రాంపండు లీలలు..!

 

రాంపండు లీలలు

రాంపండు - ఐస్ దిండు

కానీ రాంపండు ఇదంతా పూర్తిగా వినలేదు. ' మా ఆఫీసు బాయ్ ని హడల గొట్టేసేవుట. నువ్వూ నీ మైదానూ! వాడు ఆఫీసులో అందరికీ చెప్పి ఒకటే నవ్వించడం, మా సబెడిటరు గారు మరీ హుషారు.”మీ ఫ్రెండు ప్రహసనం మన 'జల్సా'లో వేద్దామండి' అంటూ ఒకటే గోల".

అనంత్ ఉడుక్కున్నాడు. “అదంతా పక్కన బెట్టు. అసలు మీ రామ..”.

ఆయన్ని... నేను రానిచ్చేదేముందిరా? ఆయన ఇష్టం వచ్చిన రూట్లో వస్తాడు. పోతాడు. ఆయన నెత్తిమీద పడాలని పెట్టిన మూడు కిలోల మైదా నీ నెత్తిమీదే పడిందటగా, అచలపతి చెప్పాడులే" అన్నాడు రాంపండు.

ఇదంతా.. నీ కోసం చేశానన్న విషయమైనా నీ నవ్వును ఆపలేదా?” కసిగా అడిగాడు అనంత్. రాంపండు కి అదంతా ఎక్కినట్లు లేదు. “ఒరేయ్, ఇవాళ సుమనోహరి ఇదంతా చెప్తే ఎంతలా నవ్విందో తెలుసా? దీనిమీద ఓ గేయం రాస్తానంది. ప్రస్తుతం సోంపల్లి వెళ్తోంది. వీలయితే నాటకం రాసి, అక్కడ ప్రదర్శిస్తుందట. నువ్వు ఒప్పుకుంటే హీరో వేషం నీదేనట....”అనంత్ ఇంకా ఎగురుతూనే ఉన్నాడు. “మీ సుమనోహరికి పనిలేదా? అక్కడికెందుకు వెళ్ళడం? అది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇల్లు".

రాంపండు నవ్వు ఇరిగిపోయింది. “ఒరేయ్, కొంపదీసి ఈ అమ్మాయితో కూడా వరస కలిపేస్తావా? నేను ఎవర్ని లవ్ చేసినా వాళ్ళు నీకు కావలసిన వాళ్ళు అయి కూచుంటున్నారు . దీనికీ అడ్డు తగిలితే మాత్రం నేనూరుకోను చెప్తున్నా. ఈ శనాదివారాల్లో నేను తనతో అక్కడికి వెళ్తున్నా. వెంటరాకు".

అరేబియన్ నైట్స్ లో రాకుమారుడి వంటి వాడు అనంత్. 'ఈ గదిలో వున్న 778 తలుపుల్లో మాత్రం ఏది తెరిచినా, మానినా 436 వాడి మాత్రం తెరవకు' అంటే ముందు అదే తెరిచి చూసే రకం. రాంపండు ప్రేమ సఫలం కావడానికి తను ఇంత చేస్తే తన త్యాగాన్ని గుర్తించకపోగా లవర్ తో కలిసి తన మీద జోకులేస్తాడా..?' అని కోపం వచ్చి సోంపల్లికి వెళ్ళి తీరదామని అనుకున్నాడు. కానీ అతని సహజమైన బద్ధకం, ఊటీ ప్రయాణానికి అచలపతి చూపే ఉబలాటం అతన్ని జోకొట్టాయి. అదైనా మాంకాళి అత్తయ్య నుండి ఫోన్ వచ్చేవరకే.

ఆ రోజు సాయంత్రం "మీ మాంకాళి అత్తయ్య గారి నుండి ఫోన్ సర్" అంటూ అచలపతి రిసీవరు అందివ్వగానే అనంత్ కాస్త వణికాడు. 'మళ్ళీ ఏం ముప్పు వచ్చి పడిందిరా' అనుకుంటూ.

'హల్లో, హల్లో, హల్లో..నేను అనంత్ ని, హల్లో"

నువ్వేమైనా చిలకవా ఏమిట్రా, హల్లో హల్లో అంటూ వల్లె వేయడానికి ! చిలకయినా బాగుండి పోను. జోస్యం కార్డులు కరక్టుగా తీసేలా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడదీ లేదు. “మాంకాళి అత్తయ్య గొంతు చించుకుంటుంది.

ఇది చెప్పడానికేనా ఫోన్ చేశావ్?” అనంత్ అడిగీ, అడగనట్లు అడిగాడు.

ఏమిటో గొణుక్కుంటున్నావ్. అసలే ముసలిదాన్ని. సరిగ్గా చెప్పి చావు.”

అదేదో నువ్వే చేయి" అని మనసులో అనుకుని "" అన్నాడు అనంత్.

ఇంకా ఏదీ చెప్పకుండానే ఊకొడతావేం? సరిగ్గా వినటం లేదా? నువ్వు ఈ శనాదివారాల్లో సోంపల్లి వెళ్ళు".

సోంపల్లా?”

అలా అరుస్తావేం? నా చెవులు బద్దలయిపోతాయి. సోంపల్లి మర్చిపోయావా? వర్ధనమ్మ గారి ఊరు. నాకు బెస్ట్ ఫ్రెండ్. నిన్ను చూడాలని ఉంది పంపమంది. వెళ్లు. వెళ్ళి నా పేరు నిలబెట్టేలా నడుచుకో".

అబ్బే ఇప్పుడెందుకు వెళ్లడం? ఆవిడ నన్నేం చూస్తుంది?” నాన్చాడు అనంత్.

వెధవ కబుర్లు చెప్పకు. నేనడిగితే సరేనంది"

అనంత్ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాడు. “నువ్వెందుకు అడగడం?”

మాంకాళి అత్తయ్య నుదురు కొట్టుకున్న శబ్దం ఫోన్ లో కూడా స్పష్టంగా వినబడింది"....

ఎందుకంటే బండా పాండురంగం గారు అక్కడికి వస్తున్నారు కాబట్టి ! రామారంలో వారింటికి వెళ్ళినప్పుడు నువ్వు వేసిన వెర్రివేషాలు చూసి నీకు మతిస్థిమితం లేదనుకుంటున్నాడాయన. వాళ్ళ అబ్బాయిని నువ్వు బ్రిడ్జి మీద నుండి తోసేశావట. వాళ్ళ అమ్మాయి సరదాగా ఉండబోతే విదిలించుకుని వచ్చేసావట. నీకు బుర్ర ఏ మాత్రం సరిగ్గా ఉన్న షాలిని లాటిదాన్ని వదిలిపెట్టేవాడివి కాదని అయన వాదన".

ఆ శాండో షాలినంటే వాళ్ల నాన్నకు ముద్దేమో గానీ..”

అనవసరంగా వాగక, నువ్వు సోంపల్లి వెళుతున్నావ్. ఆయన్ని ఇంప్రెస్ చేయబోతున్నావ్. నా పరువు కాపాడబోతున్నావ్. అంతే" అంటూ మారు మాట్టాడటానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది అత్తయ్య.

కాసేపు అనంత్ కళ్ళ ముందు ఓ త్రాసు వేళ్ళాడింది.

'ఊటీ,ఊటీ' అని కలవరిస్తున్న అచలపతి ఒక పళ్లెంలో 'సోంపల్లి వెళ్లు' అని ఆజ్ఞాపిస్తున్న అత్తయ్య ఒక పళ్లెంలో వేళ్ళాడేరు. అంతలోనే అనంత్ లో సైతాన్ కూడా త్రాసు ప్రవేశం చేశాడు. 'సోంపల్లి వెళ్లు. సుమనోహరి ప్రేమ కొల్లగొట్టు. రాంపండుపై కక్ష సాధించు'. అని అటు మొగ్గేట్లు చేశాడు.

దాని ఫలితమే ఊటీ టిక్కెట్లు కాన్సిల్ చేయమని ఆచలపతికి (అతని చూపుల్ని లెక్క చేయకుండా ) ఆర్డరేసి శనివారం పొద్దున్నకల్లా సోంపల్లిలో అనంత్ తేలడం, సుమనోహరి ఎక్కడుందని వాకబు చేయబోవడం, మధ్యాహ్నానికల్లా అనంత్ అతి హుషారుగా ఉన్నాడు.

అచలపతీ, ఒక తమాషా విన్నావా? సుమనోహరి ఎవరో కాదు తెలుసా! నా చిన్నప్పటి క్లాస్ మేట్ సుబ్బలక్ష్మీ.

కవిత్వం రాయడానికి మారు పేరు పెట్టుకుంది".

మంచిది సర్" అన్నాడు అచలపతి ముభావంగా.

ఆచలపతీ, నవ్వు ముఖం మాడ్చుకున్నట్లు మొహం చూడకుండానే తెలుస్తోంది. ఎలాగో తెలుసా? మాడు కంపు కొడుతుంది. ఛీర్ అప్ మై బాయ్. నేను సుమనోహరిని పెళ్ళి చేసుకోబోతున్నాను".

నిజంగానా సర్"

చూడు ఆచలపతీ ఇంత గొప్ప న్యూస్ నువ్వింత నిస్సారంగా రిసీవ్ చేసుకోవడం ఏమీ బాగాలేదు. సుబ్బలక్ష్మీ నీకు తెలియని వ్యక్తి కూడా కాదు".

తెలుసు కాబట్టే ఆమె మీ స్థాయికి సరిపోతుందాన్న అనుమానం సర్".

నీ భయం నాకర్థమయింది 'ఏకాంతం" వంటి గంభీర కవితలు రాసే అమ్మాయి నా 'కప్ ఆఫ్ టీ' కాదని నీ భయం కదా!' కానీ సుబ్బలక్ష్మీ.... అదే సుమనోహరి భలే సరదామనిషి తెలుసా. ఎంత బ్రెయిన్ అనుకున్నావ్! రాంపండుని ఏడిపించడానికి ఎంత బ్రిలియంట్ ఐడియా చెప్పిందో తెలుసా? ఒరిజినల్ అయిడియా. అది చేస్తే తను నాదానినంది" అనంత్ హుషారుగా చెప్పబోతుండగానే అచలపతి అడ్డు పడ్డాడు.

“.....రాంపండు గారు అప్పుడేం చేస్తున్నారు సర్?”

వాణ్ణి వేరే పని మీద పంపించి ఇవన్నీ చెప్పింది. ఇంతకీ వాడి రూం ఎక్కడన్నావ్? కొంపదీసి మన మాటలు వినబడవ్ కదా, వినబడితే జాగ్రత్త పడతాడు.

ఆయన గది మొదటి అంతస్తులో ఉంది సర్. మాటలు వినబడవ్. మీ అయిడియా అమలు చేయడంలో నేను చేయవలసింది ఏదైనా ఉందా సర్?”

ఉంది, ఉంది ఒక ఐస్ బ్లాక్ తెప్పించి, అంటే మరీ పెద్దది కాదు. ఓ దిండులో పట్టేది తెప్పించి గదిలో ఓ మూల పెట్టు. ధాన్యపు పొట్టులో వేసి పెడితే అర్ధరాత్రి దాకా కరిగిపోకుండా ఉంటుంది".

అయిసు బ్లాకా?” అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఆచపలతిని పట్టించుకోకుండా అనంత్ లంచ్ కి వెళ్ళిపోయాడు. అక్కడ పాండురంగం గారు తగిలేరు. “ఏంవోయ్ బాగున్నావా?” అన్న పలకరింపులోనే " ఇప్పటికైనా బాగు పడ్డావా?” అన్న పరామర్శ వినబడింది.

దాన్ని పట్టించుకోకుండా అనంత్ చాలా మర్యాదగా మసలుకుంటూ పనిలో పనిగా మాంకాళి అత్తయ్యను కూడా చాలా మెచ్చుకున్నాడు. దెబ్బకి వర్ధనమ్మ గారు, పాడురంగం గారు ఇద్దరూ సంతోషించారు.

రాత్రి పన్నెండు దాటాకనే అనంత్ ప్లాను (అంటే సుమనోహరి ప్లాను) అమలులో పెట్టాడు.

తనకు వేసిన పక్క మీద నుండి దిండు తీసుకున్నాడు. గలేబు తీసేసి దాంట్లో ఐసుబ్లాకు దిమ్మ దూర్చాడు. అది చంకన పెట్టుకుని మొదటి అంతస్తులో ఉన్న రాంపండు గదికి వెళ్ళాడు. కిటికీలోంచి తలుపు గడియ జాగ్రత్తగా లాగి ( కాలేజీ హాస్టల్లో ఉండగా ఇవన్నీ సీనియర్స్ శ్రద్ధగా నేర్పిన విద్యలే!) మంచం మీద పడుకుని ఉన్న రాంపండు దిండు పక్కనే ఈ దిండు పెట్టేసి వెనక్కి మరలాడు. ఇంకొక్క నిమిషంలో అనంత్ వరండాలోకి వచ్చేసే వాడే కానీ అంతలోనే ఢామ్మని చప్పుడయింది. చల్లగా జారుకోవడానికి అనువుగా వుంటుందని, తెరిచిపెట్టిన తలుపు జోరుగా గాలి రావడంతో పెద్ద చప్పుడుతో మూసుకుపోయింది.

ఎవరక్కడ?” అరిచింది మంచం మీద లేచి కూచున్న ఆకారం.

అనంత్ కి రెండు విషయాలు స్పష్టమయ్యాయి. అప్పటి దాకా గుర్రుకొడుతున్న శాల్తీని కూడా నిద్రలేపగలిగినంత గట్టిగా తలుపు మూసుకుంది. రెండు... ఈ శాల్తీ వేరెవరైనా కావచ్చు. కానీ రాంపండు కాదు. రాంపండు వాయిస్ జేసుదాసు పాట పాడబోయి ఫెయిలయ్యే అమెచ్యూర్ గొంతులో పలికే కీచుగొంతులాటిది. ఏకాదశి ఉపవాసం తర్వాత బ్రేక్ ఫాస్ట్ తెమ్మని అరిచే పులిలాటిది ఈ గొంతు.

అనంత్ ది వట్టి మట్టిబుర్ర అని మాంకాళి అత్తయ్య సర్టిఫికెట్టు ఇవ్వడానికి రెడీయే కానీ కొన్ని సందర్భాల్లో అతనిది చురుకైన బుర్రే. రాంపండు గదిలో పులి ఎందుకొచ్చింది అనే మీమాంస పెట్టుకోకుండా ఆ గదిలోంచి బయట పడటానికి తలుపు తీసి జోరుగా బయటకు వచ్చేశాడు. కొన్ని సెకన్లలో బంగళా చుట్టూ ఆవరించిన అమావాస్య చీకటిలో కలిసిపోయే వాడే కానీ అతని లుంగీ తలుపులో ఇరుక్కుపోవడం వల్ల గదిలోంచి బయటకు వచ్చిన పులి పాండురంగం వేషంలో అతని భుజాల మీద చేయి వేయడం జరిగింది.

నువ్వా?” అని గాండ్రించాడు పాండురంగం.

నేను నేనుగాక నువ్వెలా అవుతావ్?” అందామనుకుని ఊరుకున్నాడు అనంత్.

అంతలోనే పాండురంగం కళ్ళల్లో జాలి ప్రవేశించింది. “ఇవేళ అమావాస్య కదూ" అన్నాడు. “పద లోపలికి వెళదాం" అంటూనే పక్క మీద తన పక్కనే కూచోబెట్టుకోబోయి కెవ్వున కేక పెడుతూ లేచాడు.

ఇదేమిటీ పక్క తడిగా ఉంది?”

పైకి చూశాడు. కప్పు లీక్ కావడం లేదు. బయట వర్షం లేదు. ఆయనకేం అర్థం కాలేదు. ముందు అనంత్ ను పంపించి తర్వాత ఆ విషయం కనిపెడదామనుకున్నాడు.

ఇంత అర్థరాత్రి నా గదికే వద్దామని నీకెందుకు అనిపించింది నాయనా?” అడిగాడు శాంతంగా.

మిమ్మల్ని రాంపండు అనుకున్నానండీ" అన్నాడు అనంత్ వణుకుతూ.

మరి రాంపండును ఎవరనుకున్నావ్?”

అబ్బే అలాక్కాదు. ఈ రూం లో రాంపండు ఉన్నాడనుకున్నానండి".

అలా, ఎలా అనుకున్నావ్? రాంపండు, నేను రూములు మార్చుకున్నామని మీ అచలపతికి చెప్పానే! మీ ఇద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు రాత్రిపూట కబుర్లు చెప్పడానికి వచ్చి తలుపు కొట్టి నిద్ర డిస్టర్బ్ చేస్తావేమోనని ముందు జాగ్రత్తగా చెప్పి వుంచాను. మరీ ఇలా అర్థరాత్రి వస్తావని...”

ఆచలపతికి తెలుసా? తెలిసినా చెప్పలేదా? ఊటీ ప్రయాణం మాన్పించిన మాత్రాన ఇంత కత్తి కడతాడా?

అనంత్ కి ఒళ్ళు మండిపోయింది.

నీకు... వైద్యం చేయించమని మీ అత్తయ్యకు చెప్పినా వినటం లేదు. పైగా.. అవునూ..అలా చేతులు దులుపుకునే అలవాటు నీకు ఎప్పణ్ణించి అదేమిటీ... ధాన్యపు పొట్టు రాలుతోంది? చిన్న పిల్లలు మట్టిబెడ్డలు తిన్నట్లు నీకు ధాన్యం పొట్టు తినే అలవాటుందా?”

ఐసుగడ్డ కంటిన ధాన్యపు పొట్టు చేతికంటుకోవడం వల్ల వచ్చిందీ చిక్కు. అంతలోనే పాండురంగం గారి చూపు నేలమీద, పక్కమీద పడిన ధాన్యపు పొట్టు మీద పడింది. నీళ్లు ఓడుస్తున్న దిండు మీద పడింది. రెండూ, రెండూ కలిపాడు. నాలుగు వచ్చినట్లు తెలుసుకుని తల పంకించాడు.

సరే పొద్దున్న తీరుబడిగా మాట్టాడుకుందాం. అందాకా నువ్విక్కడే ఈ పక్క మీదే పడుక్కో. నీ రూమ్ రెండో అంతస్తులో కదా. నేను అక్కడికి వెళ్ళి పడుక్కుంటాను. అని అనంత్ మారు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోయాడు.

ఆ రాత్రి తడి పక్కమీద అనంత్ పడిన బాధ భగవంతుడికే తెలుసు. బహుశా ఆచలపతికి కూడా! అందుకే పొద్దునే వచ్చి మంచంకోడుకి తల ఆన్చి కూచుని నిద్రపోతున్న యజమానికి నిద్రలేపి కాఫీ ఇచ్చాడు.

గుడ్ మార్నింగ్ సర్".

మార్నింగ్ గుడ్దేమో కానీ, నైట్ మాత్రం వెరీ బాడ్ ఆచలపతీ" అన్నాడు అనంత్.

కాఫీ చప్పరించగానే ప్రాణం లేచి వచ్చింది. జ్ఞాపకశక్తి తిరిగి వచ్చింది.

అవును ఆచలపతీ. పాండురంగం గారు తను రూము మార్చుకున్న విషయం నీకు చెప్పారా? లేదా?” కటువుగా ప్రశ్నించాడు.

చెప్పారు సర్. అది మీకు నేను చెప్పకపోవడానికి ఓ కారణం ఉంది.” అచలపతి చెప్పబోయేడు.

“...కారణం ఏదైనా రాత్రి నేను పడ్డ అవస్థ నీకు తెలిసి వుంటే..”

అది ఎలాంటి అవస్థయినా శాండోషాలిని గారిని పెళ్ళి చేసుకొనడం కంటే పెద్ద అవస్థ కాదు కదా సర్"...

మధ్యలో ఈ తిరకాసేమిటీ...?”

మీకు తట్టలేదాసర్? మీ మాంకాళి అత్తయ్యగారు మిమ్మల్ని ఇక్కడికి పంపడంలో ఉద్దేశం అదే. గతంలో ఉష అత్తయ్య గారు చెప్పగా మీరు రాంపురం వెళ్ళి షాలినిని పెళ్ళాడకుండానే వచ్చేశారు. ఈసారి ఆ అమ్మాయి తండ్రినీ, మిమ్మల్ని ఓ చోటకు రప్పించి మనసు మార్చి ఆయన శాండోషాలినిని మీకు ఆఫర్ చేసేట్లా చేయాలని మాంకాళి అత్తయ్య గారి ప్లాను" అచలపతి విశదీకరించాడు.

అనంత్ గడగడ వణికాడు. మరిన్ని గుక్కలు కాఫీ తాగేడు. కాఫీ తాగడంతో బుర్ర మళ్లీ పని చేసింది. “అంటే ఈ సంఘటన వల్ల నేను పిచ్చివాణ్ణి అనుకుని పాండురంగం గారు నన్ను దూరంగా పెట్టేస్తాడంటావ్ అంతేనా? కానీ ఆచలపతీ నీవో విషయం మర్చిపోతున్నావ్. నా రియల్ టార్గెట్ రాంపండు అని ఇవాళ పొద్దున్నకి ఆయనకీ తెలిసి పోతుంది. ఇద్దరు యువకుల మధ్య ఇదో చిలిపి సంఘటనగా కొట్టేసి నన్ను "రాముడు మంచి బాలుడు" అనేసుకుంటాడు.”

రెండో సంఘటన జరక్కుండా ఉంటే ఆయన అలాగే అనుకునేవారేమో సర్".

రెండవ సంఘటనా?”

అవును సర్. ఆయనా రూమ్ కి వెళ్లిన ఇంకో గంటకి ఓ ఆకారం ప్రవేశించి ఆయన దిండు పక్కనే మరో ఐసుదిండు పెట్టి వెళ్ళిపోవడంతో మీరు నిజంగా అదో టైపు అన్న అభిప్రాయం బలపడిపోయిందాయనకు".

మై గాడ్ మళ్లీనా? ఆచలపతీ. నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందంటావా?”

లేదు సర్. అలా పెట్టింది రాంపండు గారు. ఆ రూమ్ లో ఉన్నది మీరనుకుని ఐసుదిండు పెట్టారు. పొద్దునే కనబడి "ఎలా వున్నాడు మీ బాస్" తడిసిన పక్కలో నిద్ర పట్టిందా?” అని అడగడంతో నాకీ సంగతి తెలిసింది".

అవునా? వాడికే ఇదే అయిడియా రావడం కాకతాళీయంగా లేదూ? గ్రేట్ బ్రెయిన్స్ థింక్ ఎలైక్ అంటారు ఇదే కాబోలు" అనంత్ ఆశ్చర్యపడ్డాడు.

సర్, మాటకు అడ్డు వస్తున్నాను. దీనిలో మీ బ్రెయిన్ ఏమీ లేదు. ఇది సుమనోహరి గారి ఐడియా. “రాంపండు గదిలో ఐసుదిండు పెట్టమని మీకు చెప్పినట్టే మీ గదిలో ఐసుదిండు పెట్టమని ఆయనకు చెప్పారట. ఇద్దరినీ ఒకరి మీద ఒకరిని ఉసికొలిపి..”

అనంత్ మొహం అదోలా అయింది. “ఇక చాలు ఆచలపతీ, నా హృదయం గాయపడింది. ప్రేమ చచ్చిపోయింది. ఇక్కడ్నించి బయట పడదాం".

బయటపడితే మీకు దేహశుద్ధి చేద్దామని పాండురంగం గారు కాచుకుని కూచున్నారు సర్".

మరి ఏం చేద్దాం?”

మీరు పొలాల వెంబడి పరిగెట్టి రైలు స్టేషన్ చేరండి. మీ బట్టలని పట్టుకుని నేను అక్కడికే వచ్చేస్తాను".

అచలపతీ మర్చిపోతున్నావ్. మన ఊరు వెళితే మాంకాళి అత్తయ్య ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళమంటుంది".

పోనీ ముందు అనుకున్నట్టు ఊటీ వెళ్ళిపోతే?”

ఆచలపతీ రానురాను నీకు మతిపోతోంది. ఊటీ టికెట్లు కాన్సిల్ చేశాంగా".

సర్, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది. టిక్కెట్లు కాన్సిల్ చేయలేదు. అదృష్టవశాత్తు అవి నా దగ్గరే.. ఇక్కడే ఉన్నాయి. మీరు సరేనంటే..”

అనంత్ గాఢంగా నిట్టూర్చాడు. మొత్తానికి అచలపతి తన పంతం నెగ్గించుకున్నాడు.

"రైట్ అలానే కానీయ్" అన్నాడు ఓ వెర్రి నవ్వు నవ్వి.