సంతానాన్ని ప్రసాదించే దేవత- షష్టీ దేవి

 


హైందవ మతంలో చాలామంది దేవతలే ఉండవచ్చుగాక! కానీ ప్రతి ఒక్క దేవతా ప్రత్యేకమే. వారి విధులు, ప్రార్థనలు, దీవెనలూ అన్నీ విశిష్టమే. అలాంటి ఒక విశిష్టమైన దేవతే షష్టీదేవి. సంతానం కావాలనుకునేవారిని ఈ షష్టీ దేవత స్తోత్రం చదువుకొమ్మని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఆ షష్టిదేవి కథా కమామీషు తెలుసుకుందామా...

షష్టి దేవి ప్రస్తావన ఈనాటిది కాదు. వందల వేల సంవత్సరాలుగా శాసనాలలోనూ, పురాణాలలోనూ ఈమె ప్రస్తావన కనిపిస్తూనే ఉంది. ఒకానొక సందర్భంలో అయితే ఉత్తరాదిని పాలించే రాజులు, షష్టీ దేవి రూపంతో ఏకంగా నాణేలను కూడా ముద్రించారు. షష్టీదేవిని కొందరు భూదేవి అవతారం అనీ, లక్ష్మీదేవి అంశ అనీ భావిస్తారు. కానీ ఆ సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన దేవసేనకు ప్రతిరూపమే ఈ షష్టీ దేవి అన్నది నిర్విదాంశం.

 

 

షష్టీదేవిని కొలుచుకుంటే కోరిన సంతానం లభిస్తుందన్నది నమ్మకం. కేవలం సంతానాన్ని అనుగ్రహించడమే కాదు! ఆ సంతానం జన్మించే సమయంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కాచుకుని ఉంటుందట. ఇక పిల్లవాడు పెరిగి పెద్దయ్యేదాకా కూడా అతనికి ఎలాంటి అనారోగ్యమూ ఏర్పడకుండా చల్లగా చూసుకుంటుందట. అందుకనే చాలా ప్రాంతాలలో సంతానం కలిగిన ఆరో రోజున షష్టీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

బంగారు మేనిఛాయలో మెరిసిపోయే షష్టీదేవి ఇతర దేవతలకంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎప్పుడూ చేతిలో పిల్లలతో, తన వాహనమైన పిల్లితో దర్శనమిస్తుంది షష్టి. అలాగని ఈ దేవతకు ఒక నిర్దిష్టమైన రూపం అంటూ ఏమీ లేదు! అటు సంప్రదాయవాదులు ఈ దేవిని మానవరూపంలో కొలుచుకుంటే, ఇటు జానపదులు ఆమెను గ్రామదేవతగా భావించి వివిధ రూపాలలో పూజించేవారు. సాలిగ్రామం, మట్టికుండ, పూర్ణకుంభం, అరటిచెట్టు... ఇలా వివిధ రూపాలలో షష్టిని ఆరాధించే సంప్రదాయం ఉంది.

 

ఇక షష్టీ దేవిని ప్రసన్నం చేసుకోవడమూ తేలికే! ఆమె స్తోత్రాన్ని పఠించడం ద్వారా, పక్షంలో వచ్చే ఆరో రోజున వచ్చే తిథి రోజున ఆమెను పూజించడం ద్వారా కోరిన వరాలను ఆ తల్లి ఒసగుతుందని నమ్మకం. అసలు ‘ఆరు’ సంఖ్యకి షష్టి అనే పేరు ఆమె కారణంగానే వచ్చిందని చెబుతారు. అలాంటి షష్టీ దేవిని కొలుచుకుంటే కేవలం సంతానమూ, ఆ సంతానపు ఆరోగ్యమే కాదు.... పశువులు, పంటలు, ధనం సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతారు. ఈ నమ్మకాలను బలపరుస్తూ అటు పురాణాలలోనూ, ఇటు జానపద గాథలలోనూ షష్టీ దేవి లీలల గురించి ఎన్నో గాథలు వినిపిస్తూ ఉంటాయి. అందుకే నిన్నమొన్నటి వరకూ ఉత్తరాదిన ఒడిషా, బెంగాల్‌ వంటి ప్రాంతాలలో మాత్రమే ఉన్న షష్టీ దేవి ఆరాధన నిదానంగా ఇప్పుడు దక్షిణాదిన కూడా ప్రాచుర్యం పొందుతోంది.

- నిర్జర.

 


More Vyasalu