Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 4

    ఎలాగయినా ఉద్యోగం సంపాదించుకోవాలని పట్టుదలగా వున్నాడతను. టైమ్ అవుతుందని నడక వేగం హెచ్చించాడు.
    మరో పదినిమిషాలలో ఇంటర్వ్యూ స్థలానికి చేరుకున్నాడు శ్రీకర్.
    అక్కడ గుమికూడిన అభ్యర్ధులను చూసి అవాక్కయిపోయాడు కొన్ని క్షణాలు.
    నీరసం ఆవరించినట్లయింది.
    'ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? వీరంతా ఉద్యోగానికే వచ్చారా? అంటే వున్నది ఒక్క పోస్టు: వచ్చింది రెండువందల పైన! దేశంలో యెన్నో రాజకీయ పార్టీలు వున్నాయి! ఏ ఒక్క పార్టీ అయినా నిరుద్యోగ సమస్యని గురించి తీవ్రంగా ఆలోచించి పథకాలు ఏర్పాటు చేయగలిగివుంటే_ నేడు దేశమిలా అధ్వాన్నంగా వుండేది కాదు. పేదరికం, దరిద్రము ఈ దేశము జన్మహక్కు కాబోలు' వేడి నిట్టూర్పు వదిలాడు శ్రీకర్.
    ఇంటర్వ్యూ మొదలయింది.
    అంతా సర్దుకుని తమ పేరు కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగారు.
    ఒక్కొక్కరే లేచి లోనికి వెళ్ళి దిగాలుగా, ఉత్సాహంగా బయటకు వస్తున్నారు. లోని నుండి వచ్చేవారి ముఖాలను, వారి ముఖ కవళికల్ని బట్టి వారికి ఉద్యోగం వస్తుందో, రాదో తేల్చి చెప్పవచ్చు.
    క్షణాలు - నిముషాలు దొర్లుతున్నాయ్.
    శ్రీకర్ కు పిలుపు వచ్చింది.
    కొన్ని క్షణాలతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్. లేచి లోనికి వెళుతుంటే అప్రయత్నంగా కాళ్ళు వణికాయ్. అదో విచిత్ర పరిస్థితి. జీవిత సమస్యకూడా. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని చల్లని ఎయిర్ కూల్డ్ గదిలోకి అడుగుపెట్టాడు శ్రీకర్.
    అక్కడ ఆశీనులైన అధికారులకు చేతులు జోడించి నమస్కరించాడు శ్రీకర్. ఆసనం చూపించారు. పొందికగా కూర్చున్నాడు శ్రీకర్.
    "నీ వయసెంత వుంటుంది?" మొదటి ప్రశ్న వెలువడింది.
    అలాంటి ప్రశ్న వస్తుందని శ్రీకర్ ఊహించలేదు. ఉద్యోగం చేసేందుకు తన వయసుతో పనేమిటో అర్ధం కాలేదు అతనికి.
    "ఇరవై మూడండి!" క్లుప్తంగా చెప్పాడు శ్రీకర్.
    "ఇంతకుముందు ఎక్కడయినా వర్క్ చేశావా?"
    "లేదు. ఇదే ప్రధమం!"
    "మరి యిన్నాళ్ళు ఏం చేస్తున్నావ్?"
    "ఏమి చేయకుండా ఖాళీగా వున్నందుకు బాధపడుతూ వున్నాను."
    "అంటే! ఈ ఉద్యోగం కేవలం కాలక్షేపం కోసమేనా?"
    "లేదు. కడుపు నింపుకునేందుకు. మాది మధ్యతరగతి కుటుంబం. తండ్రి చిన్న గుమాస్తా. నేను, చెల్లి, తమ్ముడు మొత్తం అయిదుమంది జీవించాలి" అని చెప్పి పెదవి తడుపుకున్నాడు శ్రీకర్.
    "పెళ్ళి కాలేదా?"
    "అయింది__"
    "మరి ఆమెకు కలపలేదే?"
    "ప్రస్తుతం ఆమె తన పుట్టింట్లో వున్నది. ఉద్యోగం వస్తే వెళ్ళి తీసుకు వచ్చుకుంటాను."
    "అంటే ఈ ఉద్యోగం నీకు వస్తుందని నమ్మకమున్నదా?"
    "వచ్చినా, రాకపోయినా ప్రయత్నించడం, పడటం సహజమేకదా! ఈ ఉద్యోగం నాకే ఇవ్వమని అడగను. దయచూసి యిస్తే బాగా కష్టపడి పని చేయగలను."
    "నీకు పెళ్ళయి ఎన్నాళ్ళయింది."
    "నాలుగు నెలలు..."
    ఆ మాటలకు వాళ్ళు శ్రీకర్ వంక కొద్దిగా ఆశ్చర్యంగా చూశారు.
    వాళ్ళ చూపులలో ఏదో సానుభూతి విరజిమ్ముతున్నట్లుంది.
    శ్రీకర్ మాట్లాడలేదు. మౌనంగా తలదించుకున్నాడు. మనసులో ఎంత బాధవున్నా ఎయిర్ కూల్డ్ కాబట్టి చల్లగా, శరీరానికి మాత్రం హాయిగా గొలుపుతున్నది.    
    "ఇది ప్రయివేట్ కంపెనీ జీతం చాలా తక్కువ. పని ఎక్కువ."
    "అవన్నీ ఆలోచించుకునే సిద్ధంగా వచ్చాను" అని చెప్పాడు శ్రీకర్.
    "ఆల్ రైట్, మీరిక వెళ్ళవచ్చు. రిజల్ట్సు ఓ గంట తర్వాత తెలుస్తాయి."
    శ్రీకర్ మరోసారి వాళ్ళకు నమస్కరించి బయటకు నడిచాడు. ఆఫీసు గదిలోంచి వస్తుంటే ఎన్నో భావాలు ఆత్రుతతో చూశాయి శ్రీకర్ ని. శ్రీకర్ తల దించుకుని కారిడార్ చివరగా వెళ్ళి రిలాక్స్ కోసం సిగరెట్ వెలిగించుకున్నాడు.
    రింగులు రింగులుగా పొగ వదులుతూ ఆలోచిస్తున్నాడు.
    తన అదృష్టం ఒక గంటలో తేలిపోతుంది. అందాక వేచివుండక తప్పదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తను చేయబోయే ఉద్యోగానికి సంబంధం లేదు. కానీ ఏదో వ్యక్తిగత జీవితాన్ని గురించి తెలుసుకోవాలని ప్రశ్నించి వుంటారు.
    తనకు పెళ్ళయిందని, భార్య పుట్టింట్లో వుందని తెలిసి పేదరికం వలన ఆమెను తెచ్చుకోలేకపోయానని వాళ్ళు అపోహపడ్డారు. సానుభూతి చూపారు.
    కానీ నిజమేమిటి?
    తనకు పెళ్ళయింది నిజమే!
    జ్యోతి! తన భార్య! కానీ ఎంత గర్వం! ఎంత అహం ఆవిడకు! భార్య తలపుకు వచ్చేసరికి అతడికి ఉద్రేకం వచ్చేసింది. మనసులో మంటలు లేచాయ్. గుండెల్ని మెలి పెడుతున్నట్లుగా విలవిల్లాడిపోయాడు.
    అసహనంగా సిగరెట్ గబగబా పీల్చి అవతల గిరాటేశాడు శ్రీకర్.
    "ఎక్స్ క్యూజ్ మీ... మ్యాచ్ బాక్స్ ఇస్తారా. అపరిచిత వ్యక్తి శ్రీకర్ దగ్గరగా వచ్చి అడిగాడు. మౌనంగా అగ్గిపెట్టె తిరిగి ఇస్తూ_"ఇంటర్వ్యూ ఎలా చేశారు?" అడిగాడా యువకుడు.
    "ఏవో ప్రశ్నించారు. తోచిన సమాధానం చెప్పాను" అన్నాడు శ్రీకర్ మామూలుగా.
    "వెధవ ప్రశ్నలండీ...ఒక్కటీ నాలెడ్జికి సంబందించింది కాదు. అసలు ఆ పోస్టు ఎవరికో రిజర్వు అయివుంటుంది. పనిలేక యీ తంతు జరుపుతున్నారు. మనలాంటివాళ్ళు ఆశలతో పరుగులు తీస్తారు. చివరకు నిరాశ ఎదురవడం తప్ప ప్రయోజనం వుండదు" ఆవేశంగా అన్నాడతను.
    శ్రీకర్ ఏమీ అనలేదు. ఆ యువకుణ్ని పరికించి చూశాడు.
    బక్కపలచగా సన్నగా ఎర్రగా వున్నాడు. మూకుడు తల మీద బోర్లించినట్లు అసహ్యంగా వుంది క్రాపు. అది ఫ్యాషన్ కాబోలు_అని అనుకొని నవ్వుకున్నాడు శ్రీకర్.
    "మనది ఈ వూరేనాండి..."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS