అసలు రహస్యం!

 

అసలు రహస్యం!

అమెరికాలో ఒక పెద్దాయన తన పెళ్లై ముప్ఫై ఏళ్లయిన సందర్భంగా గొప్ప పార్టీని ఇచ్చాడు. ఆ పార్టీకి వచ్చిన కుర్రవాళ్లంతా కూడా ఆ పెద్దాయన ముందర మూగేశారు.

‘సార్‌! పెళ్లైన మూడు రోజులకే విడిపోతున్న ఈ రోజుల్లో మీరు ముప్ఫై ఏళ్ల పాటు కలిసున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది,’ అన్నాడు ఓ కుర్రాడు.

‘అవును సార్‌! దయచేసి మీ అన్యోన్య దాంపత్యం వెనుక ఉన్న రహస్యం చెప్పండి!’ అని ఆసక్తిగా అడిగాడు మరో కుర్రవాడు.

‘అబ్బే ఇందులో పెద్దగా రహస్యమేమీ లేదయ్యా! మేము గత ముప్ఫై సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఓ అలవాటుని పాటిస్తున్నాం. అదే మా సంసార జీవితం ప్రశాంతంగా సాగిపోవడానికి కారణం,’ అన్నాడు పెద్దాయన.

‘దయచేసి ఆ రహస్యం ఏమిటో మాతో పంచుకోండి సార్‌!’ అని కుతూహలంగా అడిగారు కుర్రవాళ్లు.

‘మరేం లేదు. మేము వారానికి రెండుసార్లు డిన్నర్‌కి బయటకు వెళ్తాము. అక్కడ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ చేస్తాము. కాసేపు చక్కటి సంగీతం వింటాము. ఇంకాసేపు ఆ సంగీతానికి నృత్యం చేస్తూ గడుపుతాము. దాంతో మా సంసారంలో ఉన్న ఒత్తిడి అంతా దూరమైపోతుంది’ అన్నాడు పెద్దాయన.

‘వావ్‌! ఈసారి మేం కూడా మీతో పాటు డిన్నర్‌కి వస్తాము. ఈ వారం మీరెప్పుడు డిన్నర్‌కి వెళ్తున్నారు' అని అడిగారు కుర్రవాళ్లు.

‘ఈ వారం ఏమిటి ప్రతి వారమూ మాది ఒకే పద్ధతి. నేను మంగళవారం డిన్నర్‌కి బయటకు వెళ్తాను. నా భార్య శనివారం వెళ్తుంది!’ అని నిదానంగా అసలు విషయాన్ని చెప్పాడు పెద్దాయన.