Home » Baby Care » పిల్లలు బరువు పెరుగుతున్నారా.. దయచేసి లైట్ తీసుకోకండి!
పిల్లలు బరువు పెరుగుతున్నారా.. దయచేసి లైట్ తీసుకోకండి!

పిల్లలు బరువు పెరుగుతుంటే ముద్దుగా, బొద్దుగా ఉన్నారని మురిసిపోతారు తల్లిదండ్రులు. ఎవరైనా సరే వారి లావు గురించి మాట్లాడితే దిష్టి పెడుతున్నారని మండిపడతారు కూడా. అయితే పిల్లలు బరువు పెరగడం అనే విషయాన్ని తీవ్రంగా పరిగణించకూడదని అంటున్నారు చిన్న పిల్లల వైద్యులు. బరువు పెరిగే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అంటున్నారు. అసలు పిల్లలు బరువు పెరిగితే అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు? దీని గురించి వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుంటే..
తల్లిదండ్రుల పొరపాటు..
పిల్లలు ముద్దుగా, బొద్దుగా ఉంటే తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. పిల్లల లావు, బరువు వారి ఆరోగ్యానికి ప్రధానం అని తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే పిల్లలు ఎక్కువగా బయటకు వెళ్లకుండా, బయటి ప్రదేశంలో ఆడుకోకుండా, ఎలాంటి శారీరక శ్రమ లేదా వ్యాయామం వంటివి లేకుండా ఉంటే అది పిల్లలకు చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
అదిక బరువు లేదా ఊబకాయం.. ప్రమాదాలు..
చిన్నతనంలోనే అధిక బరువు ఉండటం వల్ల కలిగే అతిపెద్ద సమస్య.. టైప్ 2 డయాబెటిస్. చిన్నతనంలో టైప్-2 డయాబెటిస్ కు, అదిక బరువుకు చాలా బలమైన సంబంధం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదిక బరువు ఉన్న పిల్లలలో టైప్-2 డయాబెటిస్ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊబకాయం ఉన్న పిల్లలు అధిక రక్తపోటు, లిపిడ్ స్థాయిలు అసాధారణంగా ఉండటం, ఫ్యాటీ లివర్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యల ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
పాఠశాలకు వెళ్లే పిల్లలు..
భారతదేశంలో పాఠశాల వయస్సు పిల్లలలో ఎక్కువ భాగం ఊబకాయంతో బాధపడుతున్నారని జాతీయ, ప్రాంతీయ స్థాయిలో జరిపిన పరిశోధనలలో వెల్లడైందని సమాచారం. గత 10 సంవత్సరాల కాలంలో ఈ రేటు క్రమంగా పెరిగింది. ఆందోళ కలిగించే విషయం ఏంటంటే.. ఈ సమస్య కేవలం పట్టణాలలో నివసించే పిల్లలలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాలలో నివసించే పిల్లలలో కూడా ఉంటోంది.
పిల్లలో ఊబకాయం ఎందుకంటే..
నేటి తరం పిల్లలు జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణంగా మారుతోంది.
తల్లిదండ్రుల జాగ్రత్త..
తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే తమ పిల్లల ఆహారంపై శ్రద్ధ వహించాలి. పిల్లలకు సమతుల్య, పోషకమైన ఆహారం అందించాలి. ఈ ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, తగినంత ప్రోటీన్ ఉండాలి. పిల్లలు చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం పరిమితం చేయడం చాలా ముఖ్యం.
శారీరక శ్రమ కూడా ఆహారంతో పాటు ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలు ప్రతిరోజూ కనీసం 60 నిమిషాలు తేలికగా లేదా తీవ్రమైన వ్యాయామంలో పాల్గొనాలి. తల్లిదండ్రులు పిల్లలు నడక, సైక్లింగ్, బయట ఆటలు ఆడటం, వివిధ క్రీడలలో పాల్గొనమని ప్రోత్సహించాలి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం, తగినంత నిద్ర పొందడం కూడా ఊబకాయాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు దీనిని గుర్తుంచుకోవాలి.
*రూపశ్రీ.
