Home » Beauty Care »  ఇంట్లోనే కలబంద జెల్ తయారు చేసుకుంటున్నారా..ఈ మిస్టేక్ అస్సలు చేయకండి..!

ఇంట్లోనే కలబంద జెల్ తయారు చేసుకుంటున్నారా..ఈ మిస్టేక్ అస్సలు చేయకండి..!

ఈ రోజుల్లో చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ కోసం చాలామంది రసాయనాలు కలిసిన ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మన ఇంటి ఆవరణలోనే లభించే చిన్న కలబంద మొక్కతో ఎన్నో  ప్రయోజనాలను సహజంగానే పొందవచ్చు. ఆయుర్వేదంలో కలబందకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఇది చర్మానికి చల్లదనాన్ని, తేమను అందించి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మార్కెట్లో దొరికే కలబంద జెల్స్ కంటే ఇంట్లోనే స్వచ్ఛమైన కలబంద ఆకుతో తయారు చేసుకునే జెల్ ఎంతో మేలైనది. అయితే ఈ జెల్ తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రయోజనం దక్కకపోగా చర్మానికి హాని జరిగే అవకాశం కూడా ఉంది. ఇంట్లోనే ఈ జెల్ ని సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా వాడాలి?  జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుంటే..

ఇంట్లో ఫ్రష్ కలబంద జెల్ తయారుచేసే విధానం

కలబంద మొక్క నుండి ఆరోగ్యకరమైన, కాస్త మందంగా ఉన్న ఆకును కోసుకోవాలి. ఆకును నల్లటి మట్టి లేదా మురికి పోయేలా నీటితో శుభ్రంగా కడగాలి. ఆకుకు రెండు వైపులా ఉండే ముళ్ల భాగాన్ని కత్తిరించి తీసివేయాలి.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ముళ్ళు తీసేసిన తర్వాత ఆకును కాసేపు నిలువుగా ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఆకు నుంచి పసుపు రంగులో ఉండే ద్రవం లేదా జిగురు కారిపోతుంది. ఈ పసుపు రంగు ద్రవాన్ని లేటెక్స్ అంటారు. ఇది చర్మంపై పడితే దురద, మంట వంటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పసుపు రంగు రసం పూర్తిగా కారిపోయే వరకు వేచి చూడాలి.

ఆ తర్వాత ఆకును మరోసారి నీటితో కడిగి, పైన ఉన్న పచ్చని పొరను జాగ్రత్తగా చాకుతో తొలగించాలి. లోపల ఉండే ట్రాన్స్పరెంట్  జెల్ భాగం బయటకు వస్తుంది. స్పూన్ సహాయంతో ఆ జెల్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ జెల్ ని బ్లెండర్ లేదా మిక్సీలో వేసి కొన్ని సెకన్ల పాటు తిప్పితే మెత్తటి జెల్ రూపంలోకి మారుతుంది. దీనిని శుభ్రమైన, తడి లేని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

కలబంద జెల్ తో కలిగే ప్రయోజనాలు..

కలబంద జెల్ చర్మానికి సహజమైన మోయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇది ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు , ఎండ దెబ్బ వల్ల కలిగే సన్ బర్న్ సమస్యలను తగ్గిస్తుంది. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.

జుట్టు సంరక్షణలో కూడా కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. తలకు రాసుకోవడం వల్ల కుదుళ్లు బలంగా మారడమే కాకుండా చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, మెరిసేలా మారడానికి ఇది సహాయపడుతుంది.

చర్మం, జుట్టుకే కాకుండా ఆరోగ్య పరంగానూ కలబంద మేలు చేస్తుంది. తగిన మోతాదులో దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది , గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది.

వినియోగించే విధానం , జాగ్రత్తలు..

తాజా జెల్ ని ముఖానికి రాసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా జెల్ తీసుకుని సున్నితంగా ముఖానికి మసాజ్ చేయాలి.  చర్మ తత్వానికి తగినట్లుగా కొంత సమయం ఉంచుకుని తర్వాత నీటితో కడిగేసుకోవాలి. అలాగే జుట్టుకు, కుదుళ్లకు పట్టించి కాసేపటి తర్వాత తలస్నానం చేయవచ్చు.

అయితే మొదటిసారి కలబంద జెల్ ఉపయోగించేవారు నేరుగా ముఖానికి రాసుకోకూడదు. ముందస్తుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. చేతిపైన లేదా చెవి వెనుక భాగంలో కొద్దిగా జెల్ రాసి చూడాలి. 24 గంటల వ్యవధిలో ఎలాంటి దురద, ఎరుపు లేదా మంట రాకపోతేనే దానిని ముఖానికి లేదా జుట్టుకు ఉపయోగించాలి.

స్టోరింగ్,  షెల్ప్ లైఫ్..

ఇంట్లో తయారుచేసుకునే తాజా కలబంద జెల్ లో ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు లేదా కెమికల్స్ ఉండవు కాబట్టి ఇది చాలా త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ జెల్ ని ఫ్రిజ్‌లో ఉంచి కొన్ని రోజుల లోపే ఉపయోగించుకోవడం మంచిది. ఒకవేళ జెల్ రంగు మారినా, చెడు వాసన వచ్చినా లేదా దాని ఆకృతిలో మార్పు కనిపిస్తే దానిని వెంటనే పారవేయాలి. పాడైపోయిన జెల్ ని ఉపయోగిస్తే చర్మ సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.

                                *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.