Home » Fashion » బనారస్ చీరలు.. ఎన్ని తరాలు మారినా చెక్కుచెదరకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
బనారస్ చీరలు.. ఎన్ని తరాలు మారినా చెక్కుచెదరకూడదంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

భారతదేశం గుర్తింపు ఎక్కువగా వస్త్రధారణ లోనే ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కట్టుకునే చీరలు ప్రాంతాల వారీగా ప్రసిద్ధి చెందాయి. పట్టు చీరలు భారతీయ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబంబిస్తాయి. అలాంటి చీరలలో బనారస్ చీరలు కూడా ప్రముఖమైనవి. మహిళలు తమ వార్డ్ రోబ్ బనారస్ చీరలు ఉండాలని కోరుకుంటారు. వారణాసిని బనారస్ అని పిలిచేవారు. వారణాసిలో తయారయ్యే చేనేత చీరలను బనారస్ చీరలు అంటారు. ఈ చీరలు చాలా విలాసవంతమైనవి. వీటిని నేయడానికి ఎంతో నాణ్యమైన పట్టు, బంగారం, వెండి జరీలు ఉపయోగిస్తారు. ఎంతో అందమైన డిజైన్లు బనారస్ చీరలకు మరింత రాయల్ లుక్ ఇస్తాయి. అయితే బనారస్ చీరలను కొనడమే కాదు.. వాటిని మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. భారతీయులు చాలా వరకు తమ తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మల చీరలను కూడా తమ వార్డ్ రోబ్ లో ఉంచుకుంటారు. తరాలు మారినా చీరలు చెక్కుచెదరకూడదు అంటే.. బనారస్ చీరల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..
హ్యాంగ్ చేయద్దు..
చీరలను స్టైల్ గా వార్డ్ రోబ్ లో హ్యాంగర్ కు వేలాడదీయడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే బనారస్ చీరలు మాత్రం అలా వేలాడదీయకూడదు. ఇలా చేయడం వల్ల చీర బరువు జరీని సాగదీస్తుంది. దీని వల్ల ఫాబ్రిక్ చిరిగిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా అంచుల వద్ద చిరిగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
బనారస్ చీరలను చదునుగా ఉన్న ప్లేస్ లలో మాత్రమే భద్రపరచాలి. ఇది జరీకి నష్టం జరగకుండా చీర సాగకుండా జాగ్రత్తగా ఉండేందుకు సహాయపడుతుంది.
చీర మడతలు..
సాధారణంగా ఖరీదైన చీరలు చాలా ప్రత్యేక సందర్భాలలో లేదా శుభ కార్యాలలో మాత్రమే కడుతుంటారు. అందుకే ఈ చీరలను ఒకసారి మడత పెట్టి భద్రపరుస్తే నెలల పాటు అలాగే పెట్టేస్తుంటారు. కొన్నిసార్లు సంవత్సరాల పాటు అలాగే ఉంచుతారు కూడా. అయితే ఈ చీరలను కనీసం మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి బయటకు తీసి వీటిని మడతలు మారుస్తూ ఉండాలి. ఒకే మడత మీద ఎక్కువ కాలం అలాగే ఉంచితే ఈ చీరలు చిరిగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
చీరలు మడత పెట్టేటప్పుడు జాగ్రత్తగా మడతపెట్టాలి. వేగంగా మడత పెడుతూ లోపల ముడుతలు ఉండిపోతే అది ఫాబ్రిక్ ను దెబ్బతీస్తుంది.
మస్లిన్ క్లాత్..
బనారస్ చీరలు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే వాటిని తెల్లని మస్లిన్ క్లాత్ లో చుట్టి భద్రపరచాలి. చీరకు ఉన్న జరీ రంగు నల్లగా కాకుండా ఇది సహాయపడుతుంది.
ప్లాస్టిక్ కవర్లలో ఎప్పుడూ చీరలు భద్రపరచకూడదు. ఇది తేమను లాక్ చేస్తుంది. దీనివల్ల బనారస్ చీరల్లో ఉండే జరీ త్వరగా నల్లగా అవుతుంది. అందుకే చీరను భద్రపరచడానికి కాగితపు సంచులు బెస్ట్ గా ఉంటాయి. అంతేకాదు.. రంగురంగుల బట్టలతో చీరలను చుట్టకూడదు. దీని వల్ల వేరే చీరల రంగు బనారస్ చీరలకు ట్రాన్స్పర్ అయ్యే అవకాశం ఉంటుంది.
తేమ..
చీరలను పాడు చేసే వాటిలో తేమ కూడా ఒకటి. బనారస్ చీరలు పాడుకాకుండా ఉండటానికి వాటిని వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో అలాగే పొడిగా ఉన్న ప్రాంతంలో, చల్లని వాతావరణం ఉన్న ప్రాంతంలో భద్రపరచాలి. అంతేకాదు.. చీరలు పెట్టిన ప్రాంతంలో సిలికా జెల్ పౌచ్ లు లేదా బియ్యాన్ని ఒక ప్యాకెట్ లో వేసి దాన్ని ఉంచాలి.
ఎండ, ఘాటైన వాసనలు..
చీరను ఎప్పుడూ డైరెక్ట్ సన్ లైట్ కు గురయ్యేలా ఉంచకూడదు. అలాగే పెర్ఫ్యూమ్ లేదా ఘాటైన వాసనలు చీరకు పూయకూడదు. దీని వల్ల రంగు మసకబారుతుంది.
కర్పూరం..
చాలామంది చీరలు దుర్వాసన రాకుండా ఉండేందుకు కర్పూరాన్ని చీరలున్న అల్మారలో పెడుతుంటారు. కానీ కర్పూరం ప్యాబ్రిక్ ను దెబ్బతీస్తుంది. అందుకే కర్పూరాన్ని చీరలకు తాకనివ్వకూడదు.
స్టాకింగ్..
చీరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా మడత పెట్టి ఒకదాని మీద ఒకటి పెడుతుంచారు. దీనివల్ల చీరల ఆకృతి మారిపోతుంది. బరువు కారణంగా చీరల జరీ కుదించి చీర ఆకృతి దెబ్బతింటుంది.
*రూపశ్రీ.
