.webp)
బుల్లితెర మీద రీతూ చౌదరి ప్రతీ రోజు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు వాళ్ళ నాన్నకు సంబందించిన ఒక పోస్ట్ పెట్టి మళ్ళీ వైరల్ అవుతోంది.
ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్ కి రీతూ చౌదరి రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ స్టేటస్ పెట్టింది. " ఈ మెసేజ్ చూసి నా గతం మళ్ళీ నాకు గుర్తొచ్చింది. దాంతో నా గుండె బరువెక్కిపోయింది. ఒక్క క్షణం నేను మళ్లీ ఆ రోజుకు వెళ్లిపోయినట్టుగా అనిపించింది.. నా ప్రపంచం మొత్తం ముగిసిపోయిందనిపించిన రోజు అది.
చాలామంది నాతో.. “నువ్వు చాలా స్ట్రాంగ్” అని చెబుతుంటారు.
.webp)
కానీ నిజం ఏంటంటే.. నేను స్ట్రాంగ్‌గా ఉండటం నేర్చుకోలేదు.. స్ట్రాంగ్‌గా కనిపించడం మాత్రమే నేర్చుకున్నాను. ఎందుకంటే నాన్న లేకుండా ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో అని భయమేసేది. నేను ఎంతగా కుంగిపోయానో, ఎంతగా నలిగిపోయానో బయటికి చూపించడానికి కూడా భయపడేదాన్ని. ఆ రోజు ఇప్పటికీ నా కళ్లముందే కదలాడుతోంది . నా చేతుల్లో నాన్న మృతదేహం.. నా ముందు అమాయకంగా నిలబడ్డ మా అమ్మ.. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న తమ్ముడు. ఆ రోజు నుంచి నా కుటుంబాన్ని మా నాన్న ఎలా చూసుకున్నారో అలా చూసుకోవడం మొదలుపెట్టా. తండ్రి బాధ్యతను కూడా నేనే తీసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడూ మోయాల్సి వస్తుందని ఊహించని ఎన్నో బాధ్యతలను నా భుజాలపై వేసుకున్నాను.
కానీ ఎక్కడో నా మనసులో ఇప్పటికీ నాలో ఒక చిన్న పిల్ల ఉంది . చాలా సున్నితమైన మనసున్న ఆ చిన్నపిల్లల ఇప్పటికీ నాన్నను మిస్ అవుతోంది. ఎవరో తనను కాపాడాలని, తాను కూడా ఎవరో ఒకరి దగ్గర భద్రంగా ఉండాలని కోరుకుంటోంది. కొన్నిసార్లు అన్నింటినీ వదిలేసి గట్టిగా ఏడవాలని తండ్రి లాంటి మనసు తనను దగ్గరకు తీసుకుని ఓదార్చాలని కోరుకుంటోంది. ప్రపంచానికి నేను ఎంతో ధైర్యంగా ఉన్నట్టు కనిపించినా .. ఆ ధైర్యానికి చెల్లించుకుంటున్న మూల్యం ఎంతో నాకు మాత్రమే తెలుసు." అంటూ గుండె బరువెక్కిపోయే మాటలను పోస్ట్ చేసింది.





