Home » Baby Care » జాగ్రత్త.. ఈ ఆహారపు అలవాట్లు పిల్లలలో తొందరగా డయాబెటిస్ కు కారణం అవుతాయ్!
జాగ్రత్త.. ఈ ఆహారపు అలవాట్లు పిల్లలలో తొందరగా డయాబెటిస్ కు కారణం అవుతాయ్!

మారుతున్న జీవనశైలి కేవలం పెద్దవారిని, వయోవృద్ధులను మాత్రమే కాకుండా, పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ రోజుల్లో పిల్లలలో ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం కేవలం బయటి ఆహారం లేదా జంక్ ఫుడ్ మాత్రమే కాదు, ఇంట్లో అలవడిన కొన్ని ఆహారపు అలవాట్లు కూడా క్రమంగా పిల్లల బరువును పెంచుతాయి. పిల్లల ప్రతి అవసరాన్ని తీర్చడం తల్లిదండ్రులుగా తమ బాధ్యత అని, తాము అనుభవించని సుఖమయమైన జీవితాన్ని తమ పిల్లలకు ఇవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ తెలియకుండానే తల్లిదండ్రులు చేసే కొన్ని అలవాట్లే భవిష్యత్తులో పిల్లలలో ఊబకాయానికి కారణమవుతాయి. వీటి పట్ల ముందుగానే శ్రద్ధ తీసుకోకపోతే పిల్లలు చిన్న వయసులోనే ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. పిల్లల ఊబకాయానికి దారితీసే కారణాలు ఏమిటో, ఆహారపు అలవాట్లు, ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే..
ఆహారం ఇచ్చే సమయం..
పిల్లలకు ఏదో పెట్టాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. అయితే ఆకలిగా ఉన్నారని చెప్పిన ప్రతిసారీ వారికి వెంటనే ఏదైనా తినడానికి ఇవ్వడం మొదటి అలవాటు. కొన్నిసార్లు, పిల్లలకు నిజంగా ఆకలిగా ఉండదు, కానీ విసుగు, అలవాటు లేదా తినాలనే కోరికతో ఆహారం అడుగుతారు. అటువంటి పరిస్థితిలో వారికి ప్రతిసారీ ఏదో ఒకటి ఇవ్వడం అతిగా తినడానికి దారితీస్తుంది. దీనిని నివారించడానికి, పిల్లలకు భోజనం , స్నాక్స్ కోసం టైం సెట్ చేసుకోవడం మంచిది.
స్నాక్స్..
ఇంట్లో ఎప్పుడూ స్నాక్స్ స్టాక్ ఉంచడం, తినాలని అనిపించినప్పుడు లేదా తీరిక దొరికినప్పుడు టైం పాస్ కోసం ఏదో ఒకటి తినడానికి ఇవ్వడం కొందరు తల్లులు చేసే అలవాటు. జర్నీలో ఉన్నా, పిల్లలు స్కూల్ కు వెళ్తున్నా, స్కూల్ బ్యాగ్ లో అయినా లేదా బయటకు వెళ్లేటప్పుడు పిల్లల కోసం హ్యాండ్ బ్యాగ్ లో అయినా ఏదో ఒకటి తినడానికి పెట్టడం తల్లుల అలవాటు. కానీ ఇలా స్నాక్స్ తినడం వల్ల పిల్లలు నిజమైన ఆకలిని అర్థం చేసుకోలేరు. ఇది పిల్లలు అధిక కేలరీలు తీసుకోవడానికి దారి తీస్తుంది. ప్రతిసారీ పిల్లలకు చిప్స్, కుకీలు లేదా స్వీట్లు ఇవ్వడానికి బదులుగా పండ్లు, కూరగాయలు లేదా తేలికపాటి, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వడం మంచిది.
స్పెషల్ ఐటమ్స్ వండటం..
పిల్లల కోసం ఏదైనా స్పెషల్ గా వండటం చాలామంది తల్లులు చేస్తుంటారు. చాలా ఇళ్లలో పిల్లలు రోజూ ఇంట్లో చేసిన లంచ్ లేదా డిన్నర్ వంటివి తినకపోతే, వారికి మ్యాగీ, ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్ లేదా ఇతర ఇష్టమైనవి చేసి ఇస్తుంటారు. పిల్లలు ఏదో ఒకటి కడుపు నిండా తింటే చాలని అనుకుంటూ ఉంటారు. దీనివల్ల పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తినడం మానుకుని, తమకు ఇష్టమైనవే కావాలని మొండి చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనిని అవాయిడ్ చేయడానికి ఇంట్లోని మిగతా అందరిలాగే పిల్లలు కూడా సమతుల్యమైన భోజనం తినేలా అలవాటు చేయడం ముఖ్యం.
అన్నింటికంటే ప్రమాదకరమైన అలవాటు..
పిల్లలకు దాహం వేసినప్పుడు నీటికి బదులుగా, అలాగే ప్రతి రోజూ పాలకు బదులుగా తీపి పానీయాలు ఇవ్వడం. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, ఫ్లేవర్డ్ డ్రింక్స్ లేదా స్వీట్ సిరప్‌లు పిల్లల శరీరానికి త్వరగా అధిక చక్కెరను అందిస్తాయి. ఈ చక్కెర భవిష్యత్తులో బరువు పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, పిల్లలలో నీరు త్రాగే అలవాటును పెంచాలి. తీపి పానీయాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
ఈ పొరపాట్లను చేయకండి..
అన్నింటికన్నా ముఖ్యమైనది, పిల్లల బరువును తరచుగా నెగిటివ్ గా చూస్తారు లేదా దాని గురించి అస్సలు పట్టించుకోరు. ఈ రెండు పద్ధతులూ తప్పు. పిల్లలను అవమానించే బదులు, కుటుంబాలు ఆరోగ్యకరమైన ఆహారం , చురుకైన జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఐదు ఆహారపు అలవాట్లను చిన్న వయస్సులోనే మెరుగుపరిస్తే, పిల్లలను ఊబకాయం నుండి చాలా వరకు కాపాడవచ్చు.
*రూపశ్రీ.
