Home » Yeluka Vacche Illu Bhadram » Yeluka Vacche Illu Bhadram 55

Yeluka Vacche Illu Bhadram 55

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం 55

ఇలపావులూరి మురళీమోహన రావు

ఒక మారు మూల ప్రాంతంలో ఇరానీ హోటల్ "అసలు నువ్వెవరివయ్యా? అనవసరంగా మధ్యలో దూరి నా క్లైంట్ దగ్గరి కొచ్చి నా ప్లానంతా పాడుచేశావు ఏదో కాస్త భయపెట్టి వాళ్ళ దగ్గర కనీసం లక్సైనా గుంజుదామనుకున్నాను" విసుగ్గా అన్నాడు వాస్తు భూషణం.

"క్షమించండి సార్ ఐదో క్లాసు పది సార్లు చదివినా పాస్ కాలేక పోయాను వయసులో సోమరి పోతులా తిరిగాను ఎక్కడా పనిదొరక్క ఈ నగరం వచ్చాను. దిక్కులా పేర్లు, మూలాల పేర్లు, గ్రహాల పేర్లు తెలుసుకున్నాను. ఏ క్వాలిఫికేషనూ అవసరం లేని పని ఇదొక్కటే కనిపించింది నాలుగిళ్ళు తిరిగి ఏవో ఒక వంకలు చెప్పి డబ్బులు గుంజుకుంటూ ఈ మధ్యే కారు కొన్నాను దీనికంటే ఉత్తమమైనది లేదని అర్థమై ఇదే కంటిన్యూ చేస్తున్నాను మీ గురించి తెలియక ఇంటర్ ఫియరయ్యాను" అపాలజికల్ అన్నాడు వా.వి.చా.

"నువ్వు చెప్పింది నిజమే సంపాదనకు దీనిని మించిన మార్గం లేదు పది విషయాలు చెపితే రెండన్నా నిజం కాకపోవు నమ్మినవాడు మళ్ళీ పిలిస్తాడు లేకపోతే కొత్తవాళ్ళు మనకు ఎప్పుడూ దొరుకుతూనే ఉంటారు కానీ దేనికైనా అనుభవం కావాలి నాలాంటి వాడి దగ్గిర జూనియర్ గా కొన్నాళ్ళు పని చెయ్యాలి ఇంతకూ నీకు అసలు వాస్తు గురించి ఏం తెలుసు?"

"మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు" బదులిచ్చాడు వా.వి.చా.

"అంటే నాకు ఏమీ తెలియదనగానే అర్థం?"

"మరి నీ నేననలేదే"

"మరి నీ ఉద్దేశ్యం?"

"మీకు తెలిస్తే నాకు తెలిసినట్లే మీకు తెలియదంటే నాకు తెలియదనే"

"సర్లే నీతో గోల ఎందుకు గానీ కొన్నాళ్ళు నువ్వు నాకు అసిస్టెంటుగా ఉండు చిన్న స్వామిగా నిన్ను లోకానికి పరిచయం చేస్తా వేషం బాగానే ఉంది అడలాగే ఉండినీ"

"నాది నిజమైన జుట్టు కాదండీ విగ్గు"

"నాదీ నిజమైన గడ్డం కాదులే పెట్టుడిచే"

" ఒకరి కింద అసిస్టెంటుగా ఉండటం నాకిష్టం లేదండీ? ఇండిపెండెంట్ లైఫ్ నాకిష్టం."

"అలా అయితే ఒక పని చెయ్యి మనం జాయింట్ గా వ్యాపారం చేద్దాం ఎవరైతే పార్టీకి నేను ఏదైనా వాస్తు సలహా చెబితే నువ్వు వెంటనే ఆధారాలతో సహా దాన్ని సమర్థించాలి అలాగే నువ్వు ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తే దాన్ని అన్ని ఆధారాలతో నేను సమర్థించి ఆ సలహాకు ముల్లోకాలలోనూ తిరుగులేదని నేను చెబుతాను లాభాలు ఇద్దరం చెరి సగం పంచుకుందాం ఏమంటావు?"

"ఇది చాలా బాగుంది వీలైనన్ని పత్రికలకు లంచాలిచ్చి మనం కాలమ్స్ రాస్తుండాలి నా దగ్గర మెరికల్లాంటి ఇద్దరు కుర్రాళ్ళున్నారు వారి చేత రకరకాల పేర్లతో ప్రశ్నలు రాయించి సమాధానాలు రాసి పత్రికల్లో వేయిద్దాం."

"ఈ సలహా బాగుంది అలాగే వాస్తు భూషణం గారి సలహాలు పాటించి కోటీశ్వరుడి నయ్యాను. మాకు ఇలా కలిసొచ్చింది అంటూ రకరకాల ఫోటోలతో ఉత్తరాలు కూడా వేయిద్దాం అవన్నీ ఏ మహారాష్ట్రవో, పంజాబ్ వో మాత్రమే అయి ఉండాలి సుమా"

"అవసరమైతే నెలకు రెండు మూడు లక్షలైనా ఖర్చు పెడదాం అదంతా జనం దగ్గర గుంజేదే గదా."

"ఇవాల్టీ నుండీ మన పార్ట్ నర్ షిప్ ఈ చాయ్ తో ఆరంభం."

"ఛీర్స్ అనుకున్నారిద్దరూ ఇంతలో ఇద్దరు వ్యక్తులు వారి దగ్గిరికి వచ్చారు వారి చేతుల్లోని హారాల్లాంటి పసుపును చూసి వాస్తు భూషణం, వా.వి.చా. బిర్ర బిగుసుకుపోయారు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో)

google-banner