలున కుర్చీలోంచి లేచి గడపల్లో నుంచున్న మంజరిని తోసుకుంటూ గదిలో కొచ్చి ఆవిణ్ణి కౌగలించుకుని వదిలేశాడు.
"లేడికి లేచిందే ప్రయాణమటండీ! దేనికైనా వేళాపాళా అంటూ ఉందికదా!....మీరో పదినిముషాలపాటు అలా వరండాలో కూచోండి. ఈలోగా నేను చీరె మార్చుకొని వచ్చేస్తాను."
వెంకటేశ్వర్లు అక్కణ్నుంచి కదిలేప్రయత్నమన్నా చెయ్యలేదు.
"వెళ్ళరా?"
"ప్చ్"
"అయితే నేనిలానే వచ్చేస్తాను." అన్నది మంజరి కళ్ళింత చేసుకుని.
"నువ్వెలా వచ్చినా ణా కభ్యంతరం లేదు. నా క్కావలసింది నువ్వుగానీ నీ డ్రెస్ కాదు."
"మీతో ను వాదించలేను బాబూ పదినిముషాలంటే, వొట్టు పెట్టినట్టు పదేనిముషాలు......ప్లీజ్!"
వెంకటేశ్వర్లు నవ్వుకొంటూ ఇవతలకొచ్చాడు. పది నిముషాలకు లోపుగానే మంజరి మేకప్ అయి వచ్చేసింది.
"నన్నిప్పుడే నమిలేస్తారా?"
వెంకటేశ్వర్లు లేచి నిలుచున్నాడు.
"పదండి తాళంవేసి వస్తున్నాను."
ఏడు గంటలకల్లా కారు మౌంట్ రోడ్డుమీద పాములా జారిపోతోంది. వెంకటేశ్వర్లే  డ్రయివ్ చేస్తున్నాడు. మంజరి అతని పక్కనే కూచున్నది. అతనేదో చెప్పుకుపోతున్నాడు, ఆవిడ వింటున్నట్టులేదు.
ఓ పెద్దషాపు ముందు కారాగింది. ఉయ్యాలలాగా రెండు మూడుసార్లు పైకి కిందికీ ఊగింది కారు.
"ఊఁ దిగు మరి!" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరి చిరునవ్వుతో పైట సరిచేసుకొంటూ, సీటుమీదినే తలుపు దాకా జరిగి ఓ కాలు కిందబెట్టి చటుక్కున నోటికి చెయ్యడ్డం పెట్టుకొని చాపిన కాలును లోపలికి తీసుకొంటూ, "ఇప్పుడు కాదు - పదండి" అన్నది దీనంగా.
"ఏం?" అన్నాడు వెంకటేశ్వర్లు దిమ్మరపోయి.
"నాఖర్మకాలి, అన్నీ వొక్కసారే వనగూడాయి. మీ మాటలసందట్లో పడి బాగ్ తీసుకురావడం మరచిపోయాను. డబ్బంతా అందులోనే ఉండిపోయింది."
వెంకటేశ్వర్లు నిర్లక్ష్యంగా నవ్వాడు.
"ఓస్. ఇంతోసి దానికేనా నొచ్చుకోవడం? ఫర్వాలేదు లేరా నాదగ్గరుంది."
మంజరి, తటపటాయించినట్లు ఓ నిముషం అభినయించింది. వెంకటేశ్వర్లు ఆవిడ చెయ్యి పుచ్చుకొని కారులోంచి దించాడు. వాకిట్లో పొడవాంటి తలగుడ్డ చుట్టుకొన్న దర్వాన్ ముందుగా సలాంచేసి ఆ తర్వాత తలుపు తీసి వారు లోపలికొచ్చాక అటు తిరిగి నవ్వుకున్నాడు.
వీళ్ళను చూస్తూనే చాలాకాలంనుండీ ఎరిగున్న మాదిరిగా నలుగురైదుగురు వ్యక్తులు రకరకాల నమస్కారాలు చేసి ఇంగ్లీషు పద్దతిలో ఆహ్వానించారు.
అటువంటి సమయాల్లో ఏం చెయ్యాలో మంజరికి తెలీదు, తిరిగీ తను దణ్ణం బెట్టాలా? వెంకటేశ్వర్లు పెట్టలేదు. తలతోటి పెదవులతోటి చేసి చేయనట్టు నమస్కార మంటున్నాడని తననుకొంది, ఇవి చాలా ప్రమాదకరమైన ఘట్టాలనీ, తను వెంకటేశ్వర్లును గమనించడమే తప్ప గత్యంతరం లేదని మంజరి నిశ్చయించుకొంది.
"సారీస్" అన్నాడు వెంకటేశ్వర్లు ఓ సిగరెట్ అంటించి.
"వన్ మినిట్"
ఓ యాభై రకాల చీరెలు వారిముందు పరిచారు. వాటిని చూసి మంజరి దిమ్మరపోయింది. ఇన్నిరకాల చీరలను ఆవిడింతకుముందెన్నడూ చూడలేదు.
"చూడు మరి. నీ కేమేంకావాలో సెలక్టు చేసుకో, మనం త్వరగా తెమలాలి."
మంజరికి వాటన్నింటినీ కొనెయ్యాలని ఉంది. దేని అందం దానిదే! దేని ప్రత్యేకత దానిదే! ఒకదానికి, మరోదానికి పోలికే లేదు. నిజంగా మంచి గుడ్డలను ఎన్నుకోవడం చాలా కష్టమనుకొంది మంజరి!
"మీరు చూడండి" అన్నది మంజరి మెల్లగా.
"నో, నో, ఆ రెస్పాన్సిబిలిటీ నా మీదుంచకు. నచ్చినవాటిని సెలెక్ట్ చేసుకోవడం నీ వంతు. బిల్ ఇచ్చేయడం నా వంతు." అన్నాడు వెంకటేశ్వర్లు నవ్వుతూ.
అతను మంజరిని రాసుకొంటూ నిలబడ్డాడు. ఆవిడ ఏదో విషయం మీద అవతలికి జరిగితే తనూ జరుగుతున్నాడు.
అరగంటకల్లా మూడు చీరెలను మరో అయిదుగాజాల జాకెట్ గుడ్డలను సెలెక్ట్ చేసింది మంజరి.
"వెరీ లో పర్చేజింగ్ మేడమ్" అన్నాడు సేల్సుమన్,
వెంకటేశ్వర్లు ఏడువందల రూపాయల నోట్లిచ్చి కొద్దిగా చిల్లర నోట్లు తీసుకొని "వుయ్ మేక్ యే మూవ్" అన్నాడు.
దర్వాన్ మెట్లు చివరదాకా వచ్చి సలాంచేసి నిలుచున్నాడు. "ఏందబ్బీ?" అన్నది మంజరి.
వెంకటేశ్వర్లు, ఓ రూపాయినోటు వాడిమీదికి విసిరేసి, కారును స్టార్ట్ చేశాడు.
"చీరెలు నచ్చాయిగదూ?" అన్నది మంజరి పొట్లాంకేసి మరోసారి సంతృప్తిగా చూసుకొంటూ.
వెంకటేశ్వర్లు మాట్లాడలేదు. పోలీస్ సిగ్నల్ కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు.
"ఇంటికేనా పోవడం?" అన్నది మంజరి. పళ్ళుబిగబట్టి వెంకటేశ్వర్లును రాచుకొనేలాగా దగ్గరకు జరుగుతూ.
ఇంటికే . ఈలోగా వోసారి హోటల్ కెడదాం.
కారు సర్రున వలయంగా తిరిగి గేటుదగ్గర ఉయ్యాలలూది ఓ పెద్ద తోటలోకొచ్చింది. అక్కడ చెట్లకన్నా కార్లెక్కువగా ఉన్నాయి దీపాల కాంతిపడి రోడ్డంతా మిల మిలలాడిపోతోంది. వెంకటేశ్వర్లు తన కారు నో మూలగా ఆపాడు.
మంజరి వయ్యారంగా కారుదిగింది.
"కాటేజ్ నెంబర్ ఫిఫ్టీస్" అన్నాడు వెంకటేశ్వర్లు ఓ సూట్ వాలాతో.
అతనొకసారి చేతిలో ఉన్న నోట్ బుక్ ను కిందికి మీదికి చూసి "తమ పేరు వెంకటేశ్వర్లు గారాండీ" అని అడిగి సమాధానం వినకుండానే చెట్లమధ్యగా తీసుకెళ్ళి చిన్న ఇంటిముందాగాడు.
"ఇప్పుడే బోయ్ ను పంపిస్తాను. మీ టేబిల్ మీద మెమో కార్డు ఉంది. ఏంకావాలో ఫోన్ చెయ్యండి. ఇవ్వాళ ఉదయమే పారిన్ స్టఫ్ తెప్పించాను. వెరీ లిమిటెడ్ స్టాక్."
ఇంగ్లీషు అసలేమీ రాకపోతే లాభం లేదని మంజరి నిర్ణయించుకొంది.
"ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడేస్తున్నారు. వారే మంటున్నారో తెలుసుకొని జవాబులియ్యకపోతే గొడ్డును చూసినట్టు చూస్తారు. ఇంగ్లీషురాకపోతే ఇక్కడ నెగ్గుకు రావడం కష్టం" అనుకొన్నది మంజరి.
"అలా బెదిరిన గొడ్డులా అన్నిటికేసి ముఖమింత చేసుకొని చూడకూడదు. చూశామంటే మనల్ని గమర్లకింద జమకట్టేస్తారు. ప్రతిదాన్నీ చాలా నిర్లక్ష్యంగా చూస్తుండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో వెనకా ముందూ చూడకూడదు. ముందు కూచో అన్నాడు వెంకటేశ్వర్లు."
మంజరి సోఫామీద జాగ్రత్తగా కూచుంది.
"అలా కాదోయ్. జార్లబడి కూచోవాలి. సుతారంగా కాళ్ళూపుతుండాలి. చేతుల్ని ఎప్పుడో గానీ కదిలించగూడదు. ఎటో చూస్తూ సమాధానమివ్వాలి... మధ్య మధ్య గడియారం కేసి చూసుకొంటూ ఉండాలి, అన్నట్లు నీకు వాచ్ లేదు కదూ? రేపొకటి కొందాం, మోచేతులదాకా ఈ గాజులుండకూడదు. కుడిచేతికో డైమండ్ బాంగిల్ చాలు. ఎడంచేతికి చిన్న వాచ్. ఈ రావలపాడు ఆకుచెప్పులు చెత్త కుండీలోకి గిరాటెట్టు. నాలుగైదు జతల హైహీల్ శాండిల్సు  కొందాం."
ఇంకెంతసేపు చెప్పేవాడో గానీ బాయ్ వచ్చి సలాం చేసి నిలుచున్నాడు.
"త్రిడాగర్స్ హాఫ్ బాటిల్, బన్, బట్టర్, జామ్, అయిస్ సోడా, చికెన్ బిర్యానీ."
అతను వొంగి అలానే రెండడుగులు వెనక్కువేసి వెళ్ళిపోయాడు.
"ఇక్కడింత చల్లగా ఉందేం?" అన్నది మంజరి.
"ఎయిర్ కండిషన్లు కాటేజ్"

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS