Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 16

"రాక్షసిని!" అన్నది మంజరి కూడా నవ్వి.
"కాదమ్మడూ! నువ్వు దేవకన్యవు. అప్సరసవు. నేనిందాకనే అనుకొన్నాను; సోషల్ పిక్చర్ డ్రాప్ చేసి ఓ ఫోక్ లోర్ తీయాలని! సోషల్లో దేవకన్యలూ, అప్సరసలూ రావడానికి లేదాయె....!"
"మధ్యలోనే మంజరి ఫఖాలుమని నవ్వేసింది. "ఊఁ....ఆగేరేం; చూసి -చూశాక ఏం చేస్తారేమిటి?"
"అడిప్పుడే చెప్పాను. ఇన్నటికీ, నువ్వేదో నా దగ్గర దాస్తున్నా నమ్మోయ్! అదేమిటో చెబితే తప్ప వీల్లేదు" అన్నాడు వెంకటేశ్వర్లు ఎంతో ఆప్తుడులాగా.
"చలపతి మీతో అనలేదా? అన్నముక్క నోటిదాకా వచ్చింది. అదృష్టవశాత్తూ బయటపడలేదు గానీ, లేకపోతే కొంప లంటుకునేవే!
"చెప్పవా" అన్నాడు గోముగా లాలిస్తూ.
"ఆ ముక్క చెప్పాక, ఇంకా నా ముఖం మీరు చూస్తారా? నా సమస్య కన్నా, నాకు మేరే ముఖ్యం. పదికాలాలపాటు మన స్నేహం వర్దిల్లడం కన్నా నాకేమీ అవసరం లేదు. మరింక నన్ను గుచ్చి గుచ్చి అడక్కండి!"
వెంకటేశ్వర్లు ఈ సారి నిజముగానే బాధపడ్డాడు.
"అడిగాదమ్మాయ్! నామీద ఆమాత్రం విశ్వాసం వున్నప్పుడు చెప్పడానికేం? నేను పరాయివాణ్ని గనుకనా, ఏమన్నా అనుకోడానికి? ఆ పని నావల్లకూడా కానిదయితే, ఎవరివల్లనవుతుందో తెలుసుకొందాం, పూర్తిచేద్దాం! సరేనా?"
తనకింత డబ్బు కావాలని ఎలా అడగడమో మంజరికి చట్టున తట్టలేదు. ఆ అలవాటు తప్పిపోయికూడా చాలా సంవత్సరాలయింది. లోగడ తను వృత్తిలో  వున్నప్పుడు చిల్లరగా తప్ప, పెద్దమొత్తాలెప్పుడూ పుచ్చుకోలేదు. ఇప్పుడు ఎకాఠాకిన  అయిదు వందలు కావాలని ఎలా అడగడం?
"ఊఁ.....వెళ్ళేలోగా చెబుతానుగానీ, హీరోయిన్ కు ఏ మాత్రం ఖర్చు పెట్టదలిచారు?" అన్నది మంజరి.
"అది మనిషిని బట్టి వుంటుంది.!"
"అయ్య బాబోయ్! ఎంత అసాధ్యులండీ! మాటమాత్రం దాటనివ్వరు....పోనీ, నాకయితే ఎంతిస్తారు చెప్పండి"
"నువ్వడిగినంత!" అన్నాడు వెంకటేశ్వర్లు.
"నేనొక లక్ష రూపాయలడుగుతాను. ఇస్తారేమిటి?" అన్నది మంజరి, హాస్యంగా.
వెంకటేశ్వర్లు ఓ నిముషం ఆలోచించి, కళ్ళు టపటపలాడిస్తూ ఆఁ అలాగే ఇస్తాను. నువ్వీ సినిమా గొడవలు మానేసి అచ్చంగా నాతోనే వుండిపోతావా?" అన్నాడు.
మంజరి దిమ్మిరపోయింది.
హఠాత్తుగా  మంజరి మంచం మీంచిలేచి, వెంకటేశ్వర్లును కావలించుకొని, ఊపిరి తిరక్కుండా ముద్దులు పెట్టుకొంది.
"ఎంత మంచివారండీ మీరు! మీరో ముష్టి లక్ష రూపాయలిస్తే నేనా,నేను ఉండటం! నా కవేమీవద్దు మీ అభిమానం చాలు అదే నాకు పదికొండలు పెట్టు, మీరు మాత్రం నన్ను చెయ్యొదలకండి" మీ నీడన నిశ్చింతగా వుంటాను. అన్నది మంజరి. అతని చేతిని తన చేతిలోకి తీసుకొంటూ.
"నెవర్ నెవర్" అన్నాడు వెంకటేశ్వర్లు. ఆవిడ చేతిమీద తన చేతిని వేస్తూ.
రెండు మూడు నిమిషాల పాటు ఎవ్వరూ పలకలేదు.
గడియారం అయిదు గంటలు కొట్టింది. మరోసారి, వెంకటేశ్వర్లు చేతిని గట్టిగా నొక్కి విడిచింది మంజరి.
"మిమ్మల్ని వెళ్ళమనడానికే నోరురావడంలేదు.....చలపతి గాని వస్తే, బావుండదు....సాయంత్రం మీరోసారి రాగూడదూ? పోనీ - నన్ను గానీ మీ ఆఫీసుకు రమ్మంటారా?" అన్నది మంజరి.
"ఈ రెండూ వద్దు, హాయిగా హొటల్ కయినా వెళదాం.....సరేనా?"
"మళ్ళా నన్ను వెంటనే పంపేస్తారు గదూ?" అన్నది మంజరి, అతనికేసి చిలిపిగా చూస్తూ.
"చూద్దాం" అన్నాడు వెంకటేశ్వర్లు, "ఏదో అనబోయిమానేసినట్లున్నావ్ ఏమిటి విశేషం?"
"ఏం లేదు గానీ----"
ఆ పైమాట మంజరి అనలేకపోయింది. వెంటనే బయట పడితే, తన విలువ పడిపోతుందేమోనని ఆవిడ భయం! అనకుండా వుంటే చలపతి వూరుకోడు. ఒకవేళ అతనూరుకొన్నా, ఆ శర్మ ఊరుకోడు. ఇవ్వాళ సాయంత్రంలోగా, శర్మగారికి ఐదు వందలు కట్టనన్నా కట్టాలి, లేదా - ఆ రెండో వ్యాసం అచ్చు కావడానికి వొప్పుకోనన్నా  వొప్పుకోవాలి.

                                                      7
ఇంతకన్నా మంచిగుడ్డలు  నీకు లేవా? అన్నాడు వెంకటేశ్వర్లు, కట్టుకొన్న వాయిల్ చీరకేసి చూస్తూ.
"నేను లక్షాధికారిననుకొన్నారా?"
"నిన్నటివరకూ కాదు,, ఈ క్షణం నుండీ నీకేలోటూ  లేదు" అన్నాడు లాల్చీజేబులోంచి పర్సు తీస్తూ.
మంజరి హాయిగా నిట్టూర్చింది. ఓసారి రెండు కణతలూ  గట్టిగా నొక్కుకొని  చేతివేళ్ళు విరుచుకొంది.
వెంకటేశ్వర్లు పర్సులోంచి ఇన్ని వందల రూపాయల నోట్లు తీసి, మంజరి కివ్వబోయాడు. ఆవిడ ఓ అడుగు వెనక్కువేసి నిలుచుంది.
"ఇంద ప్రస్తుతానికి నీ దగ్గరుంచు. కావాలన్నప్పుడల్లా అడుగుతుండు. దిక్కుమాలిన మొహమాటాలు పెట్టుకోకు. అయినా నా దగ్గర నీకు మొహమాటమేమిటమ్మడూ! చాలా? ఇంకా కావాలా?" అన్నాడు వెంకటేశ్వర్లు.
మంజరి పలకలేదు. ఆవిడ తడిగాని కళ్ళను పమిటతో వొత్తుకుంటూ, "నాకేమీ వద్దు; ఏమీవద్దు. నన్నిలా బాధపెట్టకండి! నేను డబ్బు మనిషిని కాను" ఆమె దగ్గరగా వచ్చి వోదార్చాడు.
"పిచ్చిదానా! మనుషుల్ని గురించి నాతో మాట్లాడకు. నువ్వెటువంటిదానివో చూస్తూనే గ్రహించాను. అన్నమంతా పట్టి చూడక్కర్లేదు. ఇంద - తీసుకో మరి - వెళ్ళిరానా? సాయంత్రం తప్పకుండా, నిన్ను పికప్ చేసి కెడతాను. ఈలోగా ఆ సినిమా కధ సంగతి చూడాలి మరి! మా సన్యాసి సోషలో అంటూ ఏడుస్తున్నాడు. నీ కోసమని పోక్ లోర్ తియ్యమంటాను. లేకపోతే నా భాగం నేను తీసేసుకొని సొంత కంపెనీ  పెట్టుకొందాం....నువ్వోసారి మధ్యాహ్నంపూట - అలా మౌంట్ రోడ్ కెళ్ళి నీకేం కావాలో పర్చేజ్ చెయ్యి; ఇంకేమన్నా తక్కువపడితే నేను చెక్కిస్తాను. టాటా..గుడ్ బై."
వెంకటేశ్వర్లు ఊగుతూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిందాకా అటువేపే చూసి ఆ తరువాత రెండు తలుపులకూ గడియ బెట్టింది మంజరి. చేతిలో అతనిచ్చిన వందరూపాయల నోట్లు పెళ పెళ మంటున్నాయి. ఓసారీ గది నాలుగుపక్కలా చూసి, కుర్చీలో కూచుని నోట్లు లెక్కించింది మంజరి, పదిహేడున్నాయి.
పదిహేడు వందల రూపాయలు.
మంజరి కళ్ళు మిలమిలలాడాయి.
తన జీవితంలో తనదిగా వున్న పెద్దమొత్తం యిదే! అంత వరకూ యిన్ని వందల రూపాయలను ఒక్కసారిగా తను చూడలేదు. ఏవి చూసినా, అవి తనవిగావు, ఇప్పుడీ డబ్బంతా తనదే! వీటిని తనేం చేసినా చేసుకోవచ్చు.
మంజరి మరోసారి ఆనోట్లను లెక్కబెట్టి, అలమారులో వుంచింది. వాటిమీద, పాతపత్రిక పరచి, గాలికి లేవకుండా స్నోసీసా బరువు పెట్టింది. సీసాకింద - అప్పుడెప్పుడో తెప్పించిన కవరు కనిపించడంతో, మంజరికి రాజమణి జ్ఞాపకం వచ్చింది, తను రాజమణికి ఉత్తరం రాసి చాలా రోజులయింది. ఇంతవరకూ జవాబు రాలేదు..రాజమణి సాచివేత మనిషికాదు. అందులోనూ తనంటే దానికి అమితమైన వాత్సల్యం! రాజమణి ఆరోగ్యం బావోలేదేమో! ఏదన్నా ఊరికిగానీ వెళ్ళిందేమో!
మంజరి ఏ నిర్ణయానికి రాలేకపోయింది. ఆ అనిశ్చితస్థితికి ఆవిడ మనస్సు చిరచిరలాడిపోయింది. మంచంమీద వెల్లికితలా పడుకొని, దిండును ఎదురొమ్ములమీద వుంచుకొంది! కళ్ళు భగ్గున మండిపోతున్నాయి ఇసకపోసినట్లు గరగారలాడిపోతున్నాయి. ఓసారి గట్టిగా కళ్ళు నులుముకొంది. పక్కకు తిరిగి అద్దంలో, తన బొమ్మను చూసుకొంది. కళ్ళు పీక్కుపోయాయి. కింది పెదవి, ఓ పక్కగా చీరుకుపోయింది. తలంతా యీతపోదలా ఇంతెత్తునరేగివుంది.
ఆ బొమ్మను చూసి, తనలో తనే నవ్వుకొంది మంజరి. పెదవి చీరుకుపోయినచోట నాలుకతో తడి చేసుకొంది.
పదిహేను వందల రూపాయలు అన్నది మంజరి బొమ్మకేసి నిదానంగా చూస్తూ.
ఆమాటలు తను అంటున్నట్లుగాలేవు, ఎవరో తనవెనక నుండి అంటున్నట్లుగా   ఫీలయింది మంజరి! ఓసారి చటుక్కున వెనక్కు తిరిగి చూసింది గది తలుపును ఎవరో తడుతున్న చప్పుడు వినిపించింది.
మంజరి ఆలోచనలన్నీ, వొట్టు పెట్టినట్లుగా ఒక్కసారిగా ఆగి పోయాయి. ఆ వెంటనే లోలోపల సన్నని భయంకూడా పొడచూపింది. ఆ తలుపు కొడుతున్నది చలపతిగారేమో నన్న అనుమానం మంజరిని చిరాకు పరచింది.
ఈలోగా మరోసారి తలుపు చప్పుడయింది.
"ఎవరది?" అన్నది మంజరి మంచంమీద నుండి లేవకుండానే.
"నేనేనండమ్మా! తాయారును"
మంజరి సన్నగా నిట్టూర్చి లేచి వెళ్ళి తలుపు తీసింది. తనను చూడంగానే తాయారు నవ్వుతుందని మంజరి అనుకొంది. కానీ ఆవిడలాంటి పనేదీ చెయ్యలేదు. మామూలుగా ఇంటిపని చేసుకుపోతూ ఉంది.
తనిప్పుడు మౌనంగా ఉండటం మంచిది కాదని, రాత్రి తాయారు ఎందుకు పడుకోలేదో అడగటం అవసరమని మంజరికి తోచింది.
"ఊరికేనండమ్మగారూ!" అన్నది తాయారు.
"ఇదివరకు అడిగినప్పుడల్లా పడుకునే దానివిగదా! రాత్రి మానేశావేం?" అన్నది మంజరి.
వెంకటేశ్వర్లు రాకవిషయం, తయారుకు తెలుసునో లేదో మంజరికి స్పష్టపడాలిప్పుడు.
"ఏం లేదండీ! అవకాడ నాకు శానా పనులుండాయండీ! మా వూర్నుండొచ్చారండీ  జనం! మా సుట్టాలు కూడా ఉన్నారండీ! షూటింగ్ సూత్తామంటే రాత్రి  తీసికెళ్లినానుండి!"
మంజరి మనస్సు తేలిక పడ్డది.
"రాత్రి అయ్యగారు, నాకు టూడియోలో కనిపించారండీ! ఆయనగారి పక్కనే ఇంకోరెవరో, బంగారం కళ్ళజోడాయన ఉన్నారండీ! ఆయనగారి పేరు రామబ్రహ్మంగారట. ఇద్దరూ శానాసేపు మాట్లాడుకుంటూ కూచున్నారు. నా పానమంతా మీకాడనే ఉన్నదనుకోండమ్మాయిగోరూ !  అయ్యగారేమో, ఈడ ఉన్నారాయో నేనేమో, టూడియో కొస్తినాయే,ఇంటికాడ మీరొక్కరే ఉండి రాయె! ఏందాయిదంతా అనిపించి పాసంపింజంపింజం అన్నదండీ!"
మంజరి ఊఁకొడుతున్న దన్నమాటేగానీ ఆలోచనలన్నీ చలపతి చుట్టూ తిరుగుతున్నాయి.
"రాత్రి సరిగ్గా నిదరపోయారా అమ్మగారూ!" అన్నది తాయారు.
మంజరి ఉలిక్కిపడి 'ఆఁ' అన్నది.
తాయారు నమ్మినట్టు లేదు.
"నా కాడ దాస్తున్నారా అమ్మాయిగారూ! రాత్తిరల్లా మీకు నిదురలేదు. కళ్ళు మానుకోండి - జ్యోతులకుమల్లే ఎర్రగావున్నాయి. మడిసి - నలిగి పోయినారండమ్మాయిగారూ! ఒక్క రేత్తిరిలో సగం తీసిపోయినారు. బయటపడ్డారేందండీ?"
"ఆఁ" అన్నది మంజరి, మరేమనడానికీ  పాలుపోక, ఒక్కదాన్ని పడుకోవడం అలవాటు లేదు. అందులోనూ కొత్త తలుపులన్నీ వేసేసుకొన్నాను. అయినా భయం తీరిందికాదు.
తయారు, ఓ క్షణం మంజరిని ఎగాదిగా చూసి తనలో తాను నవ్వుకొంది.
ఎనిమిది గంటలకల్లా చలపతి కార్లోదిగాడు, మంజరి గుండెలు గుబగుబలాడాయి. సన్నని కంపరంకూడా కలిగింది. కుర్చీలో కూచున్నదల్లా లేచి లోపలిగదిలో కొచ్చింది. చలపతి సరాసరి గడిలోకే వచ్చాడు. మంజరి ప్రాణాలు నిలువునా పైకెగిరి పోయాయి. తనేదో మహాపరాధం చేసినట్లు, అదికాస్తా తెలిసిపోయినట్లూ ఆమె భయపడింది. ఇప్పుడో, మరిక్షనమో చలపతి తనను తీవ్రంగా దండిస్తాడని కూడా మంజరి భయపడింది. రానున్న సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నదానిమల్లే  గొంతు సరిచేసుకుని, వోమూలగా వెళ్ళి నిలబడింది మంజరి.....
చలపతి కాలుస్తున్న సిగరెట్ ను కితికీలోగుండా అవతలకు విసిరేసి, కుర్చీలో  కూచున్నాడు. లాల్చీచేతులు సగందాకా మడిచి, అరచేతులతో ముఖమంతా రుద్దుకున్నాడు.
"ఇక ప్రారంభమవుతుంది" అనుకొన్నది మంజరి.
"రాత్రి ఓ పొరపాటు జరిగింది మంజరీ!" అన్నాడు చలపతి చేతివేళ్ళు మెటికలు  విరుచుకుంటూ.
మంజరి బిక్కచచ్చిపోయింది.
"ఏమిటని" కూడా అడగలేకపోయింది.
"బాలాజీ మూవీటోన్ వారి షూటింగ్ కెళ్ళాను. రామబ్రహ్మంగారుకూడా వచ్చార్లే. నళిని చాలా అద్భుతంగా నటించింది. బ్రహ్మాండమైన సెట్ వేశారు. పెద్దకొండ, కొండమీంచి ఓ సెలయేరు. దానివొడ్డున చిన్న కుటీరం, అందులో హీరో, హీరోయిన్ల ఫస్టు మీటింగ్....రావుగారు హీరో....ట్రమండస్ గా యాక్ట్ చేశారు. పిక్చర్ మొత్తంమీద అదే హైలైట్ అంటున్నారు. మేమసలు షూటింగ్ కెళ్ళాలను కోలేదు. రామబ్రహ్మంగారితో మాట్లాడత. ఇంటికెడతానన్నాను. ఆయన నన్ను కదలనిచ్చాడుకాదు. సరాసరి స్టూడియోకు తీసుకెళ్ళాడు. కాదంటే బావుండదని 'సరే'నన్నాను. ఆ సంగతి ఏమాత్రం ముందు తెలిసినా, నిన్నూ తీసుకుపోదును.... రావుగారికి పరిచయం ఉండటం చాలా అవసరం. ఆయన నిన్ను గురించి అడిగారు కూడాను.....అన్నాడు చలపతి.
మంజరి ప్రాణం రెక్కొంది.
ఓసారి కళ్ళు టపటపలాడించి "ఏమన్నారండీ?" అన్నది మంజరి.
చలపతి చిరునవ్వు నవ్వాడు.
"ఏమంటారే పిచ్చిదానా! మనం ఎలాంటి అస్త్రం విసిరామంటావ్? బ్రళ్మాభేధ్యమానుకో మంజరీ! రావుగారి మనుషులమీద మనం ఖర్చు చేసింది వృధాకాలేదు. నున్ను గురించి ఆయన దగ్గర మంచి ప్రచారం చేశారు. లేకపోతే పనిమాలా నిన్నడవలసిన అవసరం ఆయనకేముందీ!" వీలున్నప్పుడు ఆమెగారినోసారి కనిపించమనండి ప్రకాశం వచ్చినప్పుడు, నేను తప్పకుండా చెబుతానన్నారు. హెడింగ్ హీరో ఆమాత్రం భరోసా యిచ్చాడంటే....నీరొట్టె విరిగి నేతిలో పడ్డదన్న మాటే!" అన్నాడు చలపతి.
మంజరి మనస్పూర్తిగా మురిసిపోయింది.
"నన్ను గురించి మీరు చాలా శ్రమపడుతున్నారండీ! ఈ రుణం ఎలా  తీర్చుకోవాలో నాకు తోచకుండా ఉన్నది" అన్నది మంజరి.
చలపతి సన్నగా నవ్వాడు.
"నువ్వా ధోరణి విడిచిపెట్టాలమ్మాయ్! నువ్వేదో పరాయి దాని వాయినట్లు మాట్లాడకు. ఇది ఇంకోరికోసం నేను చెయ్యడం లేదు. మనకోసం మనమే చేసుకుంటున్నాం. ఇందువల్ల వచ్చే లాభనష్టాలు మనమేగానీ, మూడోవాడికి దీంతో సంభంధం లేదు. కనక పదేపదే నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడమూ నేను వాటిని స్వీకరిస్తూ ఉండటమూ కుదరదు. సరా?" అన్నాడు చలపతి.
మంజరికి మాటల్లో  చాలా అర్ధాలు కనిపించాయి. ఇది ఎవరో ఇద్దరు భాగస్తులమధ్య  జరిగిన సంభాషణతంతుగా ఉన్నదిగానీ, ఇద్దరు సన్నిహితుల మధ్య మాటల్లాగా లేవు, అంటే....చలపతి తనతో సగభాగానికొస్తున్నాడా?
"ఏమిటా పరధ్యానం?"
మంజరి తేరుకొని "ఏమీలే"దన్నది.
"లేకపోతే నాకు స్నానానికి నీళ్ళు తోడతాదా? కళ్ళు భగ్గున మండిపోతున్నాయి. కాస్తంత కునుకు తీదామనుకొంటున్నాను...." అన్నాడు చలపతి.
మంజరి తాయారును పిలిచి చెప్పింది. చలపతి స్నానం చేసి వచ్చేలోగా కాఫీకప్పులోకి సర్దింది. చలపతి గళ్ళలుంగీ చుట్టుకొని భుజంమీద తడితువ్వాలేసుకొని ఓ గుక్క కాఫీతాగి కప్పును బల్లమీద పెట్టేశాడు.
"నళిని ఇంతచప్పున పైకొస్తుందనుకోలేదు  మంజరీ! మొదట్లో ప్రొడ్యూసర్ల దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఎక్ స్ట్రా వేషానిక్కూడా పనికి రాదన్నారు. ఆ పిల్ల తిరిగి వెళ్ళిపోతానంది. నేనే ఆగమన్నాను. ఆ తరువాత దశ అందుకొంది. ఇవ్వాళ దాని రేటు పాతికవేలు. పది హేనువేలు బ్లాక్ లో పుచ్చుకొంటుంది. ఈ ఇండస్ట్రీలో ఎంత ఇన్ ఫ్లుయన్స్ ఉన్నదంటే ఆవిడ మాట శిలాక్షరం. ఫలాని జీరోతో యాక్ట్ చెయ్యనంటే వాడిపని గోవిందా. ఫలానా కెమెరామెన్ ఉంటే తప్ప నేను సంతకం చెయ్యనంటే చచ్చినట్లుగా వాణ్ని బుక్ చెయ్యవలసిందే! ఆవిడమాటకు తిరుగులేదు. ఒకప్పుడు ఎందుకూ పనికిరాదనుకొన్న అమ్మాయిచుట్టూ ఇవ్వాళ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఊగలు ముసిరినట్లు ముసురుతున్నారు" అన్నాడు చలపతి.
మంజరి లోగడ తను చూసిన సినిమాల్లోని నళిని రూపం జ్ఞప్తికొచ్చింది."ఆవిడ మీకంత బాగా తెలుసు నంటున్నారుగదా! నా గురించి అడిగి చూడక పోయారా, ఏదన్నా సాయం చేస్తుందేమో! అందులోనూ మీమాట మీద గురికూడా  ఉన్నదంటుంటిరి! అలా చేస్తే బావుండదూ?" అని సలహా యిచ్చింది మంజరి.
చలపతి తల అడ్డంగా తిప్పాడు.
"ఈ ఫీల్డులో అదల్లా ముడియాద్ నళిని తెలివితక్కువదయితే తప్ప, ఇలాంటిపని చేయదు. తను ఎంత అవస్థపడి పైకి వచ్చిందో ఆవిడ మరచిపోయి వుండదు. అలానే మరొకరు రావడం ఆవిడకు గిట్టదు."
"ఎందుకనీ?" అన్నది మంజరి ఆవిడ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోలేక.
"అదంతే! మరొకరు పోటీగా వస్తే, ఆవిడరేటు పడిపోతుంది. పలుకుబడి తగ్గిపోతుంది. చేతులారా దోవనబోయే తద్దినాన్ని నెత్తినెవ్వరూఎక్కించుకోరు. సాయం చెయ్యడం మాట దేవుడెరుగు కనీసం అడ్డుపుల్లలు వెయ్యకపోతే అంతే చాలు" అన్నాడు చలపతి.
మంజరి కిదంతా అగమ్య గోచరంగా ఉంది.
"అయితే కొత్త వాళ్ళొచ్చే మార్గమే లేదంటారా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS