Home » Baby Care » పిల్లలు చిన్నతనం నుండే డబ్బు విలువ తెలియాలంటే ఇలా చేయండి..!
పిల్లలు చిన్నతనం నుండే డబ్బు విలువ తెలియాలంటే ఇలా చేయండి..!

డబ్బు మనిషి బ్రతకడానకి కీలక పాత్ర పోషిస్తుంది. నేటి కాలంలో డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. పెద్దలు డబ్బు గురించి అర్థం చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటూ డబ్బు పొదుపు చేయగలుగుతారు. కానీ పిల్లలకు అంత అవగాహన ఉండదు. పిల్లలకు వారికి నచ్చినది దక్కించుకోవడం మాత్రమే తెలుసు. తమకు నచ్చిన వాటి కోసం పిల్లలు అలుగుతారు, కోప్పడతారు, ఏడుస్తారు, చివరకు తిండి మానేసి నిరసన కూడా చేస్తారు. అయితే ఇవన్నీ కాకుండా వారికి కూడా డబ్బు విలువ తెలిస్తే తల్లిదండ్రుల మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు చిన్నతనం నుండే డబ్బు విలువ తెలియాలంటే కొన్ని టిప్స్ ఫాలో కావాలి. అవేంటో తెలుసుకుంటే..
పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పాలి ఎందుకంటే..
డబ్బును అర్థం చేసుకోవడం, దాని విలువ తెలుసుకోవడం వల్ల పిల్లలు సరైన మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు. చిన్న వయసులోనే డబ్బు విలువను అర్థం చేసుకున్న పిల్లలు అప్పులకు దూరంగా ఉండి, తరువాత జీవితంలో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. డబ్బు విలువ, డబ్బును ఎలా వాడాలి వంటి విషయాలు స్కూల్లో చెప్పే పాఠాలలో ఉండవు. వీటిని తల్లిదండ్రులే నేర్పించాలి.
డబ్బు గురించి అర్థం చేసుకోవడానికి ఏం చేయాలి?
చిన్న పిల్లలకు డబ్బు గురించి అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం, క్లాసులు తీసుకోవడం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకు అర్థమయ్యేలా కొన్ని విషయాలు నేర్పించాలి.
నాణేలు, నోట్లను గుర్తించడం నేర్పించాలి. రెండింటికి మద్య విలువను వారు అర్థం చేసుకునేలా చేయాలి. డబ్బు కష్టపడి సంపాదిస్తేనే వస్తుందని వారు అర్థం చేసుకునేలా చేయాలి. అవసరాలు, కోరికల మధ్య తేడాను గుర్తించడం నేర్పించడం చాలా ముఖ్యం. పిల్లలు ఆర్థిక విషయాలు అర్థం చేసుకునేది ఈ అడుగుతోనే. కిరాణా కొట్టులో ఏమైనా కొనుగోలు చేయడం, ఇంటి ఖర్చులను పిల్లలతో నోట్సులో రాయించడం ఇలాంటివి పిల్లలతో చేయించాలి.
పిల్లలకు ఒక పిగ్గీ బ్యాంకు లేదా ప్రత్యేకంగా వారి సేవింగ్స్ కోసం ఏదైనా మార్గం ఎంచుకోవాలి. పొదుపు నేర్పడానికి ఇది సులభమైన మార్గం. ఇది పిల్లలు తమ పొదుపులను లెక్కించడానికి, క్రమంగా పొదుపు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ అలవాటు తరువాత ఆర్థిక ప్రణాళికలో వారికి సహాయపడుతుంది.
డబ్బు అనేది తనంతట తానుగా రాదని పిల్లలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న పనులు లేదా బాధ్యతలకు బదులుగా వారికి పాకెట్ మనీ ఇవ్వడం వల్ల కష్టపడి పనిచేయడం, సంపాదన మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటారు. ఖర్చు చేయడం గురించి బాగా ఆలోచిస్తారు.
తెలివిగా ఖర్చు చేసే అలవాటు పిల్లలు దుబారా ఖర్చులను నియంత్రించడంలో, నివారించడంలో సహాయపడుతుంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని నివారించడానికి వారికి సహాయపడుతుంది. ఇంట్లో డబ్బు గురించి చర్చించడం తప్పని అనుకుంటారు. కానీ పిల్లల ముందు ఆర్థిక విషయాలు వారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం చాలాముఖ్యం.
పిల్లల కోసం తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్న డబ్బు గురించి కూడా ఎప్పటికప్పుడు వారితో చెబుతూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు కష్టం తెలియకుండా పెంచాలని కోరుకుంటారు. కానీ పిల్లలకు కష్టం గురించి చెబుతూ, కష్టాన్ని అదిగమించడానికిఏం చేయాలి అనే విషయాలు కూడా చెబుతూ పెంచాలి. లేకపోతే పిల్లలు డబ్బుకు విలువ ఇవ్వకపోవడమే కాదు.. తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వలేని విదంగా తయారవుతారు.
*రూపశ్రీ.
