Home » Baby Care » చిన్నపిల్లలకు జ్యూస్ లు, చక్కెక పానీయాలు ఇవ్వడం సరైనదేనా? వైద్యులు ఏం చెప్తున్నారంటే..!
.webp)
పిల్లలకు పండ్ల రసాలు, చక్కెర పానీయాలు, కోల్డ్ డ్రింక్స్ వంటివి తరచుగా తల్లిదండ్రులు ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా పిల్లలకు ఫ్రూట్ జ్యూస్ లు కొనివ్వడం వెనుక ఎలాంటి సమస్య ఉండదని కూడా అనుకుంటారు. ఆరోగ్యకరమైనవని నమ్మి తరచుగా ఇస్తుంటారు. కోల్డ్ డ్రింక్స్ కంటే పండ్ల రసాలు ఇవ్వడమే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ తాజాగా జరిగిన ఒక పరిశోధనలో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. పిల్లల ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
పరిశోధనల ప్రకారం.. వారానికి మూడు సార్ల కంటే తక్కువగా చక్కెర కలిపిన పానీయాలను తీసుకునే వారితో పోలిస్తే, రోజూ రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు తాగే పిల్లలు , కౌమారదశలో ఉన్నవారికి, పెద్దయ్యాక అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 52 శాతం ఎక్కువగా ఉంటుందట.రోజూ ఒకటిన్నర లేదా అంతకంటే ఎక్కువ సేర్విన్స్ పండ్ల రసం తాగే పిల్లలకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువగా ఉంటుందట.
పండ్లు తినడం హానికరం అని దీని అర్థం కాదు.. చక్కెర ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేదే కాదు.. దాన్ని ఏ రూపంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమని ఆహార నిపుణులు అంటున్నారు. పండులోని సహజ చక్కెర, జ్యూస్ లోని చక్కెర శరీరంపై వేర్వేరు ప్రభావాలను చూపుతాయి. చక్కెర పానీయానికి బదులుగా ప్రతిరోజూ ఒక పండును తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని 22 శాతం తగ్గించవచ్చని కూడా పరిశోధనలో తేలింది. పండ్ల రసానికి బదులుగా పండును తినడం ఎంతో ఉత్తమం.
పండును పూర్తిగా తింటే అందులో ఫైబర్ ఉంటుంది, ఇది శరీరం చక్కెరను నెమ్మదిగా గ్రహించడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నివారించవచ్చు. అయితే, జ్యూస్ చేయడం వల్ల చాలా వరకు పీచుపదార్థం తొలగిపోతుంది, ఫలితంగా చక్కెరలు వేగంగా శోషించబడతాయి. దీనిని పదేపదే తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, రక్తపోటును నియంత్రించే శరీర ప్రక్రియలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఎక్కువ ఫ్రక్టోజ్ తీసుకున్నప్పుడు.. ముఖ్యంగా చక్కెర పానీయాల ద్వారా తీసుకున్నప్పుడు, మొదట కాలేయానికి చేరుతుంది. ఇది శరీరంలో కొవ్వు ఏర్పడే ప్రక్రియను పెంచి, ఫ్యాటీ లివర్, ట్రైగ్లిజరైడ్స్ , పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో వాపు కారకాలను ప్రేరేపించి, రక్తనాళాల సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుంది. రక్తపోటు పెరగడానికి కూడా దీంతో సంబంధం ఉందని చెబుతారు.
పండులో పీచుపదార్థం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు , పాలీఫెనాల్లు ఉంటాయి. ఈ మూలకాలన్నీ శరీరానికి మేలు చేస్తాయి. పొటాషియం శరీరం నుండి అదనపు సోడియంను తొలగించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలీఫెనాల్లు రక్తనాళాల పనితీరును మెరుగుపరచడానికి కూడా దోహదపడతాయి. అందువల్ల తీపి పానీయాలు లేదా జ్యూస్లు తాగడం వల్ల కలిగే ప్రమాదాలు పండును పూర్తిగా తినడం వల్ల కలగవు.
ప్యాక్ చేసిన పండ్ల రసాలు, చక్కెర కలిపిన పాల పానీయాలు , స్పోర్ట్స్ డ్రింక్స్ మొదలైన వాటిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కోల్డ్ డ్రింక్స్ కంటే ఇవి చాలా బెస్ట్ అని కూడా అనుకుంటారు. అయితే 100% పండ్ల రసంలో కూడా అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది అంతేకాకుండా పండులో ఉండే పీచుపదార్థం ఇందులో ఉండదు. అందువల్ల ఫ్రూట్ జ్యూస్ లను రోజువారీ హెల్తీ డ్రింక్స్ లో భాగంగా కాకుండా చాలా పరమితంగా తీసుకోవాలి. ఈ జ్యూస్ ల కంటే.. పిల్లలకు నీరు , పాలు మంచి ఛాయిస్ లు గా పరిగణించబడతాయి, అయితే పండును పిల్లలకు స్నాక్గా ఇవ్వడం మంచిది.
*రూపశ్రీ.

